ఫ్లాష్ బ్యాక్: తలరాత వెక్కిరించడం అంటే ఇదే
on Aug 1, 2017

ఒక్కోసారి మన కళ్లే మనల్నే మోసం చేస్తాయ్. నిజం తెలుసుకునేలోపు జరగాల్సిన ఉపద్రవం జరిగిపోతుంటుంది. ఆ తర్వాత జీవితాంతం ఆ తప్పును గుర్తు చేసుకొని బాధ పడటం తప్ప మనమేం చేయలేం. రచయిత ముళ్లపూడి వెంకటరమణకు జరిగిన సంఘటన అలాంటిదే. సరదాగా దాన్నిప్పుడు గుర్తుచేసుకుందాం.
ఆదుర్తి సుబ్బారావు ‘తేనెమనసులు’సినిమాకు నటీనటుల ఎంపిక జరగుతున్న రోజులవి. కథ రిత్యా అందులో ఇద్దరు కథానాయికలు. ఆ పాత్రలకు కొత్తమ్మాయిల్ని తీసుకోవాలనుకున్నారు ఆదుర్తి. వారిని ఎంపిక చేసే బాధ్యతను రచయిత ముళ్లపూడి వెంకటరమణకు అప్పజెప్పారు. ఆ ఆడిషన్ కి చాలామంది అమ్మాయిలొచ్చారు. వారిలో జయలలిత, హేమమాలిని కూడా ఉండటం విశేషం. వారిద్దరికి కూడా ఆడిషన్ జరిగింది. కానీ చివరకు ముళ్లపూడి... సుకన్య, సంధ్యారాణి అనే ఇద్దరు అమ్మాయిల్ని ఎంపిక చేశారు.
కృష్ణ, రామ్మోహన్ హీరోలుగా, సుకన్య, సంధ్యారాణి హీరోయిన్లుగా రూపొందిన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే... ఆ సినిమా ద్వారా పరిచయమైన నూతన తారల్లో... ఒక్క కృష్ణ తప్ప మిగిలిన ముగ్గురూ పెద్దగా రాణించలేకపోయారు. మరో సినిమాల ద్వారా పరిశ్రమకు పరిచయమైన జయలలిత, హేమమాలిని తర్వాత కాలంలో సూపర్ స్టార్లుగా ఎదిగిన విషయం తెలిసిందే.
కాలం 26 సంవత్సరాలు గిర్రున తిరిగింది. వెండితెర సామ్రాజ్నిగా దక్షిణాభారత సినీరంగాన్ని ఏలిన జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. మద్రాసు లో జరిగిన ఓ అవార్డుల వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముళ్లపూడి వెంకటరమణ నిర్మించిన ‘పెళ్లిపుస్తకం’(1991) చిత్రం ఆ ఏడాది ఉత్తమచిత్రంగా ఎంపికవ్వడంతో అవార్డు అందుకోవడానికి ముళ్లపూడి ఆ వేడుకకు వచ్చారు. జయలలిత చేతుల మీదుగా అవార్డ్ అందుకోవల్సిందిగా ముళ్లపూడికి వేదిక నుంచి పిలుపువచ్చింది. ఆయన గిల్టీగానే... వేదిక ఎక్కారు. జయలలిత చిరునవ్వుతో ఆయనకు అవార్డు అందిస్తున్నారు. సరిగ్గా అక్కడే జరిగింది ఊహించని సంఘటన. జయలలిత చేతుల నుంచి అవార్డు అందుకోబోతున్న సమయంలో చేయి జారి అవార్డు కిందపడబోయింది. దాంతో దాన్ని పట్టుకోవడానికి ముళ్లపూడి కిందకు వంగారు. అంతే... కాళ్లకు నమస్కరిచండానికి వంగారేమో అని ‘అయ్యయ్యో పెద్దవారు.. మీరిలాంటివి చేయకూడదు‘ అనేశారు జయలలిత.
ముళ్లపూడికి మబ్బులు విడిపోయాయి. విధి ఆడిన ఈ వింత నాటకం చూసి ఆయనకి నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాలేదు. ఆ నాడు ఆయన ముందు చేతులు కట్టుకొని నిల్చున్న ఓ సామాన్యురాలు... ఈ రోజు అసామాన్యురాలిగా ఎదిగి... తన చేతకాని తనాన్ని వెక్కిరించింది. జీవితం అంటే ఇదే కదా! అనుకున్నారాయన. తన జీవిత విశేషాలన్నింటినీ క్రోడీకరించి ఆయన రాసుకున్న‘కోతి కొమ్మచ్చి’పుస్తకంలో ఈ విషయాన్ని అద్భుతంగా విశదపరిచారు ముళ్లపూడి.
- నరసింహ బుర్రా
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



