తమ్ముడు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదంటూ కన్నీళ్ళు పెట్టిన విజయ్
on Jul 7, 2019
ఎవరైనా ఏదైనా రంగంలో బాగా స్థిరపడితే వెంటనే సొంత వారిని ఆ రంగంలోకి తెచ్చి వారికీ కూడా ఒక జీవితాన్ని ఇవ్వాలని చూస్తారు, అది సినిమా అయినా రాజకీయం అయినా వ్యాపారం అయినా. ఇప్పటికే ఈ విషయాన్ని చాలా మంది ప్రూవ్ చేసుకున్నారు కూడా. కానీ తన తమ్ముడు తన లాగే సినిమాల్లోకి వస్తానంటే రావద్దని చెప్పానని, తనకు అలా వాడు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ.
ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ-రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరో హీరోయిన్లుగా లాంచ్ అవుతున్న సినిమా దొరసాని. ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అవుతుండగా దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిపారు. ఈ వేడుకకి ముఖ్య అతిధిగా హాజరయిన విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఉద్యోగం చేసుకునే వాడు అది మానేసి సినిమాల్లోకి వస్తానని అనడం తనకు నచ్చలేదని విజయ్ చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు ఇండియా ఎందుకురా? ఇండియా వచ్చేసి ఇక్కడ ఏం చేస్తావ్ అని అడిగితే, యాక్టింగ్ చేస్తా అన్నాడని, యాక్టింగ్ అంటే ఆటలు కాదు సడెన్ వచ్చి నటించేస్తా అంటే అంత ఈజీ కాదని చెప్పానని అయినా అప్పటికే వాడు ఫిక్స్ అయిపోయాడని చెప్పుకొచ్చాడు. సరే వస్తే వచ్చావ్ నీ సినిమా నువ్ చేసుకో, నా దగ్గరకు రాకు, నన్ను ఏం అడగకు నేను ఎలాంటి సపోర్ట్ చేయను అని చెప్పేశానని అప్పటి నుండి ఇప్పటి వరకూ వాడి సినిమా గురించి నేను మాట్లాడలేదని చెప్పుకొచ్చాడు.
నీళ్లలో పడితే స్విమ్మింగ్ అయినా చేస్తారు. లేదంటే మునిగిపోతారు. నేను ఎలాగైతే సినిమాని సెలెక్ట్ చేసుకున్నానో నువ్ చేసుకో.. ఒక కథను ఎంచుకున్న దగ్గర నుండి అది థియేటర్స్కి వెళ్లే వరకూ ఎన్ని కష్టాలు ఉన్నాయో నీకు తెలియాలని వాడ్ని అలా వదిలేశానని చెప్పుకొచ్చాడు. తాను సినిమాల్లో ప్రయత్నిస్తున్న సమయంలో యూఎస్ వెళ్లి జాబ్ చేస్తూ ఇంటికి డబ్బు పంపించి హెల్ప్ చేశాడని, ఆ టైంలో నాకు హెల్ప్ చేసినా ఇప్పుడు నీకు ఏమీ చేయలేకపోయానిఅని కన్నీళ్లు పెట్టుకున్నారు విజయ్ దేవరకొండ.