వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి రివ్యూ
on Mar 15, 2019
నటీనటులుః రాయ్ లక్ష్మి, ప్రవీణ్, మధునందన్, రామ్ కార్తిక్, అన్నపూర్ణమ్మ, బ్రహ్మాజి, పూజిత పొన్నాడ, పంకజ్ కేసరి, జెమిని సురేష్, జబర్ధస్త్ మహేష్
సాంకేతిక నిపుణులుః
సంగీతం: హరి గౌర
దర్శకత్వం: కిషోర్
నిర్మాత: శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి
విడుదల తేదీ: మార్చి 15, 2019
రాయ్ లక్ష్మి టైటిల్ రోల్ లో నటించిన చిత్రం ` వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి`. స్ఫెషల్ సాంగ్స్ తో అలరిస్తోన్న రాయ్ లక్ష్మి చాలా గ్యాప్ తర్వాత తెలుగులో కీలక పాత్రలో నటించిన చిత్రం కావడంతో పాటు టైటిల్ పోస్టర్స్, పాటలు సినిమా పై క్యూరియాసిటీ పెంచాయి. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కథలోకి వెళితే....
బెల్లంపల్లి గ్రామంలో చంటిగాడు ( కమెడియన్ ప్రవీణ్), పండుగాడు ( కమెడియన్ మధునందన్) అనే ఇద్దరు అమాయక చక్రవర్తులుంటారు. వీరిద్దరు చేసే తింగరి పనులతో ఆ గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. వీరికి మంచేదో, చెడేదో కూడా తెలియదు. ఇలాంటి క్రమంలో ఆ ఊరికి వెంకటలక్ష్మి (రాయ్ లక్ష్మి) టీచర్ గా వస్తుంది. ఫస్ట్ చూపులో ఆమెకు ఫ్లాటైన వీరిద్దరూ ఆమెను ఇంప్రెస్ చేయడానికి నానా పాట్లు పడుతుంటారు. ఆ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. కట్ చేస్తే ఆ వెంకటలక్ష్మి వీరిద్దరికి తప్ప ఎవరికీ కనిపించదు. దీంతో వెంకటలక్ష్మి దెయ్యం అని తెలుసుకుంటారు. అసలు ఆ దెయ్యం వీరిద్దరికే ఎందుకు కనపడుతుంది? ఆమె ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఆమె నుండి వీరు ఎలా తప్పించుకున్నారు అన్నది మిగతా కథాంశం.
విశ్లేషణలోకి వెళితే...
రామ్ కార్తిక్ లవ్ స్టోరితో సినిమాను మొదలు పెట్టిన డైరక్టర్ ... రాయ్ లక్ష్మి ఎంట్రీతో కామెడీ హారర్ సినిమాగా మార్చేసాడు. ఒకవైపు రామ్ కార్తిక్, పూజితల లవ్ స్టోరి రన్ చేస్తూ మరోవైపు ప్రవీణ్ , మధునందన్, రాయ్ లక్ష్మిల హారర్ స్టోరి నడిపింస్తాడు. దీంతో దేనికీ సరైన న్యాయం చేయలేకపోయాడనిపిస్తుంది. ముఖ్యంగా తీసుకున్న చాలా రొటీన్ కథ కావడం సినిమాకు మైనస్ గా చెప్పవచ్చు. అసలు రాయ్ లక్ష్మి ఎవరు? చంటి, పండు లకు మాత్రమే ఎందుకు? కనిపిస్తుంది అన్నది ఇంట్రస్టింగ్ గా ఉన్నా ....కథనం, సన్నివేశాలు స్ట్రాంగ్ గా లేకపోవడంతో బలవంతంగా సినిమాను చూడాల్సిన పరిస్థితి. కథ, కథనాలు మాత్రమే కాదు...ఇందులో డైలాగ్స్ కూడా చాలా వీక్. నవ్వించగలిగిన ఇద్దరు కమెడియన్స్ ని పెట్టుకొని అక్కడక్కడా తప్ప ఫన్ అంతగా వర్కవుట్ కాలేదు. ఇక రాయ్ లక్ష్మి ఎప్పుడైతే దెయ్యం అని రివీల్ అవుతుందో అప్పటి నుంచి ఆమె పాత్ర తేలిపోయింది. మధునందన్ ప్లేస్ లో గోదావరి స్లాంగ్ లో కామెడీ పండించగలిగిన సత్య ను పెట్టి ఉంటే ఆ పాత్ర పేలేది.
నటీనటుల పని తీరు...
కమెడియన్స్ ప్రవీణ్, మధునందన్ అమాయక చక్రవర్తులుగా, పని పాటా లేకుండా తిరిగే గాలి వెధవల్లా బాగానే నటించారు. వాళ్ల తెలివి తక్కువ పనులతో అక్కడక్కడా నవ్వించారు. రాయ్ లక్ష్మి అందంతో ఆకట్టుకోగలిగిగా అభినయంతో ఆకట్టుకునే పాత్ర మాత్రం దక్కలేదు. లవర్ బాయ్ పాత్రలో రామ్ కార్తిక్ పర్వాలేదనిపించాడు. మెయిన్ విలన్ గా పంకజ్ కేసరి పాత్రకు మించి నటించాడు. ఇక అన్నపూర్ణమ్మ, జెమిని గణేష్, జబర్ధస్త్ మహేష్ వారి పాత్రల మేరకు నటించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు..
సినిమా గురించి చెప్పాలంటే ముందుగా హరిగౌర అందించిన పాటలు, నేపథ్య సంగీతం గురించి చెప్పుకోవాలి. ఇందులో పాటలన్నీ వినసొంపుగా కంపోజ్ చేశారు. ముఖ్యంగా సమంతకే... ఏ మంత్రం వేసావే పాటలు చాలా బావున్నాయి. అలాగే కొన్ని సీన్స్ ని తన నేపథ్య సంగీతంతో ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఇక దర్శకుడు తీసుకున్న కథ చాలా పాతది. ఒక చిన్నపాయింట్ తో సినిమాను అంతా లాగే ప్రయత్నం చేశాడు. డైరక్షన్ లో కూడా ఎక్కడా మెరుపులు కనిపించలేదు. నిర్మాతలు కథకు తగ్గట్టుగా ఖర్చు పెట్టారు.
చివరగా:
ఇటీవల కాలంలో తన హాట్ హాట్ ఫొటోలతో వేడి పుట్టిస్తోన్న రాయ్ లక్ష్మి గ్లామర్ ను కూడా సరిగి యూజ్ చేసుకోలేక పోయాడు దర్శకుడు. ఇక రాయ్ లక్ష్మి నాజూకైన నడుము, హరిగౌర సంగీతంతో పాటు రాజమండ్రి అందాలు చూసి కాసేపు కాలక్షేపం పొందాలనుకునే వారు `వేర్ ఈ జ్ ద వెంకటలక్ష్మి ` సినిమాకు వెళ్లవచ్చు.
రేటింగ్ః 2/5

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
