ENGLISH | TELUGU  

'వెంకీ మామ' మూవీ రివ్యూ

on Dec 13, 2019

 

సినిమా పేరు: వెంకీమామ
తారాగణం: వెంకటేశ్, నాగచైతన్య, పాయల్ రాజ్‌పుత్, రావు రమేశ్, నాజర్, గీత, ప్రకాశ్ రాజ్, దాసరి అరుణ్‌కుమార్, హైపర్ ఆది, ఆదిత్య మీనన్, కిశోర్, చమ్మక్ చంద్ర, శివన్నారాయణ
మూలకథ: జనార్దన మహర్షి
మాటలు: శ్రీకాంత్ విస్సా
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, రవివర్మ, విజయ్
అర్ట్: బ్రహ్మ కడలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్ కూచిభొట్ల
నిర్మాతలు: డి. సురేశ్‌బాబు, టి.జి. విశ్వప్రసాద్
దర్శకత్వం: కె.ఎస్. రవీంద్ర (బాబీ)
బ్యానర్స్: సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీ: 13 డిసెంబర్ 2019

నిజ జీవితంలో మేనమామ మేనల్లుళ్లు అయిన వెంకటేశ్, నాగచైతన్య కలిసి నటిస్తున్నారనేసరికి ఆ సినిమాపై సహజంగానే ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. పైగా సినిమాలోనూ వాళ్లు అవే తరహా పాత్రలు చేస్తున్నారనే విషయం తెలిసినప్పుడు ఆ ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరుగుతాయి. అందుకే 'వెంకీమామ' మూవీ కోసం అటు వెంకటేశ్, నాగచైతన్య అభిమానులే కాకుండా సగటు సినీ ప్రేమికుడు కూడా ఆసక్తితో ఎదురుచూశారు. దివంగత సుప్రసిద్ధ నిర్మాత డి. రామానాయుడు కన్న కలల్లో వెంకీ, చైతన్య కలిసి నటించడం కూడా ఒకటి. ఆ కల డైరెక్టర్ బాబీ చేతుల్లో పడింది. మరి 'వెంకీమామ'కు ఆయన న్యాయం చేశాడా? వెంకీ, చైతన్య పాత్రలను ఆయన ఎలా చూపించాడు? చూద్దాం పదండి...

కథ:
మిలట్రీనాయుడుగా అందరూ పిలుచుకొనే వెంకటరత్నం నాయుడు (వెంకటేశ్)కు సర్వస్వం అతని మేనల్లుడు కార్తీక్ శివరామ్ (నాగచైతన్య). ఆ ఇద్దర్నీ విడతీయాలని స్వయానా వెంకటరత్నం తండ్రి, జాతకబ్రహ్మగా పేరుపొందిన రామనారాయణ (నాజర్) తీవ్రంగా ప్రయత్నిస్తుంటాడు. కారణం.. కార్తీక్ వల్ల వెంకటరత్నంకు ప్రాణగండం ఉందని. అందుకే కార్తీక్ పట్ల ద్వేషభావాన్ని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తుంటాడు. నడివయసులోకి వచ్చినా పెళ్లి మాట తలపెట్టడు వెంకటరత్నం. తనకోసమే అతను అలా ఉండిపోయాడని తెలుసుకున్న కార్తీక్, ఆ ఊరి బడికి కొత్తగా వచ్చిన హిందీ టీచర్ వెన్నెల (పాయల్ రాజ్‌పుట్)ను తన మావయ్యకు జోడీని చెయ్యాలని యత్నిస్తుంటాడు. అదే సమయంలో ఎమ్మెల్యే పశుపతి (రావు రమేశ్) కూతురు హారిక (రాశీ ఖన్నా)తో కాలేజీలో కార్తీక్ ప్రేమలో పడ్డాడనీ, అయితే వాళ్లు విడిపోయారని తెలిసి, ఆ ఇద్దర్నీ కలపడానికి అతను ట్రై చేస్తుంటాడు. ఎన్నికల్లో మరోసారి గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న పశుపతి.. అందుకు అడ్డుగా ఉన్న మామా అల్లుళ్లను విడదీయడానికి ఎత్తు వేస్తాడు. ఆ సందర్భంలో తనవల్ల మామకు ఎదురైన ప్రమాదాలను గ్రహించిన కార్తీక్, వెంకటరత్నంకు చెప్పకుండా ఆర్మీకి వెళ్లిపోతాడు. మూడేళ్ల తర్వాత వెంకటరత్నంకు ఒక నిజం తెలిసి, మేనల్లుడ్ని వెతకడానికి కశ్మీర్‌లోని ఆర్మీ రెజిమెంట్‌కు వెళ్తాడు. అక్కడ కార్తీక్‌ను కలుసుకున్నాడా? అసలు కార్తీక్ ఏమయ్యాడు?.. అనేవి పతాక సన్నివేశాలు.

విశ్లేషణ:
ఈ సినిమాకు మూలకథను రచయిత జనార్దన మహర్షి అందించారు. దాన్ని డెవలప్ చేసి 'వెంకీమామ'గా తెరపైకి ఎక్కించామని దర్శకుడు, నిర్మాతలు తెలిపారు. ఈ కథలో కొత్తదనమేమీ లేదు. 70, 80 దశకాల్లో వచ్చిన కథ తరహాలో ఉంది. "మనిషి రాతను దేవుడు రాస్తాడు. ఆ రాతను మార్చే శక్తి మనిషి ప్రేమకు ఉంది" అనేది ఈ కథ సారాంశం. ఒక మనిషి రాతను దేవుడు ఫలానా విధంగా రాశాడని ఎలా తెలుస్తుంది? జాతకం ద్వారా మనిషి రాతను తెలుసుకోవచ్చని ఈ సినిమా చెబుతుంది. ఒకసారి దేవుడు రాసిన రాతను ప్రేమ తిరగరాస్తుందని కూడా ఈ సినిమా చెబుతుంది. సో.. ప్రేమతో మన రాతల్ని మార్చుకోవచ్చు.. బహుశా ఈ కథ ప్రకారం.. మన రాతేమిటో మనకు తెలీకపోయినా, మనలోని ప్రేమ.. మన చుట్టూ ఉన్నవాళ్ల జాతకాల్ని, రాతల్ని ఇప్పటికే మార్చేసి ఉండవచ్చు కూడా! ఎవరు చెప్పగలరు!! 

సైన్స్ ఎంతగా వృద్ధి చెందినా, స్వయానా సైంటిస్టులే జాతకాల్ని నమ్ముతున్న కాలం కాబట్టి.. పైగా ఇప్పుడు దేశంలో నడుస్తున్న కాలం కూడా అదే కాబట్టి.. నేటి కాలానికి ఇది కచ్చితంగా సరిపోతుందనే ఉద్దేశంతోనే ఈ కథను తెరకెక్కించే ప్రయత్నం చేశారని మనం భావించవచ్చు. కథ వెంకటరత్నం ఊరిలో జరిగినంత సేపూ, అది పాత ధోరణిలో సాగేది అయినా.. వినోదం నిండిన సన్నివేశాల వల్ల కొద్దో గొప్పో ఆస్వాదిస్తాం. కానీ కథ ఆర్మీ బేస్‌కు మారినప్పుడు అప్పటి దాకా నడిచిన కథతో డిస్‌కనెక్ట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అప్పటిదాకా ఊళ్లోని మనుషుల మధ్య ఉండే రాగద్వేషాలతో సహానుభూతి చెందుతూ వచ్చిన మనం ఒక్కసారిగా కుదుపుకు లోనై, ఆ లోకం నుంచి మరో లోకానికి వచ్చిపడ్డట్లు కశ్మీర్‌లోని ఆర్మీ బేస్‌కు వచ్చి పడతాం. ఆ బ్యాక్‌డ్రాప్, అక్కడి సన్నివేశాలతో మనం అనుసంధానమవడం కొంచెం కష్టం. బలవంతంగా కథను ఆర్మీ నేపథ్యానికి తీసుకెళ్లారన్న అభిప్రాయం మనకు కలుగుతుంది. మనం ముందే ఊహించిన సన్నివేశాల్ని క్లైమాక్స్‌లో చూసి నిరుత్సాహపడతాం. హఠాత్తుగా ఆర్మీ నేపథ్యానికి కథను తీసుకెళ్తే ప్రేక్షకుడు ఇబ్బంది పడతాడని స్క్రీన్‌ప్లే రైటర్స్ ఊహించారేమో, సినిమాని ఉగ్రవాదం, ఆర్మీ నేపథ్యం నుంచి స్టార్ట్ చేశారు. కార్తీక్‌ను వెతుక్కుంటూ వెంకటరత్నం ఆర్మీ బేస్‌కు వస్తే, అతడ్ని ఉగ్రవాదిగా అనుమానించి ఆర్మీవాళ్లు పట్టుకుంటారు. అప్పుడు వాళ్లతో వెంకటరత్నం తమ కథ చెప్పడం మొదలుపెట్టినట్లు స్క్రీన్‌ప్లే రాసుకున్నారు.

మామా అల్లుళ్ల మధ్య సన్నివేశాలు, టీచర్‌తో మేనమామను కలపడానికి కార్తీక్, బ్రేకప్ అయిన కార్తీక్, హారికను కలపడానికి వెంకటరత్నం ప్రయత్నించే సన్నివేశాలు, ఆ సందర్భంగా జనించే కన్ఫ్యూజన్ కామెడీ అలరిస్తాయి. తన స్వార్థం కోసం మామా అల్లుళ్లను విడగొట్టడానికి పశుపతి చేసే పనులను ఇప్పటికి వందలాది సినిమాల్లో చూసేశాం. మొదట్లోనే మామా అల్లుళ్లు విడిపోక తప్పదనే విషయం మనకు అర్థమైపోతుంది. అయితే ఎలా విడిపోతారనేదే స్క్రీన్‌ప్లేలో కీలకం. ఆ అతి కీలక ఘట్టాన్ని ఆసక్తికరంగా మలచడంలో రచయితలు, దర్శకుడు బాబీ ఫెయిలయ్యారు. ఈ ఘట్టాన్ని ఇంప్రెసివ్‌గా తీసివున్నట్లయితే, సినిమా ఇంకాస్త ఆసక్తికరంగా, సంతృప్తికరంగా వచ్చి ఉండేది. వెంకటరత్నం తండ్రి, కార్తీక్ తాత అయిన రామనారాయణ పాత్రను మలచడంలోనూ దర్శకుడు తికమకకు గురయ్యాడు. ఎంతో గొప్పవ్యక్తిగా ఆయనను పరిచయం చేసిన దర్శకుడు పసివాడైన మనవడిపై ఆయన ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నట్లు చూపించడం సమంజసం అనిపించదు. ఆ విషయంలో ఆయనకంటే ఆయన భార్య (గీత) సక్రమంగా వ్యవహరించింది. కార్తీక్‌పై ద్వేషాన్ని ప్రదర్శించకుండా కూడా ఆ పాత్రను మలచవచ్చు.  విలన్ పశుపతి సడన్‌గా ఎలా మంచివాడైపోయాడో అంతుపట్టకపోవడం స్క్రీన్‌ప్లేలో, ఎడిటింగ్‌లో దొర్లిన లోపం. రెండు మూడు పాటలు ఆకర్షణీయంగా, వినసొంపుగా ఉన్నాయి. సన్నివేశాలకు తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బలాన్నిచ్చింది. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ, బ్రహ్మ కడలి ఆర్ట్ వర్క్ నిర్మాణ విలువలకు అద్దం పట్టాయి.

ప్లస్ పాయింట్స్:
మామా అల్లుళ్ల మధ్య అనుబంధం
కామెడీ సన్నివేశాలు
సంగీతం, సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్
జాతకాలతో ముడిపెట్టిన ప్రధానాంశం
అనవసరంగా చొప్పించిన ఉగ్రవాదం, ఆర్మీ నేపథ్యం
కొన్ని పాత్రల చిత్రణలో దొర్లిన లోపాలు
స్క్రీన్‌ప్లే లోపాలు

నటీనటుల అభినయం:
వెంకటరత్నం అలియాస్ మిలట్రీ నాయుడుగా వెంకటేశ్ తనదైన మార్క్ అభినయంతో చెలరేగిపోయారు. పసివాడైన మేనల్లుడిని అక్కున చేర్చుకొనే సన్నివేశంలో కానీ, భావోద్వేగాలకు ఆస్కారం ఉన్న పలు సన్నివేశాల్లో కానీ ఆయన పర్ఫార్మెన్స్ అత్యున్నత స్థాయిలో ఉంది. ఇక ఆయన కామెడీ టైమింగ్ గురించి చెప్పాల్సిందేముంది! హాస్యభరిత సన్నివేశాల్ని అత్యంత సునాయాసంగా చేసుకుపోయారు. చాలా రోజుల తర్వాత ఆయనలోని మాస్ యాంగిల్‌ని కూడా పోరాట సన్నివేశాలతో ఆస్వాదిస్తాం. కార్తీక్‌గా నాగచైతన్య ఆకట్టుకున్నాడు. చిలిపి కుర్రాడిగా ఎంతగా అలరించాడో, ఎమోషనల్ సీన్లలో అంత మెచ్యూరిటీగా నటించి మెప్పించాడు. నటుడిగా అతను ఎలా ఎదుగుతున్నాడో మామ కాంబినేషన్‌తో ఉన్న సీన్లలో గ్రహించవచ్చు. పాత్ర చిన్నదే అయినా బ్రిగేడియర్ విజయ్ ప్రకాశ్‌గా ప్రకాశ్ రాజ్ కంటే మిన్నగా చేసేదెవరు! హీరోయిన్లవి పాటల కోసం ఉద్దేశించినవి కావు. అయినా నటనాపరంగా రాశీ కంటే పాయల్‌కు ఒకింత అవకాశం ఉన్న పాత్ర లభించింది. ఆ పాత్రలో ఆమె ఒదిగింది. రావు రమేశ్, నాజర్, గీత, చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, కిశోర్, ఆదిత్య మీనన్ పాత్రల పరిధి మేరకు నటించారు. సైడ్ విలన్‌గా దాసరి అరుణ్‌కుమార్ ఫర్వాలేదనిపించాడు.

తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
వినోదం మేళవించిన పాతకథతో తయారైన ఈ సినిమాలో మేనమామ మేనల్లుళ్ల మధ్య అనుబంధం ఆకట్టుకుంటుంది. ఇలాంటి కథకు ఉగ్రవాదాన్ని మేళవించి ట్రాక్ తప్పించడమే ఇబ్బందికరం. ఒకసారి చూడొచ్చు.

రేటింగ్: 2.75/5

- బుద్ధి యజ్ఞమూర్తి


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.