'సైరా' ఓపెనింగ్స్: సెకండ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇన్ టాలీవుడ్ హిస్టరీ
on Oct 3, 2019
అంచనాలకు తగ్గట్లుగానే మెగాస్టార్ చిరంజీవి మూవీ 'సైరా.. నరసింహారెడ్డి' అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టింది. రాంచరణ్ నిర్మించగా సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలైన విషయం తెలిసిందే. తెలుగునాట ఎక్స్ట్రా షోస్‌కు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, దాన్ని 'సైరా' సద్వినియోగం చేసుకుంది. ఎంతలా అంటే.. టాలీవుడ్ హిస్టరీలోనే సెకండ్ హయ్యెస్ట్ ఓపెనింగ్ డే షేర్ని సాధించేంతగా.
అవును. తెలుగునాట ఫస్ట్ డే షేర్ పరంగా 'సైరా' మూవీ రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ ఫిల్మ్ 'బాహుబలి 2' ఉంది. దాని 42.5 కోట్ల రూపాయల ఫస్ట్ డే షేర్ రికార్డ్ చెక్కు చెదరలేదు. ఇప్పుడు 'సైరా' 37.5 కోట్ల రూపాయల షేర్ సాధించింది. విడుదలకు ముందు 30 కోట్ల రూపాయలకు పైగా ఓపెనింగ్ షేర్ సాధించే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేశారు. వాటిని దాటేసింది 'సైరా'. ఈ విషయంలో 'సాహో'ను మూడో స్థానానికి నెట్టేసింది 'సైరా'. ప్రభాస్ సినిమా 'సాహో' ఫస్ట్ డే ఏపీ, తెలంగాణలో కలిపి 36 కోట్ల షేర్ వసూలు చేసింది.
మొదటి షో నుంచే సినిమా బాగుందనే మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవడంతో తొలిరోజు చివరి షో దాకా థియేటర్ల వద్ద సందడి పెరుగుతూ వచ్చిందే కానీ తగ్గలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ఏరియాలకు సంబంధించిన ప్రి రిలీజ్ బిజినెస్‌లో దాదాపు 35 శాతాన్ని తొలిరోజే 'సైరా' రాబట్టడం విశేషంగా చెప్పుకోవాలి. ప్రి బిజినెస్ వాల్యూ సుమారు 108 కోట్ల రూపాయలు కాగా, 37.5 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. గమనించాల్సిన విషయమేమంటే.. ఏ ప్రాంతానికి చెందిన మహాయోధుడి కథతో ఈ సినిమా తీశారో, ఏ ప్రాంతంలో అయితే ఆ యోధుడి గాథను బుర్రకథల రూపంలో పాడుకుంటూ ఉంటారో.. ఆ రాయలసీమ ఏరియాలో కలెక్షన్లు ఆంధ్రా ఏరియా కలెక్షన్ల కంటే తక్కువ శాతంతో నమోదవడం!
ప్రి రిలీజ్ బిజినెస్ వాల్యూపరంగా చూసినప్పుడు.. ఆంధ్రా ఏరియాలో 'సైరా' మూవీ 41 శాతానికి దగ్గరగా వసూళ్లను రాబడితే, రాయలసీమలో 29.5 శాతం షేర్ సాధించింది. మూడు ఏరియాల్లో తక్కువ వసూళ్లు వచ్చింది నైజాం ప్రాంతంలోనే. ఈ ఏరియాలో కలెక్టయ్యింది 27 శాతం షేరే. నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను 'సాహో' నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్ 30 కోట్ల రూపాయలకు కొన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ డే ఈ ఏరియాలో 'సైరా' 8 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ విశ్లేషకులు తెలియజేశారు.
రాయలసీమ ఏరియా హక్కుల్ని తిరుపతి ప్రసాద్ 20 కోట్లకు సొంతం చేసుకోగా, తొలిరోజు అక్కడ 6 కోట్ల రూపాయల కంటే కాస్త తక్కువగా షేర్ వసూలయ్యింది. ఇక ఆంధ్రా ఏరియా మొత్తమ్మీద 'సైరా'పై బయ్యర్లు 58 కోట్ల రూపాయల దాకా వెచ్చిస్తే, మొదటిరోజు 23.5 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఆంధ్రాలో ఈస్ట్ గోదావరి ఏరియాలో బయ్యర్లకు దాదాపు 50 శాతం షేర్ రావడం విశేషం.
దసరా సెలవులు కావడంతో ఫస్ట్ వీకెండ్, ఫస్ట్ వీక్ కలెక్షన్ల పరంగా 'సైరా.. నరసింహారెడ్డి' బయ్యర్లకు ఆనందం కలిగిస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాకపోతే యు.ఎస్.లో ఈ సినిమాపై అంచనాలు తప్పాయి. ప్రీమియర్స్ ద్వారా వచ్చిన కలెక్షన్స్ విషయంలో చిరంజీవి కంబ్యాక్ ఫిల్మ్ 'ఖైదీ నంబర్ 150' కంటే 'సైరా' బాగా వెనుకబడిపోయింది. 'ఖైదీ నంబర్ 150'కి ప్రీమియర్స్ ద్వారా 1.3 మిలియన్ డాలర్స్ వస్తే, 'సైరా'కు వచ్చింది 8 లక్షల 57 వేల డాలర్లు మాత్రమే.