ENGLISH | TELUGU  

సైరా.. నరసింహారెడ్డి రివ్యూ

on Oct 2, 2019

చిత్రం: సైరా.. నరసింహారెడ్డి
బ్యానర్: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ
నటీనటులు: చిరంజీవి, తమన్నా, నయనతార, అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, రఘుబాబు, పృథ్వీ, రవికిషన్
కథ: పరుచూరి బ్రదర్స్
సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా
సంగీతం: అమిత్ త్రివేది, జూలియస్ పఖియం
సినిమాటోగ్రఫీ: రత్నవేలు
ఎడిటింగ్: ఎ. శ్రీకర్ ప్రసాద్
ఆర్ట్: రాజీవన్
స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సురేందర్ రెడ్డి
విడుదల తేదీ: 2019 అక్టోబర్ 2


తొలినాటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి చేసిన 'సైరా.. నరసింహారెడ్డి' సినిమా ఎట్టకేలకు మన ముందుకు వచ్చేసింది. సినిమా మేకింగ్‌లో ఉన్నప్పట్నుంచీ, దాని గురించి వెల్లడవుతూ వస్తోన్న ఒక్కొక్క విశేషంతో జనం ఎంతగా ఆ సినిమా కోసం ఎదురుచూస్తూ వచ్చారో.. ఈ సినిమా చిరంజీవి పుష్కర కాలం కల అని తెలిసిన తర్వాత, ప్రమోషనల్ ఈవెంట్స్‌లో చిరంజీవి భావోద్వేగాలు చూసిన తర్వాత.. 'సైరా' అంత గొప్పగా ఉంటుందా!.. అనే ఆసక్తి అందరిలోనూ వ్యక్తమవుతూ వచ్చింది. ఇంతదాకా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే చేస్తూ వచ్చిన సురేందర్ రెడ్డి డైరెక్షన్‌ను నమ్ముకొని, చిరంజీవి తనయుడు రాంచరణ్ నిర్మించిన 'సైరా' ఎలా ఉందయ్యా అంటే...

కథ:

రాయలసీమలో రేనాడుగా చెప్పుకొనే ప్రాంతానికి చెందిన పాలెగాడు మజ్జారి నరసింహారెడ్డి జీవితంలో జరిగిన ఘటనల ప్రేరణతో ఈ మూవీని నిర్మించినట్లు సినిమా మొదట్లో తెలియజేశారు. కాబట్టి ఇది పూర్తిగా నరసింహారెడ్డి బయోపిక్ కాదు అని అర్థం చేసుకోవాలి. బ్రిటిష్ వాళ్ల ఈస్టిండియా కంపెనీ భారత దేశంలోకి వచ్చి, అనేక రాజ్యాలుగా విడిపోయి ఉన్న దేశాన్ని కొంచెం కొంచెంగా బలవంతంగా స్వాధీనం చేసుకుంటూ వచ్చింది. పంట భూములే కాక, పంటలే పండని భూములకు కూడా శిస్తులు వసూలు చేస్తూ వచ్చారు. ఇక్కడి జనాన్ని బానిసలుగా చూస్తూ వచ్చారు.

ఉయ్యాలవాడ పాలెగాడు అయిన నరసింహారెడ్డి చిన్నతనం నుంచే తెల్లవాళ్ల దాష్టీకాలు చూసి కోపావేశంతో రగిలిపోతూ వచ్చాడు. గురువు గోసాయి వెంకన్న "చంపడమో, చావడమో ముఖ్యం కాదు.. గెలవడం ముఖ్యం. గెలవాలంటే యుద్ధం జరగాలి. అందుకు నువ్వొక్కడివే సరిపోవు. నీ చుట్టూ ఉన్నవాళ్లంతా నీతో కలవాలి. నువ్వు గెలవాలంటే.. నీలో ఉన్న ఈ ఆవేశం వాళ్లందరిలోనూ రగలాలి. నువ్వే ఒక యుద్ధం కావాలి" అని ఉపదేశిస్తాడు.

ఆ ఉపదేశంతో కర్తవ్యం బోధపడింది నరసింహారెడ్డికి. యుద్ధవిద్యల్లో ఆరితేరాడు. పెద్దయ్యాక తెల్లవాళ్లకు విరుద్ధంగా 61 మంది పాలెగాళ్లను ఒక్కటి చేయడానికి ప్రయత్నించాడు. లక్ష్మి అనే నాట్యకారిణి ప్రేమలో పడ్డాడు. ఆమెను భార్య చేసుకోవాలనుకున్నాడు. కరువుతో అల్లాడుతున్న సీమలో వర్ష్హాలు పడేందుకు నరసింహారెడ్డి చేత యజ్ఞాన్ని తలపెట్టాడు గోసాయి వెంకన్న. అప్పుడే తనకు ఆరేళ్ల వయసులో సిద్ధమ్మతో పెళ్లి జరిగిన విషయం తెలుస్తుంది నరసింహారెడ్డికి. నిర్ఘాంతపోయాడు. కళ్ల ముందు లక్ష్మి కనిపించింది. కానీ ధర్మం గుర్తొచ్చి హృదయం బద్దలవుతున్నా భార్య స్థానంలోకి వచ్చిన సిద్ధమ్మను స్వాగతించి యజ్ఞం నిర్వహించాడు. వాన వెల్లువెత్తింది. చిన్నతనంలో పెళ్లయిన నాటి నుంచి తననే లోకంగా భావిస్తూ వచ్చానని చెప్పిన సిద్ధమ్మ మాటల్లోని ప్రేమనూ, నిజాయితీని గ్రహించి, ఆమెను స్వీకరించాడు.

ఆంగ్లేయులకు విరుద్ధంగా తనతో కలిసి రావడానికి 61 మంది పాలెగాళ్లను ఒక్కటి చేయడానికి యత్నించాడు నరసింహారెడ్డి. స్వతంత్ర భావాలు కలిగిన అవుకు రాజు మొదట్నుంచీ నరసింహారెడ్డిని ప్రత్యర్థిగానే చూసూ వచ్చాడు. శిస్తు కట్టమన్న ఒక బ్రిటిష్ ఆఫీసర్‌ను అవమానించి పంపాడు నరసింహారెడ్డి. పగతో రగిలిన అతను నరసింహారెడ్డి లేని సమయంలో ఊరిపై దాడిచేసి అనేకమందిని కిరాతకంగా చంపేశాడు. ఒక పసివాడ్ని అత్యంత క్రూరంగా సజీవ దహనం చేశాడు. వాళ్లు పండించిన పంటను బలవంతంగా తీసుకుపోయాడు. ఇది తెలిసిన నరసింహారెడ్డి నిలువెలా కంపించాడు. మహోగ్రుడయ్యాడు. నేరుగా వెళ్లి ఆ ఆంగ్లేయ అధికారి బలగాన్ని చిత్తుచేసి, అతడి తలను ఒక్కవేటుతో ఖండించాడు.

తెల్లవాళ్లను ఇది మరింత రెచ్చగొట్టింది. మరింత మంది బలగాన్ని పంపించాడు కాక్రేన్‌. నరసింహారెడ్డి పాలన చేసే నొస్సం కొటను తెల్ల సైన్యం ముట్టడించింది. ఈ విషయాన్ని ముందే గ్రహించిన నరసింహారెడ్డి తన అనుచర గణంతో యుద్ధం చేశాడు. సరైన సమయంలో అవుకు రాజు వచ్చి నరసింహారెడ్డితో చేతులు కలిపాడు. బ్రిటిష్ సైన్యం మరోసారి చిత్తయింది. అవే క్షణాల్లో సిద్ధమ్మ కొడుకును ప్రసవించింది. ఆ పోరాటంలో వీరమరణం పొందిన వృద్ధరైతు సుబ్బయ్య పేరునే తన కొడుకుకు పెట్టాడు నరసింహారెడ్డి. ఇక కోటలో కాకుండా జనం మధ్య ఉంటూ స్వాతంత్ర్యోద్యమం చెయ్యాలని నిశ్చయించుకున్న నరసింహారెడ్డి కోటను ఖాళీ చేసి, కుటుంబం, తన దళంతో, తనతో కలిసి వచ్చిన మిగతా పాలెగాళ్లతో కలిసి నల్లమల అడవులకు చేరుకున్నాడు. తమిళనాడు నుంచి రాజా పాండి తన మనుషులతో వచ్చి అతని పక్షం చేరాడు. రాముడికి లక్ష్మణుడు ఎలాగో అలా ఉంటానన్నాడు.

కాక్రేన్‌ నొస్సం కోటను నేలమట్టం చేశాడు. నరసింహారెడ్డి కోసం అడవుల్లో అన్వేషణ ప్రారంభించాడు. భర్త సూచన మేరకు అతడి తల్లినీ, పసివాడైన కొడుకునూ తీసుకొని వేరే గ్రామానికి వెళ్లిపోయింది సిద్ధమ్మ. మరోవైపు నరసింహారెడ్డి వీరగాథల్ని పాటల రూపంలో ప్రచారం చేస్తూ, జనంలో ఉద్యమ కాంక్ష రగిలిస్తూ వచ్చింది లక్ష్మి.

ఆ తర్వాత కాక్రేన్ ఎలాంటి వ్యూహం పన్నాడు? ఆంగ్లేయులకు నరసింహారెడ్డి ఎలా పట్టుబడ్డాడు? నమ్మినవాళ్లే ద్రోహం చేశారా? సిద్ధమ్మ, లక్ష్మి ఏమయ్యారు?.. వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

అనాలిసిస్:

తెలుగువాళ్లు 'ఇదీ మా సినిమా' అని గర్వంగా చెప్పుకొనే సినిమాల్లో 'సైరా.. నరసింహారెడ్డి' నిస్సందేహంగా ఉంటుందనేది తథ్యం. ఏ సినిమా అయినా గొప్ప సినిమా ఎలా అవుతుంది? గొప్ప కథ ఉండాలి.. గొప్ప కథనం ఉండాలి. గొప్ప అభినయాలు ఉండాలి.. గొప్ప సాంకేతిక నైపుణ్యాలు ఉండాలి. అలాంటివన్నీ కలిస్తే.. అది గొప్ప సినిమా అవుతుంది. అవును.. అలాంటి అంశాలన్నీ కలిసి వచ్చిన గొప్ప సినిమా 'సైరా'.

ఇప్పటిదాకా చరిత్రలో నిలిచే సినిమా చెయ్యలేదనే అసంతృప్తితో ఉన్న చిరంజీవికి ఆ లోటు తీర్చిన సినిమా 'సైరా'. ఆయన కల 'సైరా' రూపంలో తీరిందంటే.. అది ప్రధానంగా ఇద్దరి వల్ల సాధ్యపడిందని చెప్పాలి. ఒకరు డైరెక్టర్ సురేందర్ రెడ్డి, మరొకరు ప్రొడ్యూసర్ రాంచరణ్. సాధారణంగా ఒక సినిమా క్రెడిట్‌ను డైరెక్టర్, హీరోకే ఇస్తుంటారు. కానీ 'సైరా' ఇలా రూపుదిద్దుకుందంటే కారణం.. అత్యున్నత స్థాయి నిర్మాణ విలువల వల్లే. ఖర్చుపెట్టిన ప్రతి రూపాయీ మనకు తెరపై కనిపిస్తుంది. ఏ ఒక్క సన్నివేశం.. నాసిరకంగా కనిపించదు.

పరుచూరి బ్రదర్స్ ఇచ్చిన కథను తెరపై అపూర్వంగా చిత్రించాడు సురేందర్ రెడ్డి. ఇప్పటి వరకూ దర్శకుడిగా మనం చూసిన సురేందర్ రెడ్డి వేరు.. 'సైరా' దర్శకుడు సురేందర్ రెడ్డి వేరు.. అనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. నరసింహారెడ్డి, లక్ష్మి, సిద్ధమ్మ పాత్రల్ని ఎంత డిగ్నిఫైడ్‌గా తెరపై చూపించాడు! లక్ష్మిపై ప్రేమ వ్యక్తం చేసే సన్నివేశంలో కానీ, సిద్ధమ్మను భార్యగా స్వీకరించే సందర్భంలో కానీ నరసింహారెడ్డి ప్రవర్తనను ఎంత హుందాగా చూపించాడో!! అదే విధంగా లక్ష్మి, సిద్ధమ్మ వ్యక్తిత్వాల్ని ఉన్నతంగా చిత్రీకరించాడు. యజ్ఞం చేశాక, తొలిసారి ఏకాంతంగా నరసింహారెడ్డి, సిద్ధమ్మ కలుసుకున్న సన్నివేశం సురేందర్ రెడ్డిలోని దార్శనికతను గొప్పగా పట్టిస్తుంది. సినిమాలో హైలైట్ అనిపించే సన్నివేశాలు చాలానే ఉన్నా, ఎంతో హృద్యంగా మలచిన ఆ పడకగది సన్నివేశం మన హృదయాల్లో నిలిచిపోతుంది.

ప్రథమార్ధం ముగిసే ముందు నల్లమల అడవుల్లో బ్రిటిష్ వాళ్లతో నరసింహారెడ్డి తలపడే సన్నివేశం అద్భుతం. హిరణ్యకశిపుడిని నరసింహస్వామి చంపే తీరుతో జనరల్ వాట్సన్ తలను నీళ్లలోపల తన కత్తితో నరసింహారెడ్డి ఖండించాడని చూపించడం చక్కగా అమిరింది. నరసింహారెడ్డి దళమంతా ఆత్రుతగా నీటిలోకి చూస్తుండగా ఆ నీళ్లలోంచి ఆంగ్లేయ దొర ఖండిత శిరస్సు ఎగిరివచ్చి పడటం ఒళ్లు జలదరింపజేస్తుంది. ఆ వెంటనే అతడికి నరసింహారెడ్డి తగిన శిక్ష వేశాడని ఆనందపడతాం. బ్రిటిష్ వాళ్లు, లక్ష్మి మధ్య తీసిన సన్నివేశం కూడా సురేందర్ రెడ్డి మేధస్సుకు నిదర్శనం.
క్లైమాక్స్ సన్నివేశాల్ని రోమాలు నిక్కబొడిచేశాలా చిత్రీకరించాడు దర్శకుడు. చరిత్రలో కనిపించే ఘటనలతో పోలిస్తే, ఎక్కువ కాల్పనికతను జోడిస్తూ ఆ సన్నివేశాలు తీశాడు సురేందర్. ట్రైలర్స్ ద్వారానే క్లైమాక్స్ ఏమిటో మనకు తెలిసిపోయింది. ఉరి తర్వాత నరసింహారెడ్డి శిరస్సును ఖండించి, 30 సంవత్సరాల పాటు ఆ తలను కోట గుమ్మానికి వేలాడగట్టారని చరిత్ర చెబుతుంటే, దానికి విరుద్ధంగా ఆ సన్నివేశాన్ని తీశాడు. అయినప్పటికీ ఆ సన్నివేశం మనలో భావోద్వేగాల్ని కలిగిస్తుంది.

సినిమాలో దర్శకుడి పనితనానికి మిగతా టెక్నీషియన్స్ అంతా తోడయ్యారు. ఎవరి ప్రతిభనూ మనం తక్కువ చెయ్యలేం. 'సైరా' ఇంత గ్రాండియర్‌గా, క్వాలిటీగా కనిపించిందంటే.. అది రత్నవేలు సినిమాటోగ్రఫీ వల్ల. దర్శకుడి మనసులో ఉన్నదాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్న వాడికి మల్లే అత్యున్నత స్థాయి కెమెరా పనితనాన్ని చూపించాడు. సందర్భానుసారం వచ్చే పాటలకు అమిత్ త్రివేది ఇచ్చిన సంగీతం, సన్నివేశాలకు జూలియ పఖియం సమకూర్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టాప్ క్లాస్‌గా ఉన్నాయి. వీటితో పాటు ప్రధానంగా చెప్పుకోవాల్సింది సాయిమాధవ్ బుర్రా రాసిన సంభాషణల్ని. అనేక సన్నివేశాలకు ఆ మాటలే ఆయువుపట్టుగా నిలిచాయి. నరసింహారెడ్డి నోటివెంట తూటాల్లాంటి మాటలు పలికించాడు రచయిత. అందరికీ అర్థమవ్వాలనే ఉద్దేశంతో.. ఏమో ఆంగ్లేయుల చేత కూడా మామూలు తెలుగు మాటల్నే పలికించారు. ఈ కథ రాయలసీమ ప్రాంతానికి చెందినదైనా ఆ ప్రాంత యాసను ఎక్కడా వాడలేదు. అయితే తమిళుడైన రాజా పాండి నోటివెంట మాత్రం కాస్త అరవ యాస పలికించారు.

అయితే.. గొప్పగా చెప్పాలనే ఉద్దేశంతో ఝాన్సీ లక్ష్మీబాయి నోటివెంట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను చెప్పించడం అతిశయోక్తిగానూ, ఆ సన్నివేశాలు వాస్తవికతకు మరీ దూరంగానూ అనిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్:

టైటిల్ రోల్‌లో చిరంజీవి అభినయం
నరసింహారెడ్డి, లక్ష్మి పాత్రల చిత్రణ
స్క్రీన్‌ప్లే
సురేందర్ రెడ్ది దర్శకత్వ ప్రతిభ
యుద్ధ, పోరాట సన్నివేశాలు
ఛాయాగ్రహణం, సంభాషణలు, ఛాయాగ్రహణం
గ్రాండియర్‌గా ఉన్న నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:

స్వల్ప సందర్భాల్లో ఎడిటింగ్ లోపాలు
ఆహ్లాదకర సన్నివేశాలు లేకపోవడం

తారల అభినయం:

దర్శకత్వ ప్రతిభకు తారల అభినయం తోడైతే, ఆ సినిమా 'సైరా'లా ఉంటుంది. మజ్జారి నరసింహారెడ్డిగా టైటిల్ రోల్‌లో చిరంజీవి అపూర్వమనదగ్గ అభినయాన్ని ప్రదర్శించారు. ఆయన మేకప్ సైతం సహజమనిపించేట్లు ఉంది. ఎక్కడా అరవై ఏళ్ల పైబడిన వ్యక్తిగా ఆయన కనిపించలేదు. ప్రేమ మూర్తిగా, రౌద్ర మూర్తిగా భిన్న ఛాయల్ని ఆయన గొప్పగా అభినయించారు. ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసే ప్రతి సందర్భంలోనూ ఆయన హావభావాలు చూసి తీరాల్సిందే. పోరాట సన్నివేశాల్లో యువకుడి మాదిరి వేగాన్ని ఆయన కనపర్చారు. చిరంజీవిలోని పరిపూర్ణ నటుడు ఈ సినిమాతో వెలికివచ్చాడని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఈ ఏడాది జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రేసులో ఆయన కచ్చితంగా ముందుంటారు.

ఆయన తర్వాత చెప్పుకోవాల్సింది తమన్నా నటనను. సినిమా విడుదలకు ముందు ఆమెది లక్ష్మి అనే ఒక మామూలు పాత్ర చేసిందని చాలా మంది ఊహించారు. కానీ సినిమాలో ఆమె పాత్ర, ఆ పాత్రలో ఆమె అభినయం ఉన్నత స్థాయిలో ఉన్నాయి. తన పాత్ర ముగిసే సమయంలో తమన్నా ప్రదర్శించిన హావభావాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కథ ప్రకారం సిద్ధమ్మ పాత్రకు ఎక్కువ నిడివి లభించలేదు. అయినప్పటికీ ఆ పాత్రకు నయనతార అతికినట్లు సరిపోయింది. అమాయకత్వాన్నీ, భర్తపై ప్రేమనీ ప్రదర్శించే ఆ పాత్రలో ఆమె బాగా రాణించింది.

నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా అప్పుడప్పుడు కనిపించే పాత్రలో హుందాగా కనిపించారు అమితాబ్ బచ్చన్. నటించడానికి ఆయనకు ఎక్కువ అవకాశం లభించలేదు. కానీ ఆయన విగ్రహం, ఆయన చెప్పే మాటలు చాలు కదా! అవుకు రాజుగా మొదట నెగటివ్‌గా కనిపించి, తర్వాత పాజిటివ్‌గా మారే పాత్రలో కిచ్చా సుదీప్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలా! కొట్టినపిండిలా ఆ పాత్రలో రాణించాడు. చివర్లో ట్విస్ట్ ఉండే వీరారెడ్డి పాత్రకు జగపతిబాబు పూర్తి న్యాయం చేకూర్చాడు. రాజా పాండిగా విజయ్ సేతుపతి, రాఘవాచారిగా రఘుబాబు, సుబ్బయ్యగా సాయిచంద్, నరసింహారెడ్డి తల్లిగా లక్ష్మీ గోపాలస్వామి, మాధవయ్యర్‌గా పృథ్వీతో పాటు రవికిషన్, రణధీర్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సినిమా మొదట్లో, చివరలో ఝాన్సీ లక్ష్మీబాయిగా అనుష్క స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వగా, మరో చిన్న పాత్రలో నీహారిక కనిపిస్తుంది.

తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

తెలుగు సినిమా చరిత్రలో 'సైరా.. నరసింహారెడ్డి' సినిమా సుస్థిర స్థానం సంపాదించుకుంటుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి, ఆ సినిమా దర్శకుడిగా సురేందర్ రెడ్డి ప్రేక్షకుల హృదయాల్లో కలకాలం నిలిచివుంటారు.

రేటింగ్: 4/5

- బుద్ధి యజ్ఞమూర్తి

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.