పేరు వస్తే సరిపోదు... పైసలు కూడా రావాలి!
on Feb 26, 2019
సినిమాకు పేరు మాత్రమే వస్తే సరిపోదు. పైసలు కూడా రావాలి. నిర్మాతకు లాభాలు వస్తాయి. పేరు మాత్రమే వచ్చి పైసలు రాకపోతే నష్టాలు తప్పవు. 'యన్.టి.ఆర్' బయోపిక్ కారణంగా బాలకృష్ణకు ఆ నష్టాలు ఎలా వుంటాయో తెలిసి వచ్చింది. విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి బయోపిక్ రెండు భాగాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ, పైసలు మాత్రం రాలేదు. బహుశా... '118' ప్రీ రిలీజ్ వేడుకలో "ఈ సినిమా అఖండ విజయం సాధించాలని, సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరు ప్రతిష్టలతో పాటు ఆర్ధికంగానూ లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నా" అని బాలకృష్ణ అనడం వెనుక 'యన్.టి.ఆర్' బాక్సాఫీస్ ఫలితమే కారణం కావొచ్చు. బయోపిక్ పరాజయం తరవాత ఓ సినిమా వేడుకలో బాలకృష్ణ కనిపించడం ఇదే మొదటిసారి. అబ్బాయ్ కల్యాణ్ రామ్ నటించిన '118' సినిమా టైటిల్ ఆసక్తికరంగా ఉందని, సినిమాలో నెక్స్ట్ ఏం వస్తుందో ఊహించడానికి వీలు లేకుండా, యూత్ కి కనెక్ట్ అయ్యేట్టు ఉందని బాలకృష్ణ అన్నారు. కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలని, కొత్తదానాన్ని ప్రేక్షకులకు అందించాలని, మంచి సినిమాలు చేయాలని కల్యాణ్ రామ్ లో ఉన్న తపనే అతని చేత యన్.టి.ఆర్ ఆర్ట్స్ సంస్థను స్థాపించేలా చేసిందని ఆయన అన్నారు.