ఎన్టీఆర్ లుక్ పై దృష్టి పెట్టిన రాజమౌళి
on Oct 22, 2018
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ రాకెట్ లా దూసుకుపోతుంది. 'టెంపర్' నుంచి మొదలుపెడితే రీసెంట్ గా విడుదలైన 'అరవింద సమేత' వరకు వరుసగా ఐదు విజయాలు అందుకున్నాడు. ఇక తరువాతి సినిమా అపజయం ఎరుగని రాజమౌళి దర్శకత్వంలో కావడంతో ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమంటూ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. దీనికితోడు ఈ సినిమా ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలయికలో తెరకెక్కనున్న మల్టీస్టారర్ కావడంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఎన్టీఆర్ కూడా అరవిందసమేత సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ.. రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నారు.
ఎన్టీఆర్ ఫ్రీ అవడంతో ఇక రాజమౌళి ఎన్టీఆర్ లుక్ మీద దృష్టి పెడుతున్నారు. ఎన్టీఆర్ కు ఫిట్నెస్ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్న లాయిడ్ స్టీవెన్స్ తాజాగా రాజమౌళిని కలిశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండాలి? అన్న విషయం గురించి రాజమౌళి, లాయిడ్ కలిశారట. ఈ విషయాన్ని లాయిడ్ ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ రాజమౌళితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘లెజండరీ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళిని కలిసినందుకు చాలా గొప్పగా ఫీలవుతున్నాను. రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌లో తారక్ లుక్కు సంబంధించిన విషయాలను చర్చించుకున్నాం. ఈ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను. మరిన్ని వివరాల కోసం ఎదురుచూడండి’ అని లాయిడ్ పేర్కొన్నారు. ప్రతి సినిమాలో తన లుక్ లో వైవిధ్యం చూపిస్తున్న ఎన్టీఆర్.. ఈ సినిమాలో ఎలా కనిపిస్తారో? అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read