మెగా ఫ్యామిలీ బాలయ్య సెంటిమెంట్ ఈ దఫా వర్కవుట్ అవుతుందా?
on Jan 27, 2018
నందమూరి, మెగా ఫ్యామిలీల మధ్య పోటీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ నాటిది కాదు. బాలకృష్ణ హీరో అయినప్పట్నుంచీ ఈ పోటీ కొనసాగుతూనే ఉంది. అయితే.. ఇదంతా సినిమాల విషయంలో మాత్రమే. వ్యక్తిగతంగా చిరంజీవి, బాలకృష్ణ మంచి స్నేహితులు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే... నేటి తరంలో తారక్, చరణ్ కూడా మంచి మిత్రులు. అంతేకాదు.. వీరిద్దరూ కలిసి త్వరలో ఓ చిత్రంలో నటింబోతున్నారు కూడా. అంతేకాదు... చిరంజీవి కుమార్తె సంగీత్ లో బాలకృష్ణ డాన్స్ చేసిన విషయం కూడా తెలిసిందే. సో... ఈ విధంగా సమయం దొరికినప్పుడల్లా.. ఈ రెండు కుటుంబాల హీరోలు తమ అభిమానాలను చాటుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా దేనికంటే... త్వరలో మెగా హీరో సినిమాకు సంబంధించిన టీజర్ ను నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల చేయనున్నారు.
వివరాల్లోకెళ్తే..సాయిధరమ్ తేజ్ కథానాయకునిగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ‘ఇంటిలిజెంట్’ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 9న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ ని శనివారం సాయంత్రం నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన సంప్రదాయం కాదు. గతంలో కూడా చిరంజీవి నటించిన చాలా చిత్రాలకు బాలయ్య క్లాప్ ఇచ్చాడు. అలాగే.. ఎన్నో బాలయ్య చిత్రాలకు చిరంజీవి క్లాప్ ఇచ్చారు. అయితే.. ఇక్కడ ఎవరి చేయ్ ఎవరికి కలిసొచ్చింది? అనే విషయానికొస్తే.. మాత్రం బాలయ్య చేయ్ చిరంజీవికి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. మెగాస్టార్ నటించిన ఎన్నో బ్లాక్ బస్టర్స్ కి ఫస్ట్ క్లాప్ కొట్టింది బాలయ్య. ఉదాహరణ, ఘరానామొగుడు. అల్లుడా మజాకా. మరి ఆ సెంటిమెంట్ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కి కూడా కలిసొస్తుందేమో చూడాలి.