ఫ్లాప్ డైరెక్టర్ తో ‘సై’ అనేశాడు!
on Sep 15, 2017
జాలి.. దయ.. కరుణ.. ఇలాంటి పదాలు మచ్చుకైనా కనిపించనిది సినిమా పరిశ్రమలోనే. కష్టాల్లో ఉన్నాడు కదా... అని ఫ్లాపుల్లో ఉన్నోడికి ఇక్కడ అవకాశాలివ్వరు. ఇక్కడి పరుగు అంతా విజయం వైపే. కానీ కొందరున్నారు. వాళ్లకు జయాపజయాలతో పనిలేదు. కథ నచ్చితే చాలు... అవకాశం ఇచ్చేస్తారు. వాళ్లలో ముందు చెప్పుకోవ్సాల్సిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ అయితే... రెండో వ్యక్తి రవితేజా. రీసెంట్ గా రవితేజా ఓ ఫ్లాప్ దర్శకుడితో పనిచేయడానికి పచ్చజెండా ఊపేశాడు. ఆ ఫ్లాప్ దర్శకుడు ఎవరో కాదు... శ్రీను వైట్ల. వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ అవకాశాలు కోల్పోయిన శ్రీను వైట్లకు కొత్త ఆశల్ని చిగురింపజేశాడు రవితేజా.
ఆ వివరాలేంటో తెలుసుకోవాలనుందా. అయితే చదవండి. శ్రీను వైట్ల మంచి ఊపు మీద ఉన్న రోజుల్లో మైత్రీ మూవీమేకర్స్ వాళ్లు సినిమా చేసిపెట్టమని రెండు కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చారట. ఆ తర్వాత మనోడికి ఫ్లాపులు మొదలయ్యాయ్. డబ్బు తీసుకొని చాలా కాలం అవుతున్నా... మైత్రీ వారికి సినిమా మాత్రం చేసిపెట్ట లేదు. దాంతో వారు శ్రీను వైట్ల ను నిలదీశారట. ఫ్లాపుల్లో ఉన్న నీతో సినిమా చేయడం మా వల్ల కాదనీ... డబ్బు వెనక్కు ఇచ్చేయమంటూ అడ్డం తిరిగారట. ఓ వైపు వరుస పరాజయాలు, ఇంకో వైపు అనారోగ్యం... పూర్తిగా మనశ్శంతిని కోల్పోయిన శ్రీనుని మైత్రీ అధినేతలు నిలదీయడంతో ‘డబ్బివ్వలేను సినిమా చేసిపెడతాను’ని ప్రాధేయపడ్డాడట శ్రీను వైట్ల. ‘నీతో పెద్ద సినిమాలు తీయలేం. చిన్న బడ్జెట్ తో సినిమా తీయ్’ అన్నారట నిర్మాతలు. దాంతో శ్రీను వైట్ల హీరోల అన్వేషణలో పడ్డాడు. మనోడ్ని చూసి.. చిన్న చిన్న హీరోలు సైతం ముఖం చాటేశారట.
అయితే... రవితేజా మాత్రం మనోడ్ని సాదరంగా ఆహ్వానించి... కథ విని.. సినిమా చేస్కో. అని అభయం ఇచ్చేశాడట. ఇక శ్రీను వైట్ల ఆనందానికి అవధులెందుకుంటాయ్. నిజానికి శ్రీను వైట్లకు రవితేజ సినిమా ఇవ్వడం గొప్పేం కాదు. ఎందుకంటే... చిన్న చిన్న వేషాలు వేసుకుంటున్న రవితేజాను తన తొలి సినిమా‘నీ కోసం’తో... హీరోని చేసింది వైట్ల శ్రీనే. ఆ విధంగా ఇద్దరూ కలిసి ఎదిగారు. ఇప్పుడు కష్టాల్లో ఉన్న మిత్రుడికి రవితేజా సినిమా ఇచ్చి ప్రోత్సహించడం నిజంగా ఆనందించదగ్గ విషయం. మరి రవితేజా ఇచ్చిన అవకాశాన్ని శ్రీను వైట్ల సద్వినియోగం చేసుకుంటాడో లేదో చూడాలి. డిసెంబర్ లో ఈ సినిమా సెట్స్ కి వెళతుందని తెలుస్తోంది.