సూర్య కమాండోనా? టెర్రరిస్టా?
on Jul 7, 2019
దర్శకుడు కె.వి. ఆనంద్ కొంచెం కన్ఫ్యూజ్ చేశారు. 'బందోబస్త్'లో సూర్య టెర్రరిస్టా? కమాండోనా? లేదా కమాండో టెర్రరిస్ట్‌గా మారాడా? అండర్ కవర్ కమాండోపై ఇతర కమాండోలకు అనుమానం వచ్చిందా? అని ప్రేక్షకుల్లో చిన్నపాటి సందేహాలతో పాటు సినిమాపై ఆసక్తి క్రియేట్ చేసి టీజర్ ఎండ్ చేశారు. 'వీడోక్కడే', 'బ్రదర్స్' తరవాత సూర్య హీరోగా కె.వి. ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'బందోబస్త్'. తమిళంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన 'కప్పాన్'కి అనువాదం. శనివారం సాయంత్రం 'బందోబస్త్' టీజర్ విడుదల చేశారు. అందులో కొత్తగా ఏం లేదు. ఆల్రెడీ కొన్ని రోజుల క్రితం విడుదలైన తమిళ టీజర్లో ఏముందో... తెలుగులో టీజర్లోనూ అదే ఉంది. తెలుగు డైలాగులు ఉండటం వలన తెలుగు ప్రేక్షకులందరికీ టీజర్ చేరువైంది. తమిళం అర్ధం కాని తెలుగువారికి, సబ్‌టైటిల్స్‌తో కుస్తీ పడటం ఎందుకని అనుకున్నవారు ఇప్పుడు టీజర్ చూశారు. దాయాది దేశాలు ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడం, డైలాగుల్లో సర్జికల్ స్ట్రైక్స్ ప్రస్తావన ఉండటంతో సినిమాపై ఎక్ట్రా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. గెటప్పులపై ఇంట్రెస్ట్ చూపించే సూర్య, ఇందులోనూ మూడు నాలుగు గెటప్పుల్లో కనిపిస్తున్నారు. టాలెంటెడ్ ఆర్టిస్టులు మోహన్ లాల్, బొమన్ ఇరానీ, ఆర్య సినిమాలో కీలక పాత్రలు చేశారు. రంగం తరవాత మరోసారి మాంచి ట్విస్టుల ఉన్న సినిమాతో కె.వి. ఆనంద్ వస్తున్నట్టున్నారు.
Also Read