English | Telugu

యశస్వి రంగారావు..(శతజయంతి స్పెషల్)

on Jul 2, 2018

 

ఆ పేరు వింటే... నలుపు, తెలుపుల నాటి వెండితెర స్వర్ణశోభితమవుతుంది...
ఆ పేరు తలిస్తే... భారతీయ సినీ యవనిక ఆనందాతిరేకాలతో రెపరెపలాడుతుంది...
’థిక్..’ అని  తెరపై ఆయన హూంకరిస్తే చాలు.. అదొక చరిత్రగా నిలిచిపోతుంది...
అసాధ్యం.. అనితర సాథ్యమనుకున్న ఏ పాత్రయినా... ఆయన ముందు మోకరిల్లుతుంది...
ఆయన ’పద్మశ్రీ’ కాదు.. ’పద్మభూషణుడు’ అసలే కాదు. ఆ మాటకొస్తే.. ప్రభుత్వం ఏ తీరునా గుర్తించనివాడు.. వెండితెరపై చెదరని గుర్తుగా నిలిచిపోయినవాడు... అద్భుత నటనా దీప్తి... విశ్వనట చక్రవర్తి... ఎస్వీ రంగారావు.  

‘ఎస్వీయార్ భారతీయునిగా.. అందునా.. దక్షిణాది వాడిగా... ముఖ్యంగా తెలుగువాడిగా పుట్టడం.. ఆయన దురద్రష్టం’ ఇది చాలామంది అభిప్రాయం. ఎస్వీయార్ వెండితెర వైభవాన్ని.. నటనాపటిమను చూసిన ఎవరైనా దానికి అంగీకరించాల్సిందే. ఎందుకంటే.. ఆయన గనుక హాలీవుడ్ లో పుడితే.. ఈ పాటికి ప్రపంచంలోనే నంబర్ వన్ నటునిగా నిలిచేవారు. అందులో ఏమాత్రం సందేహం లేదు.

అవును.. ఎస్వీయార్ ది నిజంగా హాలీవుడ్ పెర్ ఫార్మెన్స్. ఆయన ’రాజు పేద‘ సినిమా చూడండి... షేక్ స్పియర్ నాటకాల్లో పాత్రలు గుర్తొస్తాయ్. ఆయన నడక, నడత.. ఆంగికం.. వాచకం.. ఇవన్నీ షేక్ స్పియర్ పాత్రలను తలపింపజేస్తాయ్. అంటే... ప్రారంభంలోనే హాలీవుడ్ స్థాయి నటనను కనబరిచారన్నమాట.

ఇక ‘పాతాళభైరవి’ లోని నేపాల మాంత్రికుడు పాత్ర విషయానికొస్తే...  ఎస్వీయార్ కి ముందు... ముక్కామల, గోవిందరాజుల సుబ్బారావు లాంటి మహానటులు.. ఈ తరహా పాత్రలు పోషించేవారు. ఎస్వీయార్ ‘పాతాళభైరవి’లో ఆ తరహా పాత్ర చేయగానే.. వాళ్లు మళ్లీ ఆ పాత్రల జోలికి వెళ్లడం మానేశారు. మాంత్రికునిగా ఎస్వీయర్ నాలుగు సినిమాల్లో నటించారు. అవే... పాతాళభైరవి, భట్టీ విక్రమార్క, బాలనాగమ్మ, విక్రమార్క విజయం. వీటిల్లో ఒక మాంత్రికుడికీ, మరో మాంత్రికుడికీ సంబంధమే ఉండదు. పాత్ర ఒకటే ఆయనా... నాలుగు రకాల మాంత్రికులు తెరపై కనిపిస్తారు. దటీజ్  ఎస్వీ రంగారావు.
‘ఇక ఈ పాత్రను ఇంతకు మించి చేయడానికి లేదు..’ అని ఓ గీత గీసిన నటులు భారతీయ తెరపై ఓ అయిదారుగురుంటారు.

వారిలో రంగారావు ఒకరు.  ఆయన చేసిన... కంస, కీచక, హిరణ్యకశిప పాత్రలు అందుకు తార్కాణాలు.  బంగారుపాప, రంగులరాట్నం.. రెండు సినిమాల్లో ఆయనవి అంధుని పాత్రలే. ఒకడు పేదవాడైన అంధుడైతే..  ఒకడు దేశభక్తి కలిగిన ధనికుడైన అంధుడు. రెండూ రెండు రకాలుగా ఉంటాయ్.  ఇక చారిత్రాత్మకాల్లో  ఆయన చేసిన తాండ్రపాపారాయుని పాత్రను తేలిగ్గా మరిచిపోగలమా? ‘షావుకారు’లో సున్నపు రంగడు, ’పెళ్లి చేసిచూడు’లో ధూపాటి వియ్యన్న, ‘అప్పుచేసి పప్పుకూడు’లో ముకుందరావు, ‘తోడికోడళ్లు’లో కుటుంబరావు, ’కలసివుంటే కలదు సుఖం’లో పట్టాభిరామయ్య... ఇలా ఎస్వీయార్ చేసిన ప్రతి పాత్ర తెలుగోడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

మంచివాడిగా చేస్తే తెరపై ఆయనంత మంచివాడు మరొకరుండరు.  చెడ్డవాడిగా నటిస్తే... అంతటి దుర్మార్గుడు మరొకరు కనిపించరు. లోక కంఠకుడిగా నటిస్తే... రాక్షసాంతకులంతా కంటిముందు సాక్షాత్కరించాల్సిందే. ఆ వాచకం.. ఆ విరుపు.. ఆ సమయానుకూల నటన.. వేరొకరికి సాథ్యం కాదన్నది సత్యం.

ఎస్వీ రంగారావుగారిది భారతీయ సినీ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం. గొప్ప నటులమని విర్రవీగుతున్న చాలామందికీ.. నేటి తరానికీ..  రేపటి తరానికి..  ఎస్వీయార్ ప్రతి పాత్రా ఓ పాఠ్యాశం.

రంగారావుగారికి వందేళ్లు నిండాయట. వందేళ్లు కాదు... వెయ్యేళ్లు నిండినా.. మరువకూడని జాతి సంపద ఎస్వీరంగారావు...


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here