English | Telugu

రంగ రంగ వైభవంగా రంగస్థలం!

on Mar 30, 2018


సినిమా: రంగస్థలం
తారాగణం: రామ్ చరణ్, సంమంత, ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్..
దర్శకత్వం: సుకుమార్
నిర్మాత:  

కథకు స్పూర్తి జీవితం లోంచి పుట్టాలి. కథలోని మూలాలు జీవితంలో ఉండాలి. అలా జరగాలంటే... కథకుని నడక వాస్తవికత వైపు సాగాలి. అప్పుడే అద్భుతాలు  ఆవిష్కృతమవుతాయ్. ప్రస్తుతం అలాంటి కథకులు కరువైపోయారు.  ముఖ్యంగా తెలుగు సినిమా కథలంటే... అవి సామాన్యునిడికి అందనంత ఎత్తులో ఉంటాయ్. అలాంటి కథల్లో పాత్రలు కూడా మనుషుల్లా ప్రవర్తించవ్.

అయితే... అప్పుడప్పుడు మన వాళ్లు కూడా అద్బుతాలు చేయగలరని ఈ శుక్రవారం రుజువైంది. ఎందుకంటే... ఈ శుక్రవారం వచ్చిన సినిమా అలాంటిది. అదే ‘రంగస్థలం’. ఇప్పటివరకూ నగర నేపథ్యంలో అధునాతన పోకడలతో సినిమాలు తీసిన సుకుమార్... తొలిసారి మన మూలాలలను టచ్ చేశాడు. మన పల్లె జీవితాలూ.. వారి అభిమానాలు.. ఆప్యాయతలూ, కోపాలు, తాపాలు, ప్రేమలు, వాత్సల్యాలు, పగలూ, ప్రతికారాలూ ఇలా అన్ని భావాలనూ రెండున్నర గంటల్లో కుదించి చూపించాడు. ప్రేక్షకుల మనసుల్ని భావోద్వేగంతో నింపేశాడు. ఇక కథ కమామీషు విషయానికొస్తే...

‘రంగస్థలం’ అనే ఊళ్లో చిట్టిబాబు అనే కుర్రాడు. మంచి కుర్రాడు, చలాకీ కుర్రాడు. అల్లరి కుర్రాడు.. ధైర్యవంతుడు, మొండోడు, మూర్ఖుడు... చెవిటోడు... అదేనండీ సౌండ్ ఇంజనీర్ అనమాట. మనోడికి చిన్నగా చెబితే ఏదీ వినిపించదు. అరిచి చెప్పాల్సిందే. ఊళ్లో పొలాలకు తన మోటర్ ద్వారా నీళ్లు పట్టడం మనోడు పని. చిట్టిబాబుకు అన్నంటే ప్రాణం. ఇదిలావుంటే... ఆ ఊరు ఓ దుర్మార్గుడి కంబంద హస్తాలతో చిక్కకుకొని ఉంటుంది. వాడే కొన్ని దశాబ్దాల పాటు ఆ ఊరికి ప్రెసిడెంట్. అమాయకపు ప్రజల్ని మోసం చేస్తూ... ఎదురు తిరిగిన వాళ్లను కాటికి పంపుతూ... ఓ నియంతలా వ్యవహరిస్తుంటాడు. వాడిపై... చిట్టిబాబు అన్న ఎదురు తిరుగుతాడు. వాడికెదురుగా ఎన్నికల్లో పోటీకి దిగుతాడు. ఈ క్రమంలోనే చిట్టిబాబు అన్న... దారుణంగా హత్యకు గురవుతాడు. ఆ హత్య చేయించింది ప్రెసిడెంటే అని.. ప్రెసిడెంట్ని దారుణంగా చంపుతాడు చిట్టిబాబు. అసలు ఆ హత్య చేయించింది ప్రెసిడెంటేనా? చిట్టిబాబు అన్న హత్యకు కారణం ఏంటి?  ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ఇక్కడ ఆసక్తికరమైన విషయం.

సుకుమార్ ఇప్పటివరకూ తీసిన సినిమాలన్నీ ఒకెత్తు ‘రంగస్థలం’ ఒకెత్తు. ప్రేక్షకులందర్నీ ఆ ఊళ్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు సుకుమార్. ఆ ఊరి జనాల్లో మనల్ని కూడా ఒకర్ని చేశాడు. 1985 నాటి పరిస్థితులకు... అప్పటి జనాల మనోభావాలకు... వారి జీవన విధానానికి అద్దం పట్టాడు. ఫస్టాఫ్ అంతా వినోదాత్మకంగా, సెకండాఫ్ భావోద్వేగపూరితంగా సాగుతుందీ సినిమా. అందుకే.. సెకండాఫ్ కాస్త నిదానం అనిపిస్తుంది. కానీ... ఎక్కడా విసుగు మాత్రం రాదు. సమాజంలో పులులు ఉంటారూ... మేక వన్నె పులులూ ఉంటారు. రెండూ ప్రమాదకారులే. అప్రమప్తంగా ఉండాల్సింది సమాజమే... అని చక్కని సందేశం ఇచ్చాడు ఈ సినిమా ద్వారా సుకుమార్. సినిమాలోని ప్రతి పాత్రా నేలమీద నడిచేదే. వేస్ట్ పాత్ర ఒక్కటి కనిపించదు. సుకుమార్ కెరీర్ లోనే నంబర్ వన్ గా చెప్పుకోదగ్గ సినిమా ‘రంగస్థలం’. అందులో సందేహమే లేదు.

రామ్ చరణ్ ని నటునిగా మరో ఎత్తులో నిలబెట్టిన సినిమా ఇది. చెవిటి చిట్టిబాబుగా తను పలికించిన అభినయం.. సూపర్. నవరసాలూ పలికించగల పాత్ర దొరికింది తనకు. ఇక సమంత.. ఇప్పటివరకూ మోడ్రన్ కేరక్టర్లు చేసిన సామ్... ఇందులో తొలిసారి పల్లెటూరి అమ్మాయిగా కనిపించి... మెరిపించేసింది. సుబ్బలచ్చిమిలా మారిపోయిందంటే నమ్మండి! మొత్తంగా చెప్పాలంటే... ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారు.

సాంకేతికంగా ముందు చెప్పుకోవాల్సింది దేవిశ్రీ ప్రసాద్ గురించే. గ్రామీణ కథలంటే ఎక్కువగా ఇళయరాజా సంగీతమే అందరికీ గుర్తొస్తుంది. ఇక నుంచి దేవిశ్రీ సంగీతం కూడా వినిపిస్తుంది. అంతబాగా ఉంది ఇందులో దేవిశ్రీ మ్యూజిక్. ప్రతి పాటా వండరే. ఇక నేపథ్య సంగీతంతో కథకు ప్రాణం పోశాడు. తర్వాత చెప్పుకోవాల్సింది.. ఆర్ట్. తెరపై కనిపిస్తున్న ‘రంగస్థలం’ అనే పల్లెటూరు ఒక సెట్ అంటే ఎవ్వరూ నమ్మరు. అంత అద్భుతంగా వేశాడు ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ. మిగిలిన అన్ని విషయాల్లో కూడా సినిమా బావుంది.

చివరిగా చెప్పేదేంటంటే... సుకుమార్... ఒక మంచి దారి చూపించాడు. అదే దారిలో నడవడం నేటి దర్శకుల ధర్మం. నడకపోతే.. వారి ఖర్మం.

రేటింగ్...3.25


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here