ENGLISH | TELUGU  

వర్మ@ వివాదాలు

on May 21, 2015

వివాదానికి మారుపేరు. సంచలనానికి ప్రత్యక్ష రూపం. ఇంటిమీదకి రాయి విసిరి వీపుఒడ్డే రకం. నోటికి హద్దు పద్దు ఉండదు. ఎవర్ని పడితే వాళ్లని ఎంత మాటంటే అంత మాట అనేస్తాడు. ఈ ఘనతంతా ఎవరిదో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇంకెవరు రామ్ గోపాల్ వర్మ.

సమాజంలో ఎలాంటి సమస్యనైనా కేవలం తన మాటలతోనే రెచ్చగొట్టే సామర్థ్యం ఉన్న ఏకైకవ్యక్తి. ఇందుగలడందులేడను సందేహం వలదు మీకు అన్నట్టు ఏ రంగాన్ని, ఏ సెలబ్రెటీని వదిలిపెట్టడు. ప్రధాని నుంచి పాకీవాడివరకూ, స్టార్ హీరో నుంచి క్యారెక్టర్ అర్టిస్ట్ వరకూ కాదెవరు రామ్ నోటికి అనర్హం. చివరికి దేవుడిని కూడా  క్షమించడు. రామూ వివాదాస్పద కామెంట్స్ పై ఓ లుక్కేద్దాం.

వర్మ తాజా కామెంట్ ఏంటంటే....మహేశ్ బాబు సన్నీ లియోన్ కన్నా పదిరెట్లు సెక్సీగా ఉంటాడట.  ఈ మాట విని జనాలకు మాటరాలేదంటే నమ్మండి. అక్కడితో ఆగాడా!  పూరీ-మహేశ్ మూడోచిత్రం 10 రెట్లు ఎక్కువ ‘బాహుబలియర్’ గా ఉంటుందని రాజమౌళిని టార్గెట్ చేశాడు.
 
గతంలో రజనీ వక్షోజాలు అంటే నాకు ఇష్టం...కానీ కొచ్చాడియాన్ లో వాటిని మరింత పెద్దవిగా చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో’ అని ట్వీట్ చేసాడు. అసలే కొచ్చాడయ్యాన్  విడుదల విషయంలో చిరాకు పడుతున్న ఫ్యాన్స్ ను ఇది మరింత అసహనానికి గురిచేసింది. ఓకే బంగారంతో మంచి మార్కులు సంపాదించుకున్న దుల్కర్ ని తండ్రి మమ్ముట్టితో పోల్చాడు నోటి దురుసు వర్మ. దుల్కర్ ముందు మమ్ముట్టిని ఓ జూనియర్ ఆర్టిస్టు అన్నాడు. మమ్ముట్టికి వచ్చిన అవార్డులను వెనక్కి తీసుకుని వాటిని కొడుక్కి ఇవ్వాలని సూచించాడు ఈ కేరాఫ్ కాంట్రవర్సీ.

విషయం లేకుండా పాపులారిటీ సంపాదించుకున్న సంపూర్ణేష్ బాబంటే మన వర్మకి భలే ఇష్టంలా ఉంది. అందుకే సంపూ ది ఓన్లీ హీరో, రియల్ హీరో అంటూ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి కంటే సంపూ బెటరని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.  ఆగడులో గుక్కతిప్పుకోకుండా మహేశ్ చెప్పే డైలాగ్స్ విని ఎవ్వరికైనా చిర్రెత్తుకొస్తుంది. ఫ్యాన్స్ కూడా కక్కలేక మింగలేక ఊరుకున్నారు. కానీ అందరిలా సైలెంట్ గా ఉంటే వర్మ ఎందుకవుతాడు.....ఆగడులో డైలాగ్స్ ని- మహేశ్ బాబు మాడ్యులేషన్ ని ప్రత్యేక ఆస్కార్ అవార్డుకు పంపాలని ట్వీట్ చేశాడు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ కి ఎక్కడో కాలింది.

ఆంధ్రుల అన్నగారు నందమూరి తారకరామారావుని వదల్లేదు. ఆయనెందుకు ఈయన నోటికి చిక్కాడంటారా? ఆయన మళ్ళీ పుడితే జూనియర్ వద్ద నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయని కామెంట్ చేడాడు.  ‘టెంపర్’లో జూనియర్ లుక్ ను చూస్తుంటే సీనియర్ ఎన్టీఆర్ కూడా సరిపోడనిపిస్తోంది. అంతేకాదు టెంపర్ సినిమా చూస్తున్నప్పుడు ఎన్టీఆర్ ఆత్మ వచ్చి పక్కనకూర్చుంటే జూనియర్ ముందు సీనియర్ ఎంత వెనుక పడి ఉన్నాడో వివరిస్తానన్నాడు.  ప‌నిలో ప‌నిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కూడా కెలికాడు. పవన్ కన్నా ఆయ‌న త‌న‌యుడు అఖిరా నంద‌న్ 127 రేట్లు బెట‌ర్ అంటూ కితాబిచ్చాడు

సినిమావాళ్లనే కాదు రాజకీయనేతలనూ వదిలిపెట్టలేదు మన అయ్యగారు.  ‘గాంధీ డైనాస్టి (వంశం)పరంపర 1947లో నెహ్రూతో పుట్టి..2014లో రాహుల్ రూపంలో అంతమైంది’ అంటూ ఫేస్ బుక్‌లో కామెంట్ చేసాడు. అంతే కాదు సోనియా, రాహుల్, మన్మోహన్ సింగ్, చిదంబరం మూట ముల్లె సర్దుకుని వెళ్ళిపోతున్న ఫోటోను కూడ పోస్ట్ చేసాడు. 'గాంధీజీ బతికుంటే ఎవరికి సపోర్ట్ చేసేవారు? అలా అయితే మోదీ గెలిచేవాడా?' ...సోనియా, రాహుల్ కు మద్దతుగా గాంధీ ప్రచారం చేసిఉంటే మోదీ గెలిచేవారా అని వరుస కామెంట్స్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. గాంధీజీ తక్కువ బట్టలు ధరిస్తే.. జయలలితకేమో 10వేల చీరలా?' అంటూ మరో సెటైరికల్ ట్వీట్ కూడా పేల్చాడు. అసలు గాంధీని టార్గెట్ చేశాడా అనే రేంజ్ లో విమర్శల వర్షం కురిపించాడు. 'గాంధీజీ దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చాడా? లేక దేశం గాంధీజీకి స్వాతంత్ర్యం ఇచ్చిందా? గాంధీజీ ఆశయాలను కనీసం పది మంది నేతలు అనుసరించినా దేశం ఈపాటికి ఎక్కడో ఉండేద' అన్నాడు.

మన్మోహన్ సింగ్ స్థానంలో మోడీ 2004లోనే దేశ ప్రధాని అయ్యుంటే పౌరుడిగా నా జీవితం మెరుగ్గా ఉండేది. పదేళ్ల విలువైన జీవితాన్ని కోల్పోయేలా చేసినందుకు మోడీని అస్యహించుకుంటున్నా' అంటూ వర్మ మోదీని తిట్టాడో పొగడాడో తెలియకుండా కొట్టాడు. అంతేకాదు బీజేపీ టీమ్ ను సినిమా కాస్టింగ్ తో పోల్చాడు. 'కొన్నేళ్ల క్రితం అద్వానీ, జైట్లీ వంటి నేతల ముందు నరేంద్రమోడీ ఒక సపోర్టింగ్ యాక్టర్ కనిపించేవారు. ఇప్పుడు వాళ్లే జూనియర్ ఆర్టిస్టుల్లా కనిపిస్తున్నారు' అంటూ పోస్ట్ చేశాడు. 'మోడీ కేవలం నటిస్తున్నాడని కాంగ్రెస్ భావిస్తుంటే.. రాహుల్ ఆ పనిచేయడం లేదన్నట్లే. వెంటనే రాహుల్ ను రోషన్ తనేజా ఇనిస్టిట్యూట్ లో చేర్పించాలి' అని కాంగ్రెస్ నేతలకు ఉచిత సలహా ఇచ్చాడు.

ఇక కేసీఆర్ విషయానికొస్తే....రాముడు, కృష్ణుడు కన్నా కేసీఆరే శృంగార పురుషుడిగా కనపడుతారట.కేసీఆర్ లో భగవంతుడి అవతారాన్ని చూసుకుంటున్నామని చాలా మంది అమ్మాయిలు తనతో చెప్పినట్లు సంచలన ట్వీట్ చేశాడు.  ఎన్నికల్లో జగన్ ఓడిపోయాక....జగన్‌ పరిస్థితి తారుమారైందని-ప్రజలు రివర్స్ ఓదార్పు యాత్ర చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సెటైర్లు వేయడం సంచలనంగా మారింది. అప్పుడెప్పుడో చిరంజీవి జనసేన పార్టీ పెట్టి ఫెయిలైన సమయంలో ‘కాంగ్రెస్ కో హటావ్ దేశ్ కి బచావ్ ….చిరంజీవి హటావ్ రాష్ట్ర బచావ్’ అని ట్విట్ చేశాడు. దీంతో మెగా అభిమానులకు  కోపం వచ్చింది. వెంటనే “ఆర్.జి.వి హటావ్….ఫిల్మ్ ఇండస్ట్రీకికో బచావ్” అంటూ ప్రచారం చేశారు.

భారత్ గెలవాలని కళ్లలో వత్తులేసుకుని చూసిన జనాలకు ఊహించని షాక్ ఇచ్చాడు. భారత జట్టును ఇత‌ర దేశ‌ క్రికెట్ జట్లు ఓడించాలని, అప్పుడు ఇండియాలో క్రికెట్ ఆడటం మానేస్తారని ట్విట్ చేశాడు. అంతేకాకుండా మందుకు, సిగరెట్ల కంటే క్రికెట్ కు బానిస అయిన వారివల్ల దేశానికి ఎంతో ప్రమాదమని, దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా తమ పనులు చేయడం మానేసి, క్రికెట్ చూస్తున్నారని చెప్పుకొచ్చాడు.

పోనీ పుట్టిన రోజైనా తిన్నగా ఉండొచ్చుగా అంటే...వెనుకటి గుణమేల మాను అన్నట్టు ఆరోజు కూడా తిక్కచూపించాడు. పుట్టిన రోజు అంటే ఒక రోజు గడిచిపోయినట్లే. అంటే చావుకి దగ్గర పడుతున్నట్లేన‌ని...చేసిన పాపాలకు నేనెప్పుడో చచ్చిపోయానన్నాడు. త‌న‌కు మరుజన్మ ఉంటుందనే నమ్మకం లేదని..అందుకే  'మెనీ హ్యాపీ రిటర్స్న్' అని చెప్పడం వృథా అన్నాడు. అలా చెబితే అంతా తను మరణించిన రోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుందన్నాడు. ఇంత మర్యాదగా చెప్పాక ఎవరైనా శుభాకాంక్షలు చెబుతారా అండీ....?

సెలబ్రెటీల మీద రామూ కామెంట్స్ ఒకెత్తైతే...ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన హుదూద్ పై కూడా సెటైర్లు వేశాడు. తాము త్వరగా కోలుకోవాలని తుపాన్ బాధితులు పూజలు, పునస్కారాలు చేస్తున్నారు.....అసలు వాళ్లకు ఈ పరిస్థితి కల్పించిందే దేవుడు కదా? దేవుడు తెచ్చిన కష్టాలను తొలగించమని కోరుకుంటూ తిరిగి అదే దేముడికి ప్రార్ధనలు చేయడం ఏంటి అని సంచలనం సృష్టించారు. చివరికి ఇంట్లో వాళ్లనీ వదలిపెట్టలేదు. తన కూతురు అల్లుడు హాయిగా సరదాగా ఉంటే బోర్ కొడుతోందని...వాళ్లు విడిపోతే తనకు సినిమా కథ దొరుకుతుందని కామెంట్ చేశాడు. విన్నవాళ్లంతా నీకిందే పోయేకాలం వర్మా అన్నారంటే ఈ దర్శకుడి పైత్యం ఏ స్థాయికి చేరిందో మరి. సెలెబ్రెటీలు, సమస్యలు సరే....దేవుడేం చేశాడండీ?  వినాయక చవితి రోజున..‘ఇది గణేషుడు పుట్టిన రోజు...తండ్రి శివుడు అతని తల నరికిన రోజా అని వ్యాఖ్యలు పోస్ట్ చేశాడు.హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ పలు కేసుల కూడా నమోదయ్యాయి. కేసుల ప్రభావమో. లేక మహారాష్ట్రలో ఎదురైన పరిణామాల దెబ్బకో వర్మ దిగివచ్చారు. జీవితంలో మొదటిసారిగా  సారీ చెప్పారు.

అయితే సినిమాకో వివాదం సృష్టిస్తూ....ప్రతి సెలబ్రెటీని కామెంట్స్ చేస్తూ సాగిపోతున్న వర్మనోటిని ఏ రోజు అదుపులో ఉంచుకుని మాట్లాడుతాడో ఏమో. ఏమైనా అంటే నా ఇష్టం అంటాడు. దీంతో ఒకప్పుడు వర్మ అభిమానులు సైతం ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. ఎదుటి వారిని టార్గెట్ చేసిన సమయం మంచి కథకోసం వెచ్చిస్తే మళ్లీ గతవైభవం వస్తుందని సలహా ఇస్తున్నారు. ఏదేమైనా ప్రేమ కంటే ద్వేషం ఎక్కువ స్పైసి గా ఉంటుందన్న వర్మ ఎప్పటికి కాంప్రమైజ్ అవుతాడో ఏమో!


 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.