ఇదేం టీజర్రా బాబోయ్
on Apr 9, 2018
నాగార్జున - రాంగోపాల్ వర్మ కాంబినేషన్ అంటే... ఇప్పటికీ క్రేజే. `శివ` లాంటి అద్భుతాన్ని సృష్టించిన ద్వయం ఇది. `అంతం`, `గోవిందా గోవిందా` అప్పట్లో అంతగా ఆడలేదు. ఇప్పుడు మాత్రం టీవీల్లో ఎన్నిసార్లు వచ్చినా చూడాలనిపిస్తుంటుంది. ఈ ట్రాక్ రికార్డు ఉన్న నాగ్ - వర్మ కలిస్తే ఆ కిక్కే వేరు. `ఆఫీసర్`లోనూ ఏదో గమ్మత్తు ఉండబోతోందని అటు నాగ్ అభిమానులు, ఇటు వర్మ భక్తులు ఆశించారు. ఇప్పుడు టీజర్ కూడా వచ్చేసింది. 66 సెకన్ల ఈటీజర్లో ఒక్క సెకన్లోనూ `వావ్` అనిపించే మూమెంట్ లేదు. అదేదో తక్కువ బడ్జెట్లో తీసిన మలయాళం సినిమాని తెలుగులో డబ్ చేశారేమో అనిపిస్తోంది. ఆఫీసర్ అనే మాట కూడా... డబ్బింగ్ సినిమాకి సరితూగిపోయేట్టు కనిపిస్తుంది. మన్మథుడు నాగ్ సీరియెస్ లుక్లో ఒక్కో చోట ఒక్కోలా కనిపించాడు. `హైదరాబాద్ నుంచి ముంబై వచ్చి ఏం పీకుతాడు` అనేది కూడా ముతక డబ్బింగ్ డైలాగే. నాణ్యత విషయంలో నిర్మాతలు బాగా రాజీ పడిపోయారన్న సంగతి అర్థమవుతూనే ఉంది. సినిమా కూడా ఇలానే ఉంటే.. ఈ ఆఫీసర్కీ, ఆ వర్మనీ, చూసిన ప్రేక్షకుల్నీ ఎవ్వరూ కాపాడలేరు.