పేట మూవీ రివ్యూ
on Jan 10, 2019
నటీనటులు: రజనీకాంత్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శశికుమార్, విజయ్ సేతుపతి, సిమ్రాన్, త్రిష, బాబీ సింహా, మేఘా ఆకాష్ తదితరులు...
నిర్మాణ సంస్థ: సన్ పిక్చర్స్
కెమెరా: తిరు
సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్
నిర్మాత (తెలుగులో విడుదల): అశోక్ వల్లభనేని
దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్
విడుదల తేదీ: జనవరి 10, 2018
తెలుగు రాష్ట్రాల్లో రజనీకాంత్ అభిమానులను, ప్రేక్షకులను భారీ అంచనాల నడుమ విడుదలైన 'కబాలి', 'కాలా' చిత్రాలు నిరాశపరిచాయి. '2.0' సాంకేతికంగా ఉన్నత చిత్రంగా నిలిచింది గానీ... రజనీ నుంచి ఆయన అభిమానులు కోరుకునే అంశాలను ఇవ్వడంలో పూర్తి విజయం సాధించలేదు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన 'పేట' సంగతేంటి? ప్రచార చిత్రాలతో రజనీ అభిమానుల్లో అంచనాలు పెంచిన ఈ సినిమా ఎలా ఉంది? తెలుసుకోండి.
కథ:
రికమండేషన్ చేయించుకుని మరీ ఊటీలోని ఓ కాలేజీ హాస్టల్‌కి వార్డెన్‌గా వెళతాడు కాళీ (రజనీకాంత్). అందులో ఓ స్టూడెంట్ అన్వర్ (సనంత్), అను (మేఘా ఆకాష్)ని ప్రేమిస్తాడు. అను వాళ్ళింటికి అన్వర్ ప్రేమ సంగతి చెప్పడానికి వెళ్లిన కాళీ... అను తల్లి (సిమ్రాన్)తో ప్రేమలో పడతాడు. రెండు ప్రేమకథలు సంతోషంగా ముందుకు వెళ్తున్నాయని అనుకున్న సమయంలో అన్వర్‌పై కొందరు ఎటాక్ చేయడానికి వస్తారు. వాళ్లదందర్నీ కాళీ తన్ని తరిమేస్తాడు. అయితే... అన్వర్‌పై ఎటాక్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? అన్వర్‌పై ఎటాక్ జరగొచ్చని కాళీ ముందుగా ఎలా ఊహించాడు? కాళీ గతం ఏంటి? అన్వర్‌కి, కాళీకి సంబంధం ఏంటి? ఉత్తరప్రదేశ్‌లోని సింహాచలం సింగ్ అలియాస్ సింహాచలం (నవజుద్ధీన్ సిద్ధిఖీ)కి, కాళీ అలియాస్ 'పేట' వీర (రజనీకాంత్)కి విరోధం ఏంటి? ఇటువంటి పలు ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా!
విశ్లేషణ:
'అంతా అయిపోయిందని అనుకున్నారా?' అని సినిమాలో ఓ డైలాగ్ ఉంది! రజనీకాంత్ నోటి వెంట ఆ డైలాగ్ వస్తుంటే... 'లేదు లేదు! రజనీలో జోష్, రజనీలో స్పీడ్, రజనీలో మాస్ అయిపోలేద'ని ప్రేక్షకులు అనుకునేలా కార్తీక్ సుబ్బరాజ్ సినిమాను తీశాడు. రజనీకాంత్ నుంచి అభిమానులు ఏయే అంశాలు కోరుకుంటారో... సినిమాలో వాటన్నిటినీ చూపించాడు. రజనీకాంత్ క్యారెక్టర్‌ను జోష్‌ఫుల్‌గా డిజైన్ చేయడంతో దర్శకుడి పని సగం పూర్తయ్యింది. మిగతా సగాన్నీ తలైవా పూర్తి చేశారు. 'కబాలి', 'కాలా' సినిమాల్లో సీరియస్ పాత్రలు కావడంతో రజనీకి తన మార్క్ మేనరిజమ్స్ చూపించే అవకాశం దక్కలేదు. ఈ సినిమాలో అటువంటి పాత్ర దొరకడంతో చెలరేగి నటించారు. "ఇరవై ఏళ్ళు దాక్కోలేదు. దూకడానికి సరైన సమయం కోసం ఎదురుచూశా" అని రజనీకాంత్ డైలాగ్ చెబుతుంటే... "గత రెండు మూడు సినిమాల్లో రజనీలో నటుడు దాక్కోలేదు. సరైన పాత్ర వస్తే సింహంలా దూకడానికి ఎదురుచూశాడు" అనిపిస్తుంది.
సినిమా ఫస్టాఫ్‌లో కథ ఏంటనేది పెద్దగా చూపించకున్నా... రజనీ మార్క్ సన్నివేశాలతో సరదాగా సాగింది. సెకండాఫ్‌లో అసలు కథ మొదలైన తరవాత కాస్త నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ క్లైమాక్స్‌లో రజనీ చేత గన్ పట్టించి అభిమానుల చేత ఈలలు వేయించాడు కార్తీక్ సుబ్బరాజ్. అతడి ఊహకు తగ్గట్టు, రజనీ హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా అనిరుధ్ రవిచంద్రన్ సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు. తిరు సినిమాటోగ్రఫీ బావుంది. సినిమాకు ఓ వింటేజ్ ఫీల్ తీసుకొచ్చింది. సినిమా కథ, కథనం... 'భాష' సినిమాకు మరో వెర్షన్ అన్నట్టు ఉంటాయి.
ప్లస్ పాయింట్స్:
రజనీకాంత్ స్టార్డమ్, యాక్టింగ్
రజనీ మార్క్ మేనరిజమ్‌తో సాగే సీన్లు
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం
అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం
మైనస్ పాయింట్స్:
కొత్త కథ కాదు...
సెకండాఫ్ నెమ్మదిగా సాగడం!
నటీనటుల పనితీరు:
తన వయసు ఓ పాతికేళ్లు తగ్గినట్టు హుషారుగా రజినీకాంత్ నటించారు. కాళీ, పేట వీర.. రెండు పాత్రల్లో రజనీకాంత్ కనిపిస్తారు. రెండింటిలోనూ తన మార్క్ చూపించారు. రజనీకాంత్ క్యారెక్టర్లు, స్టయిలింగ్ బాగా కుదిరాయి. సిమ్రాన్, త్రిష పాత్రల పరిథి తక్కువే. ఉన్నంతలో బాగా చేశారు. శశికుమార్ కూడా సెకండాఫ్‌లో కాసేపే కనిపిస్తారు. ప్రతినాయకుడిగా నవాజుద్దీన్ సిద్ధిఖీ, అతడి కుమారుడిగా విజయ్ సేతుపతి పాత్రల పరిధి మేరకు అద్భుతంగా నటించారు. బాబీ సింహా, మేఘా ఆకాష్ తదితరులవి అతిథి పాత్రలను తలపిస్తాయి.
చివరగా:
Petta... By the Rajinikanth Fans, For the Rajinikanth Fans, Of the Rajinikanth Fans! రజనీకాంత్ అభిమానుల కోసం... రజనీకాంత్ అభిమానుల యొక్క అంచనాలను దృష్టిలో పెట్టుకుని రజనీకాంత్ అభిమానులు తీసిన సినిమా 'పేట'. కథలో కొత్తదనం ఆశించేవాళ్ళకు నిరాశ కలగొచ్చు. కానీ, రజనీకాంత్ అభిమానులు పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. దర్శకుడితో పాటు చిత్రబృందంలో రజినీపై అభిమానం ఎక్కువ కావడంతో ప్రతి సన్నివేశంలో అది కనిపిస్తుంది. సగటు సినిమా ప్రేక్షకుడికి అది నచ్చకపోవచ్చు.
రేటింగ్:3

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
