English | Telugu

మూవీ రివ్యూ: నేనోర‌కం

on Mar 17, 2017

సినిమాలు రెండు ర‌కాలు. క‌మ‌ర్షియ‌ల్ దినుసుల్ని న‌మ్ముకొని.. చూస్తున్నంత సేపు కాల‌క్షేం అయిపోతే చాలు.. అనుకొనే టైపు సినిమాలు కొన్ని. ఎలాంటి క‌థ చెప్పినా అందులో ఏదో ఓ మంచి విషయం చెప్పాల‌ని ప‌రిత‌పించే క‌థ‌లు కొన్ని. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తూ రెండో త‌ర‌హా సినిమాలు మ‌న‌కు చాలా త‌క్కువ‌గా వ‌స్తున్నాయి. వ‌చ్చినా.. ప్రేక్ష‌కుల నుంచి స‌రైన ఆద‌ర‌ణ దొర‌క‌డం లేదు. అయినా కొంత‌మంది ద‌ర్శ‌కులు ఆ త‌ర‌హా ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు. 'నేనోర‌కం' సినిమా కూడా ఆ జాబితాలో చేరేదే. ఇటీవ‌ల పూరి త‌మ్ముడు సాయిరాం శంక‌ర్‌కి స‌రైన విజ‌యాల్లేవు. కెరీర్ మ‌రీ డ‌ల్ అయిపోయిన త‌రుణంలో వ‌చ్చిన సినిమా ఇది. మ‌రి 'నేనోర‌కం' ఎలా ఉంది?  ఈ సినిమాలో చెప్పిన ఆ కొత్త పాయింట్ ఏంటి??  తెలుసుకొంటే...

* క‌థ‌

గౌత‌మ్ (సాయిరాం శంక‌ర్‌) ఓ అనాథ‌. ఫైనాన్స్ కంపెనీలో రిక‌వ‌రీ ఏజెంట్‌గా ప‌నిచేస్తుంటాడు. స్వేచ్ఛ (రేష్మీ మీన‌న్‌)ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. కొన్ని అబ‌ద్దాలు చెప్పి ఆమెకు ద‌గ్గ‌ర‌వుతాడు. గౌత‌మ్ చెప్పినవ‌న్నీ అబ‌ద్దాల‌న్నీ తెలిసి ముందు కోప్ప‌డినా.. ఆ త‌ర‌వాత గౌత‌మ్ ప్రేమ నిజ‌మ‌ని తెలిసి ద‌గ్గ‌ర‌వుతుంది. సరిగ్గా అప్పుడే... స్వేచ్ఛ‌ని ఎవ‌రో కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప‌ర్ (శ‌ర‌త్ కుమార్‌) గౌత‌మ్‌కి ఫోన్ చేసి ఓ ప‌ని అప్ప‌గిస్తాడు. ఆ ప‌ని చేస్తేనే స్వేచ్ఛ‌ని ప్రాణాల‌తో విడిచిపెడ‌తా అంటూ ష‌ర‌తు పెడ‌తాడు. ఇంత‌కీ ఆ కిడ్నాప‌ర్ ఎవ‌రు?  స్వేచ్ఛ‌ని ఎందుకు కిడ్నాప్ చేయాల్సివ‌చ్చింది?  గౌత‌మ్‌కి అప్ప‌గించిన ఆ ప‌నేంటి? ఇవ‌న్నీ తెలియాలంటే 'నేనో రకం' సినిమా చూడాల్సిందే. 

* విశ్లేష‌ణ‌

నేనోర‌కం.. అనే టైటిల్ ఎందుకు పెట్టారో గానీ.. క‌థానాయ‌కుడి పాత్ర మ‌రీ అంత టిపిక‌ల్‌గా ఏం ఉండ‌దు. క్యాచీ టైటిల్ అని వాడేసి ఉంటారు. అయితే... క‌థ మాత్రం రెగ్యుల‌ర్‌గా సాగుతూ... ఓ టిపిక‌ల్ పాయింట్‌తో ఎండ్ చేశారు. ఫ‌స్టాఫ్ లో హీరో హీరోయిన్ల మ‌ధ్య ల‌వ్ ట్రాక్ సాగింది. హీరో ఓ అబద్దం చెప్పి, హీరోయిన్ కి ద‌గ్గ‌ర అవ్వాల‌నుకోవ‌డం కొత్త పాయింట్ ఏం కాదు. దాంతో ఆయా స‌న్నివేశాల‌న్నీ రొటీన్‌గా విసిగిస్తాయి. దానికి తోడు ఎమ్మెస్ నారాయ‌ణ - హ‌ర్ష మ‌ధ్య సాగిన ట్రాక్ ఏమాత్రం న‌వ్వించ‌లేదు. జ‌బ‌ర్ ద‌స్త్ గ్యాంగ్‌తో చేసిన ఫైట్ కూడా సిల్లీగా ఉంది. సినిమా రొటీన్‌గానే ఉందేంది?? అనుకొంటున్న ద‌శ‌లో కిడ్నాప్ తో క‌థ మ‌లుపు తిప్పాడు ద‌ర్శ‌కుడు. క‌థానాయిక కిడ్నాప్‌.. ఆ త‌ర‌వాత జ‌రిగే ప‌రిణామాలూ రక్తి క‌డ‌తాయి. ఎప్పుడైతే శ‌ర‌త్ కుమార్ పాత్ర ఎంట్రీ ఇచ్చిందో.. అప్పుడు ఈ క‌థ స‌రైన దారిలో న‌డ‌వ‌డం మొద‌లెడుతుంది.

కిడ్నాప్ ఎందుకు జ‌రిగింది?  దాని వెనుక ఉద్దేశాలేంటి? అనేవి తేలిపోయియా గానీ.. ఆ మ‌ధ్య‌లో క‌థానాయ‌కుడితో ఆడించిన ఆట మాత్రం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. శ‌ర‌త్ కుమార్ ఫ్లాష్ బ్యాక్ క‌ట్టి ప‌డేస్తుంది. ఆ స‌న్నివేశాలే.. నేనో ర‌కం సినిమాకి ప్ర‌ధాన బ‌లం. ఈ సినిమాని శ‌ర‌త్ కుమార్ చేయ‌డానికి ముందుకు రావ‌డానికీ, నిర్మాత‌లు ధైర్యంగా ఒప్పుకోవ‌డానికి కార‌ణం.. ఫ్లాష్ బ్యాక్ ఎసిసోడ్లే. ప్రేమ పేరుతో స‌మాజంలో జ‌రుగుతున్న అరాచ‌కాల్ని ద‌ర్శ‌కుడు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించాడు. ఈ క‌థ‌ని ముగించిన తీరు ఇంకాస్త ఎఫెక్టీవ్‌గా ఉంటే బాగుణ్ణు. ఫ‌స్టాఫ్‌లో ల‌వ్ ట్రాక్, కామెడీ వ‌ర్క‌వుట్ అయితే... ఈ సినిమా స్థాయి మారిపోదును. అయినా ఫ‌ర్వాలేదు. సెకండాఫ్‌తో ఈ సినిమా కాస్త గ‌ట్టెక్క‌గ‌లిగింది. శ‌ర‌త్ కుమార్ పాత్ర‌కి ఇంకాస్త ముందుగా తీసుకొచ్చి.. ఫ‌స్టాఫ్‌లోనూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడిస్తే.. నేనోర‌కం క‌థ‌ని మ‌రింత న్యాయం జ‌రిగేది. 

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

బంప‌ర్ ఆఫ‌ర్ త‌ర‌వాత సాయి రాం శంక‌ర్‌కి స‌రైన హిట్టు లేదు. క‌థ‌, క‌థ‌నాల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం వ‌ల్లే ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించాయి. ఈసారి మాత్రం కాస్త క‌థ‌పై శ్ర‌ద్ద పెట్టిన‌ట్టు అనిపించింది. క‌థ‌లో ఉన్న పాయింట్ కొత్త‌దే. అంత వ‌ర‌కూ సాయి విజ‌యం సాధించాడు. పెర్‌ఫార్మ్సెన్స్ ప‌రంగానూ ఓకే అనిపిస్తాడు. అల్ల‌రి అబ్బాయిగా ఫ‌స్టాఫ్ లోనూ...ప్రేమించిన అమ్మాయిని కాపాడుకోవాల‌న్న త‌ప‌న ఉన్న కుర్రాడిగా సెకండాఫ్‌లోనూ ఆక‌ట్టుకొన్నాడు. అయితే... సినిమా మొత్తాన్ని త‌న‌వైపుకు తిప్పుకొన్న‌ది మాత్రం శ‌ర‌త్‌కుమారే. ఆ పాత్ర‌ని ద‌ర్శ‌కుడు డిజైన్ చేసిన విధానం బాగుంది. ఆఖ‌ర్లో సింప‌తీ గైన్ చేసేదీ ఆ పాత్రే. క‌థానాయిక అందంగా క‌నిపించింది. మిగిలిన వాళ్ల‌కు అంత స్కోప్ లేదు.

* సాంకేతిక వ‌ర్గం
చ‌క్రి త‌మ్ముడు సంతోష్ నారాయ‌ణ్ పాట‌లు, నేప‌థ్య సంగీతం ఓకే అనిపిస్తాయి. పాట‌లు బాగున్నా... ఇలాంటి క‌థ‌ల్లో పాట‌ల్ని మ‌రీ ఇంత వాడుకోకూడ‌ద‌నిపిస్తుంది. ఐటెమ్ గీతం కూడా నిడివి పెంచుకోవ‌డానికే ఉప‌యోగించిన‌ట్టుంది. ద‌ర్శ‌కుడు రాసుకొన్న పాయింట్ కొత్త‌గా ఉంది. దాన్ని సినిమా భాష‌లో త‌ర్జుమా చేయ‌డానికి క‌ష్ట‌ప‌డ్డాడు కూడా. అయితే.. తొలి భాగంలో ఆ మూడ్ క్రియేట్ చేయ‌డంలో విఫ‌లం అయ్యాడు. త‌న దృష్టంతా సెకండాఫ్‌పై కేంద్రీక‌రించ‌డంతో.. తొలి స‌గం ప‌ట్టాలు త‌ప్పింది. మాట‌లు అక్క‌డ‌క్క‌డ ఆక‌ట్టుకొంటాయి. ఛాయాగ్ర‌హ‌ణం.. బాగుంది.


* ఫైన‌ల్ ట‌చ్‌:  నేనోర‌కం.. ఇది శ‌ర‌త్‌కుమార్ సినిమా!

* రేటింగ్ : 2.0

 

Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here