English | Telugu

బాలకృష్ణ... నాగబాబు... ఓ కౌంటర్ సిరీస్!

on Jan 7, 2019

'బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు' అని మెగాబ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇటు ఇండస్ట్రీలో... అటు ప్రేక్షకుల్లో... పెద్ద చర్చకు తెర తీశాయి. నాగబాబుకు మద్దతుగా మెగా అభిమానులు, బాలకృష్ణ మద్దతుగా నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి దిగారు. వైరి వర్గానికి చెందిన హీరోలను  అతి జుగుప్సాకరంగా... చెప్పడానికి, రాయడానికి వీల్లేని భాషలో సోషల్ మీడియా పోస్టుల్లో తిట్టారు. ఈ వివాదం సద్దుమణిగిందని అనుకునేలోపు 'మాకూ కవిత్వాలు రాయడం వచ్చండోయ్' అంటూ ఫేస్‌బుక్‌లో నాగబాబు ఒక పోస్ట్ పెట్టారు. ఎన్టీఆర్ బయోపిక్‌ని టార్గెట్ చేస్తూ ఆ పోస్ట్ పెట్టారని నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు మాత్రం సరదాగా ఆ వ్యాఖ్యలు చేశాను తప్ప.. నిజంగా టార్గెట్ చేయలేదని అంటున్నారు. సీరియస్ గా టార్గెట్ చేస్తే ఇంత కామెడీగా వుండదని ఆయన అంటున్నారు.

ఇటీవల తాను చేసిన వ్యాఖ్యల గురించి నాగబాబు ఓ వీడియో విడుదల చేశారు. "హలో ఫ్రెండ్స్... గత కొంతకాలంగా నేను ఓ వ్యక్తిపై చేస్తున్న కామెంట్స్ వివాదాస్పదంగా వున్నాయని చాలా విమర్శలు వచ్చాయి. దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది. సాధారణంగా ఇటువంటి వివాదాల జోలికి నేను వెళ్ళను. వివాదాలకు వెళ్లి ఫోకస్ అవ్వాలని అవసరం నాకు లేదు. నాకున్న గుర్తింపు నాకు చాలు. నేను పేరు ప్రఖ్యాతల వెంట పడే వ్యక్తిని కాను. 'పవన్ కల్యాణ్ ఎవరో నాకు తెలియదు' అని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నేను కౌంటర్ ఇచ్చానని చాలామంది అనుకుంటున్నారు. 'ఒక్క మాటకు అంత ఫీలైతే ఎలా?  ఇచ్చింది ఏదో కౌంటర్ ఇచ్చారు. మళ్ళీ మళ్ళీ ఎందుకు టార్గెట్ చేయడం?' అన్ని నాతో అంటున్నారు. ఒక్కసారి కాదు. ఆ వ్యక్తి ఇప్పటికి ఆరుసార్లు మా ఫ్యామిలీ మీద... మా అన్నదమ్ముల మీద కామెంట్ చేశారు" అని నాగబాబు అన్నారు. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి... తెలుగుదేశం విజయానికి కృషి చేసిన పవన్ కల్యాణ్ ఎవరో బాలకృష్ణకు తెలియదా? అని నాగబాబు ప్రశ్నించారు.

ఓ సందర్భంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీడియా బాలకృష్ణ స్పందన కోరగా... "ఒకరిని హీరో చేయడం మాకు ఇష్టం లేదు. మేమే సూపర్ స్టార్స్" అని అన్నారు. ఈ వ్యాఖ్యలపైనా నాగబాబు స్పందించారు. "వెరీ గుడ్. వాళ్లు సూపర్ స్టార్స్. మాకు అభ్యంతరం లేదు. కానీ, మిగతా వాళ్ళు కదా? మీరేనా సూపర్ స్టార్స్? మీరే గొప్ప నటులా? పవన్ కల్యాణ్ కదా? ఈ కామెంట్స్ ఏంటి? కౌంటర్ ఇవ్వడం మాకు చేత కాదని అనుకుంటున్నారా? చాలా ఓపిగ్గా సహనంతో చూశాం. ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ ఉన్నారు. మహేష్ బాబు అనబడే స్టార్ ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్... మెగాస్టార్.. సూపర్ స్టార్ కృష్ణ... చాలామంది ఉన్నారు" అని నాగబాబు అన్నారు.   

"అమితాబ్ బచ్చన్ ఏం పీకాడు? చిరంజీవి ఏమైంది? మేము వేరు.. మా బ్లడ్ వేరు... మా బ్రీడ్ వేరు" అని ఒక ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందించారు. "స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎంత పెద్ద స్టారో... అమితాబ్ గారు, కన్నడ రాజ్ కుమార్, ఎంజీఆర్ కూడా అంత పెద్ద స్టార్. మీరు ఎవరినైనా విమర్శించవచ్చు. అయితే.. అంత పెద్ద నటుణ్ణి ఏం పీకారని అన్నప్పుడు చాలా బాధ వేసింది. అసలు, ఆ విషయంలో చిరంజీవి ప్రస్తావన ఎందుకు? మమ్మల్ని అవమానిస్తే... ఆ తరవాత  మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అంటే మాకు కోపం రాదా? మిగితావాళ్లను తక్కువ చేసి మాట్లాడితే మేం ఊరుకోము. మీరు దైవంశ సంభూతులు కారు. మీరూ మాలాగే మనుషులు" అని నాగబాబు అన్నారు.

"బాలకృష్ణపై కామెంట్స్ చేసినందుకు ఎవరైతే ఫీలవుతున్నారో... వాళ్ళందరూ బాలకృష్ణ ఎన్ని కామెంట్స్ చేశారో తెలుసుకోండి" అని నాగబాబు అన్నారు. ఈ కౌంటర్ సిరీస్ కంటిన్యూ కానుంది. బాలకృష్ణ ఆరుసార్లు తమ ఫ్యామిలీ మీద, తమ అన్నదమ్ముల మీద కామెంట్స్ చేశాడని నాగబాబు పేర్కొన్నారు. ఇప్పటికి మూడు కామెంట్స్ కి స్పందించారు. మరో మూడు కామెంట్స్ మీద స్పందన వస్తుందన్నమాట.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here