English | Telugu

NTR కథానాయకుడు రివ్యూ

on Jan 9, 2019

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, విద్యా బాలన్, సుమంత్, జిషుసేన్ గుప్తా, నందమూరి కళ్యాణ్ రామ్, ప్రకాష్ రాజ్, మురళీశర్మ తదితరులు...
నిర్మాణ సంస్థలు: ఎన్.బి.కె. ఫిలిమ్స్, వారాహి చలనచిత్రం, విబ్రి మీడియా  
కెమెరా: వి.ఎస్. జ్ఞాసేఖర్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
సంగీతం: ఎం.ఎం. కీరవాణి  
సమర్పణ: సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
నిర్మాత‌: నందమూరి వసుంధరాదేవి, నందమూరి బాలకృష్ణ
ద‌ర్శ‌క‌త్వం: క్రిష్
విడుదల తేదీ: జనవరి 9, 2018

యన్.టి.ఆర్ (నందమూరి తారక రామారావు) ఓ చరిత్ర! తెలుగు జాతి గౌరవాన్ని, ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి. మహా పురుషుడు. ఆయన జీవితాన్ని సినిమాగా తీయడం అంటే సాహసమే. ఆ సాహసాన్ని ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ ఎంత విజయవంతంగా పూర్తి చేశారు. బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తూ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో నిర్మించిన 'యన్.టి.ఆర్ - కథానాయకుడు'లో ఏముంది? అనేది తెలుసుకోండి.

క‌థ‌:
బెజవాడ (విజయవాడ)లో రిజిస్టార్ ఆఫీసులో అవినీతి, లంచాలకు అలవాటు పడిన అక్కడి ఉద్యోగుల తీరు నచ్చక ఉద్యోగంలో చేరిన మూడు వారాలకు నందమూరి తారక రామారావు (బాలకృష్ణ) రాజీనామా చేస్తాడు. ఉద్యోగం మానేసి ఏం చేస్తావని ఇంట్లో ప్రశ్నిస్తే.. సినిమాల్లోకి వెళతానని మద్రాస్ (చెన్నై) ట్రైన్ ఎక్కుతాడు. అక్కడి నుంచి నటుడిగా ఎన్టీఆర్ ప్రయాణం ఎలా సాగింది? సినిమా పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావుతో ఆయన అనుబంధం ఎలా వుండేది? నటుడిగా ప్రేక్షకుల చేత దేవుడు అనిపించుకున్న ఎన్టీఆర్, రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? రాజకీయాల్లో అడుగులు వేసేలా ఆయన్ను ప్రేరేపించిన అంశాలు ఏంటి? తెలుగుదేశం పార్టీ ప్రకటన ఎక్కడ ఎలా ఏ పరిస్థితుల్లో చేశారు? ఆయన నిర్ణయాలకు కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి మద్దతు వుండేది? అనేది సినిమా.  


విశ్లేషణ:

ఎన్టీఆర్ సినీ జీవితమంతా ప్రజలకు తెలుసు. మరి, కుటుంబంతో ఆయన ఎలా మెలిగేవారు? ముఖ్యంగా సతీమణి బసవతారకమ్మతో ఎన్టీఆర్ ఎలా వుండేవారు? అనేది సినిమాలో చూపించారు. రాజకీయాల్లోకి ఎన్టీఆర్ ప్రవేశించకముందు వరకూ ఆయన జీవిత ప్రయాణమే ఈ సినిమా. వ్యక్తిగా, వ్యక్తిత్వంలో ఉన్నత విలువలు కలిగిన మనిషిగా ఎన్టీఆర్ రాజీపడని మనస్తత్వాన్ని తేరా మీదకు తెచ్చిన సినిమా. ఒక్క నిడివి విషయంలో తప్ప మిగతా అంశాల్లో సాంకేతికంగా దర్శకుడు క్రిష్, అతడి బృందం నూటికి నూరు పాళ్ళు విజయం సాధించారు. సంభాషణలు బావున్నాయి. కీరవాణి సంగీతంలో 'విజితాఖిలాంద్ర', 'తెలుగోడా' పాటలు ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ వినాలనేలా వున్నాయి. నేపథ్య సంగీతం కూడా బావుంది. సినిమాటోగ్రఫీ సూపర్. ఎన్టీఆర్ సినిమా జీవితాన్ని పక్కన పెడితే.. వ్యక్తిగత జీవితంలో సన్నివేశాలు ప్రేక్షకుల మనసులను బలంగా తాకుతాయి.

ప్లస్ పాయింట్స్:

నందమూరి బాలకృష్ణ నటన
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం
కీరవాణి స్వరాలు, నేపథ్య సంగీతం
సాయిమాధవ్ బుర్రా సంభాషణలు
మిగతా చిత్రబృందం పై నలుగురికీ అందించిన తోడ్పాటు  

మైనస్ పాయింట్స్:

యంగ్ ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ లుక్
ఫ‌స్టాఫ్‌లో సీన్స్ మధ్య లింక్ మిస్ కావడం
సాగదీసినట్టుండే కొన్ని సన్నివేశాలు, నిడివి  

నటీనటుల పనితీరు:

నటుడిగా ఎన్టీఆర్ పాత్రను పోషించడం ఓ సాహసం అయితే.. ఆయన వేసిన గెటప్పుల్లో కనిపించడం మరో సాహసం. రెండు సాహసాలను సమర్థవంతంగా నిర్వర్తించడానికి బాలకృష్ణ శక్తివంచన లేకుండా కృషి చేశారు. వయసు ప్రభావం వల్ల యంగ్ ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ గెటప్ అంతగా ఆకట్టుకోదు. మిగతా గెటప్పుల్లో బాలకృష్ణ బావున్నారు. బసవతారకం పాత్రలో విద్యా బాలన్, హరికృష్ణగా నందమూరి కళ్యాణ్ రామ్ జీవించారు. మురళీశర్మ, ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్, వెన్నెల కిషోర్ తదితరులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. అక్కినేని నాగేశ్వరరావుగా ఆయన మనవడు సుమంత్ అతికినట్టు సరిపోయారు. ఏయన్నార్ మళ్ళీ తెరపై కనిపించినట్టు ప్రేక్షకులు ఫీలవుతారు.
రానా దగ్గుబాటి, రకుల్ ప్రీత్ సింగ్, ప్రణీత, నిత్యా మీనన్, శ్రియ, హన్సిక, బ్రహ్మానందం, నాజర్, డాక్టర్ భరత్, సచిన్ ఖడేకర్, షాలినీ పాండే తదితరులు అతిథి పాత్రల్లో మెరిశారు.   

చివరగా:
'యన్.టి.ఆర్ - కథానాయకుడు' చిత్రాన్ని సగటు సినిమాగా చూస్తే... కథగా విశ్లేషిస్తే... తప్పులు ఎన్నో కనిపిస్తాయి. ఎన్టీఆర్ జీవితంగా చూస్తే ఈతరం ప్రేక్షకులకు తెలియని విషయాలు, అప్పటితరం ప్రేక్షకులకూ తెలియని ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలో అంశాలు తెలుస్తాయి. చరిత్రను తెరపై చూపించడానికి చిత్రబృందం చేసిన ఒక మంచి ప్రయత్నమిది.  

రేటింగ్: 3.5


Cinema GalleriesLatest News


Video-Gossips