English | Telugu

కాస్త లేటయినా.. ‘నంబర్ వన్’కావడం మాత్రం పక్కా!

on Aug 9, 2017

టాలీవుడ్ కి హాలీవుడ్ పెర్ ఫార్మెన్స్ పరిచయం చేసిన నటుడెవరు? అనడిగితే... తడుముకోకుండా చెప్పేయొచ్చు... ‘ఇంకెవరు మా సూపర్ స్టార్ మహేశ్ బాబు’ అని. నటనలో ఇప్పుడున్న చాలామంది హీరోలకు మహేశే ప్రేరణ. ఇంకా మాట్లాడితే.. తన సమకాలీన నటులను సైతం ప్రభావితం చేయగలిన ప్రతిభాశాలి మహేశ్. అందులో ఏ మాత్రం సందేహం లేదు. సునిశితంగా చూడండి. అది మీకే అర్థమవుతుంది.  

అందం ఉన్న చోట ప్రతిభ ఉండదు. ప్రతిభ ఉన్న చోట అందం ఉండదు. ఈ రెండూ ఉన్న చోట అదృష్టం ఉండదు. అది ఇప్పుడున్న చాలామంది హీరోల పరిస్థితి. కానీ... మహేశ్ బాబు విషయంలో అలాకాదు. అందం, అబ్బుర పరిచే ప్రతిభ, అదృష్టం... ఈ మూడూ మహేశ్ వెన్నంటే ఉంటాయ్. అందుకే.. అనతికాలంలోనే ‘సూపర్ స్టార్’ అనిపించుకోగలిగాడు మహేశ్.  

తన సమకాలీన నటుల్లో... ఒక్క పవన్ కల్యాణ్ ని పక్కన పెడితే... మిగిలిన అందరు హీరోల్లోనూ వయసులో పెద్దాడు మహేశ్. కానీ... అందరిలో చిన్నాడిలా ఉంటాడు. నాలుగు పదుల వయసు దాటినా... పాలుగారే బుగ్గలు ఒక్క మహేశ్ కే సొంతం. ఏమంటారు?

తొలి సినిమా ‘రాజకుమారుడు’చూసినప్పుడు... ‘ఈ అబ్బాయ్ మంచి స్టార్ అవుతాడు’ అని అనుకున్నారు కానీ...‘సూపర్ స్టార్’ అవుతాడని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఎప్పటికప్పుడు ప్రతిభకు పదును పెట్టుకుంటూ... సినిమా సినిమాకూ నటుడిగా ఎదుగుతూ నటనలో ఆరితేరి, ఇప్పుడు రాటుదేలిన నటుడయ్యాడు మహేశ్.

18 ఏళ్ల తన హీరో ప్రస్థానంలో మహేశ్ చేసింది కేవలం 22 సినిమాలు. ఆ కొద్ది సినిమాలతోనే.. సంచలనాలు సృష్టించేశాడు ప్రిన్స్. ‘ఎవడు కొడితే... దిమ్మతిరిగి రికార్డుల మైడ్ బ్లాక్ అవుతుందో... వాడే మహేశ్ ’ అనిపించాడు.

మురారి, ఒక్కడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు... తదితర బ్లాక్ బస్టర్లే కాదు... టక్కరి దొంగ, నిజం, నాని, నేనెక్కొడినే లాంటి ప్రయోగాలు కూడా చేసి వెండితెరపై కథానాయకునిగా బలమైన పునాదిని నిర్మించుకున్నాడాయన.

మాస్ ఇష్టపడే హీరోలను క్లాస్ ఆడియన్స్ ఇష్టపడరు. క్లాస్ ఆడియన్స్ ఇష్టపడే హీరోలపై మాస్ ప్రేక్షకులు ఇంట్రస్ట్ చూపించరు. ఇదంతా మిగిలిన హీరోలకు వర్తిస్తుంది కానీ... మహేశ్ కి వర్తించదు. ఎందుకంటే... అన్ని వర్గాల ప్రేక్షకులకు ఇష్టుడు మహేశ్. ఇక అమ్మాయిల
విషయానికొస్తే...  కలల రాజకుమారుడే అనుకోండి.

 నమ్రతను మహేశ్ వివాహం చేసుకున్నప్పుడు ఎంత మంది అమ్మాయిలు డిజప్పాయింట్ అయ్యారో లెక్కేలేదు. ఇప్పటికీ నమ్రతను చూసి కుళ్లుకుంటున్న అమ్మాయిలు కోకొల్లలు అంటే మీరు నమ్ముతారా? దానికి తగ్గట్టే ప్రిన్స్ కంప్లీట్ ఫ్యామిలీ మేన్. కుటుంబం తర్వాతే తనకు ఏదైనా. భార్య నమ్రతా, పిల్లలు గౌతమ్, సితార... వీరే మహేశ్ లోకం. ఎంత బిజీలో ఉన్నాసరే... ఫ్యామిలీని మాత్రం విస్మరించడు ప్రిన్స్. అందుకే... హీరోగా మాత్రమే కాదు, ఫ్యామిలీ పర్సన్ గా కూడా చాలామందికి ప్రేరణగా నిలిచాడు మహేశ్.

మహేశ్ చారిటీలు కూడా ఘనంగానే ఉంటాయ్. సమాజానికి తెలీకుండా ప్రిన్స్ చేసే గుప్తదానాలు కోకొల్లలు. ఇక తన ‘శ్రీమంతుడు’చిత్రం ఇన్ స్పిరేషన్ తో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్వస్థలమైన ‘బుర్రిపాలెం’ని దత్తు తీసుకొని అద్భుతంగా తయారు చేశాడు మహేశ్. సి.సి.రోడ్లు, గ్రంధాలయం, రచ్చబండ, పక్కా ఇళ్లు... చుట్టూ గ్రీనరీ.. దగ్గరలో ఓ కళాశాల... వీటన్నింటితో  బుర్రిపాలెం గ్రామం ఇప్పుడు కొత్తందాలను సంతరించుకుంది. తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాలోని ‘సిద్ధాపురం’గ్రామాన్ని కూడా మహేశ్ దత్తు తీసుకొని అభివృద్ధి చేస్తున్నాడు. ఇప్పుడు హీరోల్లో ఎవరైనా ఇలా చేస్తున్నారా? చెప్పండి. పారితోషికాలు మాత్రం కోట్లకు కోట్లు తీసుకుంటారు.

పారితోషికం అంటే గుర్తొచ్చింది. ‘బాహుబలి’రాకముందు వరకూ పవన్ కళ్యాణ్ ని మినహాయిస్తే... మిలిగిన మన హీరోలందరి కంటే అధిక పారితోషికం మహేశ్ బాబే తీసుకునేవాడు. ఓ విధంగా పవన్, మహేశ్ పారితోషికాలు సమానమే.

ఇప్పుడున్న హీరోల్లో నంబర్ వన్ అయ్యే లక్షణాలు ఎవరికున్నాయ్? అని అడిగితే ఎక్కువ మంది చెప్పే సమాధానం కూడా ‘మహేశే’. కాస్త లేటయినా... మహేశ్ టాలీవుడ్ నంబర్ వన్ హీరో అవ్వడం మాత్రం పక్కా. ఇందులో సందేహం లేదు. వయసుంది. అంతకుమించి
టాలెంట్ ఉంది. అద్భుతమైన అందం ఉంది. ‘నంబర్ వన్’ కావడానికి ఇంతకంటే ఏం కావాలి? చెప్పండి?

ప్రస్తుతం మహేశ్ రెండు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అందులో మొదటిది మురుగదాస్ ‘స్పైడర్’. త్వరలోనే ఈ సినిమా విడుదల రానుంది. పాజిటీవ్ వైబ్రేషన్స్ తో విడుదలకు ముందే హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమా ఇది. ఇక రెండో సినిమా ‘భరత్ అను నేను’.‘శ్రీమంతుడు’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఇది. ఇందులో సూపర్ స్టార్ ‘ముఖ్యమంత్రి’గా కనిపించనున్నాడు. ఇది కూడా విభిన్నకథాచిత్రమే అని యూనిట్ వర్గాల సమాచారం.

వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్న ఈ సూపర్ స్టార్ పుట్టిన రోజు నేడు. మహేశ్ కి నేటితో 42 ఏళ్లు నిండాయ్ అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది నిజం. ఇలాంటి పుట్టిన రోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. శతమానం భవతి అని దీవిస్తోంది.. తెలుగు వన్.

- నరసింహ బుర్రా


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here