English | Telugu

మ‌హాన‌టి రివ్యూ

on May 9, 2018

సావిత్రి అంటే.. ఓ మాయాబ‌జార్‌
సావిత్రి అంటే.. ఓ మిస్స‌మ్మ‌
సావిత్రి అంటే.. ఓ స్టార్‌
సావిత్రి అంటే.. మ‌హాన‌టి!

అంతేనా..? ఊహూ...
సావిత్రి అంటే ఓ శిఖ‌రం
సావిత్రి అంటే ఓ ప‌త‌నం

శిఖ‌రం ఎలా ప‌త‌న‌మైంది? అనేది ఎప్పుడూ ఆస‌క్తి క‌లిగించే అంశ‌మే. అదే.. 'మ‌హాన‌టి' క‌థ‌కు మూలం అయ్యింది.
సావిత్రి గురించి మ‌న‌కు తెలిసింది, తెలియంది, తెలిసిన విష‌యాల్లో తెలుసుకోవాల్సింది, తెలియ‌ని వాటి నుంచి నేర్చుకోవాల్సింది.. ఇవ‌న్నీ క‌లిస్తేనే 'మ‌హాన‌టి' సినిమా అవుతుంది.

* క‌థ‌

నిప్పులు చిమ్ముకుంటూ నింగిని నేనెగిరిపోతే
నిబిడాశ్చ‌ర్యంతో మీరే..
నెత్తురు క‌క్కుకుంటూ నేల‌కు రాలిపోతే
నిర్థాక్ష‌ణ్యంగా మీరే..!
అంటాడు శ్రీ‌శ్రీ‌. అలా నిప్పులు చిమ్ముకుంటూ పైకి ఎగిరిన జీవితం సావిత్రిది. నెత్తురు క‌క్కుకుంటూ నేల‌కు ఒరిగిపోయిన జీవిత‌మూ సావిత్రిదే. వీటి మ‌ధ్య క‌థే... `మ‌హాన‌టి`.  సావిత్రి చిన్న‌ప్పుడే తండ్రిని కోల్పోతుంది. తండ్రి మ‌ర‌ణంతో ఆ ఇంటికి ఆధారం లేకుండా పోతుంది. అందుకే పెద‌నాన్న పంచ‌న చేరుతుంది. అక్క‌డే నాట్యం, న‌ట‌న నేర్చుకుంటుంది. నాట‌కాలు వేస్తుంది. క్ర‌మంగా సినిమాల్లోకి అడుగుపెడుతుంది. జెమినీ గ‌ణేశ‌న్ తో ప‌రిచ‌యం సావిత్రి జీవితంలో కీల‌క‌మ‌లుపు. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌తారు. కానీ... జెమినికి అంత‌కు ముందే పెళ్ల‌వుతుంది. అయినా స‌రే.. త‌ల వొంచి తాళి క‌ట్టించుకుంటుంది. జెమినీ - సావిత్రి ఇద్ద‌రూ  స్టార్లే. కానీ సావిత్రి ఇంకా పెద్ద స్టారు. ఆమె ఎదుగుద‌ల భ‌ర్త‌గా గ‌ర్వ‌ప‌డినా.. ఓ న‌టుడిగా జీర్ణించుకోలేక‌పోతాడు. క్ర‌మంగా ఇద్ద‌రి మ‌ధ్యా దూరం పెరుగుతుంది. సావిత్రి మ‌ద్యానికి బానిస అవుతుంది. సినిమాల్లో అవ‌కాశాలు త‌గ్గిపోతాయి. ఆస్తులు క‌రిగిపోతాయి. చివ‌రికి కోమాలోకి వెళ్లి.. మ‌ర‌ణిస్తుంది. ఇదీ సావిత్రి క‌థ‌. అంద‌రికీ తెలిసిన క‌థ‌ని ద‌ర్శ‌కుడు తెర‌పైకి ఎలా తీసుకొచ్చాడు?  తెలియ‌ని కొత్త సంగ‌తులు ఎన్ని చెప్పాడు? అనేది తెలుసుకోవాలంటే మ‌హాన‌టి చూడాలి.

* విశ్లేష‌ణ‌

బ‌యోపిక్‌ల‌ను తెర‌కెక్కించ‌డం ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా తీస్తే డాక్యుమెంట‌రీ అంటారు. క‌ల్ప‌న జోడిస్తే.. `దాన్ని బ‌యోపిక్ అంటారా` అంటూ హేళ‌న చేస్తారు. కేవ‌లం గొప్ప‌లే చూపించినా త‌ప్పే. అలాగ‌ని చీక‌టి కోణాల్ని ఆవిష్క‌రించినా త‌ప్పే. వీట‌న్నింటి మ‌ధ్య స‌మ‌తూకం చాలా అవ‌స‌రం.  దాన్నిచక్క‌గా పాటించాడు ద‌ర్శ‌కుడు నాగ అశ్విన్‌. దానికి త‌గిన రిసెర్చ్ వ‌ర్క్ కూడా బాగా చేసిన‌ట్టు అర్థం అవుతోంది. ఓ సాధార‌ణ‌మైన అమ్మాయి స్టార్‌గా మార‌డం ఆస‌క్తిని క‌లిగించే అంశ‌మే. కాబ‌ట్టి.. సావిత్రి క‌థ కూడా ఆస‌క్తిగానే మొద‌ల‌వుతుంది. అప్ప‌టి సినిమా సెట్టింగులు, మాయాబ‌జార్, మిస్స‌మ్మ నాటి సంగ‌తులు మ‌రోసారి తెర‌పై క‌నిపించే స‌రికి పాత సినీ అభిమానుల హృద‌యం పుల‌కించిపోతుంది. సావిత్రి క‌థ తెలిసిన‌వాళ్లంద‌రికీ ఆయా స‌న్నివేశాలు బాగా న‌చ్చుతాయి.కానీ ఈత‌రానికి మ‌రీ ముఖ్యంగా సావిత్రి గురించి, కెవి రెడ్డి, చక్ర‌పాణిల గురించి తెలియ‌ని వాళ్ల‌కు ఆ స‌న్నివేశాల్లోని ఘాడ‌త‌, గొప్ప‌ద‌నం అర్థ‌మ‌వ్వ‌డం కష్టం. కొన్ని పాత్ర‌ల‌కు క‌నెక్ట్ అవ్వ‌రు కూడా.

సావిత్రి జీవితం ఇలా అయిపోవ‌డానికి కార‌ణం జెమినీ గ‌ణేశ‌న్ అన్న సంగ‌తి అంద‌రికీ తెలుసు. కాక‌పోతే ఆయా స‌న్నివేశాల్ని ఎంత వ‌ర‌కూ చూపించాలో, అంత వ‌ర‌కే చూపించి త‌న తెలివితెట‌ల్ని ప్ర‌ద‌ర్శించాడు ద‌ర్శ‌కుడు. సావిత్రి అగాధం వెనుక జెమిని ఉన్న‌ట్టు చూపిస్తే చాలా గొడ‌వ‌లు అయిపోతాయి. అందుకే.. ఆ ఎపిసోడ్ల‌ని సుతారంగా డీల్ చేశాడు. ఓవైపు జెమినీ త‌ప్పు ఉన్న‌ట్టు అనిపిస్తుంది. మ‌రోవైపు జెమిని ఓ పాత్ర మాత్ర‌మే అన్న‌ట్టూ క‌నిపిస్తుంది. సావిత్రి జీవితం తాలుకు విషాదం త‌ప్ప‌కుండా క‌దిలిస్తుంది. ఆమె మందుకు ఎందుకు బానిస అయ్యింది? అందులోంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి ప్ర‌య‌త్నించి ఎందుకు విఫ‌ల‌మైంది? అనేవీ హృద‌యానికి హ‌త్తుకునేలా చూపించారు. ఓ పెళ్ల‌యిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా, మందు బాటిల్ ప‌ట్టుకున్నా, సుద్దులు చెబుతున్న త‌ల్లిని క‌సురుకున్నా, కన్న కూతుర్ని గెంటేసినా సావిత్రిపై కోపం, చిరాకు రావు. ఆమె ఎదుర్కుంటున్న ప‌రిస్థితుల‌పై, విధిపై కోపం త‌ప్ప‌. సావిత్రి క‌థ‌లో ఉన్న గాఢ‌త అదే.

సావిత్రి క‌థ‌ని స‌మంత కోణంలోంచి చెప్ప‌డం, సావిత్రి క‌థ చూపిస్తూ స‌మంత క‌థ‌కూడా చూపించ‌డం.. మంచి స్క్రీన్ ప్లే.  ఏ పాత్ర‌ని ఎంత వ‌ర‌కూ వాడుకోవాలో అంతే వాడుకున్నారు. ఎక్క‌డ ముగించాలో అక్క‌డే ముగించారు. కాక‌పోతే ఓ బ‌యోపిక్ తీస్తూ ''ఈ సినిమాలోని స‌న్నివేశాలు, పాత్ర‌లు ఎవ‌రినీ ఉద్దేశించిన‌వి కావు, కేవ‌లం క‌ల్పితం'' అంటూ సినిమాకి ముందు వేసుకోవ‌డం కాస్త ఆశ్చ‌ర్యానికీ గంద‌ర‌గోళానికి గురి చేసింది.

* న‌టీన‌టులు

కీర్తి సురేష్‌, స‌మంత‌, స‌ల్మాన్ దుల్క‌ర్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, న‌రేష్‌... ఇలా  ఏ పాత్ర‌నీ త‌క్కువ చేయ‌లేం. కీర్తి సావిత్రిలా మారిపోయిందంతే. సావిత్రి గా కీర్తిని ఊహించుకోవ‌డం మొద‌ట్లో కాస్త క‌ష్టంగా అనిపిస్తుంది. కానీ... క్ర‌మంగా కీర్తి మాయ‌మై సావిత్రి క‌నిపిస్తుంది. స‌మంత చేసిన మంచిపాత్ర‌ల్లో ఇదొక‌టి. కీర్తి, స‌మంత  సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం సాహ‌స‌మే అయినా.. వాళ్ల పాత్ర‌లు మ‌రింత బ‌లంగా ప్రేక్ష‌కుల గుండెల్లో దిగిపోవ‌డానికి బాస‌ట‌గా నిలిచాయి. మిగిలిన‌వాళ్లంతా త‌మ అనుభవాన్ని రంగ‌రించారు.

* సాంకేతికంగా...

ఇది ద‌ర్శ‌కుడి సినిమా. నాగ అశ్విన్ విజ‌న్ బాగుంది. ఓ బ‌యోపిక్‌ని ఎలా తీయాలో అలానే తీశాడు. ఎక్క‌డా అతి డ్రామాకి పోలేదు. సావిత్రి క‌థ నుంచి ఎక్క‌డా డైవ‌ర్ట్ కాలేదు. బుర్రా సాయిమాధ‌వ్ సంభాష‌ణ‌లు అదిరిపోయాయి. కొన్ని సార్లు ఆ మాట‌లే క‌థ‌ని న‌డిపించాయి. ప‌తాక స‌న్నివేశాల్లో స‌మంత చెప్పిన డైలాగులు గుర్తుండిపోతాయి. పాట‌ల ప‌రంగా... కాస్త నిరాశ ప‌రిచినా, నేప‌థ్య సంగీతం విష‌యంలో ఆక‌ట్టుకున్నాడు మిక్కీ. ఆర్ట్ ప‌నిత‌నం గొప్ప‌గా ఉంది.


* ఫైన‌ల్ ట‌చ్ :  సాటిలేని మ‌హాన‌టి

రేటింగ్‌: 3.5


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here