అక్కడ ఎన్టీఆర్ 24 గంటలు కూడా లేడు
on Dec 11, 2019
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెళ్ళాడు. మళ్ళీ ఒక్క రోజులో వెనక్కి వచ్చాడు. ఎక్కడి వెళ్ళాడు? మళ్ళీ ఎక్కడ నుండి వెనక్కి వచ్చాడు? అంటే... మంగళవారం ఉదయం విశాఖకు వెళ్ళాడు. అక్కడి నుండి సాయంత్రం హైదరాబాద్కు వచ్చాడు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమా ‘ఆర్ఆర్ఆర్’. మెగాపవర్ స్టార్ రామ్చరణ్ మరో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో కొన్ని సన్నివేశాలను అక్కడ తీశారు.
విశాఖలో పాడేరు ఘాట్ రోడ్డులోని మోదకొండమ్మ అమ్మవారి పాదాలు ప్రాంతంలోని కాఫీ తోటల్లో ఎన్టీఆర్పై మంగళవారం కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఎన్టీఆర్ గుర్రపు స్వారీ సన్నివేశాలు తీసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. బ్రిటీష్ కాలంనాటి వాతావరణం ప్రతిబింబించడం కోసం హైదరాబాద్ నుండి ఆనాటి కార్లను ప్రత్యేకంగా తీసుకువెళ్ళారని తెలిసింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ చిత్రీకరణ చేశారు. అయినప్పటికీ వాట్సాప్లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. శుక్రవారం వరకూ సినిమా చిత్రీకరణ చేయనున్నట్టు సమాచారం. అయితే.. ఎన్టీఆర్ మంగళవారం సాయంత్రం విశాఖ నుండి వచ్చేశారు. మళ్ళీ వెళతారేమో? ‘ఆర్ఆర్ఆర్’లో ఆయన కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజుగా రామ్చరణ్ కనిపించనున్నారు.