ఎన్టీఆర్ కోసం మళ్ళీ హీరోయిన్ వేట
on Apr 8, 2019
'ఆర్ఆర్ఆర్' సినిమాకు విదేశీ భామ డైసీ ఎడ్గార్ జోన్స్ హ్యాండ్ ఇచ్చింది. తన కుటుంబంలో జరిగిన కొన్ని పరిస్థితుల వల్ల సినిమా చేయలేకపోతున్నానని, అనివార్య కారణాల వల్ల సినిమా షూటింగులో పాల్గొనలేకపోతున్నాని డైసీ సోషల్ మీడియాలో పేర్కొంది. దాంతో దర్శకుడు రాజమౌళి మళ్ళీ హీరోయిన్ వేటలో పడ్డారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన, ఆ పాత్ర కోసం ఎవరైతే బావుంటారని ఆలోచిస్తున్నారు. ఈ వారంలో 'ఆర్ఆర్ఆర్'కి సెకండ్ షాక్ ఇది. ఇటీవల జిమ్ లో రామ్ చరణ్ కు గాయాలు కావడంతో పుణె షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు హీరోయిన్ తప్పుకుంది. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేయడంతో త్వరలో హీరోయిన్ ను ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. డైసీ ఎడ్గార్ జోన్స్ సినిమా నుంచి తప్పుకున్నప్పటికీ, ఆ పాత్రలో ఎవరు నటించినా ప్రేక్షకులు స్వాగతిస్తారని, గొప్ప పాత్ర అని పేర్కొంది. మరోవైపు రాజమౌళి కూడా సినిమా గురించి ట్వీట్ చేశారు. ఆటంకాలు ఎదురైనప్పటికీ గుజరాత్ షెడ్యూల్ ను సకాలంలో పూర్తి చేశామని ఆయన అన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే.