ENGLISH | TELUGU  

ముద్దుగుమ్మల కాన్సన్ ట్రేషన్ దేనిపైన?

on Apr 6, 2015

ఎంతబొద్దుగా ఉంటే అంత ముద్దొచ్చేవారు ఇది నాటి మాట. చక్కనమ్మ చిక్కితేనే అందం ఇది నేటి మాట. అప్పట్లో అందం అంటే ఆకట్టుకునే హావభావాలు...ఇప్పుడో అందం అంటే అంగాంగప్రదర్శన. అప్పట్లో కళ్లతో భావాలు పలికిస్తే....ఇప్పుడేమో నడుమొంపులతో ప్రేక్షకుల్ని చుట్టి పడేస్తున్నారు. అప్పట్లో నటనపై కాన్సన్ ట్రేషన్ పెడితే...ఇప్పుడేమో అందాల ఆరబోతపై దృష్టిపెడుతున్నారు. ఫలితంగా నాటి హీరోయిన్స్ కోసం అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేవి...నేటి హీరోయిన్స్ అవకాశకోసం వెతుక్కుంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం స్క్రీన్ పై జీరోసైజ్ అందాలు మతిపోగొట్టేస్తున్నాయన్నది ఒప్పుకోవాల్సిందే.

బ్లాక్‌ అండ్‌ వైట్‌ టైంలో హీరోయిన్లు ఎంత బొద్దుగా ఉండేవాళ్లు చెప్పండి. మీకు మీరే మాకు మేమే అని కళ్లతో ఆకట్టుకునే సావిత్రిని చూడండి. నిండైన రూపం చక్కని కట్టు బొట్టు...అంతకు మించిన హావభావాలతో మహానటిగా కీర్తినందుకుంది. తాటతీస్తా అన్నట్టుండే భానుమతిని గమనించండి...నిండైన ఆత్మవిశ్వాసం, హుందాతనం, రాచఠీవికి పెట్టింది పేరు. సీతమ్మగా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన అంజలి, ఊహలు గుసగుసలాడే అన్న కృష్ణకుమారి...ఇలా అప్పట్లో ఏ హీరోయిన్ ని గమనించినా చక్కగా లడ్డూల్లా ఉండేవారు. అప్పటి ప్రేక్షకులు నాజూకు సోయగాలు కావాలని కోరుకోలేదో....లేదంటే....వారు పలికించే హావభావాలు చూసి ఫిదా అయిపోయారో కానీ ఈ బొద్దుగుమ్మలంతా వెండితెరపై దశాబ్దాలుగా కొనసాగారు.



వారి తర్వాత వచ్చిన రాధ, భానుప్రియ, విజయశాంతి, జయసుధ, సుహాసిని, రాధిక వీళ్లుకూడా కాస్త బొద్దుగానే ఉండేవారు. ఇంకా గమనిస్తే సౌందర్య, రంభ, రోజా, మీనా, రవళి... వీళ్లంతా కూడా ఇటు లావుగా అటు సన్నగా కాకుండా చూడచక్కగా మెంటైన్ చేస్తూ ముద్దొచ్చారు. వీళ్ల తర్వాతే నాజూకు భామల ట్రెండ్ మొదలైంది.

మోటుగా ఉండే హీరో, విలన్లకు కాలం చెల్లడంతో బొద్దుగా ఉండే భామలకూ కాలం చెల్లింది. ప్రేక్షకుల అభిరుచులు మారాయి. ఆకట్టుకునేలా నటించే హీరోయిన్స్ కనిపించకపోవడంతో అందాలు చూసి థియేటర్ కి వెళ్లేవారిసంఖ్య పెరిగింది . దీంతో హీరోలు,దర్శకనిర్మతలు నాజూకు సోయగాలపై మనసుపడ్డారు. అప్పటి నుండి అందాల ఆరబోతపై ఫోకస్ పెరిగింది. మీరెలా అంటే అలా అన్నట్టు ముద్దుగుమ్మలంతా బక్కచిక్కి చక్కిలాల్లా తయారయ్యారు. అలా అలా చక్కనమ్మ ఎంత చిక్కితే అంత అందం అంటూ జీరోసైజ్ కి ఫిక్సయ్యారు.



ఈ జీరో సైజుకు శంకుస్థాపన చేసింది మాత్రం...బాలీవుడ్‌ బ్యూటీ కరీనాకపూర్ అనే చెప్పాలి. ఒంట్లో పిసరంత కొవ్వు లేకుండా..అందాల పదును తగ్గకుండా కొత్త లుక్ తో మెస్మరైజ్ చేసింది. అప్పట్లో సన్షేషన్ క్రియేట్ చేసిన బెబో లుక్ చూసి కొందరు బాగుందన్నారు...ఇంకొందరు ఎముకల గూడులా ఉందన్నారు. మరికొందరు ఇదికూడా అందమేనా అన్నారు. ఎవరెలా అనుకున్నా జీరో సైజ్‌ కు రిబ్బన్ కట్ చేసి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది.



బీటౌన్ లో మొదలైన ఈ జీరోసైజ్ పిచ్చి నెమ్మనెమ్మదిగా పాకుతూ టాలీవుడ్ కి చేరింది. శ్రియ, ఇలియానా ప్రత్యేకంగా మెంటైన్ చేయకపోయినా జీరోసైజ్ లో అదరగొట్టారు.  సీనియర్ హీరోల నుంటి యంగ్ హీరోలవరకూ అందరిసరసన ఎంచక్కా సెట్టైపోయారు. ఇల్లీ ఎంట్రీ మూవీ దేవదాసులో కెమెరా ఫోకస్ మొత్తం ఇల్లీ నడుముచుట్టూనే తిరుగుతుందనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రియ ఏసాంగ్ లో చూసినా నడుమందాలు చూపించి మాయచేస్తుంది. సాధారణ తారల చీరలు సెక్సీగా కడతారు. కానీ శ్రియ చీరకడితే నలిగిపోయేలా ఉండే నడుము చూసి కుర్రకారు మతిపోవాల్సిందే.



చంద్రముఖితో కెరీర్ మొదలెట్టిన నయన తార బూరెల్లాంటి బుగ్గలతో భలే ఉంది అనిపించింది. కానీ ట్రెండ్ ఫాలో అవక తప్పలేదన్నట్టు సెకెండ్ ఇన్నింగ్స్ లో కష్టపడి మరీ జీరోసైజ్ కి చేరింది. చీరకట్టులో అదుర్స్ అనిపించిన ఈ  బ్యూటీ ఇప్పుడు బికినీలేసుకుని రెచ్చిపోతోంది. నయన్ కు నయనాలు ఓ అందమైతే....మత్కెక్కించే బాడీ స్ట్రక్టర్ స్పెషల్ ఎట్రాక్షన్. ప్రస్తుతం జోరుమీదున్న శృతిహాసన్‌,  సమంత, తమన్నా, రెజీనా, రకుల్‌ప్రీత్‌సింగ్‌,... వీళ్లంతా నోరు కట్టేసుకుని మరీ సన్నగా తయారై...ఫ్యాన్స్ మనసుల్ని మడతపెట్టేస్తున్నారు. ఆఫర్స్ మిస్సవకుండా చూసుకుంటున్నారు.



నిజానికి హీరోయిన్‌గా అవకాశాలు రావాలంటే... జీరో సైజు అవసరమా అంటే ... అలాంటిదేం లేదు అనేవాళ్లు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతున్న బొమ్మాళి అనుష్క ఆరంభంలో నాజూగ్గా ఉన్నా ఇప్పుడు బాగా బొద్దుగా తయారైంది. మిర్చిలో అయితే నదియాకు అక్కలా ఉందనే కామెంట్స్ వచ్చాయి. అయినప్పటికీ అనుష్కకు ఆఫర్స్ జోరు తగ్గలేదు సరికదా మరింత పెరిగాయి. మరోవైపు కాజల్ అగర్వాల్ సైతం జీరోసైజ్ కు తాను వ్యతిరేకం అనిచెప్పింది. మరీ  బక్కగా ఉంటే కిక్కేముంటుంది....కాస్త కండ ఉంటేనే కదా ఎట్రాక్ట్ చేసేది అని చెప్పింది.


 

మరోవైపు బాలీవుడ్ లో మొదలైన జీరోసైజ్ కి అక్కడే వ్యతిరేకులు చాలామందిఉన్నారు. దబాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన సోనాక్షిసిన్హా అలానాటి హీరోయిన్స్ ని తలపించింది. వామ్మో ఎంత లావుగా ఉందో అనుకున్నా అమ్మడి యాక్టింగ్ కి ఫుల్ మార్క్స్ వేసేశారు. అటు ఆలియా భట్ కూడా బొద్దుగానే ఎంట్రీ ఇచ్చింది అలాగే కొనసాగుతోంది కూడా. ఇక విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? ఉల్లాల ఉల్లాల అంటూ భారీ అందాలతో కుర్రాళ్లనుంచి మసలాళ్ల వరకూ కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఈ మధ్యే రిలీజైన 'దమ్‌ లగాకే హైషా' లో... హీరోయిన్‌గా నటించిన 'భూమి' బరువు  ఎనభై కిలోలు. పైగా క్యారెక్టర్‌ కోసం 7 కేజీలు పెరిగిందట. అయినా ఆమెకు పట్టం కట్టారు. నటనకు మంచి మార్కులేశారు. ఇప్పుడీఅమ్మాయి ..... యష్‌రాజ్‌ ఫిల్మ్‌ బ్యానర్‌లో మరో మూడు సినిమాలకు ఎంపికైంది.

ఇక్కడ క్లారిటీ రావాల్సిన విషయం ఏంటంటే....గ్లామర్ డోస్ ఉండాలని కోరుకున్నా అంతకు మించి నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రేక్షకులు. కానీ ఈ విషయాన్ని గుర్తించని ముద్దుగుమ్మలు నడుమందాలపై పెట్టిన దృష్టి నటనపై పెట్టడం లేదు. అందంగా, సన్నగా, తెల్లగా ఉంటేనే సరిపోదు...ప్రేక్షకులను మెప్పించగల ప్రతిభ సైతం ఉండాలి. ఈ ప్రతిభ ఉండడం వల్లే నాటి హీరోయిన్స్ కి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేవి. నేటి హీరోయిన్స్ అవకాశాలని వెతుక్కుంటూ వెళుతున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే సామెతను ఇప్పటికైనా గుర్తుచేసుకుని కళ్లుతెరిస్తే మంచిదని సలహాఇస్తున్నారు.
 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.