ENGLISH | TELUGU  

అవును 2 రివ్యూ

on Apr 3, 2015

Avunu 2 Telugu Movie Review, Avunu 2 Movie Review, Avunu 2 Review, Avunu 2 Telugu Movie, Avunu 2 rating,  Telugu Review Avunu 2, telugu movie reviews

ర‌విబాబుది కామెడీ ఫేసు. కానీ ఆయ‌న హార‌ర్‌, థ్రిల్ల‌ర్ సినిమాల్ని ఎక్కువ‌గా తీస్తుంటారు. త‌క్కువ బ‌డ్జెట్‌లో సినిమా లాగించేయొచ్చ‌న్న ప్లానో ఏమో..?? ఆయ‌న నుంచి ఎక్కువుగా అలాంటి సినిమాలే వ‌స్తుంటాయి. 'అవును' హిట్ట‌య్యేస‌రికి... ఈ సినిమాకి సీక్వెల్ తీయాల‌న్న ఘోర‌మైన ఆలోచ‌న వ‌చ్చేసింది. వెంట‌నే దాన్ని ఆయ‌న అమ‌లులో పెట్టేశారు. ఇంత‌కీ ఈ సీక్వెల్ ఎలా ఉంది?? ర‌విబాబు మ‌ళ్లీ భ‌య‌పెట్టాడా? లెట్స్ చెక్ ఇట్‌..

యామిని(పూర్ణ‌) హ‌ర్ష (హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రాణె) ప్రేమించి పెళ్లి చేసుకొని... ఊర‌వ‌త‌ల ఓ టౌన్ షిప్‌లో కాపురం పెడ‌తారు. అక్క‌డ కెప్టెన్ రాజు (ర‌విబాబు) ఆత్మ తిరుగుతుంటుంది. యామిని కన్య‌త్వాన్ని అనుభ‌వించాల‌ని ర‌క‌ర‌కాల ప్ర‌యాత్నాలు చేస్తుంది. చివ‌రికి హ‌ర్ష శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది. కెప్టెన్ రాజు ఆత్మ ఆవ‌హించిన హ‌ర్ష‌ని క‌త్తితో పొడుస్తుంది యామిని. హ‌ర్ష ఆసుప‌త్రి పాల‌వుతాడు. ఇక్క‌డికి 'అవును' పార్ట్ 1 పూర్త‌యింది. ఇప్పుడు పార్ట్ 2... హ‌ర్ష‌, యామిని ఇల్లు మార‌తారు. ఆ ఇంటిని వెతుక్కొంటూ ఆత్మ వ‌చ్చేస్తుంది. మ‌ళ్లీ యామినిని వ‌శ‌ప‌రుచుకోవాల‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తుంది. ఆ ప్ర‌య‌త్నాల్ని యామిని ఎంత వ‌ర‌కూ తిప్పికొట్టింది. కెప్టెన్ రాజు ఆత్మ చివ‌రికి ఏమైంది?  అనేదే పార్ట్ 2 స్టోరీ

స్థూలంగా చూస్తే పార్ట్ 1కీ, పార్ట్ 2కీ పెద్ద తేడా లేదు. హీరో హీరోయిన్లు ఇల్లు మారారు. ప‌క్కింటివాళ్ల గొడ‌వ మారింది. అంతే తేడా. కాక‌పోతే పూర్ణ చీర‌ని ఈ సినిమాలో కాస్త ఎక్కువ సార్లు పైకి లాగాడు కెప్టెన్ రాజు. మ‌రి మ‌సాలా అద్ద‌డం కోస‌మో.. లేదంటే ఇలాంటి సీన్లు ఉంటే చాలు.. జ‌నాలు చూసేస్తారు అనుకొన్నాడో ఏమో.. `యామినిని అనుభ‌వించాలి` అనే కాంక్ష‌తో కెప్టెన్ రాజు ర‌గిలిపోయే సీన్లే ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. కొన్ని కొన్ని సార్లు మ‌నం చూస్తున్న‌ది  `అవును` సినిమానేమో అనిపిస్తుంది కూడా. అవును తీసినంత గ్రిప్పింగ్ గా పార్ట్ 2 మ‌ల‌చ‌లేక‌పోయాడు ర‌విబాబు.


అవునులో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన ఎలిమెంట్స్ ఉంటాయి. కెప్టెన్ రాజు అనేవాడెవ‌డో చివ‌రి వ‌ర‌కూ తెలీదు. అవును 2లో అలాంటి ఇంట్ర‌స్ట్రింగ్ ఎలిమెంట్స్ లేక‌పోవ‌డంతో బోర్ కొట్టిస్తుంది. దెయ్యం గొడ‌వే అనుకొంటే.. దానికి మాయ‌లూ మంత్రాల విద్య తెలుస‌న్న‌ట్టు.. ట్యాబ్స్‌, సెల్ ఫోన్స్ ఆప‌రేటింగ్ వ‌చ్చు అన్న‌ట్టు చూపించి ఇంకాస్త చిరాకు తెప్పించాడు. ఆత్మ‌ని బంధించే ఎపిసోడ్ కూడా అంతే సిల్లీగా ఉంది. `ఈ తాయెత్తు ఉంటే ఏ దుష్ట‌శ‌క్తీ నిన్ను ఏమీ చేయ‌లేదు..` ఇలాంటి డైలాగులు వినీ వినీ ఆడియ‌న్స్‌కి విసుగొచ్చేసింది. కానీ తీస్తున్న ద‌ర్శ‌కుల‌కు మాత్రం రావ‌డం లేదు. అదంతా మ‌న ఖ‌ర్మ‌.

యేడాది గ‌డిస్తే.. కెప్టెన్ రాజు ఆత్మ మాయ‌మైపోతుంది అని చెప్పి... ఆ లాజిక్‌ని కూడా ద‌ర్శ‌కుడు మిస్స‌య్యాడు. స‌రిగ్గా యేడాది గ‌డిచిన‌ప్పుడు.. చ‌టుక్కున అంద‌ర్నీ వ‌దిలేసి మాయ‌మైపోయిన కెప్టెన్ రాజు ఆత్మ‌.. మ‌ళ్లీ ఎందుకొచ్చింది..?  అంటే పార్ట్ 3 ఉంది నాయినా కాచుకోండి.. అని చెప్ప‌డ‌మే క‌దా, ర‌విబాబు ఉద్దేశం..?? పూర్ణ‌లో గ్లామ‌ర్ 1 శాతం కూడా క‌నిపించ‌లేదు. ఆమె మొహంపై కంటే.. కాళ్ల‌పైనే కెమెరా ఎక్కువ‌గా తిరిగింది. భ‌యాన్ని ఎక్స్‌ప్రెస్ చేసిన‌ప్పుడు మాత్రం ఆమె ఎక్స్ ప్రెష‌న్స్ బాగున్నాయి. హ‌ర్ష ఒక‌ట్రెండు సీన్స్‌లో బాగా చేశాడు. ఇక మిగిలిన‌వి దాదాపు గా కొత్త మొహాలే. వాళ్ల గురించి చెప్పుకోవ‌డానికి ఏం లేదు.

సాంకేతికంగా ర‌విబాబు సినిమాలెప్పుడూ బాగుంటాయి. కానీ ఈసినిమాలో అంత ఛాన్స్ లేదు. మ‌రీ ముఖ్యంగా శేఖ‌ర్ చంద్ర నేప‌థ్య సంగీతం ఘోరంగా ఉంది. అరుపులూ, కేక‌ల‌తో చిరాకు తెప్పించాడు. కెమెరా అంతా ఒక ఇంట్లోనే తిప్పాడు ద‌ర్శ‌కుడు. దాంతో లొకేష‌న్ మార‌క‌.. బుర్ర తిరిగిపోతుంది. ర‌విబాబు డైలాగుల్లో ఒక‌ట్రెండు డ‌బుల్ మీనింగులు దొర్లాయి. ద‌ర్శ‌కుడిగా, స్ర్కీన్ ప్లే రైట‌ర్‌గా ర‌విబాబు ఈసినిమాలో దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు. అవును లో చూపించిందే అవును 2లోనూ చూపించి దీనికి సీక్వెల్ అని పేరెందుకు పెట్టాడో మ‌రి. క‌నీసం అవును సినిమాలో ప్ర‌తీ సీన్ రెండు సార్లు చూపించి.. ఇదే అవును 2 అన్నా బాగుండేదేమో...?

సీక్వెల్ సినిమాలు హిట్ట‌యిన దాఖ‌లాలు తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే త‌క్కువ‌. అవును 2 కూడా ఆ సంప్ర‌దాయం కొన‌సాగించింది. అవును చూడ‌క‌పోతే.. యూ ట్యూబ్‌లో చూడండి. అవును 2 చూడాల‌నుకొంటే... ఇంకొన్ని రోజులు ఆగండి. అదీ యూ ట్యూబ్‌లో పెట్టేస్తారు. థియేట‌ర్ల‌కెందుకు దండ‌గ‌..

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.