నో డౌట్.. సంక్రాంతి విన్నర్ 'క్రాక్'!
on Jan 18, 2021
ఇది మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్‌కు నిజంగా సంబరాన్ని కలిగించే విషయమే.. సంక్రాంతికి విడుదలైన నాలుగు సినిమాల్లో రవితేజ టైటిల్ రోల్ పోషించిన 'క్రాక్' మూవీ విన్నర్ అనిపించుకుంది. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయగా జనవరి 9న విడుదలైన 'క్రాక్' మాస్ ఆడియెన్స్‌ను విపరీతంగా అలరిస్తోందని వసూళ్లు తెలియజేస్తున్నాయి. మునుపు రవితేజకు బ్లాక్‌బస్టర్ హిట్‌ని ఇచ్చిన 'కిక్' మూవీని మించి, 'క్రాక్' మరింత బ్లాక్‌బస్టర్ అయ్యిందనీ, నిజానికి రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే దిశగా కలెక్షన్లు సాధిస్తోందనీ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఎనిమిది రోజుల్లో ఈ సినిమా రూ. 24 కోట్లకు పైగా షేర్ సాధించింది.
శ్రుతి హాసన్ హీరోయిన్గా, సముద్రకని విలన్‌గా నటించిన ఈ మూవీని మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అనే తేడా లేకుండా ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. ఈ సినిమా తర్వాత విడుదలైన చిత్రాలలో విజయ్ నటించిన డబ్బింగ్ ఫిల్మ్ 'మాస్టర్' సైతం లాభాలను అందుకుంటుండగా, రామ్ మూవీ 'రెడ్' బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా వసూళ్లను అందుకుంటోంది. బెల్లంకొండ శ్రీనివాస్ టైటిల్ రోల్ చేసిన 'అల్లుడు అదుర్స్' సినిమా స్టేజ్ హిట్ తప్పితే, వాస్తవిక వసూళ్లు వేరేగా ఉన్నాయంటున్నారు.
అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన 'రాజా ది గ్రేట్' (2017) మూవీ హిట్టవడంతో రవితేజ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కానీ వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు. టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కో రాజా సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో వారు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఇప్పుడు ఆ నాలుగు సినిమాల డిజప్పాయింట్మెంట్ను 'క్రాక్' ఒక్క దెబ్బతో తీర్చేసింది. ఇదివరకు రవితేజకు 'డాన్ శీను', 'బలుపు' సినిమాలతో హిట్లు ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ ఇప్పుడు 'క్రాక్'తో మరచిపోలేని విజయాన్ని అందించాడు. అలా వారి కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్‌ను అందుకుంది. ఈ సినిమాని కొన్న ప్రతి బయ్యర్ ముఖంలో నవ్వులు తొణికిసలాడుతున్నాయి.