English | Telugu

సాయిమాధవ్ బుర్రా (ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ)

on Jan 7, 2017

ఎన్టీఆర్ వల్లే సినిమా పిచ్చి
చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే పిచ్చి..ఆ పిచ్చి క్రమంగా సినిమా మీద ఇష్టం పెరిగేలా చేసింది.. నాకు ఎప్పటికీ స్పూర్తి ఎన్టీఆరే.

నటుడి నుంచి రచయిత...
ముందు నటుడిగా ఇండస్ట్రీకి వచ్చినా రాను రాను నాకు రచన పట్ల వ్యామోహం పెరిగిపోయింది. నటుడు ఒక్క పాత్రకే పరిమితమైతే..రచయిత అన్ని పాత్రలలో నటించాల్సి ఉంటుంది..ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేయవలసిన అవసరం ఉంటుంది. నటుడిగా కంటే రచయితగానే ఇప్పుడు సంతృప్తిగా ఉంది.

పాత్ర నచ్చితే నేనే వేస్తా...
నటనవైపు వెళ్లాలని కానీ..వెళ్లకూడదని కానీ లేదు..ఒకవేళ నేను రాసిన పాత్రల్లో ఏదైనా నాకు నచ్చితే నేనే ఆ పాత్ర వేస్తానని దర్శకుల్ని అడుగుతాను. ఇప్పటి వరకైతే అలాంటి టైం రాలేదు. ప్రతి సినిమాలో టాలెంటెడ్ యాక్టర్సే  వాటిని పోషించారు..అలాంటప్పుడు అలా ఎందుకు అనిపిస్తుంది.

కులమనే కాలం కొట్టేయమని గోల చేశాం..
కులం అంటే నాకు అసహ్యం ..నా చిన్పప్పుడు స్కూల్ అడ్మిషన్ సమయంలో అప్లికేషన్ ఫాంలో ఉన్న కులం అనే కాలాన్ని తొలగించాల్సిందిగా రచ్చ చేశాం. అప్పుడు మా మాస్టర్ అది మేం చేసేపని కాదు..పునాదుల్లోంచి రావాలి ముందు మీరు బాగా చదువుకోండి అని చెప్పి పంపించారు. కానీ అది మనసులో బలంగా నాటుకుపోయింది..ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలిలో చేరి నాటకాల్లో కులం గురించి తప్పక ఉండేలా చూసుకున్నాను.

నాటకంలోనే స్వతంత్రత ఎక్కువ..
క్రియేటివ్ ఫ్రీడమ్ అనేది నాటకానికే ఎక్కువ..నాటకం నాకు ఎప్పుడు మూడొస్తే అప్పుడు రాస్తా..కానీ సినిమా అలా కాదు..దర్శకుడు చెప్పిన సమయానికల్లా స్క్రిప్ట్ ఇచ్చి తీరాలి. ప్రస్తుతం నాటకానికి కూడా క్రియేటివ్ ఫ్రీడమ్ లేకుండా పోయింది.

ఇప్పుడు భయపడి రాయాల్సి వస్తోంది...
గతంలో వ్యవస్థలను విమర్శిస్తూ కథలు రాసేవారు..కానీ ఇప్పుడు ఏ మాట రాస్తే ఏ సంఘం వల్లకి కోపం వస్తుందో తెలియడం లేదు..కారణం తెలియదు కానీ ప్రతి ఒక్కరికి మనోభావాలు దెబ్బతింటున్నాయి. అలాంటప్పుడు రచయిత భయపడక ఏం చేస్తాడు.

క్రిష్ గారితో అలా కుదిరింది...
ఈటీవీలో ప్రసారమైన పుత్తడి బొమ్మ సీరియల్‌‌కు పనిచేస్తున్న సమయంలో..ఆ సీరియల్ కోసం రాసిన డైలాగ్స్ క్రిష్ గారు చూసి నా నెక్ట్స్ మూవీకి మీరే రచయిత అన్నారు. అలా కృష్ణం వందే జగద్గురుమ్‌లో అవకాశం వచ్చింది.

కృష్ణం వందే జగద్గురుమ్ తర్వాత..
గోపాలా గోపాలా, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కంచె, రాజు గారి గది, సర్దార్ గబ్బర్ సింగ్

ప్రేక్షకులు గొప్పవారు..
మన ప్రేక్షకులు మంచి సినిమా తీశారులే బాగున్నా..బాగొకపోయినా చూద్దాంలే అనుకోరు.మంచి సినిమా అయినా వాళ్లు చూసేలా చెప్పగలిగితే ఎందుకు చూడరు..వేటగాడు చూశారు..ఆ వెంటనే శంకరాభరణాన్ని హిట్ చేశారు..మన ప్రేక్షకులు చాలా గొప్ప ప్రేక్షకులు. మనమే వాళ్లని అపార్థం చేసుకుంటున్నాం.

కంచె కంటే ముందే శాతకర్ణి తీయాలనుకున్నాం..
కృష్ణం వందే జగద్గురుం తర్వాత..కొత్తగా చేద్దామనుకుని హిస్టారికల్ మూవీ తీయాలనుకున్నాం..మన దురదృష్టం ఏంటంటే తెలుగువారికి హిస్టరీ ఎక్కువ హిస్టారికల్ మూవీస్ తక్కువ. ఈ క్రమంలో శాతవాహనులను ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయలేదు...వెంటనే శాతకర్ణికి సంబంధించిన రీసెర్చ్ స్టార్ట్ చేశాం. అయితే దానికి టైం ఎక్కువ తీసుకునేలా ఉండటంతో కంచె చేశాం. కంచె షూటింగ్ చేస్తూనే మరోవైపు శాతకర్ణిపై రీసెర్చ్ చేశాం.

బాలయ్య తప్ప మరోకరి వల్ల కాదనుకున్నా..
స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత హీరోగా బాలకృష్ణ గారు ఒక్కరే పాత్రకు న్యాయం చేయగలుగుతారని అనుకున్నాను. కానీ అంతకు ముందే క్రిష్ గారు బాలయ్య బాబు గారికి కథ చెప్పడం..ఆయన ఓకే అనడం అయిపోయిందట. అంటే క్రిష్ గారు నాకన్నా ముందే ఉన్నారన్న మాట.

బాలయ్యతో సినిమా అనగానే భయమేసింది..
99 సినిమాలు చేసిన బాలయ్య గారికి నేను డైలాగులు రాయాలి..ఎదురుగా ఆయన కూర్చొని ఉన్నారు..కెరీర్‌లో ఎందరో మహానుభావులు రాసిన డైలాగ్స్‌ని అద్భుతంగా పలికిన వ్యక్తి..నా డైలాగ్స్ నచ్చుతాయో లేదో, ఏమంటారోనని భయంతో వణికిపోయాను..కానీ డైలాగ్స్ చదివి వినిపించగానే చాలా బాగున్నాయని బాలకృష్ణ అనడంతో రీలాక్స్ అయ్యాను.

శాతకర్ణి గొప్పతనమేంటో తెలుస్తుంది..
చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న భారతదేశాన్ని కలిపి ఒకే దేశంగా ఎలా చేశాడనేది గౌతమిపుత్ర శాతకర్ణి కథ. చరిత్ర ప్రకారం శాతకర్ణికి ఓటమే లేదు. సినిమాలో ఆయన దేశాన్ని ఎలా ఏకం చేశాడనే విజయగాథను చూపించాం. రెండున్నర గంటల సినిమా అంతా ఒక జర్నీలా ఉంటుంది..ఆయన గొప్పతనమేంటో ప్రేక్షకులకు అర్థమవుతుంది.

ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు...
చిన్నప్పటి నుంచి ఎవరి సినిమాలు చూస్తూ పెరిగానో..ఎవరిలా అవ్వాలనుకున్నానో వారిద్దరి సినిమాలకు పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి గారి 150వ సినిమా, బాలయ్య బాబు గారి 100వ సినిమాకు పనిచేయడం ఆ రెండు సినిమాలు ఒకేసారి రిలీజవ్వడమనేది నాకంతా ఓ కలగా ఉంది. జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందనుకోలేదు.

శాతకర్ణికి 5 స్టార్ రేటింగ్ ఇస్తా..
క్రిష్, బాలయ్యల కష్టానికి రూపం గౌతమిపుత్ర శాతకర్ణి..ఈ సినిమాకు వాళ్లిద్దరితో పాటు ఎంతో మంది కష్టపడ్డారు..80 రోజుల షార్ట్ పీరియడ్‌లో సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు..కామన్ ఆడియన్‌గా రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 5/5 ఇస్తా..రేపు సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా ఇదే మాట చెబుతారు.

దర్శకత్వం ఆలోచన లేదు..
పరిశ్రమలో కొనసాగినంతకాలం రచయితగానే ఉంటా..మెగాఫోన్ పట్టుకోవాలనే కోరిక లేదు...అయినా నేనిప్పుడు రచయితగా ఫుల్ బిజీ..

రచయిత పునాదిలాంటి వాడు...
పరిశ్రమలో హీరోలకు, దర్శకులకు వచ్చినంత పేరు రచయితకు రాలేదని అంటుంటారు..కానీ అది నిజం కాదు. ఒక ఇంటికి పునాది ఎలాగో రచయితలు కూడా అంతే..పునాది పైకి కనిపించదు..అంతమాత్రానా పునాది విలువను తక్కువ చేసి చూడలేం..బేస్‌మెంట్ లేకపోతే ఇళ్లే కూలిపోతుంది.

తర్వాతి తరం వాళ్లకి నేను గుర్తుండాలి...
నా కన్నా ముందున్న వాళ్లందరి స్పూర్తి నాలో ఎలా ఉందో..కొత్తగా పరిశ్రమలోకి అడుగుపెడుగున్న వారికి సాయి మాధవ్ డైలాగ్స్ బాగా రాసేవాడట..మనం అతని కన్నా బాగా రాయాలి అని ఒక్కరు అనుకున్నా నా జన్మ ధన్యమైనట్లే.

పవన్‌కళ్యాణ్ గారి నుంచి పిలుపొచ్చింది..
గోపాల గోపాలతో పవన్‌కళ్యాణ్ గారితో చేసే అదృష్టం కలిగింది..అక్కడి నుంచి పవన్‌ నన్ను అభిమానించడం మొదలుపెట్టారు..సర్దార్ గబ్బర్ సింగ్‌కు ఆయనే స్వయంగా పిలిచి డైలాగ్స్ రాయాలని కోరారు..అలా ఆయన అభిమానం పొందినందుకు నిజంగా అదృష్టవంతుణ్ణి..

తర్వాతి చిత్రాలు..
మంజుల గారి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా చేస్తున్న సినిమాతో పాటు, సావిత్రి గారి బయోపిక్.

Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here