English | Telugu
సినిమా పేరు: హలో గురు ప్రేమ కోసమే
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
Rating : 2.00
విడుదలయిన తేది : Oct 18, 2018
Facebook Twitter Google

నటీనటులు: రామ్, అనుపమా పరమేశ్వరన్, ప్రకాశ్ రాజ్, ప్రణీతా సుభాష్, ఆమని, ప్రవీణ్, 'స్వామి రారా' సత్య, పోసాని కృష్ణమురళి తదితరులు
కెమెరా: విజయ్ కె చక్రవర్తి
కథ, మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాణ సంస్థ‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సమర్పణ: 'దిల్' రాజు
నిర్మాత‌లు: శిరీష్-లక్ష్మణ్  
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: త్రినాథరావు నక్కిన
విడుదల తేదీ: అక్టోబర్ 18, 2018

రామ్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు సంస్థ నిర్మించిన సినిమా 'హలో గురు ప్రేమ కోసమే'. 'వున్నది ఒక్కటే జిందగీ' తరవాత రామ్ నటించిన చిత్రమిది. ఈ ఏడాది 'లవర్', 'శ్రీనివాస కళ్యాణం' సినిమాల తరవాత దిల్ రాజు నిర్మించిన చిత్రమిది. ఇద్దరికీ తమ గత సినిమాలు ఆశించిన విజయాలు ఇవ్వలేదు. మరి, ఈ సినిమాతో విజయం సాధిస్తారా? లేదా? రివ్యూ చదవండి!

క‌థ‌:
సంజు (రామ్) కాకినాడ కుర్రాడు. సాఫ్ట్‌వేర్ జాబ్‌ రావడంతో హైదరాబాద్ వెళతాడు. హైద‌రాబాద్‌లో త‌న తల్లి స్నేహితుడు విశ్వనాథ్ (ప్ర‌కాశ్‌రాజ్‌) వాళ్ళింట్లో దిగుతాడు. ట్రైన్ జ‌ర్నీలో అను (అనుపమా పరమేశ్వరన్)ని భయపెట్టాలని ప్రయత్నిస్తాడు. ఆ అమ్మాయి విశ్వనాథ్ కుమార్తె అని తెలియడంతో, ఇద్దరూ ఒకే ఇంట్లో వుండాల్సి రావడంతో ముందు ఫ్రెండ్షిప్ చేస్తాడు. తర్వాత ప్రేమలో పడతాడు. అసలు, అనుతో సంజు ఎలా ప్రేమలో పడ్డాడు? తన ఇంట్లో వుంటూ తన కుమార్తెను ప్రేమిస్తున్నాని చెప్పిన సంజుతో విశ్వనాథ్ ఎందుకు ఫ్రెండ్షిప్ చేశాడు?  సంజు ప్రేమించాడు సరే... అను ప్రేమించిందా? ప్రేమిస్తే... మరో అబ్బాయితో తండ్రి కుదిర్చిన పెళ్లికి ఎందుకు అంగీకరించింది? చివరకు, సంజు ప్రేమకథకు శుభం కార్డు ఎలా పడింది? అనేది సినిమా!ఎనాలసిస్ :

కథగా చెప్పుకోవడానికి సినిమాలో కొత్తగా ఏం లేదు. కథనంలో పెద్దగా మలుపులూ లేవు. పాత్రల చిత్రణ కూడా అంతంత మాత్రమే. కానీ, కామెడీ మాత్రం వుంది. కామెడీ మాత్రమే వుంది. దాంతో ప్రేక్షకులకు కాలక్షేపం ఇవ్వాలని దర్శక రచయితలు తమ శక్తి మేరకు ప్రయత్నం చేశారు. వాళ్లకు రామ్, ప్రకాశ్ రాజ్  మంచి మద్దతు ఇచ్చారు. సినిమాటోగ్రాఫర్ కూడా ప్రతి ఫ్రేమ్‌ని అందంగా చూపించే ప్రయత్నమే చేశాడు. కానీ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నుంచి ఆశించిన సహకారం రాలేదు. సినిమాలో పాటలు యావరేజ్‌గా అంటే.. నేపథ్య సంగీతమూ యావరేజే! సూటిగా చెప్పుకోవాలంటే ఈ సినిమా కథ 'నేను లోకల్'కు సీక్వెల్‌గా, 'సినిమా చూపిస్త మావ'కు మూడో పార్ట్‌గా అనిపిస్తుంది. కథలో ఆ రెండు సినిమాల ఛాయలు కనిపిస్తాయి. కాస్త కొత్తదనం ఏంటంటే... హీరోయిన్ తండ్రి హీరోతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎలా ప్రవర్తిస్తాడు? అనేది! సినిమా సెకండాఫ్‌లో ఈ పాయింట్ నుంచి కావలసినంత కామెడీ రాబట్టుకోవాలని, ప్రేక్షకుల్ని నవ్వించాలని ప్రయత్నించారు.

హీరో కాకినాడ నుంచి హైదరాబాద్ వరకూ చేసే ప్రయాణం... తరవాత సాఫ్ట్‌వేర్ జాబ్ ట్ర‌యినింగ్‌లో వ‌చ్చే దృశ్యం... కాఫీ షాపులో అమ్మాయి ఆర్డర్ చేసే ఐటమ్స్‌కి బిల్ ఎక్కువ అవుతుందేమో అని పడే తాపత్రయం... ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. ముఖ్యంగా యూత్ ఆ సన్నివేశాల్లో తమను తాము చూసుకుంటారు. లేదా తమ గ్యాంగులో ఎవరో ఒకరు వాళ్లకు గుర్తొస్తారు. ఫస్టాఫ్ అంతా పెద్దగా బ్రేకులు లేకుండా బండి బాగా నచ్చింది. ప్రయాణం సరదాగా సాగింది. సెకండాఫ్ నుంచి ప్రయాణంలో బ్రేకులు, స్పీడ్ బ్రేకులు తగిలాయి. అసలు కథ మొదలైన తరవాత అంతకు ముందు ఎక్కడో ఈ సన్నివేశాలను చూసినట్టు ప్రేక్షకులకు అనిపిస్తాయి. క్లైమాక్స్ కొంచెం వీక్... సినిమాలో కామెడీ వర్కవుట్ అయ్యినంతగా ఎమోషనల్ సన్నివేశాలు వర్కవుట్ అవ్వలేదు. ప్రణీత లవ్ ఎపిసోడ్, క్లైమాక్స్ ఎపిసోడ్ హడావుడిగా ముగించిన ఫీలింగ్ వస్తుంది.

నటీనటుల పనితీరు:
రామ్ ఎప్పటిలా ఎనర్జీతో నటించాడు. పాటల్లో మంచి స్టెప్పులు వేశాడు. ప్ర‌కాశ్‌రాజ్‌తో రామ్ కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇద్దరి మధ్య సన్నివేశాలు బావున్నాయి. అనుపమా పరమేశ్వరన్ పాత్రకు తగ్గట్టు నటించింది. కాకపోతే కొంచెం లావుగా కనిపించింది. ప్రణీత సుభాష్ పాత్ర అతిథి కంటే ఎక్కువ, సెకండ్ హీరోయిన్ కంటే తక్కువ అన్నట్టుంది. ఓ పాటలో సందడి చేసింది. ప్రవీణ్ కనిపించింది నాలుగైదు సన్నివేశాల్లోనే అయినా నవ్వించాడు. ఆమని పాత్రకు రాసిన డైలాగులు, ఆమని నటన ప్ర్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రెండు మూడు సన్నివేశాలకు పోసాని కృష్ణమురళిని పరిమితం చేశారు. ఎందుకో మరి? సీనియర్ నటుడు సురేష్ కనిపించిన ఒక్క సన్నివేశమే. కానీ, అందులో కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

లాజిక్కులు గురించి ఆలోచించకుండా కామెడీలో మేజిక్ ఎంజాయ్ చేయగలిగితే సినిమాకు వెళ్ళండి. కథలో కొత్తదనం కోసం వెతికేవారు సినిమాకు వెళ్ళకపోవడం మంచిది. 'సినిమా చూపిస్త మావ', 'నేను లోకల్' తరహాలో దర్శక రచయితలు మరోసారి ప్రేక్షకులను నవ్వించడానికి చేసిన ప్రయత్నమిది! హలో గురు... జస్ట్ కామెడీ అంతే!!

  

Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here