ఎన్టీఆర్ ఫ్యామిలీ లక్కీనంబర్ మారింది
on Nov 18, 2014

అన్నగారు నందమూరి తారక రామారావు గారి లక్కీ నంబర్ ఏది అని తెలుగువారిని ఎవర్ని అడిగినా ‘‘9’’ అని ఠక్కుమని చెప్పేస్తారు. తొమ్మిదిని చాలామంది లక్కీ నంబర్‌గా భావిస్తారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ అయితే ఈ విషయంలో మరీ పర్టిక్యూలర్‌గా వుంటుంది. కారు నంబర్ల దగ్గర్నుంచి ఏదైనా తొమ్మిది అంకె కలిసేలా జాగ్రత్త పడుతూ వుంటారు. ఎన్టీఆర్ ఫ్యామిలీలో చాలామంది కారు నంబర్లు తొమ్మిది అంకెతోనే వుంటాయి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్‌తో రక్తసంబంధం లేకపోయినా బీరకాయపీచు బంధుత్వం వున్న నారా రోహిత్ మాత్రం తన లక్కీ నంబర్ 7 అంటున్నారు. నారా రోహిత్ నటించిన తాజా సినిమా ‘రౌడీ ఫెలో’ త్వరలో విడుదలకు సిద్ధమైంది. నారా రోహిత్ ఇప్పటి వరకు ఆరు సినిమాల్లో నటించారు. ‘రౌడీ ఫెలో’ రోహిత్ ఏడో సినిమా. ఏడో సినిమా సూపర్ హిట్ కావడం ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఆనవాయితీ అని, తన విషయంలో కూడా అది జరుగుతుందని నారా రోహిత్ అంటున్నారు. తాను చెబుతున్న దానికి బలం చేకూర్చే విధంగా నందమూరి ఫ్యామిలీలో ఏడో సినిమాలు ఎంత హిట్టయ్యాయో ఉదహరిస్తున్నారు. ఈ విషయాన్ని ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌కి హాజరైన నారా రోహిత్ పెదనాన్న నారా చంద్రబాబు నాయుడు కూడా అంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తానికీ ఏడో సినిమా కలిసొచ్చిందని, నారా రోహిత్‌కి కూడా ఏడో సినిమా కలిసొస్తుందని ఆయన అన్నారు. మొత్తానికి ఎన్టీఆర్ ఫ్యామిలీని తొమ్మది నుంచి ఏడుకు తగ్గించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



