బన్నీతో 'జెర్సీ' డైరెక్టర్?
on Mar 10, 2021
2017లో విడుదలైన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'మళ్ళీ రావా'తో దర్శకుడిగా తొలి అడుగేశాడు గౌతమ్ తిన్ననూరి. మొదటి ప్రయత్నంలోనే విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఆపై నేచురల్ స్టార్ నానితో ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా 'జెర్సీ' రూపొందించి.. కెప్టెన్ గా తన స్థాయి పెంచుకున్నాడు. కమర్షియల్ గానూ ఈ సినిమా ఫర్లేదనిపించుకుంది. ఇప్పడిదే స్పోర్ట్స్ డ్రామాని హిందీలో అదే పేరుతో రీమేక్ చేస్తూ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు గౌతమ్. షాహిద్ కపూర్ నటిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 5న రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే.. 'జెర్సీ' హిందీ వెర్షన్ తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో గౌతమ్ సినిమా చేయబోతున్నాడంటూ ఆ మధ్య కథనాలు వచ్చాయి. అయితే, ఏస్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో చరణ్ ఓ పాన్ ఆసియా సినిమా కమిట్ కావడంతో.. గౌతమ్ కొంతకాలం వేచి ఉండక తప్పడం లేదు. దీంతో, ఈ గ్యాప్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో గౌతమ్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. 'జెర్సీ' హిందీ వెర్షన్ నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్.. ఈ ప్రాజెక్ట్ ని నిర్మించనున్నట్లు టాక్. త్వరలోనే బన్నీ - గౌతమ్ కాంబో మూవీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.