Facebook Twitter
సమానత్వం

సమానత్వం


మూలం: పర్తాప్ అగర్వాల్.
తెలుగు అనుసరణ: నారాయణ.



గురు గోవింద సింగ్ నాయకత్వంలో సిఖ్ఖులు ఔరంగజేబు దుశ్చర్యలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రోజులవి. సిఖ్ఖులకు, ఔరంగజేబు సైన్యాలకూ మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. గురుగోవింద సింగ్ కొద్ది మంది ముఖ్య అనుచరులతో కలిసి అతి కష్టం మీద కోటనుండి బయట పడ్డాడు. దాదాపు కోటంతా శత్రువుల పాలైంది. మొగల్ సైన్యాలు ఆనాడు విలయ తాండవం చేశాయి. అనేకమంది సిఖ్కు యోధులు ఆ ఒక్క రోజులో అమరులైనారు.

సిఖ్ఖు వీరుల కళేబరాలతో రణ భూమి నిండి ఉన్నది. పది ఉన్న ఆ శరీరాల మధ్యనుండి నడుస్తున్నాడు గురు గోవింద సింగ్. ఆయనకు పరిచయం ఉన్న ముఖాలు, ఆ శరీరాల మధ్య అనేకం కనబడ్డాయి. ఆయనకు ముందుగా దీపం పట్టుకొని నడుస్తున్నారు కొద్దిమంది అనుచరులు. అక్కడ పడి ఉన్న అసంఖ్యాక మృత కళేబరాలలో ఫతేసింగ్ శరీరాన్ని గుర్తించారు వాళ్ళు- ఫతే సింగ్ గురుగోవింద సింగ్ కొడుకు. అంత చిన్న వయస్సులోనే మృతి చెందాడు, గురు పుత్రుడు. వాళ్ళు అక్కడే నిలబడి, గురుగోవింద సింగ్ రాక కోసం వేచి చూశారు.

గురుగోవింద సింగ్ వాళ్లను చేరుకొన్నాక, ప్రక్కనే పడి ఉన్న ఫతే సింగ్ మృత శరీరాన్ని చూపారు వాళ్ళు. వాళ్లలో‌ఒకరు అన్నారు- " ఆ యువ యోధుడి సేవలకు, త్యాగానికి గుర్తుగా అతని శరీరాన్ని ప్రత్యేకంగా ఒక బట్టతో కప్పుదాం" అని. గురువుగారు ఆ మాటలు విన్నారు, కానీ‌ ఏమీ అనకుండా అలాగే నిలబడ్డారు చాలా సేపు. ఆయన మనసులో‌ ఏం కదులుతున్నదో‌మరి- అందరూ ఆయన ఆజ్ఞకోసం ఎదురుచూస్తూ నిలబడ్డారు.

అప్పుడు అన్నాడాయన: "అవును. 'కళేబరాల్ని బట్టతో‌కప్పటం' అనేది చాలా మంచి ఆలోచన. అలాగే చేద్దాం- అయితే మనం ఈ వీరులందరి శరీరాలనూ కప్పాలి మరి- మీ దగ్గర ఎన్ని బట్టలున్నాయో‌చూడండి. అందరికీ సరిపోయేన్ని ఉంటే కప్పండి- నాకేమీ అభ్యంతరం లేదు. 'ఫతే నా కుమారుడు' అని అతని శరీరానికి ప్రత్యేకంగా మర్యాదలు చేయవలసిన అవసరం లేదు. సిఖ్ఖులందరూ నా కుటుంబ సభ్యులే. నేను నా ఫతే శరీరాన్ని కప్పి, మిగిలిన నావాళ్ల శరీరాల్ని కప్పకుండా ఎండకు-గాలికి వదిలెయ్యలేను" అని.

అనుచరులెవ్వరూ మాట్లాడలేదు. గోవింద సింగ్ కొనసాగించారు: "ఢిల్లీలో కూర్చొని రాజ్యాన్నేలే మొగల్ చక్రవర్తిని మనం ఎందుకు ఎదిరిస్తున్నాం? 'సమాన న్యాయం' కోసమే గదా? అలాంటప్పుడు, మనలో మనం ఆ సమానత్వాన్ని అమలు చెయ్యకపోతే ఎలాగ? ఈ పవిత్ర యుద్ధంలో పాల్గొనే వీర యోధులందరికీ సమాన గౌరవాన్నివ్వాలి. నా కొడుకు ఫతే కూడా ఒక సిఖ్ఖు కాదూ? అతన్ని వేరు చేసి చూడటం ఎందుకు? గుర్తుంచుకోండి- మనం అందరం ఆ పరమాత్ముని బిడ్డలమే. ప్రేమ, గౌరవాల్లో మనందరిదీ సమాన వాటానే."

అందరికీ సరిపోయేన్ని బట్టలు లేవు, వాళ్ల దగ్గర. అందుకని అక్కడ పడి ఉన్న శరీరాలన్నింటినీ కప్పకుండా అలాగే వదిలారు.

గురుగోవింద సింగ్ నుండి ఆనాడు నేర్చుకున్న సమానత్వపు నియమాన్ని ఆయన శిష్యులు ఇక ఏనాడూ మరచిపోలేదు.


కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో