Home » పిల్లల కోసం » మూడు సలహాలుFacebook Twitter Google
మూడు సలహాలు

మూడు సలహాలు

 


అనగనగా ఒక ఊరిలో ఒక అడవి ఉండేది. ఆ అడవికి వెళ్ళాడొక వేటగాడు. వాడు ఆ అడవి మధ్యలో వల వేశాడు. ఆ వలలోకి ఏ జంతువులో, పక్షులో వచ్చి పడతాయని ఎదురు చూస్తూ చెట్టు క్రింద కూర్చున్నాడు. చూస్తుండగానే ఓ బుజ్జి పిట్ట మెల్లగా వచ్చి వలలో చిక్కుకున్నది. వేటగాడు లేచి వల దగ్గరికి వచ్చాడు. బుజ్జి పిట్టను చేతిలోకి తీసుకొని "ఆహా! భలే రుచిగా ఉంటుంది!” అంటూ బుజ్జి పిట్టను చంపి తిందామని ప్రయత్నించాడు.


బుజ్జి పిట్టకు భయం వేసిందిగానీ, చటుక్కున తేరుకొని ధైర్యంగా మాట్లాడింది: "వేటగాడా! నన్ను తిన్నంత మాత్రాన నీ కడుపు నిండుతుందా? నీ‌ కడుపు నిండదు; నీ ఆకలీ తీరదు. నన్ను వదిలేయ్- నీకు అమూల్యమైన సలహాలు మూడు ఇస్తాను. మొదటి సలహాను నీ చేతి మీద కూర్చొని ఇస్తాను. రెండవ సలహాను దూరంగా నేలమీద కూర్చొని ఇస్తాను. మూడవ సలహాను చెట్టు కొమ్మ మీద కూర్చొని ఇస్తాను" అన్నది. వేటగాడు కొద్ది సేపు ఆలోచించాడు- 'సరేలే' అని దాన్ని వదిలేసాడు.

 

బుజ్జి పిట్ట వేటగాడి చేతిమీదే కూర్చొని మొదటి సలహా ఇచ్చింది: "అసంభవమైన వాటిని ఎప్పుడూ నమ్మవద్దు" అని. వేటగాడు ఇంకా ఆలోచిస్తుండగానే బుజ్జి పిట్ట దూరంగా వెళ్లి కూర్చొని రెండవ సలహా ఇచ్చింది: "జరిగి పోయిన దాన్ని గురించి ఎన్నడూ బాధపడవద్దు" అని. ఆ వెంటనే మూడవ సలహా ఇచ్చేందుకు చెట్టు కొమ్మ మీదికి ఎగిరింది: "నా కడుపులో కిలో బంగారం ఉంది. ఆ బంగారాన్ని నువ్వు గనక తీసుకొని ఉంటే పది తరాల పాటు కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బ్రతికేవాడివి" అన్నది బుజ్జి పిట్ట. వేటగాడు నిర్ఘాంత పోయాడు. నేను నిన్ను నమ్మి వదిలాను. బుజ్జి పిట్టా! నువ్వు నన్ను మోసం చేశావు" అని ఏడుపు ముఖం పెట్టాడు.

 

బుజ్జి పిట్ట నవ్వింది. “చూడు, నా సలహాలు నువ్వసలు పట్టించుకున్నట్టే లేవు. అసంభవమైనవాటిని నమ్మద్దని చెప్పాను కదా, మరి పిట్ట కడుపులో బంగారం ఉందంటే నువ్వు ఎలా నమ్మావు? ఇక నా కడుపులో నిజంగానే కిలో బంగారం ఉండి ఉంటే, నువ్వు నన్ను పట్టుకున్నప్పుడు ఆ బరువు తెలిసేది కదా? అయినా నా కడుపులో కిలో బంగారం పట్టేనా?” అన్నది. వేటగాడు సిగ్గుతో తల వంచుకున్నాడు.

పిట్ట కొనసాగించింది: "చూడు, జరిగిపోయినదాన్ని గురించి ఎన్నడూ బాధపడకు" అని చెప్పాను. నువ్విప్పుడు ఏం చేస్తున్నావు? 'అనవసరంగా నన్ను వదిలేసానే' అని బాధపడుతున్నావు. కదూ?” అన్నది నవ్వుతూ. వేటగాడికి మరింత సిగ్గు వేసింది. “నిజమే. ఇక మీద నీ సలహాలు పాటిస్తాను. మరిప్పుడు మూడో సలహా కూడా ఇవ్వు” అని అడిగాడు.

"ఎవరు ఏ సలహాలను ఇచ్చినా, మనకు వాటిని పాటించే గట్టి మనసు ఉంటేనే ప్రయోజనం. సలహాలు ఆచరణలోకి వస్తేనే ఉపయోగం- అర్థమైందా?” అని చెప్పి బుజ్జి పిట్ట తుర్రుమని ఎగిరిపోయింది.

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

 


అంతరంగ ఆలోచన..!!
May 10, 2019
అనగనగా నాగసముద్రంలో గంగరాజు అనే నేతగాడు ఒకడు ఉండేవాడు.
Apr 29, 2019
"అయ్యో, ఉడతా, నీ అమాయకత్వానికి నవ్వుతున్నాను! నీ చారలు చూసుకొనే నువ్వు..
May 13, 2019
పాముకి గుణపాఠం చెప్పిన కోడిపెట్ట
Apr 8, 2019
పిల్లలకు ఆకలి ఎక్కువ. టామీ కుక్కపిల్ల చిన్నగా ఉన్నప్పుడు దానికి కూడా చాలా ఆకలి ఉండేది.
Mar 1, 2019
రాజీవ్‌ అనే కుర్రవాడు చక్కగా చదివి, చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెతుక్కుంటూ పట్టణం చేరాడు..
Feb 23, 2019
పట్టువదలని విక్రం తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి, బేతాళాన్ని భుజంపైన వేసుకొని...
Feb 18, 2019
రామాపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీధర్‌, మురళి అనే అన్నదమ్ములు ఇద్దరు చదివేవాళ్ళు..
Feb 16, 2019
నాగసముద్రంలో రామయ్య, రాధమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు...
Feb 6, 2019
లింగేశ్వరంలో ఉండే కోటేశ్వరావు గొప్ప ధనవంతుడు, పరమ పిసినారి. 'అతనికి ఉన్నంత డబ్బు పిచ్చి వేరే ఎవ్వరికీ ఉండదు' అని చెప్పుకునేవాళ్ళు...
Feb 1, 2019
TeluguOne For Your Business
About TeluguOne