Facebook Twitter
దొంగ పిల్లి

దొంగ పిల్లి

 

ఒక అడవిలో ఒక కొంగ ఉండేది. ఆ కొంగకు ఒక చిన్న ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఒక వడ్ల మూట. ఆ మూట మీదనే కొంగ గుడ్లను పెట్టింది. కొన్నాళ్లకు ఆ గుడ్లను పొదిగే సమయం వచ్చింది. కొంగ తన గుడ్ల పైన కూర్చొని ఉండగా ఒక పిల్లి అక్కడికి వచ్చి, "కొంగమ్మా! కొంగమ్మా! ఉండటానికి నాకు కొంచెం స్థలం ఇవ్వవా" అని అడిగింది. అప్పుడు ఆ కొంగ "వడ్లు పైన గుడ్లు, గుడ్లపైన నేను, నా పైన స్థలం ఉంటే వచ్చి ఒడుక్కో" అని పిల్లితో చెప్పింది. 

"సరే"నని, పిల్లి పోయి ఆ కొంగమీద ఒడుక్కొని కూర్చున్నది. కాసేపటికి అక్కడికి ఓ ఎలుక వచ్చింది. దానికీ స్థలం లేదు ఉండటానికి పాపం! వచ్చి "కొంగమ్మా! కొంగమ్మా! నాకు కొంచెం స్థలం ఇవ్వవా ఉండటానికి" అని అడిగిందది. అప్పుడు కొంగ" వడ్లుపైన గుడ్లు, గుడ్లపైన నేను, నాపైన పిల్లి, పిల్లిపైన స్థలం ఉంటే వచ్చి ఒడుక్కో" అని చెప్పింది. ఎలుక మెల్లిగా ఒక్కోదాన్నీ ఎక్కి పిల్లిపైన కూర్చుంది.

మరికొంచెంసేపయ్యాక అక్కడికి ఒక కుందేలు వచ్చింది. అది కూడా కొంగను అడిగింది. తనకూ కొంచెం స్థలం‌ఇవ్వమని. కొంగ చెప్పింది "వడ్లుపైన గుడ్లు, గుడ్లపైన నేను, నాపైన పిల్లి, పిల్లిపైన ఎలుక, ఎలుకపైన స్థలం ఉంటే వచ్చి ఒడుక్కో" అని. కుందేలుకూడ పైకెక్కి కూర్చున్నది జాగ్రత్తగా!

అప్పటికి చీకటి పడింది. అన్నీ నిద్రపోయాయి. తెల్లారాక పైనున్న కుందేలు దాని తరువాత ఎలుక, లేచి అడవిలోకి వెళ్ళిపోయాయి. కొంగపైన పిల్లి ఒకటి ఉన్నది అప్పటికి. ఎంతకీ దిగలేదది. 
అప్పుడు కొంగకు ఆకలైంది. అది పిల్లితో అన్నది, "పిల్లీ! పిల్లీ! నేను పోయి కొన్ని చేపలు తినేసి వస్తాను, నా గుడ్లను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటావా, ఇక్కడే?" అని.

పిల్లి అన్నది, "నాక్కూడా ఆకలిగానే ఉంది కొంగమ్మా, నేనూ పోతాను. నీ గుడ్లకేమీ కాదులే!" అని. 'సరే' అని కొంగ, పిల్లి రెండూ బయటికి వెళ్ళాయి. అయితే కొంగ అటు వెళ్లగానే, పిల్లి వెంటనే‌ లోపలికి వచ్చి, వడ్లపైనున్న ఐదు గుడ్లనూ తినేసి, వాటి స్థానంలో ఐదు కంకర రాళ్లను పెట్టి వెళ్లిపోయింది. కొంగ వచ్చి చూస్తే, గుడ్లు లేవు! వెంటనే అది ఎలుకను, కుందేలును, పిల్లిని పిలిచి, "నా గుడ్లనెవరు తిన్నారు?" అని అడిగింది ఏడుస్తూ.

 

 

"మేం తినలేదమ్మా! మాకేంతెల్సు?" అన్నాయన్నీ. "ఆకలేసి, నీ గుడ్లను నువ్వే తిన్నావేమో! ఇప్పుడెందుకు ఏడుస్తావు?" అన్నది పిల్లి గడుసుగా. కొంగ అందర్నీ కొలనులో ఉన్న గంగమ్మతల్లి దగ్గరికి పిల్చుకు పోయింది. "గంగమ్మ తల్లీ, గంగమ్మ తల్లీ! నా గుడ్లను నేనే తినేసి ఉంటే నన్ను లోపలికి ముంచెయ్; లేదంటే తేలగొట్టు" అని ప్రార్థించి, నీళ్లలో ఓ కుండను బోర్లా విడిచి, దానిమీదికి ఎక్కి నిల్చుంది కొంగ. గంగమ్మతల్లి కొంగను తేలగొట్టింది.

అలాగే ఎలుక, కుందేలు "కొంగమ్మ గుడ్లను మేం తినలేదు గంగమ్మతల్లీ! మేం అబద్ధం చెబితే మమ్మల్ని ముంచెయ్" అంటే, గంగమ్మ వాటినీ తేలగొట్టింది. అన్నిట్లోకీ చివరగా పిల్లి వచ్చి, కుండమీద నిల్చుని, ఇంకా ప్రమాణం ఏమీ చెయ్యకనే గజ గజ వణికింది. మరుక్షణంలో అది "దభీ"మని నీళ్లల్లో పడి మునిగి, కాపాడమని గోలపెట్టింది. ఎలుక, కుందేలు, కొంగ దాన్ని బయటికి లాగి, దండిస్తే, గుడ్లు తనే తిన్నానని ఒప్పుకున్నదది. అన్నీ కలిసి దొంగ పిల్లిని అడవిలోంచి తరిమేశాయి. అట్లా ఊరు చేరుకున్న పిల్లి అలవాటు ఇంకా పోలేదు- మన ఇళ్లల్లో పాలు, పెరుగుల్ని దొంగిలిస్తూనే ఉన్నదది, ఈనాటికీ!

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో