Facebook Twitter
కుందేలు తెలివి

కుందేలు తెలివి

 


అనగా అనగా ఒక అడవి. ఆ అడవిలో ఓ కుందేలు, ఓ నక్క ఉండేవి. నక్కకేమో, మరి ఎప్పుడెప్పుడు కుందేలును తిందామా, అని ఉండేది. కానీ కుందేలు మాత్రం తెలివిగా తప్పించుకుంటుండేది. ఒక రోజున నక్క కుందేలును తన ఇంట్లో విందుకు రమ్మని పిలిచింది. పొరుగునే ఉంటుంది కదా, కాదనలేక వస్తుందేమో, వస్తే దాన్ని పట్టుకొని తినచ్చు' అనుకున్నది నక్క. కానీ కుందేలు 'నాకు కడుపునొప్పిగా ఉన్నది, విందు తినకూడదు'అని చెప్పి తెలివిగా తప్పించుకున్నది!

ఆ సమయంలో అడవిని ఆనుకునే రోడ్డు వేస్తున్నారు. రోడ్డు పనివాళ్ళు తారు డ్రమ్ములు తెచ్చి పెట్టి, దాన్ని వేడి చేసి, రోడ్డు మీద పోస్తుండగా, ఆగి ఆగి చూసింది నక్క. వెంటనే దానికి ఒక తిరుగులేని ఉపాయం తట్టింది. అది వెళ్లి, తారుతో ఒక అందమైన నల్ల పిల్లి బొమ్మని చేసింది. తెల్ల కర్పూరం తెచ్చి దానికి కళ్ళుగా పెట్టింది. ఆ బొమ్మని జాగ్రత్తగా‌ తీసుకొని వచ్చి, కుందేలు వచ్చే-పోయే దారిలో పెట్టింది. దూరం నుండే కుందేలు రాకను చూసి, ప్రక్కనే పొదలో దాక్కుంది. 

కుందేలు ఆ బొమ్మను నిజంగా పిల్లే అనుకున్నది. 'ఏంటి పిల్లి బావా! ఇక్కడేం చేస్తున్నావ్?' అంది దానితో. అది మాట్లాడలేదు. "ఏంటి, ఇక్కడున్నావ్? చెప్పు!" అన్నది కుందేలు కొంచెం కోపంతో. అయినా అది జవాబివ్వలేదు. దాంతో, "ఏయ్!‌మాట్లాడు!" అని కుందేలు కుడి చేత్తో దాన్ని ఒక్క దెబ్బ కొట్టింది- అంతే! దాని చెయ్యి తారుబొమ్మకు కరుచుకు పోయింది. 'వదులు , నా చెయ్యి వదులు' అని కుందేలు గింజుకుని తలతోటీ, కాళ్లతోటీ కొడితే, అవీ కరుచుకు పోయాయి! అప్పుడు నక్క వచ్చి పొట్ట చెక్కలయ్యేలా నవ్వింది. 'కొంచెం సేపు ఇలాగే తంటాలు పడు, ఆ తర్వాత నిన్ను కాల్చుకొని తింటాను' అన్నది, కులాసాగా పళ్ళు బైట పెట్టి నవ్వుతూ. 

'అయ్యో నక్క బావా! ఇన్నాళ్ళకి నీ చేత చిక్కాను. ఇక నువ్వు నన్ను ఏమైనా చేసుకో, కానీ ఆ ముళ్ళ పొదలో మాత్రం పడెయ్యకు. అన్ని ముళ్లు ఒకేసారి నాలోకి దిగిపోతే, ఆ బాధను భరించటం నావల్ల కాదు. నువ్వన్నట్లు, నన్ను హాయిగా కాల్చుకొని తిను. అదే నయం!" అన్నది కుందేలు దానితో. 'అవునా, అంత బాధగా ఉంటుందా, అయితే నిన్ను తప్పకుండా ఆ పొదలో పడెయ్యాల్సిందే' అని, నక్క కుందేలును పీకి, ముళ్ళపొదలోకి విసిరేసింది. 'పిచ్చి బావా! నేను పుట్టిందీ, పెరిగిందీ ఈ పొదలోనే. ఈ ముళ్ళు నన్నేమీ చెయ్యవు!' అని ఇకిలించి, కుందేలు ఒక కట్టెపుల్లతో మిగిలిన తారును కూడా గీక్కొని, పారిపోయింది. మళ్లీ మోసపోయిన నక్క, తెల్ల మొహం వేసింది!

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో