Home » పిల్లల కోసం » నక్క తిక్క కుదిరిందిFacebook Twitter Google
నక్క తిక్క కుదిరింది

నక్క తిక్క కుదిరింది

 

 

అనగనగనగనగా ఒక అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు ఉండేవి. పెద్ద కుందేళ్ళ గుంపు కూడా ఒకటి ఉండేది వాటిలో. ఒకరోజున ఆ కుందేళ్ళ దగ్గరికి నక్క ఒకటి వచ్చింది. "ఈ విషయం తెలుసా, మీకు?! మన సింహరాజుగారికి ఏదో పెద్ద జబ్బు చేసింది. రాజ వైద్యులు కోతిగారు ఆయనకు మందులిస్తున్నారు. ఆయన చెప్పారు 'రోజూ ఓ కుందేలును ఆహారంగా తీసుకుంటే రాజుగారికి మంచిది; ఆరోగ్యం చక్కగా కుదురుకుంటుంది' అని. అందుకని మిమ్మల్ని రోజుకొకరుగా తీసుకు రమ్మని రాజాజ్ఞ!" అని చెప్పింది. కుందేళ్లకు మతిపోయింది. "రాజుగారి రోగం-కుందేళ్లకు శాపం" అని అన్నీ విచారపడి, రాత్రికి రాత్రే ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. "మనం ఎవ్వరం దొరకకుండా తప్పించుకుందాం. ఆయన ఏం చేస్తాడో చూద్దాం" అన్నాయి కొన్ని కుర్ర కుందేళ్ళు.

ముసలి కుందేళ్లు వాటిని కసిరి "రాజుగారికి కోపం వస్తే మనందరినీ ఒకేసారి చంపేయగలడు. కాబట్టి మనమే మర్యాదగా ఒక్కొక్కరం వెళ్ళడం మంచిది. అయినా రాజుగారి ఆరోగ్యం కంటే మించింది ఏముంటుంది పౌరులకి? మీ కుర్ర కుందేళ్లకు ఏమీ తెలీదు ఊరుకోండి. మేం పెద్దవాళ్ళం వెళ్తాం, రోజుకొకరం! ఒక వారం రోజుల్లో ఆయన ఆరోగ్యమూ కుదురుకుంటుంది; మీకు ఈ శ్రమా తప్పుతుంది" అన్నాయి.  కుర్ర కుందేళ్లకు ఆ మాటలు నచ్చలేదు గానీ, పెద్దల మాటకు ఎదురు చెప్పలేక ఊరుకున్నాయి. అట్లా ఆ మరుసటి రోజునుండి ప్రతిరోజూ తెల్లవారుతుండగానే నక్క వచ్చేది: తనతోబాటు ఒక కుందేలును వెంటబెట్టుకు వెళ్ళేది. ఇట్లా ఒక వారం రోజులు గడిచాయి.

 

ఆ రోజున కుందేళ్లకు కోతి ఎదురైంది అడవిలో . దాన్ని చూడగానే కుందేళ్లకు తమ సమస్య, అది ఎప్పటికి పరిష్కారం అవుతుందోనన్న బెంగ గుర్తుకొచ్చాయి. వెంటనే అవన్నీ నేరుగా కట్టకట్టుకున్నట్టు కోతి దగ్గరికి వెళ్ళి, "రాజుగారికి జబ్బు తగ్గిందా?" అని అడిగాయి. కోతి ఏమీ‌ అర్థం కానట్లు ముఖం పెట్టింది: "రాజుగారికేం? చక్కగా ఉన్నారు. ఆయనకేం జబ్బు?! రాజవైద్యుడిని, నాకు తెలీని జబ్బులు ఏమొచ్చినై, ఆయనకు? ఈ పుకార్లు ఎవరు రేపుతున్నారో కనుక్కోవాలి. ఇంతకీ ఆయనకు జబ్బుచేసిందని ఎవరు చెప్పారు, మీకు?!" అని అడిగింది చికాకుగా.

కుందేళ్లన్నీ ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచాయి. "ఓహో! ఇవన్నీ నక్క జిత్తులనమాట! సింహానికి ఆరోగ్యం బానే ఉంది. అయినా నక్క తమకు అబద్ధం చెప్పింది! రోజూ కుందేలునొకదాన్ని తీసుకు వెళ్తుంటే 'సింహం కోసమే కదా' అనుకున్నాంగానీ, నిజానికి దారిలోనే ఆ కుందేలును చంపి తిని ఆకలిని తీర్చుకుంటోందనమాట,ఈ జిత్తులమారి నక్క! ఆ ఆలోచనతో కుందేళ్ల గుండెలు దహించుకు పోయాయి. అంతలోనే అటుగా వచ్చింది నక్క. ఏంటి అల్లుళ్ళూ! ఏదో మీటింగు పెట్టుకున్నట్టున్నారే, మంచినీళ్ల బావి దగ్గర!" అంటూ.

కుందేళ్ళు ఒకదాని ముఖం ఒకటి చూసుకున్నాయి. ఓ ముసలి కుందేలు గట్టిగా నవ్వి, నక్కతో "నక్కబావా! నీకు నూరేళ్ళు నిండుతున్నట్లున్నాయి- ఇప్పుడే మేమంతా నీ గురించి మాట్లాడుకున్నాం; అంతలోనే నువ్వు వచ్చేసావు! ఎట్లాగూ వచ్చావు కాబట్టి మా తాడు లాగే ఆటలో నువ్వూ కలువు. తాడును మా కుర్రవాళ్లంతా ఒక వైపు పట్టుకొని లాగుతారు; నువ్వు ఒక్కడివే ఒక వైపు పట్టుకొని లాగు. ఎదుటి వాళ్లను ఎవరైతే తమ వైపు లాగేసుకుంటారో వాళ్ళు గెలిచినట్లు. నీకు కూడా తెలుసుగా ఈ ఆట?!" అన్నాయి. "ఓ! తెలియకేమి? నేను ఒక్కడినీ చాలు, మిమ్మల్ని అందరినీ గెలిచేందుకు. కానివ్వండి మరి!" అన్నది నక్క.

కుర్ర కుందేళ్ళన్నీ తాడుని గట్టిగా పట్టుకున్నాయి ఒకవైపున. మరోవైపున నక్క; వాటన్నిటినీ తనవైపు లాగేయాలని చాలా‌ బలంగా లాగసాగింది. కొంత సేపు ఆట రంజుగా సాగింది. చూస్తున్న కుందేళ్ళన్నీ ఉత్సాహంగా కేకలు పెట్టాయి. నక్క తనని తాను మర్చిపోయి, శక్తినంతా వెచ్చించి లాగుతున్నది. 'అన్నీ సరిగా ఉన్నాయి' అన్నప్పుడు, ముసలి కుందేలు సైగను అందుకొని, కుందేళ్ళన్నీ ఒకేసారి తాడును వదిలేసాయి! అంతే! నక్క, విసిరేసినట్టుగా వెళ్ళి వెనకాల ఉన్న బావిలో‌ పడిపోయింది తాడుతో సహా. మోసపు నక్క పీడ విరగడైనందుకు కుందేళ్ళన్నీ పండగ చేసుకున్నాయి.


- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో


నల్లమల అడవుల్లో చిట్టి లేడిపిల్ల ఒకటి ఉండేది....
Sep 17, 2018
ఒక అడవిలో చాలా జంతువులు ఉండేవి. అవి ఒక రోజు సమావేశం అయ్యాయి...
Sep 14, 2018
నది ఒడ్డున చెట్టు మీద రెండు పిచ్చుకలు ఉండేవి. అవి మంచి స్నేహితులు...
Sep 8, 2018
అనగనగా ఒక అడవిలో గొప్ప గుడ్లగూబ ఒకటి ఉండేది...
Sep 6, 2018
అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు తొగర్రాయి...
Aug 31, 2018
అనగనగా ఒక అడవిలో రెండు కాకులు ఉండేవి.
Aug 30, 2018
అడవిలో ఎలుగుబంటి ఒకటి ఉండేది...
Jul 27, 2018
శ్రావణి వాళ్ళ తరగతిలో‌ పిల్లలందరూ పాఠాలను శ్రద్ధగా వినేవారు ఒకరు తప్ప.
Jul 19, 2018
శివ బాగా చదివేవాడు కాదు. కానీ వాడికి చదవటం అంటే చాలా ఇష్టం!
Jul 17, 2018
కొత్తపల్లిలో ఉండే రాఘవరావుకు ఒక కొడుకు, ఒక కూతురు.
Jul 16, 2018
TeluguOne For Your Business
About TeluguOne