టమాటో రుచిని దాచుకుందాం

 

టమాటో ఈ సీజన్ లో బాగా దొరుకుతుంది. కాబట్టి నిల్వ పచ్చడి పెడుతుంటారు. నిజానికి ప్రతి వంటలో టమాటో వుంటే దాని రుచే వేరు. కానీ సంవత్సరమంతా టమాటో ఇంత విరివిగా దొరకదు. కాబట్టి దొరికినప్పుడే దాన్ని నిల్వ చేసుకోగలిగితే.. ఎప్పుడూ ఆ రుచిని మిస్ అవ్వక్కర్లేదు.

మనం మామిడిని నిల్వ చేసుకున్నట్టే టమాటోని కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఓపికగా చేసుకోవాలి అంతే. మూడు రకాలుగా టమాటో రుచిని నిల్వ చేసుకోవచ్చు.

 

మొదటి విధానం:

 

 

టమాటోలని బాగా కడిగి తొడిమెల దగ్గర చాకుతో గంటు పెట్టి తొడిమని తీసేయాలి. ఆ తర్వాత మరుగుతున్న నీటిలో టమాటోలని వేసి ఓ పావు గంట మరిగించాలి. టమాటోలు మునిగేలా నీరు వుండాలి. అలాగే బాణలి కూడా వెడల్పుగా వుండాలి. అప్పుడే అన్ని టమాటోలు చక్కగా ఉడుకుతాయి. టమాటో లు పైన తొక్క విడటం మొదలు పెడితే టమాటో చక్కగా వుడికినట్టు. అప్పుడు వాటిని చిల్లుల గరిటతో జాగ్రత్తగా తీసి ప్లేట్లో పెట్టి ఆరనివ్వాలి. లేదా చల్లటి నీరు ఓ గిన్నెలో పోసి అందులో ఈ టమాటోలని వేయాలి. టమాటోలు చల్లారాక  టమాటో పైన చెక్కుని ఒలిచేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మంచి రంగు రావాలంటే చెక్కుని కూడా వేసుకోవాలి. టమాటో మిశ్రమాన్ని వడగట్టి బాగా ఆరాక సీసాలో పోసి ఫ్రిడ్జ్‌లో పెట్టు కోవాలి.

 

 

అయితే టమాటో గ్రైండ్ చేశాక పలచగా వున్నట్టు అనిపిస్తే ఒకసారి పొడి బాణలి లో వేసి దగ్గరయ్యే దాకా మగ్గించాలి. చల్లారక నిల్వ చేయాలి. ఎక్కువ టమాటోలని నిల్వ చేసినప్పుడు ఆ మిశ్రమాన్ని రెండు సీసాలలో పోసి ఉంచితే మంచిది. ఒక దాని తర్వాత ఒకటి వాడుకోవచ్చు. తడి చెంచాలు కాకుండా చూసుకుని ఈ టమాటో ప్యూరీ తీయటానికి వాడాలి. కూరలు చేసేటప్పుడు ఒక చెంచా ఈ ప్యూరీ వేస్తే చాలు టమాటో రుచి వస్తుంది ఆ కూరకి. టమాటో రసం, పప్పు, పచ్చడి ఇలా అన్ని విధాలుగా దీనిని వాడుకోవచ్చు.

 

రెండో విధానం:

 

 

 

ఇక రెండో రకంలో  టమాటోలని కడిగి , నీడలో ఆరనివ్వాలి. అస్సలు తడి లేకుండా చూసుకుని, అప్పుడు చిన్న ముక్కలుగా కోసి , కొంచం నూనె వేసి బాణలిలో ఈ ముక్కలని మగ్గించాలి. కనీసం ఓ ఇరవై నిముషాలు అయినా పడుతుంది. టమాటో ముక్కలు బాగా మగ్గి, దగ్గరగా అవుతాయి. ఇక నీరు లేదు అనుకున్నాక స్టవ్ ఆపాలి. బాగా చల్లరనిచ్చి మెత్తగా గ్రైండ్ చేసి ఆ టమాటో పేస్టుని సీసాలో పెట్టుకోవాలి. చిక్కగా వుంటుంది. పులుపు కూడా బాగా వుంటుంది కాబట్టి వాడేటప్పుడు చూసుకుని వేసుకోవాలి. ఈ టమాటో పేస్టుని సీసాలో పెట్టాకా పైన ఆలివ్ ఆయిల్ని పోయాలి. అంటే ఆవకాయ జాడీలో పెట్టాక దాని మీద ఒక లేయర్‌లా నూనె వేస్తాం కదా అలా అన్నమాట. పొడి చెంచాతో తీసి వాడుకోవాలి.

 

మూడో విధానం :

 

 

 

ఇక కొంతమంది టమాటోలని కడిగి, ఆరబెట్టి, ఆ తర్వాత నాలుగు ముక్కలుగా కోసి, పైన కొంచం ఉప్పు చిలకరించి ముక్కలని ఓ పళ్ళెంలో పెట్టి ఎండలో పెడతారు. ఓ వారంపాటు ఎండపెట్టాల్సి వస్తుంది. ముక్కలలోని రసం అందులో నే వుంటుంది కాబట్టి రుచి కూడా బావుటుంది. మనం టమాటో నిల్వ పచ్చడికి ఉప్పు వేసి ఆ తర్వాత ఆ నీటిని పిండి ఎండబెడతాం. కాని అలా కాకుండా ఒరుగులు చేసేటప్పుడు నేరుగా ముక్కలని ఎండలో పెట్టాలి. జాగ్రత్తగా పళ్ళాలలో పెట్టి దుమ్ము పడకుండా  ఓ నెట్ పరిచి ఉంచితే, టమాటో ఒరుగులు సిద్ధం. వాడే ముందర కొంచెంవేడినీటిలో నానపెడితే చాలు. సాంబార్, కూరలు, పచ్చడి... అన్ని రకాల వంటలలో వాడుకోవచ్చు ఈ ఒరుగులని.

 

మరి టమాటోలని నిల్వ చేసే పని లో వుండండి ఈ రోజు. ఎందుకంటే రేపు తాజా టమాటోలతో టేస్టీ బజ్జి చేయటం ఎలాగో చెబుతాను. ఆ తర్వాత రోజున డిఫరెంట్ స్టేట్స్‌లో టమాటో పచ్చడి ఎలా చేస్తారో నేర్చుకుందాం. టమాటో రుచిని ఎన్ని రకాలుగా మన వంటలలో వాడుకోవచ్చో నేర్చుకుందాం ఈ వారం. సరేనా!

 

 

-రమ