రవ్వ చెక్కలు

 

 

పిల్లలు ఆకలి అని అడగగానే, వెంటనే చేసి పెట్టగలిగే స్నాక్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు అలా చేసే వీలున్న మరో స్నాక్ ఐటమ్ చెప్పుకుందాం. బొంబాయి రవ్వ తో చేసే ఈ వంటకం త్వరగా చేయవచ్చు, రుచిగా కూడా వుంటుంది.

 

కావలసిన వస్తువులు:

రవ్వ               - రెండు కప్పులు
పల్లీలు            - అర కప్పు
కొబ్బరి పొడి    - అర కప్పు
కారం              - మూడు చేమ్చాలు
ఉప్పు             - తగినంత
నూనె              - వేయించటానికి సరిపడా

 

తయారుచేసే విధానం:

ముందుగా పల్లీలని వేయించి, పొడి చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ లో బొంబాయి రవ్వ, పల్లీల పొడి, కొబ్బరి పొడి, ఉప్పు, కారం వేసి కలిపి, అందులో నీళ్ళు పోసి కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఆ తర్వాత పక్కన ఓ పదినిమిషాలు పెడితే రవ్వ నీటిని పీల్చుకొని గట్టి పడుతుంది. అప్పుడు అవసరం అయితే మరికొంచెం నీరు కలుపుకోవచ్చు. మసాలా వడలకి పిండి గట్టిగా కలుపుతాం కదా, అలా వుండాలి పిండి. బాణలిలో నూనె వేసి, కాగాక, ఒక ప్లాస్టిక్ కవర్ ( పాల కవర్, కానీ నూనె కవర్ కానీ ) తీసుకొని దానికి కొంచెం నూనె రాసి రవ్వని పలచగా చెక్కల మాదిరిగా వత్తాలి. జాగ్రత్తగా తీసి నూనెలో వేసి వేయించాలి. ఎర్రగా వేగాక తీసి పేపర్ మీద వేస్తే నూనెనూనెగా ఉండదు. ఇవి కరకర లాడుతూ వుంటాయి. రెండు, మూడు రోజులు, నిల్వ వుంటాయి కూడా. పొడి డబ్బాలో వేసి పెట్టుకోవాలి.

 

టిప్: బొంబాయి రవ్వలో, అల్లం, వెల్లులి ముద్ద కూడా కలుపుకోవచ్చు. అలాగే కారం బదులుపచ్చిమిర్చి ముద్ద వేసుకుంటే రుచిగా వుంటుంది.

 

-రమ