కాశ్మీరీ ఖీమా

 

 

కాశ్మీరీలు భోజన ప్రియులు. వాళ్ళు చేసే వంటలు చూస్తేనే నోరూరుతూ వుంటుంది. అలా నోరూరించే ఒక వంట కాశ్మీరీ ఖీమా... ఈ వంట ఎలా చేయాలో తెలుసుకుందాం.

 

కావలసిన పదార్ధాలు:

మటన్ ఖీమా- 1 కిలో

ఆవాల నూనె - 100 గ్రాములు

ఉప్పు - తగినంత

కారం - రెండు స్పూన్లు

సోంపు పౌడర్ - రెండు స్పూన్లు

సొంఠి పొడి - అర స్పూను

గరం మసాలా -  స్పూను

యాలకుల గింజలు - స్పూను

జీలకర్ర - స్పూను

ఇంగువ - అర స్పూను

బిర్యానీ ఆకు - రెండు

నెయ్యి - స్పూను

కొత్తిమీర - ఒక కట్ట


తయారీ విధానం:

మటన్ ఖీమాను ఒక పెద్ద బౌల్‌లోకి తీసుకోవాలి. దాంట్లో ఉప్పు, కారం, సోంపు పొడి, సొంఠి పొడి, ఒక స్పూను ఆవాల నూనె, యాలకుల గింజలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు తయారైన ఈ పదార్ధంతో ఖీమా బాల్స్ తయారు చేసుకోవాలి. ఈ బాల్స్ గుండ్రంగా ఉండొచ్చు లేదా ఓవెల్ షేప్‌లో అయినా వుండొచ్చు. కిలో ఖీమాని 35 నుంచి 40 బాల్స్ చేసుకోవచ్చు.  ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకుని, అందులో మిగిలిన ఆవాల నూనె పోయాలి. సన్నటి మంట మీద నూనెను కాచి, దాంట్లో జీలకర్ర, ఇంగువ వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 50 మిల్లీ లీటర్ల నీటిని పోయాలి. ఇప్పుడు అందులో ఉప్పు, కారం వేయాలి. ఈ పదార్ధం బాగా చిక్కబడేవరకూ ఉంచిన తర్వాత అందులో సిద్ధంగా వుంచుకున్న మటన్ ఖీమా బాల్స్ వేయాలి. ఖీమా బాల్స్ సగమైనా మునగాలి. అలా కాకుండా చిక్కగా వుంటే, ఒక సగం గ్లాసు నీళ్ళు పోసుకోవచ్చు. ఇప్పుడు పది నిమిషాలపాటు మూత పెట్టి మీడియం మంట మీద ఖీమాబాల్స్ బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు గరమ్ మసాలా వేసి బాగా కలపాలి. మరో రెండు నిమిషాలు పాన్ మీద మూత పెట్టి వుంచి కిందకి దించేయాలి. ఇప్పుడు తరిగి వుంచుకున్న కొత్తిమీరని పైన చల్లుకోవాలి. నోరూరుతోంది కదూ?