ఇడ్లీ డిలైట్

 

 

 

రోజూ ఉదయాన్నే సింపుల్‌గా చేయగలిగే టిఫిన్ ఇడ్లీ అని సాధారణంగా  ఇడ్లీని చేస్తుంటాం. అయితే రోజూ ఇడ్లీనేనా... బోర్ అంటారు పిల్లలు.  అదిగో అలాంటప్పుడే ఆ ఇడ్లీని రకరకాలుగా చేయటం, ఆ ఇడ్లీ కాంబినేషన్ చట్నీలు కొత్త కొత్తవి చేయటం నేర్చు కోవాల్సి వస్తుంది. అలా మా పిల్లల కోసం నేను చేసే ఇడ్లీ ప్రయోగాలలో ఈ ఇడ్లీ డిలైట్ ఒకటి. పేరు పిల్లలే పెట్టారు కాబట్టి ఎంత వరకు నప్పిందో తెలియదు. మీరు చేసాక మీ పిల్లలని నామకరణం చేయమనండి ఆ ప్రయోగానికి.

 

కావలసిన పదార్థాలు:
ఇడ్లీలు - 5
కాప్సికం - 2
క్యాబేజ్ తురుము - ఒక కప్పు
ఉల్లి ముక్కలు - ఒక కప్పు
ఉప్పు, కారం - తగినంత
చిల్లీ సాస్ - అర చెమ్చా
నూనె - ఒక చెమ్చా
పచ్చి మిర్చి  - రెండు
మిరియాల పొడి  చిటికెడు

 

తయారీ విధానం:
ఇడ్లీలని క్యూబ్‌ల మాదిరిగా చాకుతో కోసి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి, పచ్చి మిర్చి, కూరగాయల ముక్కలు వేసి వేయించాలి. కొంచెం మెత్తపడగానే కొంచెం ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి బాగా కలిపి ఆ తర్వాత ఇడ్లీ ముక్కలని కూడా చేర్చాలి. పైన చిల్లీ సాస్ వేసి మూతపెడితే ఇడ్లీ ముక్కలకి కారం, ఉప్పు పడతాయి. వేడివేడిగా వడ్డిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.

 

టిప్: ఈ ఇడ్లీ డిలైట్‌లో కూరగాయల కాంబినేషన్ మార్చుకోవచ్చు. అలాగే ఒకసారి చైనీస్ టేస్ట్ వచ్చేలా, మరోసారి నార్త్ స్టైల్‌లో చేయచ్చు.  ఓ ఐడియా ఇడ్లీ రుచినే  మార్చేస్తుంది.. ట్రై చేయండి.

 

-రమ