చికెన్ బిర్యానీ

 

 

 

 

కావలసిన పదార్థాలు:

చికెన్ - ఒక కేజీ 

బాస్మతీ బియ్యం - ఒక కేజీ 

ఉల్లిపాయలు - నాలుగు 

పెరుగు - రెండు కప్పులు 

అల్లం, వెల్లుల్లి ముద్ద - మూడు స్పూన్లు 

కొత్తిమీర - కొద్దిగా 

పుదీనా - కొద్దిగా 

పచ్చిమిర్చి - నాలుగు 

పసుపు - తగినంత

కారం - రెండు  స్పూన్లు 

ఏలకులు - నాలుగు 

లవంగాలు - కొద్దిగా 

దాల్చిన చెక్క - చిన్న ముక్క 

గరం మసాలా - రెండు స్పూన్లు 

కేసర్ రంగు  - చిటికెడు 

పాలు - ఒక కప్పు 

ఉప్పు - తగినంత

నూనె - తగినంత

 

తయారుచేసే  విధానం:

ముందుగా నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా  తరిగి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో శుభ్రపరచిన మాంసం, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, గరం మసాలా వేసి బాగా కలియబెట్టి కనీసం గంటసేపు నానబెట్టాలి. ఆ తర్వాత బియ్యం కడిగి పదినిమిషాలు నాననిస్తే చాలు. మందపాటి గిన్నె తీసుకొని నూనె వేసి దానిలో నానబెట్టిన మాంసం, మసాలా వేసి సమానంగా అడుగున పరచి పక్కన పెట్టుకోవాలి. ఇంకో పెద్ద గిన్నెలో బియ్యానికి మూడింతలు నీళ్ళు పోసి అన్నానికి తగినంత ఉప్పు వేసి మరిగించాలి. నీరు మరిగేటప్పుడు ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు వెయ్యాలి. మరుగుతున్న నీటిలో ఈ బియ్యం వేసి సగం ఉడకగానే గంజి వార్చి, తర్వాత సగం ఉడికిన అన్నంను మాంసంపై సమానంగా పరవాలి. పైన కొన్ని ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన  కొత్తిమిర, పుదీనా కొద్దిగా, పాలలో  కేసర్ రంగు బాగా కలిసేలా కలిపి వేసుకోవాలి. ఆ తరువాత  దానిమీద  మూత పెట్టాలి. పొయ్యిమీద ఇనప పెనం పెట్టి వేడిచేసి దానిపై ఈ గిన్నె పెట్టి దాని మీద బరువైన వస్తువు పెట్టాలి. దీనివల్ల అడుగు మాడకుండా, ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది. దీనికి కాంబినేషన్‌గా పెరుగు పచ్చడి, గుత్తి వంకాయ కూర చాలా రుచిగా ఉంటాయి.