క్యాలీఫ్లవర్ ఆలూ కర్రీ

 


 

క్యాలీఫ్లవర్ అంటే అందరికి ఇష్టం ఉండదు. కానీ దాన్ని రకరకాల రుచులతో అందరికీ నచ్చేలా వండుకోవచ్చు. క్యాలీఫ్లవర్‌తో ఆలూ కలిపి చేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ చపాతీలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుటుంది. క్యాలీఫ్లవర్ టమాట, బఠాణీ, ఎగ్స్ ఇలా దేనితో వండినా ఇష్టంగా తినొచ్చు. క్యాలీఫ్లవర్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు క్యాలీఫ్లవర్‌, ఆలూ కలిపి కర్రీ ఎలా చేయాలో చూద్దాం.


కావలసిన పదార్థాలు:

క్యాలీఫ్లవర్ - ఒకటి
ఆలూ - రెండు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
కరివేపాకు - ఒక రెమ్మ
కొత్తిమీర - ఒక కట్ట
అల్లం - చిన్న ముక్క
వెల్లులి - నాలుగు రెబ్బలు
గరం మసాలా - అర టీ స్పూన్
ఉప్పు, కారం,పసుపు, నూనె, తాలింపు దినుసులు - తగినంత


తయారు చేసే విధానం:

ముందుగా ఒక బౌల్లో గోరువెచ్చని నీరు తీసుకోవాలి, క్యాలీఫ్లవర్ ని చిన్న చిన్న పువ్వులుగా చేసి వేడినీళ్ళలో కడగాలి. ఎందుకంటే క్యాలీఫ్లవర్‌లో చిన్న చిన్న పురుగులు ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి క్యాలీఫ్లవర్ విడివిడి పువ్వులను వేడి నీళ్ళలో వేస్తే పురుగులు బయటపడిపోతాయి. వాటిని తీసిపారేయాలి. ఆ తరువాత క్యాలీఫ్లవర్ ముక్కలను ఆలూ ముక్కలతో కలిపి కొంచెం ఉడికించి వార్చాలి. తరువాత ఒక బౌల్లో  నూనె వేడిచేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. అల్లం, మిర్చి, వెల్లుల్లి కలిపి గ్రేడ్ చేసుకొని ఈ పేస్ట్ వేసి వేయిచాలి. ఇప్పుడు ఉడికించిన ఆలూ, క్యాలీఫ్లవర్ వేసి కలపాలి. తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి ముక్కలు పూర్తిగా ఉడికేదాకా వేయించాలి, చివరిగా గరంమసాలా, కొత్తిమీర వేసి కలపాలి. అంతే, మనకి బాగా నచ్చే క్యాలీఫ్లవర్ ఆలూ కర్రీ రెడీ.