ఆపిల్ పాన్ కేక్

 

 

చిన్న పిల్లలు ఎక్కువగా తియ్యటి పదార్ధాలను ఇష్టపడతారు. వాళ్ళు ఆకలి అనగానే నిమిషాలలో వండి పెట్టేవి అమ్మలకి తెలిసి వుండాలి. లేకపోతే జంక్ ఫుడ్స్ వైపు వెళ్ళిపోతారు. వాళ్ళు ఇష్టపడే జంక్ ఫుడ్స్ లా కనిపించే పాన్ కేక్స్ ఫాస్ట్ గా చేయవచ్చు, మంచి రుచి గా కూడా వుంటాయి. ఎలాగో చూద్దాం.

 

కావలసిన పదార్దాలు:

గోధుమ పిండి            - 1 /2 కప్పు
మైదా పిండి               - 1/2 కప్పు
ఆపిల్ కోరు               - 1/2 కప్పు
కుకింగ్ బటర్            - 5 చెంచాలు
తేనె                          - 5 చెంచాలు
అరటిపండు గుజ్జు       - 1/2 కప్పు
నీళ్ళు                       - తగినంత

 

తయారుచేసే విధానం:

మొదటి పద్ధతి:

ఒక బౌల్ లో గోధుమ పిండి, మైదా పిండి, ఆపిల్ కోరు, అరటిపండు గుజ్జు, రెండు చెంచాల బటర్, కొంచెం నీరుపోసి కలపాలి. మరీ జోరుగా కాకుండా, గట్టిగా కాకుండా  దోశల పిండిలా కలుపుకోవాలి. పెనం మీద బటర్ వేసి ఆ పైన ఈ పిండిని దోశలా వేయాలి. ఇలా వేస్తే దోశలు కొంచెం మందంగా వస్తాయి. ఇప్పుడు దోశను రెండు వైపులా కాల్చి తీసి, ప్లేట్ లో పెట్టి, ఒకో పాన్ కేక్ మీద ఒకచెంచా తేనె వేసి రాయాలి. పిల్లలకి ఒకో పాన్ కేక్ ని రౌండ్ గా చుట్టి కూడా ఇవ్వచ్చు.

రెండో పద్ధతి:

గోధుమ పిండిని, మైదా పిండిని నీరు, బటర్ వేసి కలుపుకోవాలి. ఒక బాణలిలో కొంచెం బటర్ వేసి అందులో ఆపిల్ తురుము, అరటిపండు గుజ్జు, రెండు చెంచాల పంచదార వేసి దగ్గరకి వచ్చేదాకా కలపాలి. పాన్ కేక్ వేసుకుని దానిమీద ఆపిల్ మిశ్రమాన్ని పరచి ఎర్రగా కాల్చుకోవాలి. పాన్ కేక్ మీద ఆపిల్ మిశ్రమం ఓ స్ప్రెడ్ లా వస్తుంది.

టిప్: ఎగ్ తినేవారు పిండి కలిపేటప్పుడు ఎగ్ ని కూడా వేసి కలుపుకోవచ్చు. అలాగే బేకింగ్ పౌడర్ ఒక చెంచా వేసి కలుపుతారు కొందరు. నీరుకు బదులు పాలతో పిండిని కలుపుకోవచ్చు

 

-రమ