LATEST NEWS
బీజేపీ ఎట్టకేలకు మౌనం వీడింది. తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు విషయంలో జరుగుతున్న ప్రచారంపై బీజేపీఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది.  రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో  బీజేపీ పొత్తు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదని కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  ఇటీవల మీడియాతో మాట్లాడుతూ..  బీఆర్ఎస్‌తో పొత్తు  ప్రసక్తే లేదన్నారు. ఇది బీజేపీ తుదినిర్ణయమని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో   బీఆర్ఎస్‌  రెండుసార్లు, కాంగ్రెస్‌  ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.   బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు భారీగా బీజేపీలోకి వస్తున్నారని, వారిని ఆపుకోవడానికే కేసీఆర్, కేటీఆర్ పొత్తుల డ్రామాకు తెరతీశారన్నారు.  తమ క్యాడర్ ను, లీడర్ లను కాపాడుకోవడానికే కేసీఆర్, కేటీఆర్ లు బీజేపీతో పొత్తు అంటూ లీకులు ఇస్తున్నారని విమర్శించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే తమ బలమన్న రామచందర్ రావు.. రేవంత్ సర్కార్  ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో  ఘోరాతి ఘోరంగా విఫలమైందన్నారు.  ఇక కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, కుటుంబ పాలన వంటి అంశాల కారణంగా బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న ఆయన అటువంటి బీఆర్ఎస్ తో చేతులు కలిపే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు.   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు క్లారిటీతో.. తెలంగాణలో  రానున్న అసెంబ్లీ ఎన్నికలలో త్రిముఖపోరు అనివార్యం అని తేలిపోయింది. అలాగే బీఆర్ఎస్, బీజేపీల మధ్య చీకటి పొత్తు అంటే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను బీజేపీ నిర్ద్వంద్వంగా ఖండించినట్లైంది.  అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ సర్కార్ పై కూడా విమర్శలు గుప్పించడంతో  బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం అన్న బీఆర్ఎస్ విమర్శలను కూడా బీజేపీ ఖండించింది. ఇంత కాలంగా బీజేపీ చీకటి ఒప్పందాలు, పొత్తులు అన్న విమర్శలు బీఆర్ఎస్, కాంగ్రెస్ ల నుంచి గట్టిగా వినిపిస్తున్నా.. ఇంత వరకూ కమలం పార్టీ వాటిపై స్పందించలేదు. దీంతో అసలు రాష్ట్రంలో బీజేపీ వ్యూహం ఏమిటి? రాష్ట్రంలో సొంతంగా అధికారం చేపట్టే అవకాశం లేకుంటే.. ఏదో ఒక పొత్తు కుదుర్చుకుని అధికారంలో భాగస్వామ్యం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు పొత్తుల ప్రశక్తే లేదంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చారు.  
వన్ నేషన్ వన్ ఎలక్షన్  కరెక్ట్ కాదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించడానికే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు అంటోందని విమర్శించారు. జమిలి ఎన్నికల నిర్వహణ వల్ల రాష్ట్ర ఎన్నికల ప్రాధాన్యత తగ్గిపోతుందని విమర్శించారు.   అదికారాలన్నీ కేంద్రం చేతుల్లోకే వెళ్లిపోతాయన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణ అంటే  సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడమే అవుతుందన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి అది విఘాతమేనని స్టాలిన్ పేర్కొన్నారు. జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు.   కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.   ప్రస్తుత   సమావేశాలలోనే జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించిందన్న వార్తల నేపథ్యంలో స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ నెల 20 వరకూ సాగే ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలోనే ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆమెదింప చేసుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే జమిలి ఎన్నికల నిర్వహణను ప్రజాస్వామ్యంపై దాడిగా తమిళనాడు సీఎం స్టాలిన్ అభివర్ణించారు. అన్ని రాజకీయ పార్టీలూ దీనిని ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.  కాగా   మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ  లోక్‌సభ, రాష్ట్రాల ఎన్నికలు ఒకే సారి జరపాలన్న వన్‌ నేషన్‌ - వన్‌ ఎలక్షన్‌ ప్రతిపాదనపై గతంలో నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే.  
ఆంధ్రప్రదేశ్  మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆయన సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెచ్చరిల్లడానికి కారణంగా రాష్ట్రంలో జగన్ ఐదేళ్ల పాలనే కారణమని ఆరోపించారు.   తూర్పుగోదావరి జిల్లా  దుద్దుకూరులో  నిర్వహించిన  ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర లో ఆమె జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు.  జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు.  జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.  ప్రత్యేక హోదా కోసం మోడీ కాలర్ పట్టుకుంటానని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక బీజేపీకి సాగిలపడ్డారని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, పోలవరం ప్రాజెక్టును కూడా నిర్వీర్యం చేశారని విమర్శించారు.  రాష్ట్ర ప్రజలు గత ఎన్నికలలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వైసీపీని దారుణంగా ఓడంచడంతో ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా కోసం బతిమలాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 
  రాయలసీమ ముఖద్వారం, అన్నమయ్య జిల్లా రాజకీయ కేంద్రం రాజంపేటలో ఇప్పుడు అసలైన 'రాజకీయం' మొదలైంది. ప్రత్యర్థులతో పోరాటం కంటే.. సొంత గూటిలోనే సాగుతున్న 'ఆధిపత్య పోరు' ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్ మోహన్ రాజు, జనసేన పార్లమెంట్ ఇన్చార్జి శ్రీనివాసరాజుల  మధ్య సాగుతున్న అంతర్యుద్ధం కూటమి శ్రేణులను అయోమయంలో నెట్టడమే కాకుండా, రాబోయే స్థానిక సమరానికి సవాలుగా మారింది. *ఆధిపత్య పోరు టిడిపి ఇన్చార్జి ​చమర్తి జగన్ మోహన్ రాజు గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని, కష్టకాలంలో కేడర్‌కు అండగా నిలిచిన నాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ ఇన్‌చార్జ్‌గా క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని నిర్మించుకున్న ఆయన, రాజంపేటపై తనదే పైచేయి అని భావిస్తున్నారు. మరోవైపు, మాజీ అధికారిగా పరిపాలనా అనుభవం, జనసేన వైపు నుంచి వచ్చిన మద్దతుతో యల్లటూరు  శ్రీనివాసరాజు తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యావంతుడు, మృదుస్వభావి అనే ఇమేజ్‌తో ఆయన కొత్త తరం ఓటర్లను ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్నారు. *​అసలు చిచ్చు ఎక్కడ? ​రాజంపేటలో సామాజికంగా బలంగా ఉన్న 'రాజుల' వర్గంలో అగ్రస్థానం కోసం జరుగుతున్న పోరాటమే దీనికి మూలకారణమని పరిశీలకులు భావిస్తున్నారు. *​ప్రోటోకాల్ రచ్చ:  ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా, పార్టీ వేదికలు ఏర్పాటు చేసినా 'ముందువరుస' ఎవరిది? అనే అంశంపై ఇరు వర్గాల మధ్య సోషల్ మీడియా వేదికగా యుద్ధం నడుస్తోంది. రాజంపేట జిల్లా సాధన ఉద్యమం నుంచి స్థానిక అభివృద్ధి పనుల వరకు ఏ చిన్న పని జరిగినా "అది మా నాయకుడి చలవే" అంటూ పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఈ పరిస్థితులు కూటమి క్యాడర్ పై ప్రభావం చూపుతోంది.ఒకే కూటమి  కింద ఉన్నప్పటికీ, కార్యకర్తలు "జగన్ మోహన్ రాజు వర్గం", "శ్రీనివాసరాజు వర్గం"గా విడిపోవడం భవిష్యత్తులో కూటమికి గొడ్డలిపెట్టులా మారే ప్రమాదం ఉంది. *​వైఎస్సార్‌సీపీకి 'అయాచిత' బలం! ​ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీకి ఈ అంతర్గత కలహాలు వరంగా మారాయి. ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి వంటి ఉద్ధండులను ఢీకొట్టాలంటే కూటమి ఐక్యంగా ఉండాలి. కానీ, ఇక్కడ "ఇంటి గుట్టు లంకకు చేటు" అన్న చందంగా ఒకరిని ఒకరు నష్టం పరుచుకునే  క్రమంలో ప్రత్యర్థికి అవకాశం ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. *​అధిష్టానం మౌనం..   ​ఈ ఆధిపత్య పోరుపై అటు అమరావతిలోని టీడీపీ పెద్దలకు, ఇటు జనసేన అధినాయకత్వానికి పూర్తి సమాచారం ఉంది. అయితే, ఇద్దరినీ వదులుకోలేక, అలాగని ఒకరిని వారించలేక అధిష్టానం మౌనం వహిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ మౌనం రాజంపేటలో కూటమి పునాదులను బలహీనపరుస్తోందని సీనియర్ రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాజంపేట రాజకీయ యవనికపై ఈ ఇద్దరు 'రాజుల' పోరు ఎటు దారితీస్తుందో చూడాలి. ఒకరు అనుభవాన్ని నమ్ముకుంటే, మరొకరు మారుతున్న సమీకరణాలను నమ్ముకున్నారు. ఈ ఇద్దరూ కలిసి నడిస్తే రాజంపేటలో కూటమికి తిరుగుండదు.. కానీ, నేనే రోజు..నేనే రాజు అన్న చందంగా ఎవరికి వారు సాగితే మాత్రం ఫలితం మరోలా ఉండే అవకాశం ఉంది
  ప్రజాస్వామ్యంలో అధికారులు వ్యవస్థకు వెన్నెముక వంటివారు. కానీ, స్వలాభం కోసమో, రాజకీయ విధేయత కోసమో ఆ వ్యవస్థకే తూట్లు పొడిస్తే? ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల  రహస్య బేటీలు  సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అడుగులు వేస్తుంటే, మరోవైపు తెరచాటున ఏం జరుగుతోంది? వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై  ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన  ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.   లక్షలాది మంది పోటీ పడే యూపీఎస్సీ పరీక్షల్లో నెగ్గి, అత్యున్నత శిక్షణ పొందిన ఐఏఎస్ అధికారులను మనం క్రీమ్ ఆఫ్ ది సొసైటీ  అని పిలుచుకుంటాం. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, రూపొందించే ప్రతి రూల్ వీరి కనుసన్నల్లోనే జరుగుతుంది. అయితే.. ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులు, హైదరాబాద్‌ వేదికగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ అంతర్గత సమాచారాన్ని, కాంట్రాక్టర్ల వివరాలను, పెట్టుబడుల సమాచారాన్ని ప్రత్యర్థి పార్టీలకు చేరవేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇది కేవలం క్రమశిక్షణారాహిత్యం మాత్రమే కాదు, ప్రజలు కట్టిన పన్నులతో జీతం తీసుకుంటూ ఆ ప్రజలకే చేసే విశ్వాసద్రోహం. ఈ విషయంలో ప్రభుత్వాధినేతలు ఉదాసీనంగా వ్యవహరిస్తే అది పెను ప్రమాదానికి దారి తీస్తుందని అప్పసాని రాజేష్ హెచ్చరించారు. తెలుగువన్ యూట్యూబ్ చానల్ అప్పసాని ఇచ్చిన ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఈ కింది లింక్ క్లిక్ చేసి వీక్షించండి
ALSO ON TELUGUONE N E W S
ప్రతి ఏడాది కొన్ని వందల సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మరికొన్ని మనసుకు హత్తుకుంటాయి. అలాంటి సినిమాలు చరిత్రలో పదికాలాల పాటు నిలిచిపోతాయి. కొన్ని తరాలపాటు ఆ సినిమాల గురించి మాట్లాడుకుంటారు. సినిమా పుట్టిన నాటి నుంచి ఇప్పటివరకు వివిధ భాషల్లో అనేక సినిమాలు వచ్చాయి. అలాంటి వాటిలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించిన ‘దళపతి’ ఒకటి.  మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఆణిముత్యాల్లాంటి సినిమాల్లో ‘దళపతి’ కూడా ఒకటి. అప్పటికి తమిళ, మలయాళ భాషల్లో సూపర్‌స్టార్లుగా వెలుగొందుతున్న రజినీకాంత్, మమ్ముట్టి కలిసి నటించిన ఈ సినిమా ఓ చరిత్ర సష్టించింది. దేవాగా మమ్ముట్టి, సూర్యగా రజినీకాంత్ నటించారు. వీరిద్దరి మధ్య వైరం ఎలా వచ్చింది, ఆ తర్వాత ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా ఎలా మారారు అని తెలియజెప్పే సన్నివేశాలతో కూడిన ఈ వీడియో ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.  కథలోకి వెళ్తే, రమణ అనే రౌడీ దగ్గర ఓ సామాన్యుడు అప్ప్పు చేస్తాడు. ప్రతి నెలా వడ్డీ కడుతుంటారు. బిడ్డ అనారోగ్య కారణంగా వడ్డీ కట్టలేకపోతాడు. దాన్ని అదనుగా చేసుకొని డబ్బు కట్టే వరకు నీ భార్య నా దగ్గరే ఉంటుంది అంటూ ఆమెను లాక్కెళ్లే ప్రయత్నం చేస్తాడు. చుట్టూ ఊరి జనం ఉన్నా ఎవరూ నోరు మెదపరు. ఎందుకంటే అతను దేవరాజ్ మనిషి. న్యాయం కోసం ప్రాణాలకైనా తెగించే సూర్య, ఆ అరాచకాన్ని చూస్తూ ఊరుకోడు. దేవరాజు మనిషిని చితగ్గొట్టి ఆ సామాన్యుడికి అండగా నిలబడతాడు.  సూర్య చేసిన పనికి ఆగ్రహించిన దేవరాజు తన మనుషుల్ని పంపి సూర్యను తీసుకు రమ్మంటాడు. వాళ్లు సూర్యని బెదిరించాలని ప్రయత్నిస్తారు. అప్ప్పుడు ‘నన్ను చూడాలనుకుంటే ఆ దేవరాజునే ఇక్కడికి రమ్మను’ అంటాడు సూర్య. దేవరాజు వస్తాడు. హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతున్న తన మనిషికి ఏదైనా జరిగితే సూర్య ఉండడు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు దేవరాజు.  ఇదిలా ఉంటే హాస్పిటల్‌లో రమణ చనిపోతాడు. దీంతో పోలీసులు సూర్యను అరెస్ట్ చేస్తారు. తల్లిదండ్రులు లేని అనాథ సూర్య. పోలీసులు అడిగితే తల్లిదండ్రుల పేర్లు కూడా తెలీదని చెప్తాడు. ఆ సమయంలో తనను అవమానించిన పోలీస్ ఆఫీసర్ని చితక బాదుతాడు. ఆ తర్వాత సూర్యను చిత్ర హింసలకు గురి చేస్తారు పోలీసులు. తను రమణను చంపానంటూ పోలీసులకు లొంగిపోతాడు ఓ వ్యక్తి. అతన్ని దేవరాజు పంపాడు. సూర్యను విడుదల చేస్తారు.  దేవరాజు చేసిన పనికి సూర్య ఆశ్చర్యపోతాడు. ఎందుకలా చేశావని అడుగుతాడు. నువ్వు చేసిన పనిలో న్యాయం ఉందనీ, అందుకే ఆ నిర్ణయం తీసుకున్నానని చెబుతాడు దేవరాజు. తన కోసం అంత చేసిన దేవరాజుకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని బాధపడతాడు సూర్య. అలా ఇద్దరూ స్నేహితులుగా మారిపోతారు.    ‘సూర్య నా స్నేహితుడు, నా తోడబుట్టినవాడు, నా దళపతి’ అని దేవరాజు అన్నప్పుడు ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన బంధం ప్రేక్షకులను కన్నీరు పెట్టిస్తుంది. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం కాదు, ఒక ఆశయం కోసం కలిసిన రెండు అగ్ని పర్వతాల సంగమం.‘దళపతి’ సినిమాలోని ఈ సన్నివేశం నేటికీ మనలో స్ఫూర్తిని నింపుతుంది. న్యాయం కోసం ఎవరూ లేని అనాధ అయినా సరే, ధైర్యంగా నిలబడితే ప్రపంచమే అతడి వెనుక నడుస్తుందని సూర్య పాత్ర నిరూపించింది. స్నేహం, త్యాగం, మరియు సామాన్యుడి పట్ల బాధ్యత కలిసిన ఈ వీడియోను వీక్షించండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'  సెన్సార్ టాక్ ఎలా ఉంది? 'గబ్బర్ సింగ్'లా మరో బ్లాక్ బస్టర్ అవుతుందా? తెలుగునాట 'ధురంధర్-2'కి షాక్ ఇస్తుందా? గతేడాది 'ఓజీ'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), ఈ ఏడాది 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh)తో మరోసారి తన బాక్సాఫీస్ పవర్ చూపించాలి అనుకుంటున్నారు. 'గబ్బర్ సింగ్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఎటువంటి కట్స్ లేకుండా సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. మూవీ రన్ టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా లాక్ చేసినట్లు సమాచారం. 'ఉస్తాద్ భగత్ సింగ్'కి సెన్సార్ నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా దర్శకుడు హరీష్ శంకర్ మలిచాడట. మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యేలా ఒక మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా రూపొందించారట. ఈ సినిమాను మొదట మార్చి 26న విడుదల చేయాలి అనుకున్నారు. లాంగ్ వీకెండ్, హాలిడేస్ ని దృష్టిలో పెట్టుకొని మార్చి 19 కి ప్రీ పోన్ చేశారు. అదే రోజు 'ధురంధర్-2' పాన్ ఇండియా వైడ్ గా విడుదలవుతున్నప్పటికీ.. పవర్ స్టార్ స్టార్డమ్, కంటెంట్ మీద నమ్మకంతో అదే రోజు ఉస్తాద్ కూడా బరిలోకి దిగుతుండటం విశేషం. 'ఉస్తాద్ భగత్ సింగ్' టీం ప్రమోషన్స్ లో జోరు పెంచింది. తాజాగా థర్డ్ సింగిల్ 'కాలరే ఎత్తరా' ప్రోమోను విడుదల చేసింది. ఫుల్ సాంగ్ మార్చి 12 విడుదల కానుంది. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేయడంతో పాటు, భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  
  -ఇటీవల బెంగుళూరు వెళ్లిన ఎన్టీఆర్  -స్పీచ్ వైరల్  -అనసూయ చెప్పేది ఏంటి! సినీ సర్కిల్స్ ఏంటి.. చాయ్,కాఫీల అడ్డా ఏంటి..సోషల్ మీడియా ఏంటి. ఇలా అన్ని చోట్ల  మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)నామస్మరణ లేని రోజంటూ ఉండదు. రెండున్నర దశాబ్దాల ఎన్టీఆర్ సినీ జర్నీకి, హిస్టరీ కి దక్కిన గౌరవం అది. రీసెంట్ గా ఎన్టీఆర్  బెంగళూరులో జరిగిన 'కిమ్స్' హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఎక్కడ అడుగుపెట్టినా అభిమాన, జన సందోహంతో సంచలనం నమోదు అవుతుంది కాబట్టి  కిమ్స్ ప్రాంగణం కూడా ఆ అదృష్ట వాతావరణానికి వేదిక అయ్యింది. దీంతో  ఆ లోకెట్  లో లేని ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అనుభూతి. ఇక ఆ సభలో ఎన్టీఆర్  మహిళా గౌరవం గురించి మాట్లాడాడు. ఆ మాటలపై ప్రముఖ నటి అనసూయ స్పందన ఎలా ఉందో చూద్దాం. ఎన్టీఆర్  కిమ్స్ హాస్పిటల్ ని సందర్శించిన ఆదివారం రోజు మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతు 'ఆడవాళ్లని  గౌరవించే పద్ధతిలో తాను తన పిల్లలని  పెంచుతున్నాను. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలో నిరంతరం చర్చిస్తాను. తండ్రి ప్రవర్తనని చూసే పిల్లలు నేర్చుకుంటారని ఎన్టీఆర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ మాటలపై సోషల్ మీడియా వేదికగా అనసూయ స్పందిస్తు 'ఒక పెద్ద హీరో అయి ఉండి పిల్లల పెంపకం మరియు మహిళల గౌరవం గురించి చాలా బాధ్యతగా మాట్లాడటం నిజంగా అభినందనీయమని కొనియాడారు. ఇక ఎన్టీఆర్ అండ్ ఫ్యాన్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు ఒక్కసారిగా "సీఎం సీఎం" అంటూ నినాదాలతో హోరెత్తించారు. అయితే, ఎన్టీఆర్ ఈ సందర్భాన్ని చాలా హుందాగా ఎదుర్కొన్నారు. 2009 ఎన్నికల ప్రచార సమయంలో తనకు జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ ఘటన తనకు ఎన్నో విషయాలు నేర్పించిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన  భావోద్వేగానికి లోనయ్యారు. సందర్భం లేకుండా ఇలాంటి నినాదాలు చేసి వివాదాలను సృష్టించవద్దని కూడా అభిమానులకి సున్నితంగా హితవు పలికారు. ఇక ఎన్టీఆర్ లుక్ చూసిన తర్వాత  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న 'డ్రాగన్' సినిమా గెటప్పేనని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.   aslo read: Balakrishna: బాలకృష్ణ పై తారకరత్న వైఫ్ అలేఖ్య వ్యాఖ్యలు వైరల్  ప్రస్తుతం డ్రాగన్ కోసం రామోజీ ఫిలిం సిటీలో మూడు భారీ సెట్లు వేశారని, అక్కడ 40 రోజుల పాటు సుదీర్ఘమైన షూటింగ్ జరగనుందనే  వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాంతార సృష్టికర్త  రిషబ్ శెట్టి(Rishab Shetty)సైతం మాట్లాడుతు డ్రాగన్  బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులని  సృష్టించబోతోందని వెల్లడి చేసాడు. మరిన్ని ఆసక్తికరమైన సినీ విశేషాలు మరియు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం మా తెలుగు వన్ సినిమా(Telugu One Cinema)యూట్యూబ్ ఛానల్‌ని ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఎవరు ఇవ్వని లేటెస్ట్  సినీ అప్ డేట్స్ మా సొంతం.  కింద ఉన్న పూర్తి వీడియో కూడా చూసి లైక్ కొట్టడం మార్చుపోకండి.       
మనిషికి ఆశ ఉండొచ్చు కానీ, దురాశ ఉండకూడదు. నేటి కాలంలో ధన వ్యామోహంలో పడి మనిషి తన నైతిక విలువలను మర్చిపోతున్నాడు. కొందరు అధికారాన్ని అడ్డు పెట్టుకొని అవినీతి సొమ్ముతో కోట్లకు కోట్లు కూడబెడుతుంటారు. అయితే ఆ అవినీతి సంపాదన కన్న బిడ్డల గౌరవాన్ని ఎలా బలి తీసుకుంటుందో, సమాజంలో వారిని తలెత్తుకోకుండా ఎలా చేస్తుందో? అనేది ఆలోచించరు. ఆర్.పి. పట్నాయక్ ప్రధాన పాత్ర పోషిస్తూ, దర్శకత్వం వహించిన 'బ్రోకర్'(Broker) సినిమాలోని ఈ పవర్ ఫుల్ సీక్వెన్స్ మన కళ్ళ ముందు ఉన్న చేదు నిజాన్ని ఆవిష్కరిస్తుంది. అవినీతి కోరల్లో అధికారం ధర్మతేజ(శ్రీహరి) అనే ఒక శక్తివంతమైన అధికారి తన పదవిని అడ్డం పెట్టుకుని అక్రమంగా కోట్లు గడిస్తాడు. ఒక చిన్న సెటిల్‌మెంట్‌లో ఏకంగా ఐదు కోట్ల రూపాయల బేరం మాట్లాడటం అతని స్థాయిని చూపిస్తుంది. ఏసీబీ అధికారులు అతని నివాసంలో సోదాలు చేసినప్పుడు, కొన్ని వందల కోట్ల ఆస్తి బయటపడుతుంది. కానీ, పట్టుబడిన తర్వాత కూడా అతనిలో పశ్చాత్తాపం లేదు. ఏసీబీ అధికారులు పట్టుకెళ్లిన పెన్ డ్రైవ్ లో బినామీల వివరాలు ఉన్నాయని, దానిని ఎలాగైనా తీసుకురావాలని బ్రోకర్ గణపతి(ఆర్.పి. పట్నాయక్)తో చెబుతాడు. "రాజ్యాంగాన్నే మార్చాం, రికార్డులను మార్చలేమా?" అంటూ గణపతి ఓ ఏసీబీ అధికారితో రెండు కోట్ల డీల్ సెట్ చేయడం వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతుంది.   వ్యవస్థను మేనేజ్ చేసే వైనం తనపై వచ్చిన సస్పెన్షన్‌ను ఎత్తేయడానికి ధర్మతేజ రాజకీయ పలుకుబడిని ఉపయోగించడం, అధికారులకు భారీగా లంచాలు ఆశ చూపడం వంటివి ఈ కథనంలో కనిపిస్తాయి. ఉన్నతాధికారుల భార్యలకు లక్షల విలువైన బహుమతులు కొనిచ్చి, వారి ద్వారా ఫైళ్లను కదిలించే ప్రయత్నాలు వ్యవస్థ ఎంతగా కుళ్ళిపోయిందో స్పష్టం చేస్తున్నాయి. ఒక నగల దుకాణంలో 4.7 లక్షల రూపాయల పీస్‌ను కొనుగోలు చేస్తూ, "ఎదుటోడి సొమ్ము అంటే ఎవరికైనా లోకువే కదా" అని మాట్లాడే మాటలు వింటే అధికారం మనిషిని ఎంత గుడ్డివాడిని చేస్తుందో అర్థమవుతుంది. కన్న బిడ్డ కన్నీరు - గుండెను కలిచివేసే నిజం ఈ కథనంలో అత్యంత కీలకమైన మరియు భావోద్వేగభరితమైన ఘట్టం ధర్మతేజ కూతురు ఎదురు తిరిగే సన్నివేశం. స్కూల్లో తోటి పిల్లలు తనను "లంచగొండి కూతురు" అని పిలుస్తుంటే, ఆ చిన్నారి పడే వేదన వర్ణనాతీతం. "మా పొట్ట నింపడం కోసం జనం పొట్ట కొట్టాలా నాన్న?" అని ప్రశ్నిస్తూ, "నేను నీకు పుట్టకుండా ఉండాల్సింది నాన్న" అని ఆ బిడ్డ అన్న మాటలు ఏ తండ్రికైనా చావు దెబ్బ వంటివి. కోట్లు సంపాదించినా, తన బిడ్డ కళ్లలో గౌరవాన్ని కోల్పోయిన ఆ తండ్రి ఇక సాధించినట్టు?   డబ్బు మనిషికి సౌకర్యాలను ఇవ్వగలదు కానీ, సమాజంలో గౌరవాన్ని, కన్నబిడ్డల ప్రేమను కొనలేదు. అవినీతి వల్ల వచ్చే సుఖం తాత్కాలికం.. కానీ అది మిగిల్చే మచ్చ, అవమానం శాశ్వతం. ప్రతి తండ్రి తన బిడ్డకు ఆదర్శంగా ఉండాలే తప్ప, ఇలాంటి తలవంపులు తెచ్చే వ్యక్తిగా మిగిలిపోకూడదు. ఈ శక్తివంతమైన సన్నివేశం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. మరిన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు, సినిమా కంటెంట్ కోసం మా తెలుగువన్(TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.  
-రీసెంట్ గా ఇంటర్వ్యూ ఇచ్చిన అలేఖ్య  -ఆమె మాట్లాడిన అంశాలేంటి  -బాలయ్య, తారకరత్న గురించి ఏం చెప్పింది నందమూరి అభిమానులని,ప్రేక్షకులని దుఃఖసాగరంలో ముంచుతు 2023 ఫిబ్రవరి 18 న నందమూరి తారకరత్న( Nandamuri Tarakarathna)హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఊహించని ఆ సంఘటనతో షాక్ అవ్వని తెలుగు వారు లేరు. అంత అనుబంధం నందమూరి కుటుంబానికి తెలుగు వాళ్ళకి మధ్య పెన వేసుకొని ఉంది. రీసెంట్ గా  తారకరత్న భార్య అలేఖ్య(Alekya) ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆమె చెప్పిన పలు మాటలతో బాలకృష్ణ, తారకరత్న మధ్య ఉన్న ఒకే సారూప్యం మరో సారి  తెలియచేసినట్లయింది. ఆ మాటలేంటో చూద్దాం. తారక్‌ని నేను హైదరాబాద్‌లోనే కలిశాను. ఆయన సినిమాలు చూడలేదు. నాకు ఫ్రెండ్‌గా పరిచయం అయ్యారు. ఎంత మంచి ఫ్రెండ్ అంటే నీకోసం వచ్చాడంటే అలా నిలబడిపోతాడు. ఏదైనా చేస్తాడు. ఎంత దూరం అయినా వెళ్తాడు. చిన్న పిల్లోడి మనస్తత్వం. అలాంటి క్వాలిటీ బాల బాబాయ్ (బాలకృష్ణ) లో కూడా ఉంది. నా అనుకుంటే ఎంతదూరం అయినా వెళ్తారు. ఎవర్నైనా వరసలు పెట్టి పిలించేంతగా కలిపేసుకుంటారని చెప్పింది. also read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై సుస్మిత వ్యాఖ్యలు వైరల్.. భయపెట్టాడనేది నిజం ఇప్పుడు ఈ మాటలతో బాలకృష్ణ(Balakrishna)తారకరత్న మధ్య ఉన్న అనుబంధాన్ని అభిమానులు మరో సారి గుర్తు చేసుకుంటున్నారు. తారకరత్నని సినీ ఇండస్ట్రీకి తీసుకొచ్చింది బాలకృష్ణనే. ఆ ఇద్దరికి సంబంధించి సోషల్ మీడియాలో కనపడే  ఎన్నో పిక్స్ ఆ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియచేస్తుంది. తారకరత్న కి కూడా బాలకృష్ణ అంటే ఎంతో ప్రాణం.   
ఒకేరోజు విడుదలైన భార్యాభర్తల సినిమాలు శరత్‌కుమార్ పై రాధిక పైచేయి  బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న 'తాయ్‌ కిళవి' 10 రోజుల్లోనే 50 కోట్లు కొన్ని బాక్సాఫీస్ క్లాష్ లు ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తలు ఢీ అంటే ఢీ అన్నట్టుగా బాక్సాఫీస్ బరిలో దిగడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఇటీవల తమిళనాట అలాంటి అరుదైన క్లాష్ జరిగింది. భార్యాభర్తలు బాక్సాఫీస్ వార్ కి దిగారు. ఈ పోరులో భార్య పైచేయి సాధించడం విశేషం. ఆర్. శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'ఆళి'(Aazhi), రాధికా శరత్‌కుమార్ ప్రధాన పాత్ర పోషించిన 'తాయ్‌ కిళవి'(Thaai Kizhavi) ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఫిబ్రవరి 27న ఈ రెండు సినిమాలు థియేటర్లలో అడుగుపెట్టాయి. 'ఆళి' పెద్దగా ప్రభావం చూపించడం లేదు కానీ.. 'తాయ్‌ కిళవి' మాత్రం భారీ వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది.  థియేటర్లలో భారీ సినిమాలు మాత్రమే చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతారు. చిన్న సినిమాలు, అందునా ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ చూడరనే అభిప్రాయముంది. దానిని పటాపంచలు చేసింది 'తాయ్‌ కిళవి'. కంటెంట్ ఉంటే కాసులు కురుస్తాయని మరోసారి నిరూపించింది. కథ ఏంటంటే.. పవునుత్తాయి(రాధిక) అనే ఒక వృద్ధురాలు వడ్డీ వ్యాపారం చేస్తూ ఊళ్ళో దర్జాగా జీవిస్తూ ఉంటుంది. అయితే అకస్మాత్తుగా పక్షవాతంతో మంచాన పడుతుంది. ఆమె చనిపోతే ఆస్తి పంచుకోవచ్చని కొడుకులు మొదట భావిస్తారు. కానీ, ఆమె దగ్గర బంగారు నిధి ఉందనే విషయం వారికి తెలుస్తుంది. ఆ బంగారం ఎక్కడ దాచిందో తెలుసుకోవడం కోసం, ఆమెను బతికించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెడతారు. అసలు ఆ బంగారం రహస్యం ఏంటి? స్వార్థపరులైన కొడుకులు తమ తప్పు తెలుసుకున్నారా? పవునుత్తాయి తన కుటుంబానికి, ఊరి మహిళలకు ఏం చెప్పాలనుకుంది? అనేదే మిగతా కథ. కథ చిన్నదే అయినప్పటికీ.. రూరల్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ, ఎమోషన్స్ తో కథను నడిపించిన తీరు ఆకట్టుకుంది. కుటుంబ బాంధవ్యాల విలువను తెలియజేయడంతో పాటు, మహిళకు మంచి సందేశాన్ని ఇచ్చింది ఈ చిత్రం. ప్రస్తుతం తమిళ బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాలు లేకపోవడం, ఈ సినిమాకి పాజిటివ్ టాక్ టాక్ రావడంతో 'తాయ్‌ కిళవి' భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం పది రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇతర భాషల్లోనూ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదే జోరు కొనసాగితే ఫుల్ రన్ లో రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యం లేదు.  కాగా, ఈ చిత్రానికి శివకుమార్‌ మురుగేశన్‌ దర్శకత్వం వహించగా, ప్రముఖ హీరో శివ కార్తికేయన్‌ నిర్మించడం విశేషం. Also Read: మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ 'పోచమ్మ'.. మరో కాంతార అవుతుందా?
    -మన శంకర వరప్రసాద్ గారు తో జోష్ లో ఉన్న సుస్మిత ' -మెగా డాటర్ నుంచి మెగా ప్రొడ్యూసర్  -పవన్ కళ్యాణ్ గురించి స్పీచ్  సుస్మిత కొణిదెల(Sushmita Konidela).. ఇప్పుడు ఓన్లీ సుస్మిత కొణిదెల కాదు మెగా ప్రొడ్యూసర్ . మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)డాటర్ గా ఎంట్రీ ఇచ్చి, తండ్రి టోటల్ సినీ కెరీర్ కే 'మన శంకర వరప్రసాద్ గారు' తో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చే స్థాయికి ఎదిగింది. కలెక్షన్స్ పరంగా కూడా మొట్టమొదటి తెలుగు ప్రాంతీయ సినిమా. దీన్నిబట్టి చిరంజీవి నే సుస్మిత కి గౌరవం ఇవ్వాల్సిన సినీ పరిస్థితి. మరి ఇంత అదృష్టం ఎవరికి వస్తుంది చెప్పండి. అభిమానుల ఆనందం అయితే అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ తో కూడా సినిమాలు చేయమనే డిమాండ్ పురుడు పోసుకొని చాలా రోజులే అవుతుంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గురించి సుస్మిత మాట్లాడిన మాటలు వాళ్ళ జోష్ ని మరింత తీసుకొస్తున్నాయి. మరి అవేంటో చూద్దాం. సుస్మిత రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు నా చిన్నప్పటి నుంచి నాతో పాటు మా ఇంట్లో ఉండే పిల్లలందరితో బాబాయ్ చాలా సరదాగా గడిపే వారు. నా వరకు ఆయన కేవలం బాబాయ్ మాత్రమే కాదు, ఒక బ్రదర్‌. సినిమాలంటే ఆసక్తి కలిగేలా చేసింది  కూడా  బాబాయ్ నే. నాతో పాటు రామ్‌చ‌ర‌ణ్‌(Ram Charan)మిగతా  పిల్లలందర్నీ కూర్చోబెట్టి హర్రర్ కథలు చెప్పేవారు. నాకు హర్రర్ కథలంటే చాలా ఇష్టం ఉండటంతో శ్రద్దగా వినేదాన్ని. కానీ మిగతా పిల్లలు భయపడి మధ్యలోనే వెళ్లిపోయేవారు. బాబాయ్ దగ్గర  ది గాడ్ ఫాద‌ర్, స్టార్ వార్స్ లాంటి సినిమాల క్యాసెట్స్ ఉండేవి. అసలు హాలీవుడ్ సినిమాలని పరిచయం చేసింది బాబాయినే. ఇంగ్లీష్ మ్యూజిక్ కూడా ఆయనే మాకు వినిపించేవారు. అలాకొత్త ప్రపంచాన్ని చూపించారు.   also read: ప్రేమికులు పిచ్చి పిచ్చిగా పాడుకుంటున్న పాట.. 316 మిలియన్ల వ్యూస్  బాబాయ్ ఏ డ్రెస్ వేసుకున్నా అది వెంటనే ట్రెండ్ అవుతుంది. ఆయన స్టైల్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆధ్యాత్మికత, తాత్వికత పాళ్ళు  చాలా ఎక్కువ. . ఆ విషయాలు మమ్మల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తాయని సుస్మిత చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ మాటలు అభిమానులని అలరిస్తున్నాయి. పవన్ తో సినిమా చెయ్యాలనే డిమాండ్ ఇంకా పెరిగింది.     
మనం నివసించే ఇల్లు కేవలం ఇటుకలు, సిమెంట్లతో కట్టిన కట్టడం మాత్రమే కాదు. అది మన తండ్రి రక్తమాంసాలతో కట్టుకున్న ఒక దేవాలయం. ఆ ఇంటి ప్రతి మూలలో మన చిన్ననాటి జ్ఞాపకాలు, మన నాన్న పడిన కష్టం దాగి ఉంటాయి. అటువంటి ఇంటిని పరాయివారి పాలు కాకుండా దక్కించుకోవడం కోసం ఒక మనిషి 20 ఏళ్ల పాటు తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడితే ఎలా ఉంటుంది? పద్మనాభం కథ సరిగ్గా ఇదే. జగపతిబాబు, రమ్యకష్ణ, రవితేజ తదితరులు ముఖ్యపాత్రల్లో ఎస్.వి.కష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బడ్జెట్ పద్మనాభం’ చిత్రంలోని సన్నివేశాల సమాహారమిది.  పద్మనాభం తన తండ్రి కట్టిన ఇంటిని తిరిగి దక్కించుకోవడానికి ప్రతి రూపాయిని ప్రాణంలా దాచుకున్నాడు. ఆ ఆశయం కోసం అతను తన వ్యక్తిగత సరదాలను, ఆశలను చంపుకున్నాడు. ఎంతటి కటిక పేదరికాన్ని అనుభవించాడంటే, దేవుడికి వెలిగించాల్సిన అగరబత్తులను కూడా ముక్కలు చేసి వెలిగించి పొదుపు చేశాడు. 20 ఏళ్ల కష్టం తర్వాత, బ్యాంకు నుండి డబ్బు డ్రా చేసి, తన భార్య రమ్యతో కలిసి ఆ ఇంట్లోకి మొదటి అడుగు వేయాలని కలలు కన్నాడు. కానీ విధి మరోలా తలచింది. సరిగ్గా ఇంటిని స్వాధీనం చేసుకోవాల్సిన ఆఖరి నిమిషంలో, స్కూటర్‌లో పెట్టిన డబ్బు మాయమైపోయింది. ఆ క్షణం పద్మనాభం అనుభవించిన నరకం వర్ణనాతీతం. ‘దేవుడికి కూడా నా మీద కోపం వచ్చిందేమో’ అని అతను రోదించిన తీరు మన కళ్ళలో నీళ్లు తెప్పిస్తుంది. అనాధగా మిగిలిపోయానని, తన ప్రేమ కూడా ఓడిపోయిందని అతను కుమిలిపోయాడు. అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ డబ్బుని దొంగిలించింది మరెవరో కాదు, అతని భార్య రమ్యనే. కానీ, పద్మనాభం ఆ ఇంట్లో ఉన్న పిల్లల ఏడుపు చూడలేక, తన కన్న కలని త్యాగం చేసి ‘మీరందరూ ఈ ఇంట్లోనే ఉండండి’ అని చెప్పినప్పుడు అతని ఉన్నతమైన వ్యక్తిత్వం బయటపడింది. పద్మనాభం ఎంతటి సున్నిత మనస్కుడో అర్థం చేసుకున్న రమ్య, తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరడం ఈ కథలో అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టం. డబ్బు కంటే మనుషులు, ఆస్తుల కంటే అనుబంధాలు గొప్పవని నిరూపించే ఈ గాథ మనందరికీ ఒక గుణపాఠం. కష్టకాలంలో కూడా ఎదుటివారి బాధను అర్థం చేసుకునే గుణం ఉన్నవాడే నిజమైన మనిషి. పద్మనాభం తన ఇంటిని దక్కించుకున్నాడా లేదా అనే దానికంటే, అతను అందరి మనసులను గెలుచుకున్నాడన్నదే ముఖ్యం. ఇంత‌టి భావోద్వేగ‌మైన వీడియోను మీకు అందిస్తున్నాం. వీక్షించండి. అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
ఆకట్టుకుంటున్న 'పోచమ్మ' టైటిల్ గ్లింప్స్ కాంతార రేంజ్ లో సౌండ్ చేస్తుందా? తెలంగాణ గ్రామ దేవతల పేర్లతో ప్రస్తుతం తెలుగులో పలు సినిమాలు, సిరీస్ లు రూపొందుతున్నాయి.  ఇప్పటికే ఎల్లమ్మ, మారెమ్మ సినిమాలు ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడదే బాటలో ఒక వెబ్ సిరీస్ రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహా నుంచి వస్తున్న వెబ్ సిరీస్ 'పోచమ్మ'(Pochamma). మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సిరీస్ కి రమేష్ ఇంద్ర దర్శకుడు. శృతి నాయుడు నిర్మిస్తున్నారు. "మీ పాపాలకు ఒక సాక్షి ఉంటుంది" అంటూ తాజాగా టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. 50 సెకన్లతో రూపొందిన 'పోచమ్మ' గ్లింప్స్ ఇంటెన్స్ గా ఉంది. ఒక ఇంటిలో ఏం జరిగింది? దానికి సాక్షిగా నిలిచిన పోచమ్మ తల్లి ఏం చేసింది? అనేలా గ్లింప్స్ సాగింది. డివోషనల్ టచ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఒక మంచి సిరీస్ చూడబోతున్నామనే ఫీలింగ్ ని కలిగించింది. ముఖ్యంగా గ్లింప్స్ లో ఎల్.వి. గణేశన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కట్టిపడేసింది.  "నువ్వు పాపాన్ని దాచవచ్చు. నిజాన్ని దాచవచ్చు. కానీ సాక్షి నోరు మూయించలేవు." అంటూ 'పోచమ్మ' సిరీస్ ఎలా ఉంటుందో మేకర్స్ తెలియజేశారు. ఈ సిరీస్ ఆహా వేదికగా ఏప్రిల్ లో స్ట్రీమింగ్ కి రానుంది. ప్రాంతీయ ఆచారాలకు తెరరూపం ఇచ్చిన కన్నడ చిత్రం 'కాంతార' జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. అదే స్ఫూర్తితో తెలుగు మేకర్స్ కూడా ఇక్కడి గ్రామ దేవతల మహిమల నేపథ్యంలో కొన్ని కథలను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. 'ఎల్లమ్మ', 'మారెమ్మ' సినిమాలు, 'పోచమ్మ' సిరీస్ కి మంచి ఆదరణ లభిస్తే.. మరికొందరు మేకర్స్ ఇదే బాటలో పయనించే అవకాశముంది. Also Read: 'ధురంధర్ 2' ట్రైలర్ రెస్పాన్స్.. నెట్ ఫ్లిక్స్ ఎందుకు తప్పుకుంది? https://x.com/ahavideoIN/status/2030961019254964486
  -యూట్యూబ్ చరిత్రలో రికార్డు  -అంతలా మెస్మరైజ్ చెయ్యడానికి రీజన్  -రికార్డు ఎంత! ప్రేమికుల హృదయంలో ఉద్భవించే ప్రేమకి, పాటకి మధ్య ఎంతో అనుబంధం ఉంది. ఆ రెండిటి మధ్య సదరు అనుబంధం ఎప్పుడు పుట్టిందో తెలియదు గాని, విడదీయరాని అనుబంధం అని చెప్పవచ్చు. ప్రేమికులు తమ ప్రియడు లేదా ప్రేయసిపై తమకున్న ప్రేమని చెప్పుకోవడానికి కూడా పాటే సాధనం. సాధనమే కాదు తమ లవ్ సక్సెస్ కి షార్ట్ కట్. ప్రేమ పాటకి ఉన్న సుదీర్ఘ ట్రాక్ రికార్డునే అందుకు ఉదాహరణ. ఎన్నో సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్ ప్రేమని తమ ముడి సరుకుగా భావించి కొన్ని వందల ప్రేమ పాటలకి జీవాన్ని ఇస్తున్నారు. అలాంటి ఒక ప్రేమ పాట యూట్యూబ్ చరిత్రలోనే రికార్డు వ్యూస్ ని కొల్లగొడుతుంది. మరి ఆ ప్రేమ పాట ఏంటో చూద్దాం. 'సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్న రాములమ్మ'.. ఈ పదం చెప్పి చెప్పగానే మేము చాలా సార్లు విన్నాం. ప్రెజెంట్ కూడా వింటున్నామనే రాములమ్మ పాట ప్రేమికులకి లెక్కే లేదు. అంతలా సదరు సాంగ్ తో ట్రావెల్ అవుతూ వస్తున్నారు. అందుకే ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ లో 316 మిలియన్ లకి  పైగా వ్యూస్ సొంతం చేసుకొని సరికొత్త రికార్డు సృషించింది. ఆ వ్యూస్ అంతటితో ఆగదని తెలుసు. మరో కొత్త రికార్డు కూడా రావడం ఖాయం. పైగా ఒక సినిమా పాటగా కాకుండా ప్రవైట్ ఆల్బమ్ గా రిలీజ్ అయ్యి రికార్డుల వేట కొనసాగిస్తుండటం  మాములు విషయం కాదు. అన్నట్టు ఈ సాంగ్ ని సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మజాకా మూవీలో కూడా ఉపయోగించుకున్నారు. ఈ సాంగ్ కూడా 3 .8 మిలియన్స్ వ్యూస్ ని సాధించడం విశేషం. aslo read: Gaddar Awards: గద్దర్ అవార్డ్స్ పై ఆర్ నారాయణమూర్తి కామెంట్స్.. ఆ వ్యాఖ్యలు సరైనవేనా!  కల్లాకపటం లేని ఒక యువకుడు తన హృదయంలో తన ప్రియురాలుకి ఇచ్చిన స్థానమే   రాములమ్మ సాంగ్ కాన్సెప్ట్. రచించింది, ఆలపించింది రాము రాథోడ్. సాంగ్  లో పెర్ ఫార్మ్  చేసింది కూడా తనే. దివ్య భగత్ సదరు రాములమ్మ గా చేయగా, కళ్యాణ్ కీస్ మ్యూజిక్ ని అందించడం జరిగింది.   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవగానే దిండు మీద రాలిన జుట్టును చూసినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. జుట్టు అనేది కేవలం మన శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసానికి మరియు మన వ్యక్తిత్వానికి ప్రతీక. ఆడవారికైనా, మగవారికైనా ఒత్తైన కురులు ఉండాలని కోరుకోవడం సహజం. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో జుట్టు రాలడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. అసలు జుట్టు ఎందుకు రాలుతుంది? దీనికి పరిష్కారాలు ఏమిటి? డాక్టర్ల అభిప్రాయం ప్రకారం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను Expert Dermatologist Dr. Sunaina Shaik (MD, DNB Dermatology, FRGUHS Trichology) విషయాలు Video Link క్లిక్ చేసి తెలుసుకోండి.  మనం జుట్టుపై ఎందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి? (Why Should We?) జుట్టు రాలడం అనేది కేవలం పైకి కనిపించే సమస్య మాత్రమే కాదు, అది మన శరీరంలో ఉన్న అంతర్గత మార్పులకు లేదా ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. • ఆత్మవిశ్వాసం: ఒత్తైన జుట్టు మన అందాన్ని పెంచడమే కాకుండా మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. • ఆరోగ్య సూచిక: జుట్టు అధికంగా రాలుతుంటే అది మన శరీరంలో పోషకాహార లోపం (Vitamin D, Iron, Zinc) లేదా థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నాయని సూచిస్తుంది. • ముందస్తు జాగ్రత్త: ప్రారంభంలోనే జుట్టు రాలడాన్ని గమనించి తగిన చర్యలు తీసుకుంటే, భవిష్యత్తులో జుట్టు పల్చబడకుండా (Hair Thinning) చూసుకోవచ్చు. ఏం చేయకూడదు? (What Not To Do) తెలిసో తెలియకో మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు జుట్టు విపరీతంగా రాలడానికి కారణమవుతాయి. వాటిని వెంటనే ఆపండి: 1. బిగుతైన హెయిర్ స్టైల్స్ (Tight Hairstyles): జుట్టును గట్టిగా లాగి ముడి వేయడం లేదా పోనీటైల్స్ వేయడం వల్ల 'ట్రాక్షన్ అలోపేషియా' (Traction Alopecia) వచ్చి నుదురు భాగంలో జుట్టు రాలిపోతుంది. 2. టైట్ హెల్మెట్లు వాడటం: మగవారిలో టైట్ హెల్మెట్లు వాడటం వల్ల కలిగే ఘర్షణ (Friction) జుట్టు షాఫ్ట్ బలహీనపడి విరిగిపోవడానికి కారణమవుతుంది. 3. ఇతరుల వస్తువులు వాడటం: ఒకరు వాడిన హెల్మెట్ లేదా దువ్వెన మరొకరు వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం ఉంది. 4. జంక్ ఫుడ్‌పై ఆధారపడటం: సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల జుట్టుకు అందాల్సిన ప్రోటీన్ అందదు. జుట్టును ఎలా సంరక్షించుకోవాలి? (How To) జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే కేవలం పైన రాసే నూనెలు, సీరమ్స్ మాత్రమే కాదు, లోపలి నుండి పోషణ అవసరం. • సరైన డైట్ (High Protein Diet): జుట్టు అనేది కెరాటిన్ అనే ప్రోటీన్‌తో తయారవుతుంది. కాబట్టి మీ బరువులో ప్రతి కిలోగ్రాముకు 1 గ్రాము ప్రోటీన్ అవసరం (ఉదాహరణకు 60 కేజీల బరువు ఉంటే 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి). మీ ఆహారంలో పన్నీర్, సోయా, చికెన్, చేపలు మరియు గుడ్లు ఉండేలా చూసుకోండి. • గింజలు మరియు విత్తనాలు (Nuts & Seeds): ప్రతిరోజూ గుప్పెడు నట్స్, గుమ్మడి గింజలు (Pumpkin Seeds), పొద్దుతిరుగుడు గింజలు (Sunflower Seeds) మరియు నువ్వులు తీసుకోవడం జుట్టుకు చాలా మేలు చేస్తుంది. • ఒత్తిడి తగ్గించుకోండి: అధిక ఒత్తిడి వల్ల జుట్టు రాలడం పెరుగుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి. • స్కాల్ప్ పరిశుభ్రత: చెమట పట్టినప్పుడు జుట్టును తరచుగా వాష్ చేయడం మరియు హెల్మెట్ లోపల ఉండే ప్యాడింగ్‌ను శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. తరచుగా అడిగే ప్రశ్నలు (Q&A) ప్ర: రోజుకు ఎన్ని వెంట్రుకలు రాలడం సహజం?  జ: సాధారణంగా రోజుకు 100 వెంట్రుకల వరకు రాలడం సహజమే. అయితే మీ జుట్టు పల్చగా ఉంటే, 50 వెంట్రుకలు రాలినా అది సమస్యగానే పరిగణించాలి. ప్ర: హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు ఊడిపోతుందా?  జ: కేవలం హెల్మెట్ వల్ల జుట్టు ఊడదు. కానీ టైట్ హెల్మెట్ వల్ల కలిగే ఘర్షణ మరియు చెమట వల్ల ఇన్ఫెక్షన్లు ఉంటే జుట్టు రాలవచ్చు. ప్ర: జుట్టు రాలడం మొదలైన వెంటనే చికిత్స తీసుకోవాలా?  జ: సాధారణంగా ఏదైనా స్ట్రెస్ లేదా అనారోగ్యం (జ్వరం వంటివి) వచ్చిన మూడు నెలల తర్వాత జుట్టు రాలడం మొదలవుతుంది. అది ఆరు నెలల వరకు ఉంటే పర్వాలేదు కానీ, ఏడాది కంటే ఎక్కువ కాలం విపరీతంగా రాలుతుంటే తప్పనిసరిగా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. జుట్టు సంరక్షణ అనేది ఒక ప్రయాణం. మనం తీసుకునే ఆహారం, మన జీవనశైలి మరియు మనం చేసే చిన్న చిన్న మార్పులే మన జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ, మీ జుట్టును ప్రేమించండి. మీకు మరిన్ని ఆరోగ్య చిట్కాలు మరియు నిపుణుల సలహాలు కావాలా? అయితే ఆలస్యం చేయకుండా ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ను క్లిక్ చేయండి (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ప్రపంచ దేశాలలో చాలా ఆనందంగా ఉండే ప్రజలుగా జపనీయులను చెబుతారు.  వారు ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తారు.  వారి ఆరోగ్యం,  వారి సంతోషం వారి ముఖంలోనూ, వారి శరీరాకృతిలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. జపనీయులు ఎప్పుడూ  ఆహ్లాదకరమైన చిరునవ్వుతో,  చాలా ఫిట్‌గా కనిపిస్తారని సోషల్ మీడియా నుండి ఎన్నో వార్తల వరకు ప్రతి ఒక్కచోట కనిపిస్తూ ఉంటుంది.. దీనికి ప్రధాన కారణం వారి జీవనశైలి, ముఖ్యంగా వారి ఆహారం. ఆధునిక కాలంలో ఊబకాయం అత్యంత తీవ్రమైన వ్యాధులలో ఒకటిగా పరిగణించబడుతున్నప్పటికీ, జపాన్‌లో ఊబకాయం రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ప్రపంచ మొత్తం మీద  ఆరోగ్యం విషయానికి వస్తే, జపనీయులు ప్రపంచంలో నాల్గవ లేదా ఐదవ స్థానంలో ఉన్నారు. జపనీయులు తమ రోజును చాలా సరళంగా ఉంటూనే శరీరానికి బాగా పోషకాలు  ఇచ్చే ఆహారంతో మొదలుపెడతారని చెబుతారు.  వారి అల్పాహారం తేలికగా అనిపించవచ్చు, కానీ అది పోషకాలతో నిండి ఉంటుందట. ఫిట్నెస్ రహస్యం.. జపనీయుల మాదిరిగా ఫిట్‌గా ఉండటం చాలా సులభం. వారి దినచర్యలను ఖచ్చితంగా పాటిస్తే ఇది సాధ్యమేనని అంటున్నారు ఆరోగ్య నిపుణులు,  వైద్యులు. ఇలా ఆచరిస్తే ఆ ఫలితాలను  అనుభవపూర్వకంగా తెలుసుకుంటారని అంటారు. చిన్న ప్లేట్ లో ఆహారం.. మనం ఆహరం తినే సమయంలో, మన ప్లేట్ పరిమాణం మన ఆరోగ్యానికి నేరుగా సంబందం ఉంటుందట. పెద్ద ప్లేట్లు పెట్టుకుంటే అది అతిగా తినడానికి దారి తీస్తుందట.  ఇది అనారోగ్యకరమైనికి కారణమవుతుందట. ఫిట్‌గా ఉండటానికి  జపనీస్ లాగా చిన్న ప్లేట్‌లలో తినే అలవాటును అలవర్చుకోవాలట. ఇది అతిగా తినడాన్ని తగ్గిస్తుంది,  ఫిట్‌గా ఉండటానికి సహాయపడుతుంది. సీజనల్ ఫుడ్స్.. ఎక్కువ కాలం ఫిట్‌గా ఉండాలనుకుంటే,  ఆహారంలో సీజనల్ పండ్లు,  కూరగాయలను చేర్చుకోవాలని అంటారు. జపనీయులు తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి సీజనల్ ఆహారాలను తింటారు.  శీతాకాలంలో  వేడెక్కే ప్రభావాన్ని కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. దీని కోసం,  ఎండిన పండ్లు, నువ్వులు, బెల్లం, ఖర్జూరం,  ఆకుపచ్చ కూరగాయలను తీసుకోవచ్చు. వేసవిలో శరీరాన్ని చల్లబరిచే ఆహారాలైన పండ్లు,  పానీయాలు, ఎక్కువగా నీరు వంటివి తీసుకోవాలి. ఆహారం మోతాదు.. మనకు ఇష్టమైన ఆహారం దొరికినప్పుడు ఆకలి తీరిన తర్వాత కూడా  ఇంకా తింటూనే ఉంటారు. దీనివల్ల కడుపు సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. జపనీయులు ఇలా చేయరు. వారికి  ఆహారం ఎంత నచ్చినా, వారి ఆకలి తీరే వరకు మాత్రమే తింటారు. ఈ అలవాటు వారి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతోందట. నిద్ర.. దీర్ఘకాలిక ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా అవసరం, ఎందుకంటే తగినంత నిద్ర లేకపోవడం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది,  జ్ఞాపకశక్తిని  ప్రభావితం చేస్తుంది. ఈ సమస్యలను నివారించడానికి, ప్రతిరోజూ 7 నుండి 8 గంటలు నిద్రపోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. జపనీస్ ప్రజలు తమ నిద్ర గురించి చాలా శ్రద్దగా ఉంటారు. తినే విధానం.. ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే సరిపోదు;  తినే విధానం కూడా ముఖ్యం. మనలో చాలామంది తొందరపడి తింటారు.   సరిగ్గా నమలడం మర్చిపోతారు, ఇది తీవ్రమైన హానిని కలిగిస్తుంది. , జపనీయులు ఆహారం తీసుకునేటప్పుడు నెమ్మదిగా ఆహారాన్ని బాగా నమిలి తింటారట. ఫైనల్ గా..  శరీరాన్ని దీర్ఘకాలికంగా ఫిట్‌గా ఉంచుకోవాలనుకుంటే,  ఈ జపనీస్ ఫిట్‌నెస్ దినచర్యను పూర్తిగా అనుసరించాలి. ఎటువంటి రాజీలు ఉండకూడదు. అప్పుడే ఫిట్ గా మారతారు.                                      *రూపశ్రీ.
1979- శశిబాల ఒక అందమైన 20 ఏళ్ల యువతి. దిల్లీలోని ప్రఖ్యత లక్ష్మీబాయ్‌ కాలేజి నుంచి డిగ్రీని కూడా సాధించింది. శశిబాలకు పది నెలల క్రితమే పెళ్లయింది. ఇప్పుడు తను ఆర్నెళ్ల గర్భవతి కూడా! బయట నుంచి చూసేవారికి ఇదంతా ఓ అందమైన జీవితం తాలూకు వర్ణనగా తోచవచ్చు. కానీ శశిబాల వ్యక్తిగత జీవితం ఆ చిత్రానికి తలకిందులుగా కనిపిస్తుంది. పెళ్లయిన దగ్గర్నుంచి శశిబాల అత్తమామలు కట్నం కింద ఏదోఒక వస్తువుని తీసుకురమ్మంటూ గొడవచేస్తూనే ఉన్నారు. శశిబాల తన తల్లి సత్యరాణి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించిన ప్రతిసారీ, తల్లీకూతుళ్లు వారి కోరికను ఎలా తీర్చాలా అని మదన పడుతూనే ఉన్నారు. సత్యరాణి వితంతువు, పైగా శశిబాలతో పాటు ఆమె మీద మరికొందరి బిడ్డల భారం కూడా ఉంది. ఇలాంటి సమయంలో ఓ రోజు సత్యరాణికి, శశిబాల అత్తగారింటి నుంచి వెంటనే రమ్మంటూ కబురు వచ్చింది.     పరుగుపరుగున వెళ్లిన ఆమెకు తన బంగారు కూతురు నల్లటి ముద్దగా ఓ మూల కనిపించింది. ‘నీ కూతురు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఆ చెత్తని ఇక్కడి నుంచి పట్టుకుపో!’ అన్నారు శశిబాల అత్తగారు. కూతురి శవాన్ని కప్పేందుకు వాళ్లు ఒక దుప్పటిని అందించేందుకు కూడా సిద్ధపడలేదు. 1980వ దశకంలో ఇలాంటి సంఘటనలు చాలానే వినిపించేవి. కిరసనాయిలు పోసుకునో, చీరకు నిప్పంటుకునో నిస్సహాయంగా ఎందరో ఆడవాళ్లు చనిపోయేవారు. అవన్నీ ప్రమాదాలో ఆత్మహత్యలో కాదనీ, వరకట్నపు హత్యలనీ తెలిసినా ఎవరూ నోరు మెదపలేని పరిస్థితి. కానీ సత్యరాణి అలా నిశ్శబ్దంగా ఊరుకోదల్చుకోలేదు.   స్కూటరు కొనిపెట్టలేదన్న కారణంగా తన అల్లుడు ఆమెను చంపేశాడంటూ కేసుని నమోదు చేసింది. అయితే అప్పట్లో చట్టాలు ఇంత కఠినంగా ఉండేవి కాదు. పెళ్లి సమయంలో అందుకున్నవే కట్నకానుకల కిందకి వస్తాయన్న నిర్వచనం ఉండేది. పైగా చావుకి సంబంధించిన ఆరోపణలను నిరూపించే బాధ్యత మృతుల తరఫు న్యాయవాదులకే ఉండేది. సత్యరాణి ఒక పక్క తన కూతురి చావుకి సంబంధించిన కేసులను పోరాడుతూనే, మరో పక్క వరకట్నపు చావులను ఎదుర్కొంటున్న ఎందరో అభాగ్యుల కోసం గొంతు విప్పడం మొదలుపెట్టింది. తమ కూతురు వరకట్నం కారణంగా చావుని ఎదుర్కొందిని భావించిన ప్రతి ఒక్కరి పోరాటానికీ ఆసరాగా నిలిచేది.       సత్యరాణి తనలాంటి దుస్థితిలో ఉన్న మరికొందరితో కలిసి శక్తిశాలిని పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. వరకట్నపు వేధింపులను ఎదుర్కొనేవారికి ఈ సంస్థ నిలువనీడను కల్పించేది. సత్యరాణికి చదువు లేదు. వయసు పైబడుతోంది. పైగా చెట్టంత కూతురిని పోగొట్టుకుంది. అయినా వరకట్నానికి వ్యతిరేకంగా తన పోరులో రవ్వంత కూడా వెనక్కి తగ్గలేదు. రానురానూ సత్యరాణి ఉద్యమం ఫలితాలనివ్వసాగింది. వరకట్న వ్యతిరేక చట్టానికి ప్రభుత్వం మరింత పెట్టాల్సి వచ్చింది. వరకట్నం అంటే కేవలం డబ్బే కాదు, వస్తువుని కోరడం కూడా వరకట్న పరిధిలోనే వస్తాయంటూ చట్టాన్ని మార్చింది కేంద్రం. పెళ్లైన ఏడేళ్ల లోపు స్త్రీ ఆత్మహత్య చేసుకున్నా కూడా, అందుకు కారణం అత్తవారింటి ఆరళ్లు కూడా కావచ్చునంటూ మరో సవరణ కూడా చేసింది.   ఒక పక్క సమాజంలో మార్పు రావడం, మరో పక్క చట్టాలకు పదునెక్కించడంతో... వరకట్న హత్యలు కొంతమేరకన్నా తగ్గాయి. ముఖ్యంగా ‘వంటగదిలో ప్రమాదాలు, ఆత్మహత్యలు’ చాలామేరకు తగ్గాయి. నేరాల తగ్గుదలను చాలామంది గమనించారు కానీ, అందుకు కారణమైన సత్యరాణి వంటి తల్లుల పోరాటాన్ని పెద్దగా గమనించింది లేదు. వరకట్న చావులను తగ్గించడంలోనే సత్యరాణి విజయం సాధించడమే కాదు, మారిన చట్టాలకు అనుగుణంగా తన అల్లుడికి శిక్షపడేలా కూడా విజయం సాధించింది. 2014లో సత్యరాణి తన 85వ ఏట ప్రశాంతంగా కన్నుమూసింది. కానీ ఆమె జీవితం ఏనాడూ వృధాగా పోలేదు. ఒక తల్లిగా తాను పొందిన గర్భశోకాం, మరో తల్లికి కలుగకుండా ఉండేందుకే అనుక్షణం పోరాడింది. ఎందరో కూతుళ్లకి న్యాయాన్ని సాధించింది. మరెందరో వధువులు వరకట్నపు కోరల్లో చిక్కుకోకుండా తన జీవితాన్ని అడ్డు వేసింది.   - నిర్జర.
మన జీవితంలో వినికిడి అనేది కేవలం ఒక ఇంద్రియ జ్ఞానం మాత్రమే కాదు, అది మన ఆత్మీయులతో మనల్ని కలిపే ఒక వారధి. వయసు మళ్లుతున్న కొద్దీ కంటి చూపు తగ్గడం సహజమని ఎలా భావిస్తామో, వినికిడి తగ్గడాన్ని కూడా అలాగే గమనించాలి. ముఖ్యంగా 50 నుండి 60 ఏళ్ల మధ్య వయసు వారికి మాటలు వినిపిస్తున్నా, అవి స్పష్టంగా అర్థం కాకపోవడం ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఇది కేవలం శారీరక సమస్యే కాదు, మనుషులతో కలవలేకపోవడం వల్ల వచ్చే మానసిక వేదన కూడా. మీ వినికిడి ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవడానికి ENT Specialist Dr. PLVN Murthy గారు చెప్పిన విషయాలను ఈ  Video Link క్లిక్ చేసి  తెలుసుకోండి. మనం ఎందుకు వినికిడి పరీక్షలు చేయించుకోవాలి? (Why Should We?) వయసు పెరిగే కొద్దీ వచ్చే వినికిడి లోపాన్ని 'ప్రెస్ బై అక్యూసిస్' (Presbycusis) అంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే కలిగే నష్టాలు ఇవే: సామాజిక దూరం (Social Withdrawal): ఎదుటివారు మాట్లాడే మాటలు అర్థం కాకపోవడం వల్ల, ఫ్యామిలీ ఫంక్షన్లలో లేదా స్నేహితులతో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్న భావన కలుగుతుంది. మానసిక ఒత్తిడి: సరిగ్గా వినిపించకపోవడం వల్ల ఎదుటివారు ఎగతాళి చేస్తారేమో అన్న భయంతో డిప్రెషన్ మరియు మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. జ్ఞాపకశక్తి తగ్గడం: వినికిడి లోపం వల్ల మెదడు యొక్క పనితీరు (Cognitive function) మందగించే ప్రమాదం ఉంటుంది. ఆరోగ్య పర్యవేక్షణ: ముఖ్యంగా డయాబెటిస్ (చక్కెర వ్యాధి), బీపీ (రక్తపోటు) ఉన్నవారిలో వినికిడి నరాలు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు రెగ్యులర్ గా పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. ఏమి చేయకూడదు? (What Not To Do) గూగుల్ వైద్యం వద్దు: వినికిడి సమస్య రాగానే గూగుల్‌లో చూసి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం లేదా మందులు వాడటం చేయకండి. ఇది చాలా సున్నితమైన అవయవం కాబట్టి నిపుణులైన ఈఎంటి (ENT) డాక్టర్ని మాత్రమే సంప్రదించాలి. లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి: "వయసు పెరిగింది కదా, వినిపించకపోవడం సహజం" అని సరిపెట్టుకోవద్దు. అధిక శబ్దాలకు దూరంగా ఉండండి: ఫ్యాక్టరీల్లో లేదా అధిక శబ్దాలు వచ్చే ప్రదేశాల్లో పని చేసే వారు తగిన రక్షణ లేకుండా ఉండకూడదు. పరీక్షలు మరియు చికిత్స - ఎలా? (How To) మీ వినికిడి స్థాయిని తెలుసుకోవడానికి డాక్టర్లు సాధారణంగా ఈ క్రింది పరీక్షలు చేస్తారు: ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ (Pure Tone Audiometry): ఇది వినికిడి లోపాన్ని గుర్తించడానికి అత్యంత కీలకమైన (Gold Standard) పరీక్ష. దీని ద్వారా ఏ ఫ్రీక్వెన్సీలో ఎంత లోపం ఉందో తెలుస్తుంది. టెంపనోమెట్రీ (Tympanometry): మధ్య చెవిలో ఏవైనా లోపాలు ఉన్నాయా లేదా నీరు చేరిందా అని తెలుసుకోవడానికి ఈ పరీక్ష చేస్తారు. ఓటో ఎకౌస్టిక్ ఎమిషన్స్ (OAE): చెవిలోని లోపలి భాగంలో ఉండే 'ఔటర్ హెయిర్ సెల్స్' పనితీరును ఇది గుర్తిస్తుంది. పరీక్షల కాలపరిమితి: 45 నుండి 50 ఏళ్ల మధ్యలో ఒకసారి బేస్‌లైన్ టెస్ట్ చేయించుకోవాలి. సాధారణంగా ప్రతి 2 నుండి 3 ఏళ్లకు ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిది. డయాబెటిస్, బీపీ లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు ప్రతి ఏటా వినికిడి పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్రశ్న: నాకు మాటలు వినిపిస్తున్నాయి కానీ అర్థం కావడం లేదు, ఎందుకు?  సమాధానం: దీనిని 'వర్డ్ డిస్క్రిమినేషన్' (Word Discrimination) సమస్య అంటారు. వయసు రీత్యా హై ఫ్రీక్వెన్సీ వినికిడి లోపం ఉన్నప్పుడు శబ్దం వినిపిస్తుంది కానీ మాటలోని స్పష్టత లోపిస్తుంది. ప్రశ్న: ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారికి కూడా వినికిడి సమస్యలు వస్తాయా?  సమాధానం: అవును, మంచి లైఫ్ స్టైల్ ఉన్నప్పటికీ వయసుతో పాటు వినికిడి నరాలు బలహీనపడటం వల్ల సమస్యలు రావచ్చు. అలాగే డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నా ఇది త్వరగా వచ్చే అవకాశం ఉంది. ప్రశ్న: ఏవైనా మందుల వల్ల వినికిడి తగ్గుతుందా?  సమాధానం: అవును, కొన్ని రకాల క్యాన్సర్ డ్రగ్స్ లేదా మరికొన్ని ఆటోటాక్సిక్ డ్రగ్స్ వాడటం వల్ల వినికిడి శక్తిపై ప్రభావం పడవచ్చు. వినికిడి లోపం అనేది కేవలం చెవికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, అది మీ జీవన ప్రమాణాన్ని ప్రభావితం చేసే అంశం. సరైన సమయంలో స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా మీ సామాజిక జీవితాన్ని, ఆనందాన్ని తిరిగి పొందవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం, అందులో వినికిడి ఆరోగ్యం అత్యంత ముఖ్యం! మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. వినికిడి లోపం అనేది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి. మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడిండి (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
• కిడ్నీలో రాళ్ళు ఉన్న • యూరిన్ ఇన్ఫెక్షన్ / యూరిన్ ప్రాబ్లెమ్స్ • కిడ్నీ డిసీజ్ & వారి కుటుంబ సభ్యులు • సహజమైన ఆయుర్వేదం / యూనానీ వైద్యం  • సర్జరీ లేకుండా కిడ్నీ స్టోన్స్ ట్రీట్‌మెంట్ ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికే అనలేదు. ఈ రోజుల్లో మనల్ని వేధిస్తున్న ఎన్నో ఆరోగ్య సమస్యలకు ప్రకృతిలోనే అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వంటి ఇబ్బందులతో బాధపడేవారికి ఒక తీపి కబురు. కేవలం ఒక పండుతో మీ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో ఈ వ్యాసంలో వివరంగా తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్ళు (Kidney Stones) & యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ వీడియోలో ప్రముఖ యూనానీ వైద్య నిపుణులు Dr. SGV Satya గారు కిడ్నీ స్టోన్స్ కి సహజమైన & శాశ్వతమైన పరిష్కారం గురించి వివరంగా చెప్తున్నారు. సర్జరీ లేకుండా కిడ్నీ రాళ్ళు కరిగించే అద్భుతమైన పండు గురించి, యూరిన్ ప్రాబ్లెమ్స్ కి యూనానీ ట్రీట్‌మెంట్ గురించి ఈ వీడియోలో తెలుసుకోండి. పైనాపిల్: మీ కిడ్నీలకు మరియు సర్వ రోగాలకు ఒక సంజీవిని పైనాపిల్ కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, వందల ఏళ్ల నాటి యునాని వైద్యంలో దీనికి విశిష్ట స్థానం ఉంది. శరీరంలోని మలినాలను తొలగించి, మిమ్మల్ని తాజాగా ఉంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మనం పైనాపిల్ ఎందుకు తీసుకోవాలి? (Why Should We?) 1. కిడ్నీ మరియు మూత్రపిండాల రక్షణ: పైనాపిల్‌లో 'డయూరిటిక్ ఎఫెక్ట్' ఉంటుంది. ఇది యూరిన్ ఫ్రీగా వచ్చేలా చేసి, కిడ్నీలో రాళ్లు (Kidney Stones) మరియు ప్రోస్టేట్ సమస్యలను నివారిస్తుంది. 2. వాపుల నివారణ (Anti-inflammatory): యునాని వైద్యంలో దీనిని 'ఇల్తహాబ్' (వాపు) తగ్గించడానికి వాడుతుంటారు. కీళ్ల నొప్పులు (Arthritis), సైనసైటిస్, గొంతు ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలకు ఇది మేలైన పరిష్కారం. 3. శరీర ప్రక్షాళన (Detoxification): శరీరంలోని హానికరమైన వ్యర్థాలను (Morbid material) బయటకు పంపడంలో పైనాపిల్‌ను మించినది లేదు. 4. మెదడు మరియు గుండె ఆరోగ్యం: నిరంతరం కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేసే వారికి, మెమరీ లాస్ ఉన్న వారికి ఇది మేధోశక్తిని పెంచుతుంది. అలాగే రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా (Blood clotting) చూస్తూ గుండెను కాపాడుతుంది. 5. దంత ఆరోగ్యం: పళ్లపై పేరుకుపోయిన గార (Plaque) తొలగించడానికి మరియు చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నేరుగా పైనాపిల్ ముక్కలు తినడం ఎంతో మంచిది. ఏం చేయకూడదు? (What Not to Do?) • అపెండిక్స్ సర్జరీ అయిన వారు: అపెండిక్స్ తీసేసిన వారు నేరుగా పండు తినకూడదు, కేవలం జ్యూస్ మాత్రమే తాగాలి. • అతిగా తీసుకోవద్దు: పైనాపిల్ ఆరోగ్యానికి మంచిదే కదా అని అతిగా, మరీ పుల్లగా ఉన్నవి తీసుకోకండి. దీనివల్ల కొన్నిసార్లు జలుబు లేదా ఆస్తమా ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. • డయాబెటిస్ ఉన్నవారు: షుగర్ ఉన్నవారు పండును లేదా జ్యూస్‌ను తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఎలా ఉపయోగించాలి? (How to Use?) • ప్రయాణాల్లో వాంతులు (Motion Sickness): బస్సుల్లో ప్రయాణించేటప్పుడు వాంతులు అయ్యే వారు, చిన్న బాక్స్‌లో పైనాపిల్ ముక్కలు పెట్టుకుని, టూత్‌పిక్‌తో అప్పుడప్పుడు తింటూ ఉంటే ఆ సమస్య తగ్గుతుంది. • పిల్లల్లో కడుపులో పురుగులు: పిల్లలకు తరచుగా పైనాపిల్ తినిపిస్తే, పేగుల్లో ఉండే పురుగులు (Intestinal worms) నశిస్తాయి. • డయాబెటిస్ నియంత్రణకు: పైనాపిల్ ఆకులు మరియు వేర్లను నీళ్లలో మరిగించి ఆ కషాయం తాగితే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. • శ్వాసకోస సమస్యలకు: జలుబు, దగ్గు ఉన్నప్పుడు పైనాపిల్ జ్యూస్‌ను డైల్యూట్ చేసి తీసుకుంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. తరచుగా అడిగే ప్రశ్నలు (Q&A) ప్రశ్న: కిడ్నీలో రాళ్లు ఉన్నవారు పైనాపిల్ తీసుకోవచ్చా?  జవాబు: తప్పకుండా! బాడీలో ఎక్కడ స్టోన్స్ ఉన్నా వాటిని బ్రేక్ చేయడంలో, ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ తొలగించడంలో పైనాపిల్ జ్యూస్ పాత్ర సాటిలేనిది. ప్రశ్న: పైనాపిల్ తింటే జలుబు చేస్తుందా?  జవాబు: ఇది చాలా మందిలో ఉన్న అపోహ. పైనాపిల్ వల్ల జలుబు రాదు, కానీ అతిగా పుల్లని పండు తింటే సమస్య రావచ్చు. సరైన పద్ధతిలో తీసుకుంటే ఇది లంగ్స్ మరియు గొంతు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రశ్న: శరీర నొప్పులకు పైనాపిల్ పనిచేస్తుందా? జవాబు: అవును, ఇందులో అనాల్జిసిక్ (Analgesic) గుణాలు ఉండటం వల్ల వెన్నునొప్పి, కడుపునొప్పి వంటి బాడీ పెయిన్స్ తగ్గడానికి సహాయపడుతుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన పండును మీ డైట్‌లో భాగం చేసుకోండి. "ఏతదాలే అక్లాత్" అంటే శరీరంలోని నాలుగు ధాతువులను సమతుల్యంగా ఉంచి మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడంలో పైనాపిల్ ఎంతో కీలకం. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు నిపుణుల సలహాల కోసం మా యూట్యూబ్ మా Youtube"TeluguOne Health"ఛానెల్‌ను సందర్శించండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!) ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి! Disclaimer: ఈ వీడియో కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ట్రీట్‌మెంట్ ప్రారంభించే ముందు మీ డాక్టర్‌ని సంప్రదించండి.
బోన్ సిస్ట్.. దీన్నే ఎముక తిత్తి అని అంటారు. ఎముక తిత్తి అనేది ఎముక సంబంధిత సమస్య, దీని గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. ఇది చాలా అరుదైన వ్యాధి, కానీ ఎవరికైనా ఇది వచ్చినప్పుడు, వారి సమస్యలు విపరీతంగా పెరుగుతాయి. ఎముక తిత్తి అభివృద్ధి చెందినప్పుడు, ఆ ప్రాంతంలోని ఎముక నెమ్మదిగా కరిగిపోవడం ప్రారంభమవుతుంది.  తరచుగా ఈ సమస్యను  క్యాన్సర్‌తో  రిలేటెడ్ గా పరిశీలిస్తారు. కానీ ఇది క్యాన్సర్ కు సంబందం లేని వ్యాధి. బోన్ సిస్ట్ సమస్య ప్రధానంగా పిల్లలను ప్రభావితం చేస్తుంది.  మరీ ముఖ్యంగా  కౌమారదశలో పిల్లలను ప్రభావితం చేస్తుంది.  చిన్న గాయం కారణంగా అకస్మాత్తుగా ఎముక విరిగినప్పుడు ఎముక తిత్తులు వస్తాయి.  ఒక అధ్యయనం ప్రకారం, ఈ తిత్తులు సాధారణంగా ఎముకల చివర్లలో అభివృద్ధి చెందుతాయి. ఇక్కడ పెరుగుదల ప్లేట్లు చురుకుగా ఉంటాయి, ఈ తిత్తులు సాధారణంగా రెండు రకాలు: అనూరిస్మల్ ఎముక తిత్తులు  యునికార్న్యుయేట్ ఎముక తిత్తులు. ప్రారంభం..  ఈ వ్యాధి ప్రారంభం లక్షణాలు ప్రభావిత ప్రాంతంలో వివరించలేని నొప్పి,,  ఎక్స్-కిరణాలు ఆ ప్రాంతంలో ఎముక సాంద్రత తగ్గినట్లు వెల్లడిస్తాయి. అదృష్టవశాత్తూ, ముందుగానే గుర్తిస్తే, దీనిని పూర్తిగా నయం చేయవచ్చు. కౌమార దశలో దీని ప్రమాదం ఎక్కువ ఎందుకు? కౌమారదశలో ఎముకలు వేగంగా పెరుగుతాయి.  ఈ సమయంలో ఎముకల లోపల ద్రవ పీడనం లేదా రక్త నాళాలలో మార్పులు తిత్తులు ఏర్పడటానికి దారితీస్తాయి.  వైద్యులు, నిపుణుల అభిప్రాయం ప్రకారం..  ఇది సాధారణంగా 5 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలలో కనిపిస్తుంది, ఎందుకంటే ఈ కాలంలో ఎముక ఎదుగుదల,  ఎముకలలో మార్పుల  ప్రక్రియ వేగంగా జరుగుతుంది. లక్షణాలు.. ఎముక తిత్తులు ఎలాంటి స్పష్టమైన లక్షణాలను కలిగి ఉండవు,  కొన్నిసార్లు ప్రభావిత ప్రాంతంలో నొప్పిని కలిగిస్తాయి, కానీ చాలా సందర్భాలలో ఎముక బలహీనపడి విరిగిపోయే వరకు నొప్పి ఉండకపోవచ్చు. ఈ వ్యాధి తరచుగా ఆటలు ఆడే  సమయంలో గాయాలు తగలడం జరిగినప్పుడు చేసే  ఎక్స్-రే వాపు లేదా చిన్న బెణుకుల ద్వారా గుర్తించబడుతుంది. పిల్లలు పెద్ద గాయం లేకుండా ఒకే ప్రాంతంలో పదే పదే నొప్పి లేదా పగుళ్లను ఎదుర్కొంటుంటే, అది ఎముక తిత్తికి ముందస్తు సంకేతం కావచ్చు. చికిత్స.. వైద్యులు తరచుగా చిన్న తిత్తులను పర్యవేక్షిస్తారు, ఎందుకంటే చాలా సందర్భాలలో అవి వయస్సుతో పాటు వాటంతట అవే నయం అవుతాయి. తిత్తి పెద్దగా ఉండి, పగులు వచ్చే ప్రమాదం ఉంటే, 'క్యూరెట్టేజ్' ప్రక్రియ ద్వారా ద్రవాన్ని తొలగించడం ద్వారా 'బోన్ గ్రాఫ్టింగ్' చేస్తారు. కొన్ని సందర్భాల్లో, ఈ తిత్తులను శస్త్రచికిత్స లేకుండానే స్టెరాయిడ్ ఇంజెక్షన్ల ద్వారా కూడా చికిత్స చేయవచ్చు. తిత్తి పెద్దదిగా మారితే  శస్త్రచికిత్సను కూడా సూచించవచ్చు. ఇది చాలా అవసరం.. ఎముక తిత్తి సమస్య   సరైన సమయంలో గుర్తించబడితే  సకాలంలో చికిత్స చేయడం ద్వారా దీనిని పూర్తిగా నయం చేయవచ్చు. ప్రభావిత ప్రాంతంలో కణజాలం  బయాప్సీ చేసిన తర్వాత మాత్రమే నిపుణులు ఈ సమస్యను  నిర్ధారిస్తారు. బయాప్సీ నివేదిక ఎముక తిత్తిని నిర్ధారించిన తర్వాత, చికిత్స ప్రారంభిస్తారు. పిల్లలకు ఎముకల విషయంలో ఏదైనా అనుమానాస్పదంగా సమస్య కనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయంకుడా ఆర్థోపెడిక్ వైద్యులను సంప్రదించడం చాలా మంచిది.                                       *రూపశ్రీ.