సినిమా ఇండస్ట్రీలో ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు విడుదల కావడం సాధారణమే. కానీ ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకుల సినిమాలు ఒకేరోజు థియేటర్లలోకి రావడం మాత్రం అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో అలాంటి ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకోబోతోంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ నటించిన సినిమాలు నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దీంతో ఈ తండ్రీకొడుకుల బాక్సాఫీస్ పోటీపై ఆసక్తి నెలకొంది.
మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన చిత్రం 'ఓం' (O.M). తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనుండగా.. సాయిపల్లవి పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. శ్రీలీల, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వండర్ బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.
ఇక మరోవైపు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న సినిమా 'ఆకాశంలో ఒక తార'. సాత్విక వీరవల్లి ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా సంస్థలపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇందులో శ్రుతి హాసన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. నవంబర్ 20న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
ఇలా ఒకే రోజు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ సినిమాలు విడుదల కానుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ రెండు సినిమాలు వేర్వేరు భాషల్లో, విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఒకవైపు ధనుష్, మమ్ముట్టి కాంబినేషన్లో వస్తున్న 'ఓం'పై అంచనాలు ఉండగా.. మరోవైపు తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్న దుల్కర్ 'ఆకాశంలో ఒక తార'తో వస్తున్నారు. మరి నవంబర్ 20న తండ్రి సినిమా ఎక్కువగా ఆకట్టుకుంటుందా? కొడుకు సినిమా పైచేయి సాధిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Mammootty, Dulquer Salmaan, Mammootty vs Dulquer, OM Movie 2026, Aakasamlo Oka Tara, Dhanush OM Movie, Mammootty New Movie, Dulquer Salmaan Telugu Movie, November 20 Movie Releases, Father Son Box Office Clash




