Home

»

Latest News

AI దుర్వినియోగంపై కేంద్రానికి చిరంజీవి వినతిపత్రం.. కిషన్ రెడ్డి ఏమన్నారంటే?

Nov 16, 2026 7:17PM

సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ముందుండి స్పందించే మెగాస్టార్ చిరంజీవి మరోసారి చిత్ర పరిశ్రమ తరఫున కీలకమైన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. దాని ద్వారా సెలబ్రిటీల ముఖాలు, గొంతులను అనుమతి లేకుండా ఉపయోగించడం, డీప్‌ఫేక్ వీడియోలు రూపొందించడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కళాకారుల వ్యక్తిగత గుర్తింపు, గౌరవం, సృజనాత్మక హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతూ చిరంజీవి కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఈ వినతిపత్రాన్ని అందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర హోం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలకు ఉద్దేశించి దీనిని సమర్పించారు. ఇటీవల అమిత్ షాతో జరిగిన సమావేశంలో AI దుర్వినియోగం వల్ల సినీ, టెలివిజన్ కళాకారులకు ఎదురవుతున్న సమస్యలను చిరంజీవి వివరించారు. ఈ అంశంపై లిఖితపూర్వకంగా వినతిపత్రం ఇవ్వాలని అమిత్ షా సూచించడంతో తాజాగా కిషన్ రెడ్డికి అందజేశారు. ఇందులోని అంశాలను సంబంధిత మంత్రిత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లి సమన్వయం చేస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఈ వినతిపత్రంలో పలు కీలకమైన అంశాలను చిరంజీవి ప్రస్తావించారు. కళాకారుల ముఖం, గొంతు, వ్యక్తిగత గుర్తింపును వారి అనుమతి లేకుండా డిజిటల్ రూపంలో ఉపయోగించకుండా చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరారు. AI ద్వారా ఒక వ్యక్తి రూపాన్ని, గొంతును తిరిగి సృష్టించే ముందు వారి అనుమతి తప్పనిసరి చేయాలని సూచించారు. అలాగే దురుద్దేశంతో రూపొందించే డీప్‌ఫేక్ వీడియోలపై తగిన శిక్షలు విధించడం, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను నిర్ణీత సమయంలో తొలగించే వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి ప్రతిపాదనలు చేశారు. ఇలాంటి ఘటనలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని కూడా కోరారు.

కేవలం సినీ ప్రముఖులే కాకుండా సాధారణ ప్రజలు, మహిళలు, చిన్నారులు కూడా AI దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని చిరంజీవి పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల కష్టంతో సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠలు, వ్యక్తిగత గౌరవం క్షణాల్లో దెబ్బతినే పరిస్థితులు వస్తున్నాయని వివరించారు. కరోనా సమయంలో సినీ కార్మికులకు అండగా నిలవడం, హెల్త్ కార్డులు, వైద్య సహాయం అందించడం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న చిరంజీవి.. ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో కళాకారుల హక్కుల పరిరక్షణ కోసం ముందుకొచ్చారు. "సాంకేతికత సృజనాత్మకతను పెంపొందించాలి.. మనిషి గౌరవాన్ని దెబ్బతీయకూడదు" అనే సందేశంతో ఈ అంశంపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు.


Chiranjeevi, Chiranjeevi Latest News, AI Deepfake Misuse, Chiranjeevi Kishan Reddy Meeting, Kishan Reddy, Amit Shah, AI Protection for Actors, Celebrity Digital Rights, Deepfake Videos, Telugu Film Industry News

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com