గణపతి నవరాత్రులు ఎలా ప్రారంభం అయ్యాయి..వీటి వెనుక ఉన్న భారత చరిత్ర ఏమిటి.!
గణపతి నవరాత్రుల మహోత్సవం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రజా చైతన్యాన్ని, ఐక్యతను పెంపొందించడానికి ఉపయోగపడిన ఒక గొప్ప విప్లవాత్మక సామాజిక ఉద్యమం. ప్రాచీన కాలంలో వినాయక చవితి పూజలు ఇళ్లకే పరిమితమై, ఇళ్లలోనే భక్తి శ్రద్ధలతో జరుగుతుండేవి. శాతవాహనులు, రాష్టకూటులు, విజయనగర రాజుల కాలం నుండి గణేష్ ఉత్సవాల ప్రస్తావన ఉన్నప్పటికీ, అందరూ ఇప్పట్లో వీధుల్లో గణపతిని ప్రతిష్ట చేసి గణపతి నవరాత్రులు జరుపుకోవడానికి ప్రధాన కారణం బ్రిటిష్ పాలనా కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు. నేటి వినాయకచవితి నవరాత్రి ఉత్సవాల వెనుక చరిత్రలో జరిగిన కారణాలు ఏమిటో తెలుసుకుంటే..
గణపతి ఉత్సవాల వెనుక చరిత్ర..
ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలో మరాఠా సామ్రాజ్యంలో సంస్కృతి, జాతీయ భావాన్ని పెంపొందించడానికి వినాయక ఉత్సవాలను ప్రాచుర్యంలోకి తెచ్చారు. పీష్వాల పాలనలో వినాయకుడు వారి కులదైవం కావడంతో పూణేలో ఈ ఉత్సవాలు రాజ్యపండుగలా వైభవంగా సాగేవి. అయితే 1818లో పీష్వాల పాలన అంతరించి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారం చేపట్టిన తర్వాత ఈ ఉత్సవాలు ప్రాభవాన్ని కోల్పోయాయి.
ప్రజలు ఇళ్లలోనే రహస్యంగా లేదా వ్యక్తిగతంగా పూజలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితిలో 19వ శతాబ్దం చివరలో ఒక పెద్ద మార్పు వచ్చింది. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతదేశంలో స్వాతంత్ర్య కాంక్ష తీవ్రమైంది. దీనిని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1892 ప్రాంతంలో తీవ్రమైన ఆంక్షలు విధించింది. భారతీయ ప్రజలు రాజకీయంగా సమావేశం కాకుండా, గుమిగూడకుండా నిషేధాజ్ఞలు విధించారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది ఒకచోట చేరడం నేరంగా పరిగణించబడేది. ప్రజా సంఘాలు, రాజకీయ సమావేశాలపై కఠినమైన నిఘా ఉండేది.
ఈ క్లిష్ట సమయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, లోకమాన్య బిపిన్ చంద్రపాల్, లాలా లజపతిరాయ్ లతో కలిసి పనిచేసిన గొప్ప నాయకుడు లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం రాజకీయ సమావేశాలపై నిషేధం విధించింది కానీ, మతపరమైన ఆచారాలు , ఉత్సవాలపై నేరుగా జోక్యం చేసుకోలేకపోయింది. ఈ అవకాశాన్ని తిలక్ తెలివిగా ఉపయోగించుకున్నారు. 1893లో పూణేలో ఆయన సార్వజనిక గణేశోత్సవ మండలిని ప్రారంభించి, ఇళ్లలోని పూజను వీధులకి, బహిరంగ వేదికలకి తీసుకువచ్చారు.
తిలక్ గణపతి ఉత్సవాలను ఒక సామాజిక, రాజకీయ వేదికగా మలిచారు. పందిళ్లు వేసి గణపతి విగ్రహాలను ప్రతిష్టించడం ద్వారా ప్రజలందరూ ఒకచోట చేరే అవకాశం లభించింది. కుల మత భేదాలు లేకుండా ప్రజలందరూ ఒకే వేదికపైకి వచ్చి కలవడానికి ఈ ఉత్సవాలు తోడ్పడ్డాయి. ఉత్సవాల సందర్భంగా సంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, పద్య పఠనాలు నిర్వహించేవారు. వీటితో పాటు దేశభక్తి ఉపన్యాసాలు ఇస్తూ, స్వాతంత్ర్య ఉద్యమ భావాలను, బ్రిటిష్ పాలనలోని అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేవారు.
ఈ తొమ్మిది లేదా పది రోజుల ఉత్సవాల కాలంలో విప్లవకారులు, స్వాతంత్ర్య సమరయోధులు రహస్యంగా సమావేశమై ప్రణాళికలు రచించుకోవడానికి వీలు కలిగింది. బ్రిటిష్ గూఢచారులు పందిళ్లలో ఏం జరుగుతుందో కనిపెట్టడం కష్టమయ్యేది. తిలక్ స్థాపించిన కేసరి, మరాఠా వార్తాపత్రికల ద్వారా ఈ గణపతి నవరాత్రుల సందేశం మహారాష్ట్ర అంతటా మాత్రమే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపించింది. ముంబై, పూణే, నాగపూర్ వంటి నగరాల్లో వేలాదిగా సార్వజనిక మండపాలు వెలిశాయి.
స్వాతంత్రోద్యమంలో ఈ ఉత్సవాలు అందించిన చైతన్యం వెలకట్టలేనిది. ప్రజలలో జాతీయ సమైక్యతను, ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో గణపతి నవరాత్రులు కీలక పాత్ర పోషించాయి. 1947లో దేశానికి స్వాతంత్ర్య లభించినప్పటికీ, తిలక్ ప్రారంభించిన ఈ సాంప్రదాయం భారతదేశ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిపోయింది.
కాలక్రమేణా ఈ నవరాత్రుల ఉత్సవాలు మహారాష్ట్ర సరిహద్దులు దాటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు , ఉత్తర భారత దేశమంతటా విస్తరించాయి. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు, లాల్ బాగ్ చారాజా వంటివి ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఈనాడు గణపతి నవరాత్రులు కేవలం పూజలకే పరిమితం కాకుండా, రకరకాల సామాజిక సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు , పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమాలకు వేదికగా మారుతున్నాయి.
ఈ విధంగా భక్తి భావనతో మొదలై, స్వాతంత్ర్య ఉద్యమ ఆయుధంగా రూపాంతరం చెంది, నేడు మహోన్నత సామాజిక ఉత్సవంగా విలసిల్లుతున్న గణపతి నవరాత్రుల వెనుక శతాబ్దాల భారతీయ చరిత్ర, సమరయోధుల వ్యూహాత్మక ఆలోచనలు , ప్రజల ఐక్యతా శక్తి దాగి ఉన్నాయి.
*రూపశ్రీ.