LATEST NEWS
  టిటిడి పాలక మండలి కీలక నిర్ణయం తీసుకోనుంది. శ్రీ వారి సొమ్మును ఇక పై జాతీయ బ్యాంకుల్లోనే ఫిక్స్ డ్ డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. ప్రాంతీయ బ్యాంకులో భద్రత లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకోనునట్లు తెలిపారు. త్వరలోనే 15 వందల కోట్లను జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వంలో టీటీడీ సొమ్మును ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంతో పలువురు భక్తులు కోర్టును ఆశ్రయించారు. 14 వందల కోట్లను ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంతో అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు సూచనల మేరకు జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేయాలని పాలక మండలి తీర్మానం తీసుకోనుంది. దీని పై ప్రతిపాదనను కూడా సిద్ధం చేసింది.అయితే టీటీడీ తీసుకోబోతున్న ఈ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు శ్రీ వారి భక్తులు.  ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు వెయ్యి కోట్ల రూపాయలను ఇండస్ అండ్ బ్యాంక్ అనే ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. నేనొక భక్తుడిగా హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాజ్యం వేశానని పిటీషన్ దాఖలు చేసిన వ్యక్తి తెలిపారు. హైకోర్టు చాలా ఘాటుగా స్పందించి జాతీయ బ్యాంకులు ఉండగా ప్రైవేటు బ్యాంకులో ఏ ఉద్దేశంతో డిపాజిట్ చేశారని చెప్పి టిటిడిని ప్రశ్నించటం జరిగింది. అప్పుడు తాత్కాలికంగా షార్ట్ టర్మ్ డిపాజిట్ కోసం వెయ్యి కోట్ల రూపాయల మేము ఇండస్ అండ్ బ్యాంక్ లో వేశామని ఆ గడువు ముగిసినాక వెనక్కి తీసుకుంటామని ఈవో చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు దాదాపు 12 వేల కోట్ల రూపాయలు శ్రీవారి నిధులున్నాయి. ఆ నిధులన్ని కూడా ఖచ్చితంగా భవిష్యత్ లో జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ లు చేయాలి. భద్రత విషయం దృష్టిలో పెట్టుకొని ఉండాలని శ్రీ వారి భక్తుడు హెచ్చరించారు.
  కృష్ణా జిల్లా నందిగామలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. ఓ వైపు రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల ఉపాధి లేక కూలీలు అల్లాడుతుంటే మరోవైపు దర్జాగా అక్రమ రవాణా సాగిపోతుంది. కృష్ణా జిల్లా నుండి పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలిపోతున్న ఇసుక లారీలను చెక్ పోస్టు దగ్గర పోలీసులు పట్టుకున్నారు. నందిగామ డివిజన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా కట్టిన చర్యలు తీసుకుంటున్నామని.. అదే విధంగా 110 కిలో మీటర్లు ఉన్న డివిజన్ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. మొత్తం 7 చెక్ పోస్టులు, 6 మొబైల్ టీమ్స్ ను ఏర్పాటు చేసినట్లు నందిగామ డీఎస్పీ చెప్పారు.  ఇటీవల కాలంలో నందిగామ పరిధిలో చెక్ పోస్టుల పరిధిలో పోలీసులు లారీలను పట్టుకున్నారు. జొన్నల గడ్డ, అనాసాగరం, కీసర ప్రాంతాల్లో లారీలను ఆపి పరిశీలిస్తే పాత బిల్లులతో పర్మిట్లు ఉన్నాయి. వాటిని ఉపయోగించి కృష్ణా జిల్లా నుంచి తెలంగాణకు ఇసుక తరలిస్తూ నిందితులు పట్టుబడ్డారు. పర్మిట్ లు తీసుకున్న వాహన దారులు మోతాదుకు మించి లోడ్ ను లారీల్లో నింపుతున్నట్లు ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు గుర్తించారు. వాటికి జరిమానా కూడా విధించారు. రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు ఇసుక వారోత్సవాలు జరుపుతుంటే మరోవైపు అక్రమార్కులు ఏదో ఓ రూపంలో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
  మంత్రి కొడాలి నానిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. తిరుమల ఆలయం పై మంత్రి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని  మండిపడ్డారు బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. శ్రీ వారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన మంత్రి నాని పై చర్యలు తీసుకోవాలంటూ..  ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్యమతస్థులు తిరుమల శ్రీ వారి దర్శనానికి వచ్చినపుడు డిక్లరేషన్ ఇవ్వాలన్న చట్టం కాపీలను ఆయన పోలీసులకు అందజేశారు. మంత్రి నాని పై కేసు నమోదు చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తామని భానుప్రకాశ్ రెడ్డి ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక అయిన తిరుమల తిరుపతి దేవస్థానాల్లో గుడికి కానీ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తానంటే అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలని.. గుడిని చట్టాల్ని అగౌరపరిచే విధంగా  రాష్ట్ర మంత్రివర్యులు కొడాలి నాని గారి వ్యవహార శైలి కోట్లాది మంది హిందువుల మనోభవాలు కించపరిచేలా ఉందని ఆయన తెలియజేశారు.  అయ్యా నాని గారు మీరు మాట్లాడే భాష కోట్లాది మంది శ్రీవారి భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి వెంటనే మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. మీరు మాట్లాడిన పదాలు కూడా నేను ఇక్కడ మాట్లాడలేనని.. కానీ భక్తులందరికీ తెలిసిరావాలని.. గౌరవ మంత్రిగా ఉండి మీరు మాట్లాడిన మాటలు 'నీ అమ్మ మొగుడు కట్టాడా తిరుపతి గుడిని'  అని ఎలా సంభోదించారు. ఒకసారి తిరుమల ఆలయ చరిత్ర తెలుసుకోండి. కొన్ని దశాబ్దాల క్రితం శతాబ్దాల క్రితం చోళులు పల్లవులు, విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు వీరందరూ స్వామి మీద ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్మించినట్టి ప్రసిద్ధమైన ఆలయం తిరుమల. ఈ రోజు కలియుగ వైకుంఠంగా ఉన్నటువంటి ఈ ఆలయం పట్ల ఆలయంలో ఉన్న వ్యవహారాల పట్ల మీరు వ్యాఖ్యానించిన  మాటలని వెనక్కి తీసుకొని వెంటనే క్షమాపణ చెప్పాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఇలా హిందువుల మనోభావాలను గాయపరిచిన కొడాలి నానిని వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయవలసిందిగా బీజేపీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. హిందువులు కాకపోతే డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి గెజిట్ ఉంది. దీనికి కూడా చట్టం ఉంది.. చట్టాన్ని కూడా గమనించకపోతే ఎలా అంటూ ఘాటుగా స్పందించారు.
  ఎమ్మార్వో కార్యాలయాలకు వెళ్తున్నారా.. తహసీల్దార్ ఆర్డీవోలను కలవాలనుకుంటున్నారా.. అయితే ఇక పై వారిని నేరుగా కలిసే అవకాశం లేదు. తహసిల్దార్ విజయా రెడ్డి హత్య అనంతరం అధికారులకు.. ప్రజలకు.. మధ్య కొత్త వ్యవస్థ రాబోతుంది. వారి మధ్య పీఆర్వో విధానం రాబోతుంది. తహసిల్దార్ విజయరెడ్డి హత్యానంతరం ఎమ్మార్వో కార్యాలయాల్లో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల్లో పీఆర్వోలను నియమించటానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఎన్నో సమస్యలతో రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే వారు నేరుగా అధికారులను కలవకుండా పీఆర్వోలను కలిసే విధానం రాబోతుంది. రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలు మొదటగా పీఆర్వోను కలుస్తారు. తమ సమస్యలు ఎంత వరకు వచ్చిందని వారిని అడుగుతారు. వారి వినతి పత్రాలను పీఆర్వోలు అధికారులకు అందజేస్తారు. పరిష్కారం ఎంత వరకు వచ్చిందో తెలుసుకొని ప్రజలకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తారు.  పీఆర్వో విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సమస్యలు సరిగ్గా పరిష్కరిస్తే ఎందుకు దాడులు జరుగుతాయంటున్నారు సామాజిక కార్యకర్త ఆర్ శ్రీనివాస్.పీఆర్వో వ్యవస్థను ప్రవేశ పెట్టడం చాలా సంతోషకరమైన వార్త అలాగే ప్రజలు అధికారులు.. తోటి సిబ్బంది కూడా సహకరించాలి. సిబ్బంది కూడా ప్రజలతో సహకరించి.. ఏ సమస్య ఉన్నా క్షుణ్ణంగా వాళ్లు పరీక్షిస్తేనే ఆ సమస్య పరిష్కారమవుతుందని శీనివాస్ వెల్లడించారు.  మరోవైపు విజయారెడ్డి హత్యానంతరం రెవెన్యూ అధికారులకు భద్రత అవసరమని ముఖ్యంగా మహిళా రెవెన్యూ ఆఫీసర్లకు భద్రత తప్పనిసరి అంటున్నారు. ఇంకో వైపు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులకు , మళ్లీ పీఆర్వోలు ఎందుకంటున్నారు మరికొంతమంది అధికారులు. ప్రజా సమస్యలు పరిష్కరించడం కొరకు నియమితులైన అధికారులు వాటిని పరిష్కరించకుండా పీఆర్వో వ్యవస్థ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అంటున్నారు.ప్రజల మనస్తత్వం మారనంత వరకు ఎంత సెక్యూరిటీ ఎన్ని చట్టాలు వచ్చినా ఉపయోగం లేదు అంటున్నారు మరికొందరు అధికారులు. వ్యవస్థలోని కొన్ని లోపాలు కూడా దీనికి కారణమంటున్నారు.
  వ్యవసాయ రంగంపై శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు టిడిపి సీనియర్ నేత ఆలపాటి రాజా. కోటి మంది రైతులుంటే 40 లక్షల మందికే భరోసా ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ఆదా చేస్తున్నామని చెప్పుకునే వైసిపి జగన్ ఇంటి కిటికీలకు రూ.80 లక్షలు ఖర్చు చేయడం ఏంటని నిలదీశారు. గతంలో కోటి మంది రైతులున్నారు. ఇవాళ కనీసం నలభై లక్షల మంది రైతులను కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి ప్రభుత్వంలో ఉంది. అంతే కాకుండా కౌలు రైతులకి మేం భరోసా అన్నారు.. ఇవాళ కౌలు రైతులను గుర్తించే విషయంలోనే మీరు విఫలమైతే మీరు వారికి ఏం న్యాయం చేయగలుగుతారు. బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు మీరు ఎంత ఇచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక శ్వేత పత్రం ఎక్కడైనా రిలీజ్ చేశారా..? రైతు భరోసా అని చెప్పి చాలా గొప్పగా ఈనాడు చెప్పుకుంటున్నారు. కొన్ని లక్షల రూపాయలు మీరు రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ఇవాళ పబ్లిసిటీ పేరుతో దుర్వినియోగం చేశారు. ఇందులో ఏమి ఆదా చేస్తున్నారు. మేము రివర్స్ టెండర్ల ద్వారా ఆదా చేస్తామన్నారు ఏ రకమైన ఆదా చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ ల రంగు మార్చినందుకు రూ.1100  కోట్ల రూపాయల ఖర్చయ్యింది. ఆఖరికి మీరు కట్టుకున్న ఇంటికి రూ.20 కోట్ల రూపాయల ఖర్చెందుకు పెడతారన్నారు. బాత్ రూము టాయిలెట్స్ కి 10 లక్షల రూపాయలు.. కిటికీలకూ 80 లక్షల రూపాయలు ఏమి వెండితో చేయిస్తున్నారా కిటికీలూ లేద బంగారంతో చేపిస్తున్నారా. మీ ఇంటికి రోడ్డు వేయటానికి రూ.5 కోట్ల రూపాయలా ఏమిటిది..? ప్రజాధనం అని మర్చిపోకండి అంటూ జగన్ ప్రభుత్వ నిర్వాకంపై మండి పడ్డారు.  
ALSO ON TELUGUONE N E W S
  సూపర్‌స్టార్ మహేశ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు' ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసేందుకు నిర్మాతలు ముహూర్తం నిర్ణయించారు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తయారవుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ టీజర్‌ను నవంబర్ 22న లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ తన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా మంగళవారం సాయంత్రం 6:03 గంటలకు వెల్లడి చేసింది. దీని కోసం టాలీవుడ్‌లోనే తొలిసారిగా 'అన్‌లాక్' టూల్‌ను ప్రవేశపెట్టింది. అంటే ట్విట్టర్ అకౌంట్‌లో అదిపెట్టిన 'అన్‌లాక్' టూల్‌ను క్లిక్ చేస్తే మనకు టీజర్ రిలీజ్ డేట్ రివీల్ అవుతుందన్న మాట. అలా ఫ్యాన్స్‌లో 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ డేట్ ఎప్పుడా అనే క్యూరియాసిటీని అమితంగా క్రియేట్ చేశారు. నవంబర్ 22న మూవీ ఫస్ట్ టీజర్ వస్తుందనే సమాచారంతో మహేశ్ ఫ్యాన్స్‌లో సంబరాలు ఒక్కసారిగా అంబరాన్ని అంటాయి. "గెట్ రెడీ పీపుల్. మాస్ మహేశ్ బాబు మేనియా బిగిన్స్ విత్ 'సరిలేరు నీకెవ్వరు' టీజర్! లెట్స్ సెట్ ద స్క్రీన్స్ ఆన్ ఫైర్" అంటూ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్వీట్ చేసింది. క్షణాల వ్యవధిలోనే 'సరిలేరు నీకెవ్వరు' అనే హ్యాష్‌టాగ్ ట్విట్టర్ ట్రెండింగ్‌లోకి రావడం విశేషం. దానికంటే ముందు 'అన్‌లాక్ ఎస్ఎల్ఎన్ టీజర్ డేట్' అనే హ్యాష్‌టాగ్ ట్రెండింగ్‌లో ఉంది. అంటే ఈ రెండు హ్యాష్‌టాగ్‌లూ ఇప్పుడు ట్విట్టర్ వేదికపై హల్‌చల్ చేస్తున్నాయి. 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ లోడ్ అవుతున్నదనే విషయాన్ని మూడు రోజుల క్రితమే, అంటే నవంబర్ 16నే అనిల్ రావిపూడి బయటపెట్టాడు. 'టీజర్ లోడింగ్' అంటూ 'సరిలేరు నీకెవ్వరు' ట్యాగ్‌ను జోడించడంతో దానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అతి త్వరలోనే మూవీ టీజర్ బయటకు రానున్నదనే విషయం తెలియడంతో, ఆ డేట్ ఎప్పుడా అనే ఆత్రుతతో మహేశ్ ఫ్యాన్స్ అల్లాడిపోతూ వచ్చారు.  మంగళవారం మధ్యాహ్నం టీజర్ రిలీజ్ డేట్ టైం సాయంత్రం 6:03 గంటలకు వెల్లడి అవుతుందంటూ ఫ్యాన్స్‌ను ప్రొడక్షన్ హౌస్ ఊరించింది. 'అన్‌లాక్ ఎస్ఎల్ఎన్ టీజర్ డేట్'తో ప్రి సెలబ్రేషన్స్ మొదలవుతున్నాయంటూ అది ట్వీట్ చేసింది. మరో మూడు గంటల తర్వాత టీజర్ డేట్‌ను అన్‌లాక్ చేయడానికి 'సరిలేరు నీకెవ్వరు' టీం ఒక యూనిక్ ప్లాన్‌తో వస్తోందని తెలిపారు. "సినిమా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టడానికి మూవీ మేకర్స్ రంగం సిద్ధం చేశారు. టీజర్ త్వరలోనే బయటకు వస్తుందంటూ ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. తాజాగా టీజర్ డేట్‌ను అన్‌లాక్ చెయ్యడానికి ఒక యూనిక్ ప్లాన్‌తో ముందుకు వచ్చారు. ట్విట్టర్ వేదికపై అన్‌లాక్ ఫీచర్‌ను ఉపయోగించడం ఒక తెలుగు సినిమాకి సంబంధించి ఇదే ప్రథమం. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్విట్టర్ అకౌంట్‌పై 6:03 గంటలకు టీజర్ డేట్, టైంను వెల్లడి చేస్తారు. దీని కోసం ఒక కొత్త టూల్‌ను నిర్మాతలు ఉపయోగిస్తున్నారు" అంటూ తెలిపింది. ఫ్యాన్స్‌లో ఉత్కంఠ మరింత పెరిగింది. దాన్ని ఇంకా పెంచుతూ, మరో రెండు గంటల తర్వాత "ఈరోజును 'సూపర్‌ఫ్యాన్స్'కు అంకితం చేస్తున్నాం. గెట్ రెడీ ఫర్ ద మాస్ మహేశ్ బాబు ధమాకా ఎట్ 6:03 పీఎం" అంటూ ట్వీట్ చేసింది ప్రొడక్షన్ హౌస్. ఆ వెంటనే డైరెక్టర్ అనిల్ రావిపూడి రంగం మీదకు వచ్చాడు. "సూపర్‌స్టార్‌కు సంబంధించిన మాసివ్ న్యూస్‌ను వెల్లడి చేయబోతోంది ఎవరో ఊహించండి. 'నువ్వు'.. ఎందుకంటే .. సరిలేరు నీకెవ్వరు" అంటూ ట్వీట్ చేశాడు. దాంతో అదెలాగా? అంటూ ఫ్యాన్స్ అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. అన్నట్లే ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ 'అన్‌లాక్' టూల్‌తో టీజర్ డేట్‌ను బయటపెట్టింది. ఫ్యాన్స్ అంతా ఆ టూల్‌ను అన్‌లాక్ చేసి 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ డేట్ నవంబర్ 22 అనే విషయం తెలుసుకున్నారు. వెంటనే సంబరాల్లో మునిగిపోయారు.  ఆ తర్వాత టీజర్ రిలీజ్ టైంను కూడా ప్రొడక్షన్ హౌస్ బయటపెట్టింది. ఆ టైం.. 22 నవంబర్ సాయంత్రం 5:04 గంటలు! "నవంబర్ 22 సాయంత్రం 5:04 గంటలకు మేజర్ అజయ్ కృష్ణను చూడండి" అంటూ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంస్థలు రెండూ ట్వీట్ చేశాయి. అంటే శుక్రవారం మహేశ్ ఫ్యాన్స్‌కు ఒక పెద్ద పండగే. మహేశ్ జోడీగా రష్మికా మందన్న నటిస్తోన్న ఈ సినిమాలో విజయశాంతి, ప్రకాశ్ రాజ్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు చేస్తున్నారు. జనవరి 12న 'సరిలేరు నీకెవ్వరు' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇంతదాకా మూవీకి సంబంధించిన ప్రచారం ఎప్పుడు మొదలవుతుందా అని అత్యంత ఆత్రుతగా ఎదురు చూస్తూ వస్తున్న వాళ్లు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. 22న టీజర్ అనే ఒక చిన్న శాంపిల్‌తో మేజర్ అజయ్ కృష్ణగా మహేశ్ ఎలా ఫ్యాన్స్‌ను వెర్రెత్తిస్తాడో.. వెయిట్ అండ్ సీ.. 
సెలబ్రిటీ ఫ్యామిలీగా ముంబైలో కానీ, దేశవ్యాప్తంగా కానీ అమితాబ్ ఫ్యామిలీకి ఉన్న పేరే వేరు. అమితాబ్, జయా బచ్చన్.. ఇద్దరూ సినిమాల్లో జంటగా నటించి, ప్రేమలో పడి పెళ్లాడారు. అదే రీతిలో వాళ్లు కలిసి చేసిన సినిమాలు తక్కువైనా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఇలా ఆ ఫ్యామిలీ సినీ రంగంలోనే మోస్ట్ సెలబ్రేటెడ్ ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే అభిషేక్ కంటే ముందు సల్మాన్ ఖాన్, వివేక్ ఓబరాయ్, మోడల్ రాజీవ్ ముల్‌చందానితో ఐశ్వర్య ఎఫైర్లు నడిపిందనే ప్రచారాలు ఏ రీతిన మీడియాలో హల్‌చల్ చేశాయో మనకు తెలుసు.  ఆ విషయం అలా ఉంచితే, మామ అమితాబ్‌పై ఐశ్వర్య ఆగ్రహించిందనే వార్త కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో బాగా చలామణిలోకి వచ్చింది. కారణం.. 'చెహ్రే' మూవీలో ఇమ్రాన్ హష్మితో కలిసి అమితాబ్ నటిస్తుండటం! దానికీ, ఆమె కోపానికీ లింకేమిటి అనుకుంటున్నారా? లింకు ఉంది. ఇమ్రాన్ హష్మి అంటే ఐశ్వర్యకు ఏమాత్రం గిట్టదు. ఐదేళ్ల క్రితం, అంటే 2014లో పేరుపొందిన టీవీ షో 'కాఫీ విత్ కరణ్'లో పాల్గొన్న ఇమ్రాన్, హోస్ట్ కరణ్ జోహార్ అడిగిన ఒక ప్రశ్నకు జవాబిస్తూ, ఐశ్వర్యా రాయ్‌పై నెగటివ్ కామెంట్స్ చేశాడు. ఐశ్వర్యను 'ఫేక్ అండ్ ప్లాస్టిక్' అంటూ అభివర్ణించాడు. అతడి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని సృష్టించాయి. అప్పట్నుంచీ ఇమ్రాన్ అంటే మండిపడుతూ వస్తోంది ఐశ్వర్య. అతడితో కలిసి నటించడానికి వచ్చిన అవకాశాల్ని మరో మాట లేకుండా తిరస్కరిస్తూ వచ్చింది. ఆ ఉదంతం జరిగి ఐదేళ్లయినా ఐశ్వర్య మర్చిపోలేదు. తాను ఆ మాటల్ని ఉద్దేశపూర్వకంగా అనలేదని ఇమ్రాన్ సంజాయిషీ ఇచ్చుకున్నా అతడిని ఐశ్వర్య క్షమించలేదు. "అది నవ్వులాటగా చెప్పిన మాట. దాన్ని ఆమె సీరియస్‌గా తీసుకొని బాధపడుతుందని ఊహించలేదు. ఐశ్వర్యా రాయ్‌కి నేను బిగ్ ఫ్యాన్‌ని. ఎప్పుడైనా ఆమెను కలుసుకొనే అవకాశం వస్తే, నా మాటలకు క్షమాపణలు చెబుతాను. ఎందుకంటే వ్యక్తిగతంగా ఆమెను బాధపెట్టే ఉద్దేశం నాకేమాత్రమూ లేదు" అని తెలిపాడు ఇమ్రాన్. తన మాటలకు ఇమ్రాజ్ సంజాయిషీ చెప్పినా, అతడన్న 'ఫేక్ అండ్ ప్లాస్టిక్' కామెంట్స్ ఐశ్వర్య మనసు నుండి తొలగిపోలేదు. ఆ మాటల్ని మరచిపోయే మూడ్‌లో ఆమె లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇమ్రాన్‌తో కలిసి తన మామ అమితాబ్ బచ్చన్ నటిస్తుండటాన్ని ఐశ్వర్య జీర్ణించుకోలేక పోతోందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటివరకూ అమితాబ్, ఇమ్రాన్ కలిసి నటించలేదు. రుమి జాఫ్రీ డైరెక్ట్ చేస్తోన్న 'చెహ్రే' మూవీలో మొట్టమొదటిసారిగా వాళ్లు కలిసి నటిస్తున్నారు. ఆ మూవీలో 'తీన్ మార్' ఫేం కృతి ఖర్బందా, రియా చక్రవర్తి, సిద్ధాంత్ కపూర్, అన్ను కపూర్ కీలక పాత్రలు చేస్తున్నారు. తనను ఒక పబ్లిక్ ప్లాట్‌ఫాంపై కించపరిచే విధంగా మాట్లాడిన ఇమ్రాన్‌తో ఎలా కలిసి పనిచేస్తారని మామ అమితాబ్‌పై ఐశ్వర్య ఆగ్రహంతో ఉన్నదంటూ కొంత కాలం క్రితమే వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పటికీ ఆ విషయంలో ఐశ్వర్య ధోరణి మారలేదంటున్నాయి ఆ కుటుంబ సన్నిహిత వర్గాలు. ఆ సినిమా చేస్తున్నప్పట్నుంచీ అమితాబ్‌తో ఆమె అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నదని లేటెస్టుగా ప్రచారం నడుస్తోంది. గతంలో 'బాద్‌షాహో' సినిమాలో అజయ్ దేవ్‌గణ్ జోడీగా నటించే అవకాశం వచ్చినప్పుడు, ఆమె తిరస్కరించింది. కారణం.. అందులో ఇమ్రాన్ హష్మి ఉండటం. అతడితో కలిసి పనిచేయడాన్ని ఆమె ఏమాత్రమూ ఇష్టపడటం లేదని అందరికీ తెలిసిందప్పుడే.  అంతేకాదు, ఇమ్రాన్‌పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసే అవకాశం వచ్చినప్పుడు ఆమె దాచుకోలేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, "మీకు బాధ కలిగించిన ,మీపై వచ్చిన వరస్ట్ కామెంట్ ఏమిటి?" అనే ప్రశ్న ఎదురైనప్పుడు, ఏమాత్రం తడుముకోకుండా "నేను ఫేక్ అండ్ ప్లాస్టిక్ అనే కామెంట్‌ను" అని బదులిచ్చింది ఐశ్వర్య. అయితే మీడియాలో తన కామెంట్ ప్రచారంలో ఉన్నందువల్లే ఆమె దాన్ని మరచిపోలేదంటున్నాడు ఇమ్రాన్. వినోదం కోసం కరణ్ జోహార్ ఇలాంటి మాటల్ని అనిపిస్తుంటాడనీ, వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదనీ అతను తెలిపాడు. అయితే సున్నితమనస్కురాలిగా ముద్రపడిన ఐశ్వర్య మాత్రం ఇప్పట్లో అతడి మాటని మర్చిపోయేట్లు లేదు. కాగా అమితాబ్, ఇమ్రాన్ కలిసి నటిస్తోన్న 'చెహ్రే' సినిమా 2020 ఏప్రిల్ 24న విడుదల కానున్నది.
  నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన 'జెర్సీ' మూవీ ప్రేక్షకులను ఆకట్టుకొని, విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది. నాని కేరెక్టర్‌ను షాహిద్ కపూర్ చేస్తున్నాడు. ఇటీవలే 'అర్జున్‌రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్'గా నటించి, సూపర్ హిట్ కొట్టిన షాహిద్, వెంటనే మరో తెలుగు రీమేక్‌కు సంతకం చెయ్యడం గమనార్హం. ఈ మూవీలో నాయికగా మృణాల్ ఠాకుర్ ఎంపికైంది. 'సూపర్ 30', 'బాట్లా హౌస్' సినిమాలతో తన నటనతో అలరించిన మృణాల్‌కు ఇది భిన్న కేరెక్టర్. షాహిద్‌తో కలిసి నటిస్తుండటంపై మాట్లాడుతూ "షాహిద్ జోడీగా 'జెర్సీ'లో నటించనుండటం నన్ను ఉద్వేగానికి గురి చేస్తోంది. ఒరిజినల్ సినిమా చూసినప్పుడు ఆ ఎమోషనల్ జర్నీకి పడిపోయాను" అని చెప్పింది మృణాల్. సినిమాలో ఆమెది చాలా కీలక పాత్ర. 36 ఏళ్ల వయసులో దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్న ఒక క్రికెటర్ జీవితంలోని హృదయాన్ని మెలిపెట్టే దశను చూపించే ఆ కథలో, ఆ క్రికెటర్‌కూ, ప్రేమించి పెళ్లి చేసుకున్న అతని భార్యకూ మధ్య నెలకొన్న ఘర్షణ కీలక పాత్ర పోషిస్తుంది. అంతకుముందు, తన ఇన్‌స్టాగ్రాం పేజీలో జెర్సీలోని తన లుక్‌ను వెల్లడి చేశాడు షాహిద్. చేతిలో క్రికెట్ బ్యాట్‌తో, వైట్ జెర్సీలో కనిపిస్తున్న అతను "జెర్సీ ప్రిపరేషన్స్ బిగిన్స్' అంటూ పోస్ట్ చేశాడు.
మహేష్ బాబు కామెడీ టైమింగ్ సూపర్ గా ఉంటుంది. 'ఖలేజా', 'దూకుడు' అందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. కామెడీ సీన్స్ రాయడంలో అనిల్ రావిపూడిది అందెవేసిన చెయ్యి. 'పటాస్' నుండి 'ఎఫ్ 2' వరకు కామెడీతోనే ఈ దర్శకుడు హిట్లు కొట్టాడు. మహేష్, అనిల్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు ఇదొక సీరియస్ సినిమా అనే కలర్ ఇచ్చింది. మహేష్ ఆర్మీ ఆఫీసర్ లుక్ ఫస్ట్ వచ్చింది. తర్వాత కొండారెడ్డి బురుజు ముందు మహేష్ గొడ్డలి పట్టుకున్న లుక్ వచ్చింది. అయితే, ఈ సినిమాలో కామెడీ కూడా ఫుల్లుగా ఉంటుందని నటకిరీటి రాజేంద్రప్రసాద్ అన్నారు. "'సరిలేరు నీకెవ్వరు'లో మహేష్ బాబుతో నా పాత్ర టామ్ అండ్ జెర్రీలా ఉంటుంది" అని రాజేంద్రప్రసాద్ అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. అక్కడ ఫైట్ సీన్స్ తీస్తున్నారట. ఆల్రెడీ జమ్మూ కశ్మీర్, హైదరాబాద్ లో చాలా వరకు సీన్స్ తీశారు. కేరళ షెడ్యూల్ తో దాదాపు సినిమా పూర్తి అవుతుంది. తమన్నాతో మహేష్ ఇంట్రడక్షన్ సాంగ్ కేరళ నుండి వచ్చాక షూట్ చేసేలా ప్లాన్ చేశారు.
ఓ వార్త చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే... ఎన్టీఆర్ తనను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేశాడని దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పిన వార్త! ఓ వారం రోజుల క్రితం ఒక వార్తా ఛానల్ కు సురేందర్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. 'సైరా నరసింహారెడ్డి' విడుదలై, దాదాపుగా థియేటర్లలో నుండి వెళ్లిపోతున్న సమయంలో వచ్చిన ఇంటర్వ్యూ కావడంతో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదనుకుంట. అయితే, ఉన్నట్టుండి ఆ ఇంటర్వ్యూలో ఒక వీడియో క్లిప్ ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. దీనికి కారణం ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్. "నేను 'అతనొక్కడే' విడుదల తర్వాత ప్రభాస్ గారితో ఒక సినిమా చేయాలి. ఒక నిర్మాతకు కమిట్మెంట్ కూడా ఇచ్చాను. దురదృష్టవశాత్తూ అప్పుడు ఏం జరిగిందంటే... ఎన్టీఆర్ మేనేజర్ సుకుమార్ అని ఉండేవాడు. తను ఒక రోజు వచ్చి నన్ను తీసుకువెళ్లాడు. రెండు రోజులు నన్ను కూర్చోబెట్టి 'మనం సినిమా ఇలా చేద్దాం, అలా చేద్దాం' అన్నారు. తారక్ నన్ను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేశారు. మూడు రోజులు నన్ను ఫాలో అయ్యారు. తారక్ పెద్ద హీరో అని కలిశా. ఆయన నాకో కథ చెప్పించారు. నా స్టయిల్ కాదని అనిపించింది. చెప్పాను. తారక్ అడగడంతో చేశా. సినిమా చేశాక చూస్తే అందులో నేను చేసిన తప్పులు కనిపించాయి" అని సురేందర్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. 'అశోక్' తర్వాత సురేందర్ రెడ్డి తీసిన 'అతిథి' కూడా ప్లాప్. ఆ ప్లాప్ నుండి నేర్చుకున్నాని ఆయన చెప్పారు. కానీ, ఎన్టీఆర్ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేశాడనే క్లిప్ ను మాత్రమే యాంటీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. దీంతో పాటు "ఎన్టీఆర్ కి 'కేజీయఫ్' నచ్చడంతో ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేద్దామన్నారు. కథ వినాలి" అని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన క్లిప్ ను కూడా వైరల్ చేస్తున్నారు. నిజానికి, తమిళ సినిమా అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఇటువంటి వార్స్ ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు తెలుగు సినిమా అభిమానులు కూడా మొదలు పెడుతున్నట్టు ఉన్నారు. 
టబు బ్రహ్మచారి. పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడామె వయసు 48 ఏళ్ళు. అయితే అంత వయసున్నట్టు టబు కనిపించరు. టబు అందం ఆమె వయసును కొంతవరకు దాచేస్తుందనేది నిజమనే చెప్పాలి. అడవి కాచిన వెన్నెల అన్నట్టు... ఈ అందం వెండితెర ముందున్న ప్రేక్షకుల సొంతమే. టబు ఇంకా పెళ్లి చేసుకోలేదు కాబట్టి. ఆమె పెళ్లి ఎందుకు చేసుకోలేదనే విషయాన్ని పక్కన పెడితే... "ఇంకా నా పెళ్లి గురించి అడుగుతారేంటి?" అని  ఎదురు ప్రశ్నిస్తున్నారు. "నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది... ప్రజలు ఇంకా నా పెళ్లి గురించి అడుగుతుంటే. అయితే, నాపై వాళ్ళందరూ ఎంతో ప్రేమచూపిస్తున్నారు. ఏం జరిగినా... అంతా మన మంచికే అనుకుంటాను. జీవితంలో నేను ప్రేమను కోల్పోయానో? లేదో? తెలియదు. కానీ, జీవితంలో ప్రేమ అనేది ఓ అందమైన విషయం" అని టబు పేర్కొన్నారు. కొంత విరామం తర్వాత తెలుగులో 'అల... వైకుంఠపురములో' సినిమా చేస్తున్నారామె. త్రివిక్రమ్ అందమైన పాత్ర రాశారని టబు చెప్పారు. సినిమాలో ఎక్కువ డైలాగులతో కాకుండా, కళ్ళతో హావభావాలను వ్యక్తం చేసే పాత్ర తనదని టబు అన్నారు.
  విజయ్ దేవరకొండ నాలుగైదేళ్ల క్రితం వరకు కెరీర్‌లో చాలా స్ట్రగుల్ పడ్డాడు. సినిమా ఛాన్సుల కోసం ఆడిషన్స్‌లో పాల్గొన్నాడు. డబ్బు కోసం చిన్న చిన్న పాత్రలు చేశాడు. సీన్ కట్ చేస్తే.. ఇవాళ అతను యూత్ ఐకాన్. అతనికి కథలు వినిపించాలని రైటర్లూ, అతడితో పనిచెయ్యాలని డైరెక్టర్లూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆ దశ నుంచి ఈ దశకు రావడం అంత ఈజీగా జరగలేదు. విజయ్ చివరిసారిగా ఆడిషన్‌లో పాల్గొన్న సినిమా.. 2015లో వచ్చిన 'ఎవడే సుబ్రమణ్యం'. 'పెళ్లిచూపులు' సినిమా కంటే ముందు మూడు సినిమాల ఆడిషన్స్‌కు అటెండ్ అయ్యాడు. వాటిలో వేషాలు చేజిక్కించుకున్నాడు. రవిబాబు డైరెక్ట్ చేసిన 'నువ్విలా', శేఖర్ కమ్ముల సినిమా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాల్లో ఆడిషన్ల ద్వారానే నటించాడు. అప్పుడు అతని స్క్రీన్ నేం 'విజయ్ సాయి'. ఆడిషన్లంటే అతనికి అయిష్టం కాదు కానీ, ప్రొడక్షన్ ఆఫీసుకు వెళ్లి, అక్కడ మరికొంతమందితో పాటు తనకు ఎప్పుడు అవకాశం వస్తుందా.. అని ఎదురుచూడాల్సి రావడమంటే చాలా కష్టంగా ఉండేది. అందరూ ఆడిషన్‌లో తాము ఎంపికవుతామని ఆశపడేవాళ్లే. అలాగే మిగతావాళ్లను దాటుకొని, తాను ఆ ఛాన్స్ దక్కించుకుంటానని నమ్మేవాడు విజయ్. అయితే నటుడిగా తన కెరీర్‌లో చేదు దశగా అతను దాన్ని భావిస్తాడు. అలాంటి దశ మళ్లీ ఎన్నడూ తన జీవితంలో రాకూడదని అతను కోరుకుంటున్నాడు. మనం శుక్రవారం సినిమాలకు వెళ్తాం. టికెట్ కొని, దాన్ని ఎంజాయ్ చేస్తాం. కానీ తెరవెనుక చూస్తే, ఒక సినిమా మేకింగ్‌లో భాష, ప్రాంతం, పాలిటిక్స్ ప్రధాన పాత్ర వహిస్తాయని విజయ్‌కు బాగా తెలుసు. "ఒక కళగా అది 'క్లీన్' కాదు. డబ్బు, వ్యాపారం, అధికారం, కులం అనేవి అక్కడ రాజ్యం చేస్తుంటాయి. నాకు అదొక యుద్ధం లాంటిది" అని చెబుతాడు విజయ్. నటన అనేది అతడి పనిలో 30 శాతమే అని జనానికి తెలీదు. మిగతా 70 శాతం ఏమిటనేది.. అతడిని అత్యంత సమీపంగా చూసేవాళ్లకే తెలుస్తుంది. ఒక సినిమా చెయ్యాలంటే అనేకమంది కలిసి పనిచెయ్యాలి. జనానికి బెస్ట్ ఇవ్వడానికి కృషి చెయ్యాలి. ఎక్కువగా కొత్తవాళ్లతో పనిచేస్తుండటం వల్ల, ఆ సినిమా పూర్తి కావడానికీ, దాన్ని ప్రమోట్ చెయ్యడానికీ మరింత ఎక్కువగా అతను కష్టపడుతున్నాడు. విజయ్‌కు ఇవాళ డబ్బు అనేది ప్రయారిటీ కాదు. కంటెంట్ తనను ఎగ్జైట్ చేస్తేనే సినిమాలు ఒప్పుకుంటున్నాడు. గతంలో డబ్బు కోసం అతను చాలా పనులు చేశాడు. డబ్బు కోసమే మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఒక ఇల్లు కొనాలనే ఉద్దేశంతో 'నీ వెనకాలే నడిచి' అనే  ఒక మ్యూజిక్ వీడియో కూడా చేశాడు. కానీ దాంతో వచ్చిన డబ్బు ఇల్లు కొనడానికి సరిపోలేదు. పదివేల రూపాయలు, అంతకంటే ఎక్కువ వస్తుందనుకుంటే ఏ పని చెయ్యడానికైనా సిద్ధపడ్డ రోజులున్నాయి. ఆ రోజులు గతించాయి. ఇవాళ తన పనికి తగ్గ ఆదాయం గడిస్తున్నాడు. అయితే కంటెంట్ నచ్చకపోతే, ఎంత డబ్బు ఇచ్చినా చెయ్యకూడదనే డెసిషన్ తీసుకున్నాడు.  కొత్తవాళ్లతో పనిచెయ్యడానికి అతను సిద్ధంగా ఉంటాడు. అలా అని 'నేను బ్లాక్‌బస్టర్ సినిమా తీస్తాను' అని ఊరికే మాటలు చెప్పేవాళ్లతో కలిసి పనిచెయ్యాలని అతను అనుకోవట్లేదు. ఎవరైనా తన దగ్గరకు కొత్త డైరెక్టర్ వస్తే, అతను చేసిన షార్ట్ ఫిల్మ్ కానీ, యాడ్ ఫిల్మ్ కానీ చూపించమని అడుగుతున్నాడు విజయ్. అవి చూశాకే, స్క్రిప్ట్ వినడానికి అతను ఆసక్తి చూపిస్తున్నాడు. అలా కాకుండా ప్రతి ఒక్కరి కథనూ వింటూ పోతే, తన మెదడు బ్లాంక్ అయిపోతుందని అతను భావిస్తున్నాడు. అతడి దృష్టిలో డైరెక్టర్స్ అనేకమంది ఉన్నారు కానీ, యాక్టర్లు మాత్రం ఒక గుప్పెడు మంది మాత్రమే ఉన్నారు. యాక్టర్ అవసరమైన స్క్రిప్టులు చాలానే ఉన్నాయి. విజయ్‌లో ఉన్న గుణమేమంటే.. అతను ఏ సినిమా ఒప్పుకున్నా, తన పాత్రను ఎలా పోషించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతుంటాడు. చేసే ప్రతి సినిమాతో నటుడిగా అతను ఇంకో రేంజికి వెళ్తాడని విజయ్ ఫ్యాన్స్ ఆశిస్తూ ఉంటారు. ఈ విషయం విజయ్‌కు బాగా తెలుసు. ఆ భయం విజయ్ మనసును తొలుస్తూ ఉంటుంది. ఉదాహరణకు 'డియర్ కామ్రేడ్' చేసేటప్పుడు కొన్ని సీన్లను విని, వాటిని తాను చేయగలనా అని భయపడ్డాడు. కానీ చివరకు ఆ భయాన్ని జయించి వాటిని చేశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ రిజల్టును పక్కనపెడితే నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు. త్వరలో అతను 'వరల్డ్ ఫేమస్ లవర్'గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీతో అతను ఎంతమంది హృదయాల్ని కొల్లగొడతాడో చూడాలి.
గత గురువారం నటి అర్చన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఓ హెల్త్‌కేర్‌లో వైస్ ప్రెసిడెంట్ అయిన ప్రముఖ పారిశ్రామివేత్త జగదీష్‌తో ఆమె వివాహం జరిగింది. వీరిద్దరినీ కలిపింది నటుడు శివబాలాజీ దంపతులు. అయితే... తమది ప్రేమ వివాహాం కాదనీ, అరేంజ్డ్ లవ్ అనీ అంటోంది అర్చన. జగదీష్, అర్చనను శివబాలాజీ దంపతులు కలిపిన తర్వాత ఇద్దరూ ఇంట్లో పెద్దలకు మీటింగ్ ఆరెంజ్ చేశారట. వాళ్ళ మీటింగ్ తర్వాతే తమ మధ్య ప్రేమ మొదలైందని అర్చన చెప్పుకొచ్చింది. కొత్తగా పెళ్ళైన జగదీష్, అర్చన జంట హనీమూన్ కోసం ఎక్కడికి వెళుతున్నారో తెలుసా? మ్యాగ్జిమమ్ అమెరికా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇంకా ఫుల్ ప్లానింగ్ చేయలేదట. అమెరికాను ఒక ఆప్షన్ గా పెట్టుకున్నామన్నాడు. పెళ్ళికి ముందు పెళ్లి ప్లానింగ్ తో సరిపోయిందనీ, హనీమూన్ గురించి ఆలోచించలేదనీ... ఇప్పుడు న్యూ ఇయర్, హనీమూన్ ట్రిప్ ఒకేసారి ప్లాన్ చేస్తున్నామని జగదీష్ చెప్పాడు.
  దేశం గర్వించదగ్గ తారల్లో రేఖ ఒకరనే విషయాన్ని ఎవరైనా అంగీకరిస్తారు. ఆమెకు అక్కినేని నాగేశ్వరరావు అవార్డు వరించింది. ఆదివారం (నవంబర్ 17) అన్నపూర్ణ స్టూడియోస్‌లో కన్నుల పండువగా జరిగిన వేడుకలో 2018 సంవత్సరానికి శ్రీదేవి తరపున ఆమె భర్త బోనీ కపూర్, 2019 సంవత్సరానికి రేఖ.. ఈ అవార్డును అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి వాటిని అందజేశారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో రేఖను ఆకాశానికెత్తేశారు చిరంజీవి. కేవలం ఆమె గురించే దాదాపు 5 నిమిషాల సేపు మాట్లాడారు. ఆమె తన ఆరాధ్య తార అనీ, ఆమెను దృష్టిలో ఉంచుకొనే తన భార్య సురేఖను 'రేఖా' అని పిలుస్తాననీ ఆయన చెప్పారు. "పార్లమెంటంటే అందరికీ తెలుసు. రచ్చ రచ్చగా ఉంటుంది. కేకలు, కేరింతలు, పేపర్లు విసిరేసుకోవడాలు.. ఇవన్నీ ఉంటాయి. ఒకసారి రాజ్యసభలో.. ఈ గొడవలన్నీ మనకెందుకని తలవంచుకొని సెల్‌ఫోన్ చూసుకుంటున్నాను. ఒక్కసారిగా రాజ్యసభంతా సైలెంట్ అయిపోయింది. ఏంటా.. అని ఆశ్చర్యపోతూ నేను తలెత్తి చూస్తే.. అందరి తలలూ పొద్దు తిరుగుడు పువ్వులా ఒకవైపే చూస్తున్నాయి. ఒక అద్భుత సౌందర్యరాశి.. లోపలికి వస్తున్నారు. నేను అందర్నీ ఒకసారి చూశాను.. నోళ్లు వెళ్లబెట్టుకొని చూస్తున్నారు. ఆ అందాలరాశి ఎవరో కాదు, నా తోటి రాజ్యసభ సభ్యురాలు రేఖ గారు!" అని ఆయన గుర్తు చేసుకున్నారు. రేఖ వంక చూస్తూ.. "మీకు గుర్తుందా.. ఆరోజు మీరెంత మందిని డిస్టర్బ్ చేశారు! వాళ్ల ప్రాబ్లెమ్స్‌ని చర్చించుకోనీయకుండా, వాళ మెదళ్లలోని మేటర్‌ని మర్చిపోయేలా చేశారు" అన్నారు. "ఆరోజు సభ జరగలేదంటే ఒట్టు. ఆరోజు ఆమె తెలుసుకున్నారు.. తాను రాజ్యసభకు వస్తే డిస్టర్బెన్స్ అని. దాంతో ఆమె తాను అక్కడికి రావడం తగ్గించుకుంటే బెటర్ అని.. అప్పుడప్పుడు గెస్ట్‌గా వస్తుండేవారు" అని చిరంజీవి చెప్పారు. ఇది అతిశయోక్తి కాదనీ, నిజంగా జరిగిందనీ అన్నారు.. "స్టాండింగ్ బ్యూటీ, టైంలెస్ గ్లామర్, ఏజ్‌లెస్ బ్యూటీ.. ఎవరంటే.. ఒక్క రేఖగారు తప్ప ఎవరిని చెప్పుకోగలం! అలాంటి లెజెండరీ పర్సనాలిటీ చేతుల మీదుగా నేను లెజెండరీ ఫిలింఫేర్ అవార్డు తీసుకోవడం.. నేను జీవితంలో మర్చిపోలేని అద్భుత సంఘటన" అని తెలిపారు చిరంజీవి. ఎయిటీస్ క్లబ్ అని సౌత్ ఇండియన్ స్టార్స్ అంతా సెలబ్రేట్ చేసుకొనేది.. ఈసారి తమ ఇంట్లో చేసుకుందామని ప్లాన్ చేసి, రేఖ గారిని దానికి స్పెషల్ గెస్ట్‌గా రావాలనీ, వస్తే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతారనీ పదిహేను రోజుల క్రితం ఫోన్ చేసి అడిగాననీ రావడానికి ప్రయత్నిస్తా అన్నారనీ ఆయన చెప్పారు. వస్తారో, రారో చూడాలన్నారు. "కాలేజీ రోజులు ముగిసే కాలం నుంచీ, ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాక కూడా ఆమె సినిమాలు చూస్తూనే ఉన్నాను. నేను ఆరాధించే నటీమణుల్లో ఆమె ప్రధానంగా ఉంటారు. ఆవిడంటే అంత ఆరాధన. ఆ విషయం ఆమెకు ఎన్నోసార్లు చెప్పాను కూడా. ఈరోజున నా చేతుల మీదుగా ఆమెకు అవార్డు ఇవ్వడమన్నది నాకు అమితమైన సంతోషాన్నిస్తోంది. అది నాకు లభించిన అదృష్టం. ఆమెకు అక్కినేని నాగేశ్వరరావు అవార్డు రావడం ఆమెకు గౌరవం. ఆమెకు అవార్డు ఇవ్వడం నాకు గౌరవం" అన్నారు చిరంజీవి.  ఆమెపై తనకున్నఇష్టానికి నేచర్ స్పందించిందేమో తెలీదనీ, తనకు భార్యగా సురేఖ దొరికిందన్నారు. "తనను అందరూ సురేఖ అని పిలుస్తారు. నేను మాత్రం రేఖా అని పిలుస్తాను. నా ఆరాధ్య నటీమణి రేఖను దృష్టిలో పెట్టుకొని తనను రేఖా అని పిలుస్తుంటానని ఆమెకు తెలీదు. (నాగార్జునను చూస్తూ).. ఇది నా వైఫ్ చూడకపోతే బెటర్.. ఎడిట్ చేసి పక్కనపెడితే బెటర్" అని నవ్వేశారు మెగాస్టార్.
రేఖ అందంగా ఉంటారు. ఆమెది ముగ్ద మనోహరమైన మోము. అంతేనా? ఆమె తెలుగు పలుకులూ అంతే అందంగా ఉంటాయి. ఆదివారం ఏయన్నార్ జాతీయ పురస్కారం అందుకున్న సందర్భంగా రేఖ తెలుగులో మాట్లాడుతుంటే వేదిక పైన ఉన్న అతిథులు చిరంజీవి, టి. సుబ్బరామిరెడ్డితో పాటు అక్కినేని కుటుంబం, వేదిక ముందున్న ప్రేక్షకులు, టీవీల ముందున్న వీక్షకులు కళ్ళు అప్పగించారు. ఆమె అంత అందంగా మాట్లాడారు. గులాబీ మొక్కకు అంటు కట్టినట్టు! తల్లితండ్రుల జీన్స్, ప్రేక్షకుల ప్రేమాభిమానాలు తన అందానికి కారణమని ఆమె అన్నారు. అక్కినేనితో తనకున్న అనుబంధాన్ని రేఖ గుర్తు చేసుకున్నారు. "మా చిన్నాన్న వేదాంతం రాఘవయ్య గారు చెబుతుండేవారు. 'ఆ అబ్బాయికి సిగ్గు గానీ కెమెరా ముందుకొస్తే ఇరగదీస్తాడు' అని. అమ్మను 'ఆ అబ్బాయి' ఎవరు? అని అడిగా. అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పింది. తర్వాత ఆయన నటించిన 'సువర్ణ సుందరి' చూశా. నేను చూసిన తొలి చిత్రమిది. తర్వాత వందసార్లైనా చూసి ఉంటాను. నాకు సినిమా పిచ్చి పట్టేసింది. ఆ సినిమా చూసే సినిమా అంటే ఏంటో తెలుసుకున్నాను. నేను నటి కావడానికి అక్కినేని, అంజలి అత్తయ్య కారణం. నటి అయ్యాక, అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ చేసేటప్పుడు అక్కినేని గారి ఇంటి ముందు వెళుతూ, ఆ ఇంటికి దణ్ణం పెట్టుకునేదాన్ని. అక్కినేనిగారిని ఎప్పుడు కలుస్తానా? అని ఎదురుచూసేదాన్ని. ఒకరోజు ఆయన ఇంటికి పిలిచారు. భోజనం చేస్తూ చాలా విషయాలు మాట్లాడుకున్నాం" అని రేఖ అన్నారు. రేఖకు ఏడాది వయసు ఉన్నప్పుడు 'ఇంటిగుట్టు'లో నటించారు. బాలనటిగా 'రంగులరాట్నం' చేశారు. కథానాయికగా హిందీ సినిమాలు ఎక్కువ చేశారు. అయితే, తెలుగులో కథానాయికగా నటించిన ఆమె తొలి సినిమా 'అమ్మ కోసం'. రేఖ తల్లి పుష్పవల్లి తెలుగు బిడ్డ. తన బిడ్డ తెలుగు సినిమా చేయాలని ఆమె కోరుకున్నారు. అందుకోసం మళ్ళీ తెలుగులో నటిస్తానని రేఖ అన్నారు. "మా అమ్మ నన్నెప్పుడూ తెలుగులో ఒక్క సినిమా చేయమ్మా అనేది. ఆమె ఆసుపత్రిలో ఉన్నప్పుడు నన్ను తెలుగులో సినిమా చేయమని కోరింది. అమ్మ కోసం మరోసారి తెలుగు సినిమా చేస్తా. స్పష్టంగా తెలుగు నేర్చుకుని సినిమా చేస్తా" అని రేఖ అన్నారు. ఆమె కోసం దర్శక, రచయితలు ప్రత్యేకంగా పాత్రలు రాసుకోవచ్చు అన్నమాట.
  టీడీపీ అధినేత, అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలతో ఎంఎంటీఎస్ పురుడు పోసుకుంది. పెరుగుతున్న జనాభా, తీవ్రమవుతున్న ట్రాఫిక్, ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా ఈ మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు రూపకల్పన చేశారు చంద్రబాబు. కొత్తగా ఎలాంటి రైల్వే ట్రాక్ నిర్మాణం చేపట్టకుండానే... ఉన్న వాటిని వినియోగించుకుంటూ... అద్భుతమైన, సౌకర్యవంతమైన ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. 2003లో ప్రారంభమైన ఎంఎంటీఎస్ కు మొదట్లో ఆశించినంత ఆదరణ లభించకపోయినా, అనంతరం ఎవరూ ఊహించనిస్థాయిలో పుంజుకుంది. ఒక్కో ట్రైన్ లో కోచ్ ల సంఖ్య 12కి పెరగడంతోపాటు అత్యాధునిక టెలిస్కోపిక్ బోగీలు అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభంలో 25వేల మంది ప్రయాణికులు, 30 సర్వీసులతో మొదలైన ఎంఎంటీఎస్ సేవలు అంచెలంచెలుగా పెరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ చేరుకునేవారంతా... తమ చివరి గమ్యస్థానాలకు చేరడానికి ఎంఎంటీఎస్ నే ఆశ్రయించేస్థాయికి చేరింది. ఇక, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతోపాటు ఐటీ ఎంప్లాయిస్ పెద్దఎత్తున ఈ ఎంఎంటీఎస్ ను వినియోగిస్తున్నారు. దాంతో, ప్రతిరోజూ సుమారు రెండు లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతోంది ఈ ఎంఎంటీఎస్. హైదరాబాదీల బిజీ జీవితంలో ఎంఎంటీఎస్ ఒక భాగమైపోయింది. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ ఎంఎంటీఎస్ సర్వీసులను....రాత్రి 11గంటల వరకు మొత్తం 121 ట్రిప్పులు నడిపిస్తున్నారు. ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–ఫలక్‌నుమా, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్‌–లింగంపల్లి మధ్య ఈ సర్వీసులు నడుస్తున్నాయి. అయితే, పదహారేళ్ల ఎంఎంటీఎస్ చరిత్రలో మొదటిసారి ప్రమాదం చోటు చేసుకోవడంతో హైదరాబాదీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో కర్నూలు ఎక్స్ ప్రెస్ ను ఎంఎంటీఎస్ ట్రైన్ ఢీకొట్టడంతో 30మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది. అయితే, ప్రమాదం జరిగే సమయంలో రెండు రైళ్ల వేగం తక్కువగా ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. ఏ కొంచెం వేగం ఉన్నా... ఊహించని ప్రాణనష్టం జరిగి ఉండేదని రైల్వే అధికారులు అంటున్నారు. ఎంఎంటీఎస్ సర్వీసులకు సెపరేట్ ట్రాక్ లేకపోయినప్పటికీ, ఇఫ్పటివరకు ఎలాంటి ప్రమాదాలు చేసుకోలేదు. ఫస్ట్ టైమ్ ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఎంఎంటీఎస్ చరిత్రలో తొలిసారి ప్రమాదం జరగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు.
  అయోధ్య వివాదం 1822లో మొదలైంది. ఫైజాబాద్ కోర్టు అధికారి హఫీజుల్లా... ఓ కేసు సందర్భంగా దీన్ని వివాదంగా పేర్కొన్నారు. కానీ, 1957లో తొలి వ్యాజ్యం పడింది. బాబ్రీ మసీదులో పనిచేసే మౌల్వీ మహ్మద్ అస్ఘర్ ఈ వ్యాజ్యం వేశారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు ప్రాంతాన్ని హనుమాన్ గఢీ మహంత్ బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. దాంతో, హనుమాన్ గఢీ మహంత్ లో ఉండే వైష్ణవ బైరాగులు ప్రతి కేసు దాఖలు చేశారు. బాబ్రీ మసీదు స్థలం... రాముడు పుట్టిన చోటు అంటూ వైష్ణవ బైరాగులకు చెందిన నిర్మోహీ అఖాడా 1857లో కోర్టును ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలు విన్న ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం... వివాదాస్పద స్థలంలో అడ్డుగోడ కట్టించి, హిందువులంతా తూర్పువైపు నుంచి.... ముస్లింలు ఉత్తరం వైపు నుంచి వెళ్లాలని ఆదేశించింది. ఇక, 1860-84 మధ్య అయోధ్య స్థలంపై అనేక కేసులు దాఖలు అయ్యాయి. కానీ అతిముఖ్యమైన కేసు 1885లో పడింది. వివాదాస్పద స్థలానికి(రామజన్మస్థానం) తానే మహంత్ నని, అక్కడ రామాలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ ధార్మిక నేత రఘువర్ దాస్ పిటిషన్ వేశారు. అయితే, దాన్ని 1986లో కోర్టు కొట్టివేసింది. అయితే, వివాదాస్పద ప్రాంతాన్ని హిందువులు రామజన్మభూమి అని బలంగా నమ్మడానికి దోహడపడింది. దాంతో అప్పట్నుంచి 1923వరకు అనేక వ్యాఖ్యాలు నమోదయ్యాయి.  అయితే, 1949లో అయోధ్య బాబ్రీ మసీదు లోపల... కొందరు బలవంతంగా సీతారామలక్ష్మణుల విగ్రహాలు పెట్టడంతో... దేశ చరిత్రలోనే అతిపెద్ద వివాదంగా రూపుదాల్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలోనే ఈ వివాదం పురుడు పోసుకుంది. అయితే, 1949 డిసెంబర్ 29న బాబ్రీ మసీదు ఉన్న వివాదాస్పద ప్రాంతంలో యథాతధ స్థితిని కొనసాగించాలని ఫైజాబాద్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దాంతో, ఆ ప్రాంతాన్ని మూసివేసి, ముస్లింలకు అనుమతి నిరాకరించారు. అయితే హిందూ పూజల నిమిత్తం నలుగురు పూజారులకు మాత్రం అనుమతి ఇచ్చారు. అనంతరం 1950 జనవరి 16న హిందూమహాసభ కార్యకర్త గోపాల్ సింగ్ విశారద్ కేసు వేశారు. వివాదాస్పద ప్రాంతంలో ఉన్న హిందూ విగ్రహాలను ఎప్పటికీ తొలగించరాదని, పూజలు చేసుకోనివ్వాలని కోరారు. ఇక, 1959లో నిర్మోహీ అఖాడా మరో పిటిషన్ వేసింది. అది రాముడు పుట్టిన చోటని, ఆ స్థలాన్ని తమకు అప్పగించాలని కోరింది. దాంతో, 1961 డిసెంబర్ 18న సున్నీ వక్ఫ్ బోర్డు కౌంటర్ పిటిసన్ వేసింది. అక్కడున్న బాబ్రీ మసీదును బాబర్ కట్టించాడని, ఆ ప్రాంతం తమకే చెందుతుందని, దాన్ని తమకు అప్పగించాలని కోరింది. ఇక, 1990ల్లో ఈ వివాదం పతాకస్థాయికి చేరింది. 1992 డిసెంబర్ 6న లక్షల మంది కరసేవకులు బాబ్రీ మసీదును నేలమట్టం చేశారు. ఈ ఘటన వివాదాన్ని మరో మలుపు తిప్పింది.  అనంతరం, ఈ వివాదంపై 1992 నుంచి 2002వరకు అలహాబాద్ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, 2010 జులై 26న తీర్పు ప్రకటించిన అలహాబాద్ హైకోర్టు... వివాదాస్పద ప్రాంతాన్ని మూడు పక్షాలకు సమానంగా పంచుతూ నిర్ణయం ప్రకటించింది. అయితే, అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ, సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. దాంతో, అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించింది. ఇక, 2019 ఆగస్ట్ 6 నుంచి అక్టోబర్ 16వరకు ఏకధాటిగా 40రోజులపాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు... 2019 నవంబర్ 9న చారిత్రాత్మక తీర్పు ప్రకటించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని హిందువులకు అప్పగిస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సంచలన నిర్ణయం ప్రకటించింది.
తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు భూవివాదమే కారణమని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా గౌరెల్లి గ్రామానికి చెందిన రైతు సురేష్‌... ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే, లంచం కోసం వేధించినందుకే సురేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని సర్వే నెంబర్ 90, 101లో గల 20 ఎకరాలకు సంబంధించిన భూవివాదమే విజయారెడ్డి హత్యకు కారణంగా తెలుస్తోంది. తన వ్యవసాయ భూమిని ఓ రియల్టర్‌కు కట్టబెట్టేలా రిపోర్ట్ ఇవ్వడంతో... కొద్దిరోజులుగా సురేష్‌....  అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు చెబుతున్నారు. అన్యాయంగా తన భూమిని రియల్టర్‌కు కట్టబెట్టేలా వ్యవహరించినందుకే... మనోవేదనకు గురై... ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హయత్‌నగర్ మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన సురేష్‌... ల్యాండ్ మ్యుటేషన్ కోసం తహశీల్దార్ విజయారెడ్డికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఎంతకీ తన పని కాకపోవడంతో.... విజయారెడ్డిపై కోపం పెంచుకున్న సురేష్‌.... ఈ హత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. ఇక, నిందితుడు సురేష్‌కి కూడా తీవ్ర గాయాలు కావడంతో... కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. తహశీల్దార్ విజయారెడ్డి హత్యపై ప్రాథమిక సమాచారంతో కేసు నమోదు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. అసలు, విజయారెడ్డి కార్యాలయంలోకి దుండగుడిని ఎవరు అనుమతించారు... హత్యకు అసలు కారణమేంటనే సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, భూవివాదంలో... విజయారెడ్డి మర్డర్ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామన్న సీపీ.... దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తామని తెలిపారు. తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యతో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు. విజయారెడ్డి హత్యను ఖండిస్తూ రెవెన్యూ సిబ్బంది ఎక్కడికక్కడ ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించిన రెవెన్యూ ఉద్యోగులు.... పెద్దఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.
  ప్రస్తుతం మనం జనాలకి పెద్దగా తెలియదు కదా అని నోటికి ఏదొస్తే అది వాగకూడదు. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఉద్దరించాలి అనుకునేవారైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కొందరు.. అబ్బే, ఇప్పుడు మనం పెద్దగా ఎవ్వరికి తెలీదు కదా అని రెచ్చిపోయి.. వారి కులపోళ్ళని పొగుడుతూ ఓ నాలుగు ట్వీట్లు.. మిగతా వ్యక్తుల్ని, మిగతా కులాల్ని నీచంగా కించపరుస్తూ మరో నాలుగు ట్వీట్లు చేస్తారు. కట్ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత ఓ రాజకీయ పార్టీలో చెప్పుకోదగ్గ స్థానంలో ఉంటారు. ఎవరైనా.. అయ్యా అప్పట్లో మీరు ఇలా వాగారంటూ సాక్ష్యాలతో సహా బయటపడితే.. దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో అర్థంగాక ఆకులు పట్టుకుంటారు. ఇప్పుడు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పరిస్థితి ఇదే.     ప్రస్తుతం ఏపీలో ఇసుక కొరతపై విపక్షాలు ఉద్యమిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా లాంగ్ మార్చ్ కి పిలుపునిచ్చారు. ఈ మార్చ్ కి టీడీపీ, బీజేపీ మద్దతు కూడా కోరారు. పవన్ తలపెట్టిన ఈ మార్చ్ కి ఇరు పార్టీల అధినేతలు సానుకూలంగా స్పందించినట్లు వార్తలొచ్చాయి. అయితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సానుకూలంగా స్పందించడం.. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి అస్సలు నచ్చలేదంట. ఇంకేముంది పవన్ తలపెట్టిన ఆందోళనలో కన్నా పాల్గొనాల్సిన అవసరంలేదంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో విష్ణు పేరుకి బీజేపీలో ఉన్నా.. ఆయన కులానికి చెందిన జగన్ మోహన్ రెడ్డి పార్టీకి మద్దతుగా మాట్లాడతారని, ఆయనకు కులపిచ్చి అని విమర్శలు మొదలయ్యాయి. అయితే ఇవేవో సాధారణ రాజకీయ విమర్శలు కాదు. జనసైనికులు ఎంతో శ్రమించి దాదాపు పదేళ్ల క్రితం నాటి సాక్ష్యాలను వెలికి తీసి.. విష్ణుకి కులపిచ్చి ఉందని రుజువుచేసారు.     దాదాపు పదేళ్ల క్రితం.. విష్ణువర్ధన్ రెడ్డి పెద్దగా ఎవ్వరికీ తెలీదు. అయితే అప్పట్లో ఆయన చేసిన ట్వీట్లు చూస్తే తెలియకపోవడమే మంచిది అనుకుంటారు. ఆయన ట్వీట్లు చూస్తే ఆయనకు ఎంత కులపిచ్చి ఉందో అర్ధమవుతుంది. ఆయన కులానికి చెందిన వారిని పేరుపేరునా పొగుడుతూ ట్వీట్ చేయడం. మిగతా కులాల్ని కించపరచడం. అంతేకాదు ఆడవారి అందాల గురించి సంస్కారం లేకుండా మాట్లాడటం. ఇలా ఆయన పదేళ్ల క్రితం చేసిన ఏ ట్వీట్ చూసినా చండాలమే. ఛీ ఛీ ఈయన ఓ జాతీయ పార్టీ నాయకుడా అనుకునేలా ఉన్నాయి ఆయన ట్వీట్స్. రాజకీయ నాయకుడు కులాలు, మతాలతో సంబంధం లేకుండా.. అందర్నీ కలుపుకొని పోతూ ప్రజలకి మంచి చేయాలి. కానీ ఈయన నరనరాల్లో కులపిచ్చి నింపుకొని ప్రజాసేవ అర్థాన్నే మార్చేశారు. దీంతో ప్రస్తుతం విష్ణుపై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది.     కాగా, పదేళ్ల క్రితం ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవ్వడం, విమర్శలు రావడంతో.. విష్ణు మొదట ఆ ట్వీట్లను డిలీట్ చేసే ప్రయత్నం చేసారు. ఆ ట్వీట్లు వందల్లో ఉండటంతో ఇక చేసేది లేక అకౌంట్ నే తీసేసారు. అయినా స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుండటంతో.. ఇక చేసేదేమి లేక.. అబ్బే ఆ ట్వీట్లకు నాకేం సంబంధం లేదు, అప్పట్లో ఆ అకౌంట్ ని థర్డ్ పార్టీ చూసేది అంటూ ఏదో చెప్పుకొచ్చారు. కానీ అవి నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే.. ఒకవేళ నిజంగానే ఆయనకు ఆ ట్వీట్లకు సంబంధం లేకపోతే.. విమర్శలు రాగానే కొన్ని ట్వీట్లు ఎలా డిలీట్ అయ్యాయి? తర్వాత ఏకంగా అకౌంటే ఎందుకు డిలీట్ అయింది?. అందుకే అంటారు చేతులు కాలాక ఆకులు పట్టుకోకూడదు.. ముందే చేతులు కాలకుండా చూసుకోవాలి అని. మరి ఇప్పటి ప్రభుత్వాలు.. ఎవరైనా సామాన్యులు చిన్న ట్వీట్ చేస్తే చాలు.. కేసులు, అరెస్ట్ లు అంటున్నాయి.. మరి ఈయన గారు కులాల్ని కించపరుస్తూ చేసిన ట్వీట్లపై ఎలా స్పందిస్తాయి?. వీటిపై విచారణ చేసి, చర్యలు తీసుకునే సాహసం చేస్తాయా? చూడాలి.
  అధికారం చేతిలో ఉంటే తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయటం తేలిక. ఒకవేళ ఎవరైనా అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయినా, వారి పార్టీ అధికారంలో ఉందనుకోండి ఆయా నేతలు తమ తమ నియోజక వర్గాల్లో అనధికార ఎమ్మెల్యేలుగా కూడా చలామణి కావచ్చు. బదిలీలు, పోస్టింగ్లు అభివృద్ధి పనుల్లో జోక్యం చేసుకోవటాలు ఇలా ఒక్కటని కాదు ఇంకా ఎన్నెన్నో చేయొచ్చు. అయితే ఇలాంటి వారికి అన్నివేళల్లో కాలం కలిసి వస్తోందని లేదు ఒక్కోసారి స్వపక్షం లోనే చెక్ పెట్టే వారుండొచ్చు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇదే జరుగుతోంది. పశ్చిమలో ఉండి నియోజకవర్గానికి ఆంధ్ర ప్రదేశ్ లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం ఎప్పట్నుంచో జరుగుతోంది. రాజకీయంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి ఉండి నియోజకవర్గం కంచుకోట. గతంలో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచినప్పుడు, మొన్నటి ఎన్నికల్లో ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీచినపుడు కూడా ఇక్కడి ఓటర్లు టిడిపికే పట్టం కట్టారంటే ఆ పార్టీ పట్ల స్థానికులకు ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం అలా ఉంచితే 2019 ఎన్నికల్లో ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసిన పీవీఎల్ నరసింహరాజు ఓడిపోయారు కానీ, రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన అనధికార ఎమ్మెల్యేగా చలామణి కావడం మొదలు పెట్టారు. అధికారులు అసలు ఎమ్మెల్యే కంటే కొసరు ఎమ్మెల్యేకి ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. అధికార కార్యక్రమాల్లోనూ పీవీఎల్ హవా చలాయిస్తున్నారు అంటే ఆ సార్ కు అధికార యంత్రాంగం ఏ స్థాయిలో గౌరవిస్తుందో గ్రహించవచ్చు. అటువంటి పీవీఎల్ నరసింహరాజుకి ఇప్పుడు సొంత పార్టీలోనే ఎదురు గాలి మొదలైంది. కొందరు నేతలకు ఆయన వైఖరి రుచించడం లేదు, దీంతో సదరు అనధికార ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వేరు కుంపటి పెట్టారు. దీనికి ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజును పెద్దతలకాయగా పెట్టుకున్నారు. గత ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి విముఖత చూపిన సర్రాజు తమ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రస్తుతం యాక్టివ్ రోల్ పోషించడం మొదలు పెట్టారు. ఇదే చివరకు పీవీఎల్ నరసింహరాజు, సర్రాజు మధ్య ఆధిపత్య పోరుగా పరిణమించింది. ఉండిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మొదటి నుంచి అనేక మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. మొదట్లో ఈ నియోజక వర్గం ఇన్ చార్జిగా మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు వ్యవహరించేవారు. గత ఎన్నికలకు ముందు ఆయన పోటీ చేయడానికి ఇష్టపడలేదు. ఈ పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తనైన పీవీఎల్ నరసింహరాజును తెరపైకి తెచ్చారు. ఆయనకే ఉండి ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆ తర్వాతి ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ను కూడా ఇచ్చారు. కానీ నాటి ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు, అంతటితో ఆయన హుందాగా ఊరుకుంటే బావుండేదేమో కానీ, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన రూటు మార్చి నియోజక వర్గాల్లో జరిగే అధికార, అనధికార కార్యక్రమాలన్నింటి లోనూ తలదూర్చడం మొదలుపెట్టారు. అన్నింటా తనదే పైచేయిగా ఉండేలా చక్రం తిప్పుతున్నారు, ఆ  మధ్య కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. నాకు పార్టీలోకి రావడం ఇష్టం లేదు వైయస్ జగన్ పిలిచి మరీ టికెట్ ఇవ్వడంతో పోటీ చేశాను, పార్టీ అభ్యర్ధులకు ఎన్నికల్లో పది కోట్లు, ఎనిమిది కోట్ల చొప్పున ఖర్చుల కోసం ఇచ్చారు నేను మాత్రం ఆ సొమ్ము తీసుకోలేదు అంటూ పీవీఎల్ నరసింహరాజు చెప్పుకొచ్చారు. ఆయన అలా మాట్లాడినా కూడా పార్టీ పెద్దలు లైట్ తీసుకున్నారు, దీంతో ఆయన తనకు ఇక తిరుగులేదనుకున్నారేమో మరింత స్పీడు పెంచినట్టు భోగట్టా. ఈ దశలో పీవీఎల్ వ్యవహార శైలి కొందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు రుచించలేదు. క్రమేపీ వారిలో అసంతృప్తి రాజుకోవడం మొదలైంది, అది కాస్త వర్గపోరుకు దారి తీసింది. మరో వర్గం నేత మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు తెరపైకి తెచ్చారు అసంతృప్తివాదులు. కొన్ని రోజుల క్రితం వారంత పీవీఎల్ తీరుపై బహిరంగం గానే ఆక్రోశం వెళ్లగక్కారు. ఉండి నియోజక వర్గ ఇన్ చార్జిగా ఆయన్ని తప్పించి పాతపాటి సర్రాజుకు ఆ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ తెరపైకి తెచ్చారు. అంతేగాకుండా పీవీఎల్ వైఖరి గురించి అమరావతి వెళ్లి పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్ళాలనే నిర్ణయానికి వచ్చారట. ఉండి వ్యవహారం ఒక్కసారిగా రోడ్డెక్కడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అలర్టైంది. పీవీఎల్ ని, సర్రాజుని కూర్చోబెట్టి విషయాన్ని సెటిల్ చేయాలని పార్టీలో మరో ముఖ్యనేత కొత్తపల్లి సుబ్బరాయుడికి బాధ్యతలు అప్పగించింది. ఆ ఇద్దరినీ అమరావతికి పిలిచిన సుబ్బరాయుడు విషయాన్ని ఇప్పటికైతే సెటిల్ చెయ్యగలిగారు. నియోజకర్గ ఇన్ చార్జిగా పీవీఎల్ కొనసాగుతారు, అదే సమయంలో మిగతా వ్యవహారాలు మీరు చూసుకోండి అంటూ పాతపాటి సర్రాజుకు సూచించారు. ఈ ఒడంబడికకు ఇద్దరు నేతలు అంగీకరించడంతో తాత్కాలికంగా ఉండి వివాదం సద్దుమణిగినట్టయింది. అంతేకాదు అప్పట్నుంచీ ఇద్దరు నేతలు అన్ని కార్యక్రమాలకు కలిసే హాజరవుతున్నారనుకోండి అది వేరే విషయం. అయితే ఇరు వర్గాల్లోనూ అసంతృప్తి మాత్రం చల్లారలేదని అది ఎప్పుడో ఒకప్పుడు బట్టబయలవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు, చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.
  కొడాలి నాని... వల్లభనేని వంశీ... వంగవీటి రాధాకృష్ణ... ఈ ముగ్గురూ మంచి స్నేహితులంటారు... ఈ ముగ్గురూ పార్టీలో ఉన్నా... పార్టీలకతీతంగా వీరి స్నేహం కొనసాగుతుందని చెప్పుకుంటారు. అయితే, ఇప్పుడో కొత్త సంగతి బయటికొచ్చింది. గన్నవరంలో వైసీపీ తరపున పోటీచేసి వంశీ చేతిలో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు కూడా... ఈ ముగ్గురికీ చిరకాల మిత్రుడని తెలిసింది. ఈ నలుగురూ మంచి స్నేహితులని, తరచూ కలిసికుని మాట్లాడుకుంటారని సన్నిహితులు చెబుతున్నారు. అయితే కొడాలి నాని... వల్లభనేని వంశీ... వంగవీటి రాధాకృష్ణ... స్నేహితులని అందరికీ తెలిసినా... యార్లగడ్డ సంగతే కొత్తగా ఉంది. అయితే, తన స్నేహితుడైన వల్లభనేని వంశీపై యార్లగడ్డ వెంకట్రావు పోటీకి దిగడానికి కొడాలి నానేయే కారణమనే మాట వినిపిస్తోంది. ప్రవాస భారతీయుడుగా ఉన్న యార్లగడ్డను కొడాలి నానినే... ఆంధ్రాకి రప్పించి... జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లడమే కాకుండా.... వల్లభనేని వంశీపై పోటీకి దింపారని అంటున్నారు. ఈ మాట... వల్లభనేని వంశీ కూడా చాలాసార్లు తన సన్నిహితులతో చెప్పుకొచ్చారు. రాజకీయంగా ఎవరు ఎత్తులు వాళ్లు వేసుకున్నా... వీళ్ల మధ్య మాత్రం స్నేహం... మాత్రం కంటిన్యూ అవుతోంది. అయితే, గన్నవరంలో ముఖాముఖిగా తలపడిన వంశీ, యార్లగడ్డ మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఇక, రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. సరిగ్గా ఇప్పుడదే జరిగింది.   తొలుత వల్లభనేని వంశీ, కొడాలి నాని... ఇద్దరూ తెలుగుదేశంలోనే ఉన్నా... ఆ తర్వాత కొడాలి... వైసీపీలో చేరారు. వంశీ మాత్రం టీడీపీలో కొనసాగారు. వంగవీటి రాధా కూడా కొన్నాళ్లూ వైసీపీలోనే ఉన్నారు. ఈ ముగ్గురూ వేర్వేరు పార్టీల్లోనే ఉన్నా... వీళ్ల మధ్య స్నేహం మాత్రం కొనసాగింది. అయితే, మొన్నటివరకు అమెరికాలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు సరిగ్గా ఎన్నికల ముందు ఏపీకి ఎంట్రీ ఇచ్చి... గన్నవరం నుంచి బరిలోకి దిగి ఏకంగా స్నేహితుడైన వంశీనే ఢీకొట్టారు. అయితే స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక ఎన్నికల టైమ్ లో ఈ ఇద్దరికి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. అది వ్యక్తిగత వైరంగానూ మారింది. అయితే, గెలిచిన తర్వాత కూడా వల్లభనేని వంశీని ఆర్ధిక సమస్యలు, కేసులు చుట్టుముట్టడంతో... తన స్నేహితుడైన కొడాలి నానితో పంచుకున్నట్లు తెలుస్తోంది. దాంతో కొడాలి... వల్లభనేని వంశీని జగన్ దగ్గరికి తీసుకెళ్లాడని చెప్పుకుంటున్నారు. ఇదిలాఉంటే, 2014 ఎన్నికల సందర్భంగా బెజవాడ బెంజ్ సర్కిల్ లో జగన్ ను వంశీ ఆలింగనం చేసుకోవడంతో... వీళ్లిదరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే చర్చ జరిగింది. అంతేకాదు వంశీ వైసీపీలో చేరతానే ప్రచారం కూడా జరిగింది. అయితే, ఈ నలుగురు చిరకాల స్నేహితుల్లో వంగవీటి రాధాకృష్ణ... మొన్నటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండగా... కొడాలి నాని సూపర్ విక్టరీ కొట్టి జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు... ఇక వల్లభనేని వంశీ వైసీపీ గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా, ఎన్నికల ముందు స్నేహితుడినే ఢీకొట్టి వ్యక్తిగత వైరం తెచ్చుకున్న యార్లగడ్డ వెంకట్రావు పరిస్థితే ఇరకాటంలో పడిందని మాట్లాడుకుంటున్నారు. మరి, నలుగురి స్నేహితుల రాజకీయ అడుగులు ఎప్పుడు ఎటువైపు వెళ్తాయోనన్న చర్చ కృష్ణాజిల్లాలో జరుగుతోంది.  
కచ్చులూరు బోటు ప్రమాద బాధిత కుటుంబాల వేదన హృదయవిదారంగా ఉంది. ప్రమాదం జరిగాక దఫాదఫాలుగా 39 మృతదేహాలను వెలికితీసి బంధువులకు అప్పగించిన అధికారులు.... ఇంకా 13మంది ఆచూకీ కోసం 39రోజులు ఆగాల్సి వచ్చింది. 38రోజుల తర్వాత ఎట్టకేలకు బోటును బయటికి తీయడంతో తమవాళ్ల మృతదేహాలు దొరుకుతాయని ఆశపడ్డ బాధిత కుటుంబాల్లో కొందరికి నిరాశే ఎదురైంది. తమవారిని కనీసం చివరి చూపు అయినా చూసుకోవచ్చని ఆశపడ్డ ఆత్మీయులు ఆశలు గల్లంతయ్యాయి. బోటు నుంచి 8మృతదేహాలు వెలికితీయగా... ఐదుగురిని మాత్రమే గుర్తించారు. అయితే, బోటు నుంచి వెలికితీసిన మృతదేహాలన్నీ కుళ్లిపోయి ఛిద్రమై ఉండటంతో గుర్తించడం కష్టతరంగా మారింది. అయితే, వాళ్లు ధరించిన బట్టలు, జేబుల్లో ఉన్న గుర్తింపు కార్డులు ఆధారంగా ఐదుగురిని గుర్తించగలిగారు. ఇంకా మూడు మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. అయితే, రాయల్ వశిష్ట బోటును శుభ్రం చేయడంతో మరికొన్ని ఎముకులు, అవయవాలు, వస్త్రాలు దొరికాయి. దాంతో వాటిని కూడా మూటలుగా కట్టి రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాంతో మొత్తం మృతదేహాలు దొరికినట్లేనని అంటున్నారు. అయితే, పలువురి మృతదేహాలు ఛిద్రమైపోవడం... అలాగే అవయవాలు తెగిపోయి కొన్ని భాగాలు మాత్రమే దొరకడంతో వాళ్లను గుర్తుపట్టడం కష్టంగా మారిందని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ అంటున్నారు. మృతదేహాలన్నీ మట్టితో నిండిపోయి ఉండటం... అలాగే కొన్ని డెడ్ బాడీస్ కు కాళ్లూచేతులు తెగిపోయి ఉండటం... మరికొన్ని మృతదేహాలైతే కేవలం ఎముకలు, మాంసపు ముద్దలు మాత్రం దొరకడంతో... డీఎన్‌ఏ పరీక్షల కోసం శాంపిల్స్ ను హైదరాబాద్ పంపుతున్నట్లు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. రాయల్ వశిష్ట బోటు డ్రైవర్ నూకరాజు మృతదేహాన్ని అతని కుమారుడు గుర్తించాడు. టీషర్ట్ ఆధారంగా గుర్తించినట్లు తెలిపాడు. అలాగే, వరంగల్ వాసులైన కొమ్ముల రవీంద్ర, ధర్మరాజు మృతదేహాలను వాళ్ల జేబుల్లో దొరికిన ఐడీ కార్డుల ఆధారంగా మృతదేహాన్ని ఐడెంటిఫై చేశారు. ఇక, మంచిర్యాల వాసి రమ్యశ్రీ మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉంది. అయితే, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో మిగిలిన మూడు మృతదేహాల్లో... ఆ తర్వాత బోటు నుంచి తీసుకొచ్చిన ఎముకలు, మాంసపు ముద్దల్లో రమ్యశ్రీ డెడ్‌బాడీ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అయితే, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె మృతదేహం ఇంకా దొరక్కపోవడంతో రమ్యశ్రీ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మంచిర్యాల నుంచి వచ్చిన రమ్యశ్రీ తల్లిదండ్రులు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి దగ్గర పడిగాపులు పడుతున్నారు. మొత్తానికి, తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదాన్ని నింపిన రాయల్ వశిష్ట బోటు బయటికొచ్చినా... బాధిత కుటుంబాల్లో కొందరికి మాత్రమే కొంతలో కొంత ఊరట లభించలేదు. కనీసం చివరి చూపు చూసుకునే అవకాశం లభించింది. అయితే, మిగతా మృతదేహాలన్నీ ఏ రకంగానూ గుర్తుపట్టలేనివిధంగా ఉండటంతో ఆయా బాధితుల కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణణాతీతంగా ఉంది. ఇక, ఆచూకీ దొరకాల్సిన, గుర్తించాల్సిన ఆరేడు మంది వివరాలు డీఎన్‌ఏ పరీక్షల తర్వాతే తేలే అవకాశం కనిపిస్తోంది.
  మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోబోతోందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. లోక్ సభ ఎన్నికల తరువాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలం తన సత్తా నిరూపించుకుందని జాతీయ సర్వే సంస్థలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, హర్యానా రెండు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం గతంతో కంటే తగ్గినా ఇక్కడి ఓటర్లు మాత్రం మరోసారి అధికార పార్టీకే అనుకూలంగా ఓటు వేసినట్టు ఎగ్జిట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమికి మరోసారి ఓటర్లు అవకాశమిచ్చినట్లు సర్వే సంస్థలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ నూట అరవై నాలుగు, శివసేన నూట ఇరవై ఆరు సీట్లలో పోటీ చేశాయి.  వివిధ జాతీయ సంస్థల అంచనాలు చూస్తే.. టైమ్స్ నౌ అంచనాల ప్రకారం బీజేపీ, శివసేన కూటమి రెండు వందల ముప్పై స్థానాలు గెలుచుకుంటోంది. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నలభై ఎనిమిది, ఇతరులు పది స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తారు. న్యూస్ సర్వే ప్రకారం బీజేపీ నూట నలభై ఒకటి, శివసేన నూట రెండు, కాంగ్రెస్ పదిహెడు, ఎన్సీపీ ఇరవై రెండు, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తారు. యాక్సిస్ మై ఇండియా సంస్థతో కలిసి ఓటరు నాడి పట్టిన ఇండియా టుడే సంస్థ మహారాష్ట్రలో బీజేపీకే నూట తొమ్మిది నుంచి నూట ఇరవై నాలుగు, శివసేనకు యాభై ఏడు నుంచి డెబ్బై, కాంగ్రెస్ కు ముప్పై రెండు నుంచి నలభై, ఎన్సిపికి నలభై నుంచి యాభై, ఇతరులు ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తారని అంచనా వేసింది. ఇక ఏబీపీ న్యూస్ సీ ఓటర్ సర్వే ప్రకారం బీజేపీ శివసేన కూటమి రెండు వందల నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అరవై తొమ్మిది సీట్లలో ఇతరులు పదిహేను సీట్లను గెలుచుకుంటారు. న్యూస్ఎక్స్ చేసిన సర్వేలో బీజేపీకి నూట నలభై నాలుగు నుంచి నూట యాభై, శివసేనకు నలభై నాలుగు నుంచి ఎనభై, కాంగ్రెస్ నలభై నుంచి యాభై, ఎన్సీపీ ముప్పై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది, ఇతరులు ఆరు నుంచి పది సీట్లు గెల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హర్యానాలోనూ మరోసారి బీజేపీకే జై కొట్టారు అక్కడి ఓటర్లు. టైమ్స్ నౌ అంచనాల ప్రకారం హర్యానాలో బీజేపీ డెబ్బై ఒకటి, కాంగ్రెస్ పదకొండు, ఇతరులు తొమ్మిది స్థానాలు గెలుచుకునే అవకాశముంది. బిజెపి డెబ్బై ఐదు నుంచి ఎనభై స్థానాలు కైవసం చేసుకొంటుందని ఇండియన్ న్యూస్ ఛానల్ అంచనా వేసింది. కాంగ్రెస్ కు తొమ్మిది నుంచి పన్నెండు, అకాలీ కూటమి ఒకటి, ఇతరులు ఒకటి నుంచి మూడు స్థానాలూ గెలుచుకోవచ్చు. న్యూస్ఎక్స్ సర్వే ప్రకారం బిజెపి డెబ్బై ఐదు నుంచి ఎనభై స్థానాల్లో, కాంగ్రెస్ తొమ్మిది నుంచి పన్నెండు సీట్లు, ఐఎన్ఎల్డీ అకాడమీ కూటమి ఒక సీటు గెలుచుకునే అవకాశాలున్నాయి. ఏబీపీసీ ఓటర్ అంచనాల ప్రకారం బీజేపీ డెబ్బై రెండు, కాంగ్రెస్ కి ఎనిమిది, ఇతరులు పది స్థానాలనూ గెలుచుకోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీ పై వ్యతిరేకత కనిపించకపోగా ఓటర్లల్లో మద్దతు పెరిగినట్లు ఎగ్జిట్ పోల్ అంచనాలను బట్టి అర్ధమౌతోంది. లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన కాంగ్రెస్ మహారాష్ట్ర, హర్యానా లోనూ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటోంది.ఇక ఈ సర్వే లెక్కలు నిజమౌతాయే లేదో అన్నది మరో రెండు రోజుల్లో తేలనుంది.
  మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ రెండు రాష్ట్రాల్లోని ఓటర్లు నేడు తీర్పునివ్వనున్నారు. మరోవైపు వివిధ రాష్ట్రాలలోని యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలకు, రెండు లోకసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల కౌంటింగ్ గురువారం జరగనుంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, శివసేన కూటమిగా బరిలో దిగుతుండగా అటు ఎన్సీపీ, కాంగ్రెస్ తో పాటు మరికొన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని బిజెపి, కమలనాథులకు షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ కూటమి ఎన్నికల సమరంలో హోరాహోరీగా తలపడుతున్నాయి. మరి ఓటరు తీర్పు ఏమిటన్నది గురువారం తేలిపోనుంది.  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 3,239 మంది అభ్యర్థులున్నారు. ఇందులో ఒక్క నాందేడ్ దక్షిణ నియోజక వర్గం నుంచే 38 అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. ఇక చిప్లున్ నియోజక వర్గం నుంచి అత్యల్పంగా ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల బరిలో బిజెపి 152 స్థానాల్లో పోటీ చేస్తోండగా, శివసేన 124 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. ఓర్లీ నియోజక వర్గం నుంచి ఠాక్రే వారుసుడు ఆదిత్య ఠాక్రే పోటీకి దిగారు. మరోవైపు కాంగ్రెస్ 145 స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఎన్సీపీ 123 స్థానాల్లో పోటీకి దిగింది. వీటితో పాటు ఇతర పార్టీలు కూడా పోటీకి దిగాయి. రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఏకంగా 103 స్థానాల్లో పోటీకి దిగి ఈ సారి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఎంఐఎం కూడా ఎన్నికల బరిలో దిగి సవాల్ విసురుతోంది. ఎంఐఎం నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తోంది. హర్యానాల్లోనూ పోటీ వేడిని పెంచుతోంది. హర్యానాలో మొత్తం 90 స్థానాలుండగా..1,169 తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా హన్సీ నియోజక వర్గం నుంచి 25 మంది అభ్యర్ధులు పోటీ చేస్తుండగా అత్యల్పంగా షహబాద్ నియోజకవర్గల్లో 6 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక బిజెపి 90 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ కూడా పొత్తు లేకుండా 90 స్థానాల్లో బరిలో నిలిచింది. ఇక బీఎస్పీ 87 ఐఎన్ఎల్డీ 81 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.  మహారాష్ట్ర, హర్యానాతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రాల్లో ఆయా నేతల పాలన ప్రోగ్రెస్ రిపోర్టు చెప్పబోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల తలరాతను మార్చబోతున్నాయి. అందుకే ఈ ఎన్నికలపైనా నిఘా పెరిగింది. దాదాపు పది రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు కీలకం కాబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లోని నాయకుల పరిపాలనకు మార్కులు వేయబోతున్నారు ఓటర్లు. యూపీలో ఏకంగా 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు యోగికి ఇది కఠిన పరీక్షే. యూపీలో ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. బీహార్ లోని 5 స్థానాలు కూడా ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ బైపోల్స్ కూడా బిజెపి, జేడీయూ స్నేహానికి కీలకంగా మారబోతున్నాయి. మరో ఏడాదిలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికల్లో పార్టీలు కర్టనరైజర్ గా చూస్తున్నాయి.  మధ్యప్రదేశ్ లో రాజకీయం నువ్వా నేనా అన్నట్లు ఉంది. బిజెపి కాంగ్రెస్ ల మధ్య బలం దోబూచులాడుతోంది. స్వతంత్రులు బీఎస్పీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ గట్టెక్కిన, కర్ణాటక పరిణామాలు కమలనాధ్ సర్కారుకు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో మధ్యప్రదేశ్ లోని ఒక స్థానానికి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ ఉప ఎన్నిక అటు బిజెపి  ఇటు కాంగ్రెస్ కు చాలా కీలకం. ఇప్పటికే ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను ఓ బీఎస్పీను లాగి కాంగ్రెస్ వ్యూహం ప్రదర్శించిన ఎప్పటికైనా బిజెపి నుంచి ముప్పు తప్పదన్న భావనలో ఉంది.అందుకే ఈ ఒక్క స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. అయితే బీజేపీ కూడా ఈ స్థానంపై కన్నేసింది. ఇది గెలిస్తే ప్రజాభిప్రాయం తమకే ఉందంటూ కర్నాటక ఫార్ములా ప్రయోగించిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.  కేరళలో 5 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఐదింటినీ చేజిక్కించుకోవాలని లెఫ్ట్ ఫ్రంట్ చూస్తూంటే పాగా వేయాలని బిజెపి అనుకుంటోది. అటు కాంగ్రెస్ కూటమి కూడా గెలుపుపై నమ్మకం పెట్టుకుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2021లో జరుగుతున్నాయి. అందుకే తాజా ఉప పోరును సెమీ సమరంగా చెబుతున్నారు.  తమిళనాడులో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో రెండు స్థానాలపై డీఎంకే కన్నేసింది. ఇప్పటికే ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అదరగొడుతోంది. రాబోయే ఎన్నికల్లో తమదే విజయమని ధీమాతో ఉన్న స్టాలిన్ పార్టీ ఇప్పుడు రెండు స్థానాలను దక్కించుకోవాలని చూస్తోంది. అటు అన్నా డీఎంకే నేతలు మాత్రం అసెంబ్లీలో తమ నెంబర్ పెరుగుతుందని చెబుతున్నారు.  తెలంగాణలోని హుజూర్ నగర్ పై అందరి దృష్టీ నెలకొంది. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక వచ్చింది. గుజరాత్, పంజాబ్, ఒడిషా రాష్ట్రాల్లోను ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్ లో ఇప్పటికే బిజెపి ప్రభుత్వం బలంగా మారింది. ఇప్పుడు అక్కడ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోవు. పంజాబ్ లోనూ కెప్టెన్ సర్కార్ కు ఎన్ని మార్కులు పడతాయి అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ మధ్య అధికారంలోకి వచ్చిన నవీన్ పట్నాయక్ కు ఒక్క స్థానంతో ఎలాంటి మార్పు ఉండదు. కానీ యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు మరింత కీలకంగా మారాయి ,ఎందుకంటే వీటితోనే జాతకాలు తేలిపోనున్నాయి. అధికార పార్టీల పాలనపై జనం మాటేంటో ఫలితాల ద్వారా బయటకు రానుంది, మరి ప్రజాధరణ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.
  మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు తయారైంది హైదరాబాదీయుల పరిస్థితి. ఆర్టీసీ సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ ప్రజలకు మరో షాక్ తగిలింది. బస్సుల బంద్ తో ఇబ్బందులు పడుతున్న నగర వాసులకు క్యాబ్ డ్రైవర్లు ఝలక్ ఇచ్చారు. డిమాండ్ల సాధన కోసం ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. దాంతో ఒకవైపు తెలంగాణ బంద్... మరోవైపు క్యాబ్ డ్రైవర్ల సమ్మెతో... రాష్ట్రం మొత్తం స్తంభించనుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో 50వేలకు పైగా క్యాబ్ లు నిలిచిపోనుండటంతో నగరంలో ప్రధాన రవాణా వ్యవస్థ దాదాపు ఆగిపోనుంది. క్యాబ్ సంస్థలు పెద్దఎత్తున లీజు వాహనాలను పెంచేశాయి. దాంతో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. దాంతో అప్పులు చెల్లించలేక క్యాబ్ డ్రైవర్లు రోడ్డునపడుతున్నారు. అందుకే, ప్రతి డ్రైవర్ కు కనీస బిజినెస్ గ్యారంటీ ఇవ్వాలంటూ ఓలా, ఊబర్ క్యాబ్ సర్వీస్ సంస్థలను కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే తమ డిమాండ్లు పరిష్కారమయ్యేవరకు సమ్మెను ఆపేది లేదని క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ తెగేసి చెప్పింది. ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ కు క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ మద్దతు ప్రకటించింది. ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాదీలకు... ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు కూడా సమ్మె బాటపట్టడంతో... కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. ఎందుకంటే ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా నగరవాసులు... ఎక్కువగా క్యాబ్ లనే ఆశ్రయిస్తుంటారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లాలన్నా... అక్కడ్నుంచి రావాలన్నా... క్యాబ్ లే ఆధారం. ఇక ఐటీ ఉద్యోగులు కూడా ఎక్కువగా క్యాబ్ లపైనే ఆధారపడుతుంటారు. దాంతో క్యాబ్ డ్రైవర్ల సమ్మెతో హైదరాబాద్ లో ప్రధాన రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించినట్లవుతుంది. అయితే, ఆటో డ్రైవర్లు కూడా సమ్మె బాటపట్టే అవకాశముండటంతో.... కేవలం మెట్రో అండ్ ఎంఎంటీఎస్ మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.
  తెలుగుదేశానికి కృష్ణాజిల్లాలో మరో భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ టీడీపీ వీడతారనే ప్రచారం జరుగుతోంది. రెండు నెలల క్రితమే ఈ మాట వినిపించినప్పటికీ, ఈ మధ్య చంద్రబాబు పిలుపునిచ్చిన ఛలో ఆత్మకూరు ఆందోళనలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొనడంతో... పార్టీ మారే ఆలోచనను దేవినేని అవినాష్ విరమించుకున్నారేమోనన్న టాక్ వినిపించింది. అయితే, దేవినేని అవినాష్ పార్టీ మారతారంటూ మళ్లీ ప్రచారం ఊపందుకుంది. తాజాగా దేవినేని అవినాష్.... టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో సమావేశమైనట్లు తెలుస్తోంది. దాంతో త్వరలోనే అవినాష్ వైసీపీలో చేరడం ఖాయమంటున్నారు. అవినాష్ తండ్రి దివంగత దేవినేని నెహ్రూకి కృష్ణాజిల్లాలో రాజకీయంగా పట్టుంది. జిల్లావ్యాప్తంగా దేవినేని కుటుంబానికి అభిమానులు, అనుచరులు ఉన్నారు. దేవినేని నెహ్రూ కుమారుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన అవినాష్ ... అతి తక్కువ సమయంలోనే యూత్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీచేసి వార్తల్లో నిలిచారు. ఇక, 2019లో గుడివాడ నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన అవినాష్.... ప్రస్తుత మంత్రి కొడాలి నానికి గట్టిపోటీనిచ్చారు. నువ్వానేనా అన్న స్థాయిలో దడ పుట్టించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఘోర పరాజయంతో అవినాష్ చూపు వైసీపీ వైపు మళ్లింది. అసలు ఎన్నికలకు ముందు అవినాష్ ... వైసీపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, అనూహ్యంగా టీడీపీలో చేరారు. ఇక, కొడాలి నానికి దీటైన అభ్యర్ధిగా అవినాష్ ను భావించిన చంద్రబాబు... గుడివాడ నుంచి బరిలోకి దింపారు. అయితే, వైసీపీలో హోరుగాలిలో అవినాష్ ఓటమి పాలైనా... యూత్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.   ఇక, దేవినేని నెహ్రూ కుటుంబానికి వైఎస్ ఫ్యామిలీతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దేవినేని నెహ్రూ... ఆ తర్వాత ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. దేవినేని నెహ్రూ... వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యే కావడమే కాకుండా ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు. అయితే, 1995 ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్ లో చేరి, వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. అలాగే, వైఎస్ ఫ్యామిలీతో దేవినేని నెహ్రూ కుటుంబానికి సత్సంబంధాలు ఉండటంతో... అవినాష్ వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ దేవినేని అవినాష్... వైసీపీలో చేరితే అది టీడీపీ నష్టమేనని చెప్పాలి. ఎందుకంటే దేవినేని నెహ్రూ కుటుంబానికి కృష్ణాజిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున అనుచరులు, అభిమానులు ఉన్నారు. వాళ్లంతా అవినాష్ వెంట నడిచే అవకాశముంది.
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా తయారైంది ఏపీలో సీఎం ఆర్ఎఫ్ బాధితుల పరిస్థితి. ప్రాజెక్టుల్లో రివర్స్ టెండర్ల తో సొమ్ము ఆదా చేసినట్టు ప్రజల ఆరోగ్య విషయంలోనూ అదే చేస్తున్నట్టు కనిపిస్తుంది. పాత వారికి డబ్బులు జమ చేయకుండా కొత్త వారికి దరఖాస్తులు చూడకుండా ప్రభుత్వం వారితో ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు దాటినా ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి నామ మాత్రం గానే బాధితులకు సొమ్ము విడుదల చేస్తోంది. ఇతర ప్రాజెక్టుల మాదిరిగా ఇక్కడ కూడా రివర్స్ పద్ధతిని పాటిస్తున్నట్లు కనబడుతుంది. గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులను మళ్లీ తనిఖీ చేస్తున్నామంటూ కాలయాపన చేస్తోంది. దీంతో రిలీఫ్ పండ్ సెక్షన్ లో సుమారు ముప్పై మూడు వేల దరఖాస్తులు నూట యాభై కోట్ల బిల్లులు పెండింగ్ లో పడిపోయాయి. గత ప్రభుత్వం తన మన అని చూడకుండా సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎల్వోసీలోని ఉదారంగా అందించింది. కొత్త ప్రభుత్వం అంత కంటే ఎక్కువే చేస్తుందని ప్రజలు ఆశించారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి నాలుగు నెలలుగా ప్రతి రోజూ మూడు వందల నుంచి నాలుగు వందల దరఖాస్తుల సీఎంఆర్ఎఫ్ వస్తున్నాయి. అధికారులు వాటి అన్నింటినీ పక్కన పడేస్తున్నారు. జూన్ ఒకటి నుంచి అక్టోబర్ వరకు పదమూడు వేల సీఎం ఆర్ కు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. వీటి విలువ సుమారు డెబ్బై కోట్లని అంచనా. ఇవి కాకుండా టీడీపీ ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు వచ్చిన పద్దెనిమిది వేల దరఖాస్తులను కొత్త ప్రభుత్వం పెండింగ్ లో ఉంచింది. వీటి విలువ కూడా అరవై ఐదు కోట్ల పైనే ఉంటుంది. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పటి వరకు వెయ్యి దరఖాస్తులను మాత్రమే క్లియర్ చేస్తుంది.వీటిలో ఐదు వందల నుంచి ఆరు వందల దరఖాస్తులకు మాత్రమే చెక్కులు అందించింది.ఆ చెక్కులు కూడా బాధితుల అకౌంట్ లలో జమ కాలేదని తెలుస్తోంది. దరఖాస్తులను ఇంకా వాయిదాలో ఉండటంతో  బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది జిల్లాల్లో ఎమ్మెల్యేల కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. దీంతో ఎమ్మెల్యే లు సీఎం కార్యాలయం పై ఒత్తిడి తెస్తున్నారు ఫలితంగా నియోజకవర్గాని కి యాభై దరఖాస్తుల చొప్పున క్లియర్ చేసేందుకు అధికారులు ఆమోదం తెలిపారు. అయితే ఎమ్మెల్యేలు పేద ప్రజలను వదిలేసి తమ బంధువుల అనుంగు సహచరులు దరఖాస్తులు మాత్రమే నిశ్చితం చేయించుకుంటున్నారు. డబ్బుల్లేక నిధులు విడుదల చేయడం లేదా అంటే ప్రస్తుతం సుమారు ఎనభై కోట్ల నిధులు ఉన్నట్లు సమాచారం. వీటిని విడుదల చేయకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఐదు వేల మందికి ఇచ్చిన చెక్కు లను కూడా ఇప్పటి వరకు క్లియిర్ చేయకుండా ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. చెక్కులు చేతికి వచ్చిన బ్యాంకుల్లో డబ్బు లు జమ కాకపోవడం తో కొంత మంది బాధితులు ఆశలు వదిలేసుకున్నారు. ప్రస్తుత వాతావరణం చూసి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యా లు భయపడుతున్నాయి. సీఎంఆర్ఎఫ్ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియక ఆందోళన చెందుతున్నాయి. అందుకే రోగులకు లెటర్ లు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుతం చాలా ఆస్పత్రుల్లో ముప్పై నుంచి అరవై లక్షల వరకు ఎల్ వోసీలు బకాయిలున్నట్లు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు పెట్టుకొని కొత్తగా రోగుల కు ఎల్ వోసీ నుంచి తాము అప్పులపాలు కాలేమని ప్రైవేటు ఆసుపత్రుల చేతులెత్తేస్తున్నాయి. ఇదే విషయాన్ని రోగులకు స్పష్టంగా వివరిస్తున్నాయి డబ్బులుంటే బిల్లు కట్టే వైద్యం చేయించుకోండి లేదంటే వెళ్లిపొమ్మని కటువుగా చెప్పేస్తున్నారు విధిలేక కొందరు రోగులు లక్షల్లో అప్పు లు చేసి వైద్యం చేయించుకుంటున్నారు ఇంకొంతమంది అనారోగ్యం తో యుద్ధం చేస్తున్నారు.ఇక జగర్ సర్కార్ ఏమి చేయ్యబోతోందో వేచి చూడాలి.
  కొలెస్ట్రాల్.... ఈ మాట వినటం సర్వసాదారణం అయిపొయింది. ఇది శరీరంలో సమపాళ్ళలో ఉంటే  పర్వాలేదు కాని కాస్త పెరుగుతున్న సూచనలు కనిపిస్తే మాత్రం జాగ్రత్తలు తీసుకోవటం మొదలుపెట్టాల్సిందే  అంటున్నారు వైధ్యనిపుణులు. మనం తీసుకునే ఆహరపధార్ధాల్లో కొవ్వు శాతం ఎంత ఉందో, ఎంత ఉండచ్చో అనే విషయాలపై అవగాహన లేకపోవటమే కొవ్వు పెరగటానికి ప్రధాన కారణం అంటున్నారు. కొలెస్ట్రాల్ ఎక్కువయితే అది గుండె పోతుకి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు కార్డియోలజిస్ట్ లు.   అయితే ఆహారంలో  మనం తీసుకునే కొన్ని పదార్ధాల ద్వారా దీనిని నియంత్రించవచ్చు.       *  చూడగానే తన ఎర్రటి రంగుతో కూరాలకి మంచి రంగునిచ్చే మిరపకాయలు కొవ్వుని కరిగిస్తాయట. ఎండుకారం ఒంట్లో వేడి పుట్టేలా చేసి కొవ్వుని నియంత్రిస్తుంది. అంతేకాదు రోగనిరోదక శక్తిని కూడా పెంచుతుందిట. అయితే వేసవిలో మాత్రం వీటి వాడుకలో కొంత మార్పులు చేసుకోవాలి.     *  మిరియాలలో ఉండే పిపరైన్ అనే పదార్థం ఒంట్లో కొవ్వుని పెంచే కణాల పెరుగుదలని నియంత్రిస్తుందిట.కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు కూరలలో కారానికి బదులు మిరియాలపొడి వేసుకుంటే మంచి గుణం కనిపిస్తుంది.       *  మసాల దినుసులలో మంచి ఘుమఘుమలాడే దాల్చిన చెక్కకి కూడా కొవ్వుని కరిగించే గుణం ఉంది. ఇది షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచటం వల్ల బరువు త్వరగా పెరగరు. దాల్చిన చెక్క పొడిలో  కొద్దిగా తేనే కలిపి వేడినీటితో సేవించినా కొవ్వు కరుగుతుంది. ఇలా ఆహారవిషయంలో పాటించే కొద్దిపాటి జాగ్రత్తల వల్ల కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవచ్చు.    ...కళ్యాణి
  ఎర్రగా, చూడగానే నాలుగు గింజలు నోట్లో వేసుకునేలా ఊరించే దానిమ్మలో మన ఆరోగ్యానికి పనికివచ్చే ఎన్నో పోషకాలు వున్నాయి. దానిమ్మ ఎన్ని రకాలుగా మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుందో తెలుసా?... నోటి పూతగా వుంటే ఒక దానిమ్మని వలచి గుప్పెడు గింజలు నోట్లో వేసుకోండి చాలు. దానిమ్మలోని యాంటీ బ్యాక్టీరియన్, యాంటీ వైరల్ గుణాలు నోటి పూత నుంచి ఉపశమనాన్ని కలుగచేస్తాయి. అల్సర్లను నివారిస్తాయి.  ఆడవారు నెలసరి రోజుల్లో దానిమ్మని తింటే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఆ సమయంలో వుండే ఇతర శారీరక ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఇవేకాదు.. దానిమ్మని రోజూ తినడం అలవాటుగా చేసుకుంటే దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ బారిన పడకుండా చూస్తాయి. అలాగే దీనిని సహజ యాస్పిరిన్ అనచ్చు. ఎందుకంటే రక్త సరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. రోజుకి పావు కప్పు దానిమ్మరసం చాలు గుండె భద్రంగా వుండటానికి. ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలామంచిది.  ఆస్టియో ఆర్ద్రస్టియస్‌తో బాధపడేవారు రోజూ దానిమ్మ తింటే ఎంతో ఉపశమనం కలుగుతుంది. వయసు పెరిగేకొద్దీ ఏర్పడే చర్మం ముడతలను నివారించే గుణం కలిగిన దానిమ్మ వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది కూడా. దీనిలోని ఫోలిక్ యాసిడ్ గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. బిడ్డ చక్కగా ఎదగడానికి దోహదపడుతుంది. రుచిగా, చూడగానే తినాలనిపించే దానిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలిశాక తినకుండా వుంటామా! రోజూ తప్పకుండా గుప్పెడు గింజలని నోట్లో వేసుకుందాం. ఆరోగ్యంగా వుందాం.   -రమ 
Who hasn't come across someone suffering from backaches...one in every three adults complains of back ache, at some time of the day. There have been several pain relief techniques such as over-the-counter drugs, physiotherapy treatments, exercises, acupressure and accupuncture, yoga and such, all promising to offer pain relief and problem eradication. A recent study conducted by a health research institute in Seattle, Washington state, USA revealed that training the brain through meditation can help cure back ache isssues. They invited more than 300 people between the ages 20 and 70, suffering from some form of back pain issues and offered them three different treatments, randomly to each for more than 3 months. One was a form of phychotherapy, second a mindfullness based therapy such as yoga and meditation, third being the usually followed treatment such as medication through drugs with the Doctors help. The first therapy was concentrating on changing the thought process of the patients, teaching them relaxation therapies...the Second practice taught the group to train the brain to accept the difficult emotions and thoughts of discomfort and relaxing thebrain using yoga and meditation.     After offering these two therapies for 8 weeks, the study conducted a result oriented casestudy and observed that at 6 months milestone, the second form of treatment that involved meditation fetched more good results than the phychotherapy based treatment, and the medication technique was the last...and the number of people who reported a recurrence of back pain was lesser in the meditation group, next the phychotherapy group, last the drug-treated group, after one year after starting the respective treatments. The study revealed that training the brain helped people to get more immune to back aches and recurrence was reduced than through the traditional physiotherapy and medication techniques, which is a healthier option compared to risks that may come along with medication for some people...and a cost effective, affordable option for those who cannot afford expensive medicines and physiotherapy sitting fees every week or so. There needs to be a further study extended to find out if these positive results of the meditation technique are valid even after an year and beyond or not, until then it is considered a better, healtheir and affordable alternative to any other techinques to fight chronic lower back aches. --Pratyusha