
సినీ, టీవీ రంగాల్లో అవకాశాల కోసం ప్రయత్నించే యువతులను లక్ష్యంగా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో టీవీ సీరియల్స్‌లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, రహస్యంగా తీసిన ఫొటోలతో బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌కు చెందిన ఓ యువతి సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో జవహర్ కాలనీకి చెందిన బొరగడ్డ కాళిదాస్ ఆమెకు పరిచయమయ్యాడు. టీవీ సీరియళ్లలో నటించే అవకాశాలు ఇప్పిస్తానని, అలాగే రీల్స్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా భారీగా డబ్బులు సంపాదించవచ్చని నమ్మబలికాడు.
అలా పరిచయం పెంచుకున్న తర్వాత జవహర్ కాలనీలో పలుమార్లు బలవంతంగా లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా రహస్యంగా ఫొటోలు కూడా తీశాడని ఫిర్యాదులో పేర్కొంది.
ఆ తర్వాత తన వద్దకు రాకపోతే ఆ ఫొటోలను బంధువులకు పంపిస్తానని, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించినట్లు తెలిపింది. అంతటితో ఆగకుండా చంపేస్తానని కూడా బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపించింది.
ఈ వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





