LATEST NEWS
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.! ముఖానికి ముసుగు.. ఒంటినిండా నల్లటి దుస్తులు.. వేలిముద్రలు పడకుండా చేతులకు గ్లౌజులు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరక్కుండా పక్కా ప్లాన్. సుమారు 15 కిలోల బంగారం, వజ్రాభరణాలను క్షణాల్లో బ్యాగులో నింపుకుని పరారయ్యాడు. కానీ తాను చేసిన చిన్న పొరపాటు అతడి నేర సామ్రాజ్యాన్ని బయటపెట్టింది. చేతి మణికట్టుపై ఉన్న ఓ చిన్న టాటూ పోలీసులకు కీలక క్లూగా మారింది. తమిళనాడులోని మదురైలో జరిగిన ఈ భారీ నగల చోరీ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. 25 ఏళ్ల నిషాంత్ కృష్ణ.. ఓ గ్రాడ్యుయేట్. బైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూనే యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, సినిమాల్లో చూపించినట్లుగా పక్కా ప్రణాళికతో భారీ దొంగతనానికి తెరతీశాడు. మదురై బైపాస్ రోడ్డులోని తనిష్క్ జ్యువెలర్స్‌ను టార్గెట్‌గా చేసుకున్నాడు. ఈ నెల 11వ తేదీ రాత్రి తన ప్లాన్‌ను అమలు చేశాడు. మూడు గెటప్పులు.. మూడు సార్లు రెక్కీ.! చోరీకి ముందే నిషాంత్ పక్కాగా రెక్కీ నిర్వహించాడు. సాధారణ కస్టమర్‌లా ఒక్కోసారి ఒక్కో గెటప్‌లో షోరూంకు వెళ్లాడు. ఆభరణాలు ఎక్కడున్నాయి? భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎక్కడి నుంచి లోపలికి వెళ్లొచ్చు? ఎలా బయటపడొచ్చు? ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. ఏ చిన్న ఆధారం కూడా వదలకూడదని ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఆ షోరూం ప్రారంభమై అప్పటికి కేవలం రెండు వారాలే అవుతోంది. దీపావళి సీజన్‌లో భారీగా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో యాజమాన్యం భవన నిర్మాణం పూర్తికాకముందే కార్యకలాపాలు ప్రారంభించింది. లాకర్ గది నిర్మాణంలో ఉండటం, భద్రతా ఏర్పాట్లు పూర్తిస్థాయిలో లేకపోవడం నిషాంత్‌కు కలిసొచ్చాయి. బ్యాగులో పట్టినంత బంగారమే టార్గెట్.! ముఖానికి ముసుగు.. ఒంటినిండా నల్లటి దుస్తులు.. చేతులకు గ్లౌజులు ధరించి భవనం వెనుకవైపు ఉన్న ఇనుప చువ్వల సాయంతో పైకి ఎక్కాడు. మొదటి అంతస్తులోకి ప్రవేశించాడు. సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. కొన్ని కెమెరాలపై స్ప్రే కూడా చల్లాడు. లాకర్లను తెరిచే ప్రయత్నం చేయలేదు. కేవలం డిస్‌ప్లేలో ఉంచిన ఆభరణాలనే టార్గెట్ చేశాడు. తనతో తెచ్చుకున్న డఫ్ బ్యాగులో పట్టినంత బంగారం, వజ్రాభరణాలను నింపుకున్నాడు. అప్పటికి ఆ అంతస్తులో సుమారు 42 నుంచి 43 కిలోల బంగారం ఉన్నట్లు సమాచారం. అయితే బ్యాగులో పట్టకపోవడంతో మిగిలిన ఆభరణాలను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ మార్గంలో ఏర్పాటు చేసిన తాడును ఉపయోగించి కిందికి దిగాడు. తాళాలు పగులగొట్టకుండా, ఆయుధాలు ఉపయోగించకుండా చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. మరుసటి రోజు షోరూంలో ఆభరణాలు కనిపించకపోవడంతో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి కోసం ఓ కస్టమర్ అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్న నగలు కూడా చోరీకి గురవడం నిర్వాహకులను కలవరపరిచింది. పోలీసులకు చిక్కిన చిన్న టాటూ.! కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు షోరూం పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ముసుగు ధరించిన దొంగ ద్విచక్రవాహనంపై మాడకుళం రోడ్డు వైపు వెళ్లినట్లు గుర్తించారు. అయితే అతడి ముఖం కనిపించకపోవడంతో గుర్తించడం కష్టంగా మారింది. ఇదే సమయంలో షోరూం ప్రారంభోత్సవం రోజు నుంచి నమోదైన సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు మరోసారి పరిశీలించారు. ఓ యువకుడు మూడు వేర్వేరు సందర్భాల్లో షోరూంకు వచ్చినట్లు గుర్తించారు. అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో నిశితంగా పరిశీలించారు. అప్పుడే పోలీసులకు ఓ కీలక విషయం కనిపించింది. రెక్కీ సమయంలో కనిపించిన యువకుడి చేతి మణికట్టుపై ఉన్న టాటూ.. చోరీ జరిగిన సమయంలో ముసుగు ధరించిన వ్యక్తి చేతిపై కనిపించిన టాటూతో సరిపోలింది. ముఖాన్ని దాచుకున్నా.. ఆ చిన్న గుర్తును మాత్రం దాచలేకపోయాడు. అదే పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది. ప్రియురాలి బైక్‌తోనే చోరీకి వెళ్లాడా.? దర్యాప్తులో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. నిషాంత్ ఉపయోగించిన ద్విచక్రవాహనం ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మీనాక్షి నాచ్చియార్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఆమె కాల్ డేటాను పరిశీలించగా తిరుప్పూర్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ కీలకంగా మారింది. చోరీ చేసిన నగల సమాచారాన్ని నిషాంత్ తన సొంత ఫోన్ నుంచి కాకుండా మరో వ్యక్తి ఫోన్ ద్వారా మీనాక్షికి చేరవేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా నగలను ఎక్కడెక్కడ దాచారో పోలీసులు గుర్తించారు. మదురైలోని మాడకుళం ప్రాంతంలోని ఇంటితో పాటు సమీపంలోని కొండ ప్రాంతంలో దాచిన సుమారు ఆరు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీ తర్వాత తాను ధరించిన దుస్తులను పొలాల్లో తగులబెట్టినట్లు కూడా విచారణలో తేలింది. పోలీసులకు చిక్కకుండా పలుమార్లు మార్గాలు మార్చుకుంటూ వెళ్లినట్లు గుర్తించారు. ప్రేయసి కోసం భారీ చోరీ చేశాడా.? మీనాక్షి నిర్మించుకుంటున్న ఇంటికి డబ్బు అవసరమవడంతో నిషాంత్ ఈ భారీ చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మీనాక్షితో పాటు నిషాంత్ తండ్రి, ఆటో డ్రైవర్ సురేష్‌ను కూడా అరెస్టు చేశారు. చోరీ చేసిన సొత్తును దాచిపెట్టడంలో వీరి పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ప్రధాన నిందితుడు నిషాంత్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడి ఫోన్ సిగ్నల్స్ తొలుత మదురై సమీపంలోని తిరుప్పాలైలో, ఆ తర్వాత తిరుప్పూర్‌లో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పొల్లాచ్చి, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో తొమ్మిది ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఇంటి దొంగ హస్తం ఉందా.? ఈ భారీ చోరీ వెనుక షోరూం భద్రతా లోపాలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చోరీ జరిగిన సమయంలో అలారం ఆఫ్‌లో ఉండటం, డిస్‌ప్లేలోని ఆభరణాలను రాత్రివేళ లాకర్లలో భద్రపరచకపోవడం, భవనం నిర్మాణం పూర్తికాకపోవడం వంటి అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. అలారం ఎందుకు ఆఫ్‌లో ఉందనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. షోరూం సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 5వ తేదీనే నిషాంత్ చోరీకి ప్రయత్నించినట్లు సీసీ కెమెరాల ద్వారా బయటపడింది. భవనంపైకి ఎక్కినప్పటికీ కుక్కలు తరమడంతో అప్పట్లో పారిపోయాడు. ఆ సమయంలో నగలు తీసుకెళ్లలేదు. అయినా షోరూం యాజమాన్యం భద్రతను మరింత పటిష్టం చేయకపోవడం మరోసారి చర్చకు దారితీసింది. 29 వరకు జ్యుడీషియల్ కస్టడీ..! ఈ కేసులో అరెస్టయిన మీనాక్షి, సురేష్‌లను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి ఈ నెల 29 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వారిని మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. తొలుత సుమారు 30 కిలోల ఆభరణాలు చోరీకి గురైనట్లు అంచనా వేసినా, స్టాక్ పరిశీలన అనంతరం దాదాపు 15 కిలోల బంగారు, వజ్రాభరణాలు మాయమైనట్లు నిర్ధారించారు. ఇప్పటివరకు ఆరు కిలోల వరకు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఖాన్ని దాచుకుంటే తప్పించుకోవచ్చని.. సీసీ కెమెరాలకు చిక్కకుండా వ్యవహరిస్తే పోలీసులకు దొరకమని భావించిన నిషాంత్‌ను చివరకు అతడి చేతిపై ఉన్న చిన్న టాటూ పట్టించింది. కోట్ల విలువైన ఆభరణాల చోరీలో పెద్ద ప్లాన్ వేసినా.. ఓ చిన్న గుర్తు అతడి గుట్టును బయటపెట్టింది. ఇప్పుడు మిగిలిన నగలు ఎక్కడున్నాయి? నిషాంత్ ఎక్కడ దాక్కున్నాడు? ఈ భారీ చోరీలో ఇంకా ఎవరి పాత్ర ఉంది? అన్న ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తులో సమాధానాలు రావాల్సి ఉంది. మీకు నచ్చవచ్చు: హైదరాబాద్‌లో బిర్యానీ ప్రియులకు షాక్..భారీగా పెరిగిన ధరలు.! మీకు నచ్చవచ్చు: ప్రేమించింది..చంపేయాలనుకుంది..ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి మాస్టర్ ప్లాన్.!   [ Tanishq Jewellery Robbery, Madurai Gold Theft, Nishanth Krishna, Meenakshi Nachiyar, 15 Kg Gold Theft, Jewellery Heist, Tattoo Clue, Madurai Police Investigation, Gold Robbery Case, CCTV Footage ]
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది. నగరంలో ఎంతో ఇష్టంగా తినే బిర్యానీ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. నగరంలోని పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు ప్లేట్ బిర్యానీపై రూ.50 వరకు ధరలు పెంచేశాయి. దీంతో వీకెండ్‌లో కుటుంబంతో కలిసి హోటల్‌కు వెళ్లాలన్నా, చిన్నపాటి సెలబ్రేషన్ చేసుకోవాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి ఈ పెంపు అదనపు భారంగా మారింది. హైదరాబాద్‌లో సుమారు 25 వేల హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నట్లు వ్యాపార వర్గాల అంచనా. ఉద్యోగాలు, చదువుల కోసం నగరానికి వచ్చిన బ్యాచిలర్లు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగుల్లో చాలామంది బయటి ఆహారంపైనే ఆధారపడుతుంటారు. తాజా ధరల పెంపుతో వీరి నెలవారీ ఆహార బడ్జెట్‌పై రూ.500 నుంచి రూ.1,000 వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని అంచనా. ఇక నగరవ్యాప్తంగా రోజుకు సుమారు 6 లక్షల బిర్యానీ ప్లేట్లు అమ్ముడవుతున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సగటున ఒక్కో ప్లేట్‌పై రూ.30 పెరిగినా.. నగరవాసులపై రోజుకు రూ.1.8 కోట్ల అదనపు భారం పడుతుంది. అంటే నెలకు సుమారు రూ.54 కోట్ల మేర అదనపు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా ఆర్డర్ చేసేవారికి ప్యాకింగ్, డెలివరీ ఛార్జీలు అదనంగా తోడవడంతో బిల్లు మరింత పెరుగుతోంది. అయితే, ఈ ధరల పెంపునకు ముడిసరుకుల ధరల పెరుగుదలే ప్రధాన కారణమని హోటల్ యజమానులు చెబుతున్నారు. గత ఆరు నుంచి ఎనిమిది నెలలుగా ముడిసరుకుల ధరలు 15 నుంచి 20 శాతం వరకు పెరిగాయని వివరిస్తున్నారు. బిర్యానీ తయారీలో ఉపయోగించే నాణ్యమైన నెయ్యి ధర హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ.580 నుంచి రూ.800 దాటిందని పేర్కొంటున్నారు. పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తుల ధరలు కూడా 20 శాతం వరకు పెరిగాయని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..పూర్తి షెడ్యూల్ ఇదే.! వీటికి తోడు నిర్వహణ ఖర్చులు కూడా హోటల్ యాజమాన్యాలకు భారంగా మారాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర గతంలో రూ.1,750 ఉండగా, ప్రస్తుతం రూ.3,080కి చేరిందని నిర్వాహకులు చెబుతున్నారు. వంట నూనె లీటరు ధర రూ.150కి చేరగా, నాణ్యమైన బియ్యం కిలో రూ.100కు చేరువైందని పేర్కొంటున్నారు.  చికెన్, కూరగాయల ధరలు కూడా అధికంగానే ఉండటంతో హోటళ్ల నిర్వహణ వ్యయం గణనీయంగా పెరిగిందని వివరిస్తున్నారు. ముడిసరుకుల నుంచి వంట గ్యాస్ వరకు అన్నింటి ధరలు పెరగడంతో నాణ్యతలో రాజీ పడకుండా హోటళ్లు నిర్వహించడం కష్టంగా మారిందని యజమానులు అంటున్నారు. ఈ కారణంగానే తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచాల్సి వచ్చిందని స్పష్టం చేస్తున్నారు. లాభాలు పోయి.. నష్టాలు వస్తున్నాయి: కంచర్ల అశోక్ రెడ్డి.! నగరంలో హోటల్ వ్యాపారం ప్రస్తుతం తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోందని తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కంచర్ల అశోక్ రెడ్డి తెలిపారు. గతంలో వచ్చిన లాభాలు పోయి.. ఇప్పుడు నష్టాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో కొన్ని హోటళ్లు ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ధరలు పెంచితే కస్టమర్లు దూరమవుతారనే ఆందోళన ఉన్నప్పటికీ, ధరలు పెంచకుండా హోటళ్లు నిర్వహించడం సాధ్యం కాని పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు.మొత్తంగా ఒకప్పుడు సామాన్యుడికి సైతం అందుబాటులో ఉన్న బిర్యానీ ఇప్పుడు క్రమంగా ఖరీదైన వంటకంగా మారుతోంది. ముడిసరుకుల ధరలు తగ్గకపోతే భవిష్యత్తులో హోటల్ భోజనం మరింత భారంగా మారే అవకాశముందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీకు నచ్చవచ్చు: ప్రేమించింది..చంపేయాలనుకుంది..ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి మాస్టర్ ప్లాన్.! మీకు నచ్చవచ్చు: స్నేహితులతో సరదాగా బయటకు వెళ్లిన ఇండిగో మహిళా ఉద్యోగిని దారుణ హత్య.!     [ Hyderabad Biryani Prices hike , Biryani Price Hike, Hyderabad Restaurants, Telangana Food Prices, Hotel Association ]  
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.! ప్రేమంటే నమ్మకం.. ఒకరికొకరు తోడుగా నిలిచే అనుబంధం. కష్టసుఖాల్లో అండగా ఉంటారని నమ్ముతారు. కానీ అదే ప్రేమలో ఊహించని మోసం ఎదురైతే..? ప్రాణంగా ప్రేమించిన వ్యక్తే ప్రాణాలు తీసేందుకు కుట్ర పన్నితే..? కేరళలో జరిగిన ఈ ఘటన అలాంటి నమ్మకాన్నే ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రేమించి దగ్గరైన యువకుడిని.. తనకు దూరం చేసుకోవాలనుకుందో ఏమో కానీ, ఏకంగా అతడిని అంతం చేసేందుకు ఓ 19 ఏళ్ల యువతి తన స్నేహితులతో కలిసి పథకం వేసింది. చివరకు ఆ యువకుడు మృత్యువు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడటంతో ఈ దారుణ కుట్ర వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో పిలిచి.. మృత్యుపాశం పన్నింది.! కేరళలోని మలప్పురం జిల్లాలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పటాంబి ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల సఫానా తన ప్రియుడితో సంబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకుంది. అయితే అతడిని వదిలించుకోవడంతో ఆగకుండా.. ఏకంగా ప్రాణాలు తీసేందుకు తన స్నేహితులతో కలిసి కుట్ర పన్నింది. ఇందులో భాగంగా నవంబర్ 10వ తేదీ రాత్రి ప్రియుడికి ఫోన్ చేసింది. మలప్పురం జిల్లాలోని తిరూర్‌కు రావాలని చెప్పింది. ప్రియురాలు పిలవడంతో ఎలాంటి అనుమానం లేకుండా అక్కడికి వెళ్లిన ఆ యువకుడికి.. తన కోసం ప్రమాదం పొంచి ఉందన్న విషయం తెలియదు. బైక్‌పై తీసుకెళ్లి.. కారులో బంధించి దాడి.! సఫానా స్నేహితుల్లో ఒకరు తిరూర్‌లో ఆ యువకుడిని కలిశాడు. సఫానా దగ్గరకు తీసుకెళ్తానని నమ్మించి బైక్‌పై ఎక్కించుకుని మరో ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే మాటువేసి ఉన్న మిగతా నిందితులు ఒక్కసారిగా అతడిపై విరుచుకుపడ్డారు. బలవంతంగా కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేశారు. అతడి మొబైల్ ఫోన్‌ను లాక్కొని.. కారులోనే విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా కొట్టి చంపేందుకు ప్రయత్నించారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ యువకుడు ఎంతగా పోరాడాడో కానీ.. చివరకు తీవ్ర గాయాలతో నిస్సహాయ స్థితికి చేరుకున్నాడు. ఇది కూడా చదవండి:  ఐసీసీ ఛైర్మన్‌గా జై షా రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక.! నదీ తీరంలో వదిలేసి పరార్.. అయినా వదలని ధైర్యం.! దాడి చేసిన నిందితులు అతడిని మలప్పురంలోని తాళెపాలెం నది సమీపంలో రోడ్డు పక్కన పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆ యువకుడు మాత్రం ప్రాణాలపై ఆశ వదులుకోలేదు. మృత్యువుతో పోరాడుతూ ఎలాగోలా పోలీసులను ఆశ్రయించాడు. తనకు జరిగిన దారుణాన్ని వివరించాడు. అతడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తిరూర్ పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. 19 ఏళ్ల యువతి సహా ఐదుగురు అరెస్ట్.! ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సఫానాతో పాటు తిరూర్‌కు చెందిన 20 ఏళ్ల నదియా, 25 ఏళ్ల రబీనా, 28 ఏళ్ల ఇర్షాద్, 25 ఏళ్ల అజారుద్దీన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ 11 రాత్రి లేదా 12వ తేదీ తెల్లవారుజామున నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విచారణలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇర్షాద్, అజారుద్దీన్‌లపై గతంలోనే పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ అక్రమ రవాణా, హత్యాయత్నం, హింసాత్మక దాడులతో పాటు కేరళ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (KAAPA) కింద కూడా కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో వీరు జైలు శిక్ష కూడా అనుభవించారు. నిందితులందరినీ కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం వారిని జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపింది. ప్రేమ బంధంలో ఇంతటి క్రూరత్వమా.? ప్రాణంగా నమ్మిన వ్యక్తి నుంచి ఇలాంటి ప్రమాదం ఎదురవుతుందని ఆ యువకుడు కలలో కూడా ఊహించి ఉండడు. ప్రేమ పేరుతో పిలిచి.. స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేసి.. ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించిన ఈ ఘటన కేరళలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అయితే ఆ యువకుడు సకాలంలో పోలీసులను ఆశ్రయించడంతో ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది. ప్రేమ బంధంలో విభేదాలు రావచ్చు.. విడిపోవాలనే నిర్ణయాలూ ఉండొచ్చు. కానీ ఒకరి జీవితాన్ని అంతం చేయాలనే ఆలోచన ఎంతటి విషాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.   మీకు నచ్చవచ్చు: పులివెందుల ఎంపీపీ ఎన్నికకు కొత్త చిక్కు.! మీకు నచ్చవచ్చు: స్నేహితులతో సరదాగా బయటకు వెళ్లిన ఇండిగో మహిళా ఉద్యోగిని దారుణ హత్య.! [ kerala boyfriend murder plot, safana tirur case, malappuram crime news, kerala teenage girl arrest, kidnapping and robbery case, 19 year old woman arrested ]
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది. ప్రైవేట్ విమానయాన సంస్థలో పనిచేస్తున్న ఆ మహిళా ఉద్యోగిని విగతజీవిగా మారిన వైనం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన గోండియా జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. మృతురాలిని పుణె విమానాశ్రయంలోని ఇండిగో కౌంటర్‌లో పనిచేస్తున్న వర్షా తుర్కర్‌గా పోలీసులు గుర్తించారు. ఆమె వయసు 35 సంవత్సరాలు కాగా, కొద్దిరోజుల క్రితమే తన చిన్నారి కూతురితో కలిసి పుట్టింటికి వచ్చారు. శనివారం సాయంత్రం సమయంలో వర్ష తన స్నేహితుడు నితేష్ అగర్వాల్‌తో కలిసి బయటకు వెళ్లారు. వైన్‌గంగా నదీతీర ప్రాంతం వైపు వెళ్లిన వీరు కొద్దిసేపటి తర్వాత అటవీ ప్రాంతానికి చేరుకున్నట్లు సమాచారం. అయితే కొద్ది గంటల వ్యవధిలోనే ఆ ప్రాంతం నుంచి తీవ్ర విషాద వార్త వెలువడింది. వర్ష తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిఉన్నట్లు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని ఆమెను సమీపంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మృతురాలితో పాటు వెళ్లిన నితేష్ అగర్వాల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ముఖం ధరించిన కొందరు దుండగులు తమపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారని నితేష్ పోలీసులకు తెలిపాడు. అయితే, దాడి జరిగిందని చెబుతున్నప్పటికీ నితేష్ శరీరాలపై ఎటువంటి గాయాలు లేకపోవడం పోలీసులకు తీవ్ర అనుమానం కలిగించింది. అతని మాటల్లో పొంతన లేకపోవడంతో హత్య కోణంలో అన్ని కోణాల నుంచి లోతుగా విచారిస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తేనే అసలు నిజాలు బయటపడతాయని అధికారులు తెలిపారు.   ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా కార్తీక తొలి సోమవారం.. పోటెత్తిన శివ భక్తులు [ IndiGo employee murder, Varsha Turkar news, Gondia forest crime news, Maharashtra police investigation, Diwali tragedy news ]
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. నేడు కార్తీక మాసపు తొలి సోమవారం కావడంతో పరమశివుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు రెండు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాల వద్ద భక్తుల రద్దీ కనిపిస్తోంది. నదీ తీర ప్రాంతాలు, పుష్కర ఘాట్లు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. భక్తులు పవిత్ర నదీ స్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. మల్లన్న దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా చేరుకుంటున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. పంచారామ క్షేత్రాలలో ఒకటైన పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారికి వేద పండితుల ఆధ్వర్యంలో రుద్రాభిషేకాలు, విశేష పూజలు ఘనంగా జరుగుతున్నాయి. రాజమండ్రిలోని గోదావరి ఘాట్ల వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైనది కావడంతో భక్తులు కఠిన నియమ నిష్టలతో ఉపవాసాలు ఆచరిస్తారు. ఆలయాల్లో రద్దీని నియంత్రించేందుకు నిర్వాహకులు మరియు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించారు. ఈ పవిత్ర మాసం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని రాబోయే రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా శ్రీశైలంలో ఈ నెల 24న నిర్వహించనున్న కోటి దీపోత్సవానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్తీక దీపారాధనతో తెలుగు లోగిళ్లన్నీ ఆధ్యాత్మిక వెలుగులతో కళకళలాడుతున్నాయి.     [ Karthika Masam First Monday, Srisailam Temple Rush, Karthika Somavaram 2026, Telugu Shiva Temples, Karthika Deepam Rituals ]  
ALSO ON TELUGUONE N E W S
సినిమా కథల విషయంలో ఒక్కోసారి విచిత్రమైన యాదృచ్ఛికాలు జరుగుతుంటాయి. ఇద్దరు దర్శకులు ఒకే తరహా ఆలోచనతో సినిమాలు తెరకెక్కించడం, అవి దగ్గర దగ్గరగా విడుదల కావడం మనం చూస్తుంటాం. కానీ ఇప్పుడు టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. నవంబర్ 20న విడుదలకు సిద్ధమవుతున్న ‘ఆకాశంలో ఒక తార’, ‘డియర్ ఆస్ట్రోనాట్’ సినిమాల కథలు దాదాపు ఒకేలా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ రెండు సినిమాల ట్రైలర్లు విడుదల కావడంతో ఈ పోలికలపై చర్చ మరింత పెరిగింది. ఒక అమ్మాయి ఆకాశాన్ని అందుకోవాలని, వ్యోమగామి కావాలని కలలు కనడం.. ఆ కలను నిజం చేసుకునే క్రమంలో ఎదురయ్యే పరిస్థితులు.. ఆమెకు అండగా నిలిచే వ్యక్తులు.. ఇలా రెండు ట్రైలర్లలోనూ ఒకే తరహా పాయింట్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈ రెండు సినిమాల మధ్య పోలికలు కనిపించడంతో అసలు ఈ కథ ఎవరిది? ముందుగా ఎవరు మొదలుపెట్టారు? అనే ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ రెండు ప్రాజెక్టుల వెనుక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘డియర్ ఆస్ట్రోనాట్’ దర్శకుడు కార్తీక్ భాగ్యరాజా 2021లో ఇదే కథాంశంతో ‘కౌగిలి’ అనే షార్ట్ ఫిల్మ్ రూపొందించారట. ఆ షార్ట్ ఫిల్మ్‌కు మంచి స్పందన రావడంతో దానిని ఫీచర్ ఫిల్మ్‌గా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారట. 2022 జనవరి 1న ‘కౌగిలి’ పేరుతో సినిమా పోస్టర్ కూడా విడుదల చేశారని సమాచారం. ఇది కూడా చదవండి: ఆకాశంలో ఒక తార ట్రైలర్.. ఆకాశాన్ని అందుకోవాలని అమ్మాయి ఆశ.. అండగా కృష్ణ.! ఆ తర్వాత ఈ కథను సినిమాగా రూపొందించేందుకు పలువురు నిర్మాతలను సంప్రదిస్తున్న సమయంలో.. ‘ఆకాశంలో ఒక తార’ కూడా ఇలాంటి కథాంశంతో తెరకెక్కుతోందని మరో దర్శకుడి ద్వారా కార్తీక్‌కు తెలిసిందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన ‘ఆకాశంలో ఒక తార’ దర్శకుడు పవన్ సాధినేనిని సంప్రదించి రెండు కథల్లో ఉన్న పోలికల గురించి చర్చించారట. అయితే ఇద్దరు వ్యక్తులకు ఒకే ఆలోచన రావచ్చని, తమ సినిమా మాత్రం తమ సొంత కథతోనే తెరకెక్కుతోందని పవన్ సమాధానం ఇచ్చినట్లు ఇన్ సైడ్ టాక్. తాజాగా జరిగిన ‘ఆకాశంలో ఒక తార’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు పవన్ సాధినేని మాట్లాడుతూ.. కరోనా టైంలో 2020లోనే ఈ కథ రాసుకున్నట్లు తెలిపారు. అంటే ఇద్దరు దర్శకులకు ఇంచు మించు ఒకే సమయంలో ఒకే తరహా కథ ఆలోచన వచ్చింది అన్నమాట. ‘ఆకాశంలో ఒక తార’లో కల్పన అనే పల్లెటూరి అమ్మాయి ఆస్ట్రోనాట్ కావాలని కలలు కంటుంది. ఆమె ఆశయాన్ని చుట్టూ ఉన్నవాళ్లు ఎగతాళి చేసినా, అసాధ్యమని నిరుత్సాహపరిచినా తన లక్ష్యాన్ని వదులుకోదు. ఆ సమయంలో కృష్ణ అనే వ్యక్తి ఆమెకు అండగా నిలుస్తాడు. కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్, కల్పనగా సాత్విక వీరవల్లి నటించారు.  మరోవైపు ‘డియర్ ఆస్ట్రోనాట్’లోనూ ఓ అమ్మాయి వ్యోమగామి కావాలనే కల, ఆ కలను నిజం చేసుకునేందుకు ఆమె చేసే ప్రయత్నాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అయితే ఇందులో ఆమె భర్త తన ఆశయానికి తోడుగా నిలుస్తాడు.  అంటే ఒక సినిమాలో ప్రేమించే వ్యక్తి.. మరో సినిమాలో భర్త అమ్మాయి కలకు అండగా నిలుస్తారు. కథలోని ప్రధాన భావన ఒకేలా కనిపిస్తున్నా, పాత్రల మధ్య సంబంధాలు, కథను నడిపించే విధానం వేరుగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఒకే తరహా కథతో రెండు సినిమాలు వస్తే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడం సహజం. అయితే ఇక్కడ రెండు సినిమాలూ ఒకే రోజు థియేటర్లలోకి వస్తుండటంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. మరి నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ రెండు సినిమాల్లో ఏది మనసులు గెలుచుకుంటుంది? ఒకే కథాంశం రెండు విభిన్న విజయాలుగా మారుతుందా? చూడాలి. మీకు నచ్చవచ్చు: బన్నీ-బోయపాటి కాంబో.. ఈసారి మాస్ కాదు.. మైథలాజికల్.! ఎన్టీఆర్ లైనప్‌లో భారీ మార్పులు.. నెక్స్ట్ నాలుగు సినిమాల రిలీజ్ డేట్స్ ఇవే.!       [Aakasamlo Oka Tara, Dear Astronaut, Dulquer Salmaan, Pavan Sadineni, Karthik Bhagyaraja]  
సోనియా గాంధీ.. రాజకీయాలు తెలియని వాళ్ళ నోళ్ళల్లో సైతం నిత్యం 'సోనియా గాంధీ' అనే పేరు వినిపిస్తూనే ఉంటుంది. భారత రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన మహిళా నేతగా గుర్తింపు సైతం ఆమె సొంతం ఈ కాంగ్రెస్ అగ్రనేత్రి  జీవిత కథ ఇప్పుడు వెండితెరపైకి రాబోతోంది. ఇటీవల నవంబర్ 10న విడుదలైన ఆమె 544 పేజీల ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వేళ, ఈ పుస్తకం ఆధారంగా తెలుగులో ఒక భారీ బయోపిక్ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించాడు. సంగారెడ్డిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించాడు . ఈ సినిమా నిర్మాణం కోసం ఇప్పటికే స్థానిక కాంగ్రెస్ కన్వీనర్ జూలకంటి ఆంజనేయులు . 2 కోట్ల విరాళాన్ని ప్రకటించగా, ప్రాజెక్టు పనులను పర్యవేక్షించడానికి గాంధీ భవన్ పీఆర్ఓ హరిప్రసాద్ ఆధ్వర్యంలో 50 మంది సభ్యులతో ఒక ప్రత్యేక కమిటీని  ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ బయోపిక్ ప్రకటన వెలువడినప్పటి నుంచే సోనియా గాంధీ పాత్రలో ఏ హీరోయిన్ కనిపిస్తారనే  దానిపై సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన ఊహాగానాలు మొదలయ్యాయి.  దర్శకుడు లేదా నటీనటుల వివరాలను అధికారికంగా ప్రకటించనప్పటికీ, సోనియా గాంధీ జీవితంలోని విభిన్న దశలను తెరపై ఆవిష్కరించగల సత్తా ఉన్న ఐదుగురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కరీనా కపూర్ ఖాన్ పేరు మొదటి వరుసలో ఉంది. ఇటలీలో పుట్టిన ఒక సాధారణ యువతి నుంచి, భారత రాజకీయాలను శాసించే అగ్రనేతగా ఎదిగిన తీరును తన అద్భుతమైన నటనతో కరీనా పండించగలరని అభిమానులు భావిస్తున్నారు.   మరోవైపు, గతంలో 'రాజనీతి' సినిమాలో రాజకీయ నాయకురాలిగా అద్భుతంగా నటించిన కత్రినా కైఫ్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఆ సినిమా కోసం ఆమె ప్రియాంక గాంధీ ప్రసంగాలను, హావభావాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన నేపథ్యంలో, సోనియా గాంధీ పాత్రకు కత్రినా అయితే రూపం పరంగా, నటన పరంగా సరిగ్గా సరిపోతారని పలువురు విశ్లేషిస్తున్నారు. వీరితో పాటు లోతైన భావోద్వేగాలను కళ్లతోనే పలికించగల షెఫాలీ షా, గతంలో 'సంజు' చిత్రంలో నర్గీస్ దత్ పాత్రలో ఒదిగిపోయిన మనీషా కొయిరాలా, అలాగే హుందాతనంతో కూడిన పాత్రలకు పెట్టింది పేరైన సీనియర్ నటి టబు పేర్లు కూడా ఈ రేసులో ప్రచారంలో ఉన్నాయి.  ఇది కూడా చదవండి: అంగరంగ వైభవంగా జరిగిన ప్రముఖ హీరో పెళ్లి: ఆ హీరో అన్న కొడుకు కూడా! ఇటలీలోని ఒక చిన్న గ్రామంలో 1946లో జన్మించిన సోనియా మైనో, కేంబ్రిడ్జ్‌లో రాజీవ్ గాంధీని ప్రేమించి 1968లో వివాహం చేసుకున్నారు. అత్తగారు ఇందిరా గాంధీ, భర్త రాజీవ్ గాంధీ హత్యల వంటి తీవ్ర విషాదాలను తట్టుకుని, కుటుంబాన్ని నిలబెట్టిన తీరు ఎంతో భావోద్వేగభరితం. 2004లో ప్రధానమంత్రి పదవిని సైతం త్యాగం చేసి, డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ఆ బాధ్యతలు అప్పగించిన చారిత్రక ఘట్టం ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మరి జగ్గారెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ బయోపిక్‌లో సోనియా గాంధీగా కనిపించే ఆ అదృష్టవంతురాలైన హీరోయిన్ ఎవరో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.   మీకు నచ్చవచ్చు:పాపని కడుపులో ఉంచుకొని వంద సిగరెట్లు తాగిన హీరోయిన్! మీకు నచ్చవచ్చు: పవన్ కళ్యాణ్ , అన్నా లెజినోవా విడాకులపై: లేటెస్ట్ అప్ డేట్ ఇదే!   [Sonia Gandhi, Sonia Gandhi Biopic, Belonging A Journey of Love movie, Tollywood, Bollywood]
మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మాతగా సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లను కూడా నిర్మిస్తున్నారు. అలా ఆమె నిర్మించిన తాజా సిరీస్ ‘వరం’. విశ్వదేవ్ రాచకొండ, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు ఆదిత్య మండల దర్శకత్వం వహించారు. అక్టోబర్ 22 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్స్‌ను విడుదల చేస్తున్నారు. ఫాంటసీ, థ్రిల్లర్ అంశాలతో రూపొందిన ఈ సిరీస్ కథేంటో.. ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం. రాజు (విశ్వదేవ్ రాచకొండ) ఒక మురికివాడలో నివసించే యువకుడు. అతని తండ్రి (శివాజీ రాజా) తాగుడుకు బానిస కాగా, తల్లి కమలమ్మ ఓ ధనవంతుడైన శర్మ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తుంటుంది. రాజుకు ఓ టిఫిన్ సెంటర్ నడిపే బాబాయ్, అతని కూతురు సింధు, స్నేహితుడు నాని తోడుగా ఉంటారు. ఇదే సమయంలో వేశ్యాగృహంలో ఉండే సత్యతో రాజుకు మంచి పరిచయం ఏర్పడుతుంది. ఆమెను ఆ జీవితం నుంచి బయటకు తీసుకురావాలని రాజు భావిస్తుంటాడు. అయితే సత్య దగ్గరకు తరచూ వచ్చే రాజకీయ నాయకుడు త్రిపాఠి (శ్రీనివాస్ అవసరాల)కు రాజు ఆమెతో చనువుగా ఉండటం నచ్చదు. మరోవైపు పేదరికంలో బతకడం రాజుకు ఇష్టం ఉండదు. తన తల్లిని అవమానించిన శర్మ ఇంటినే కొనుగోలు చేసి, అందులో ఆమెను గౌరవంగా ఉంచాలనేది అతని ఆశయం. ఈ క్రమంలో అతనికి ఓ విచిత్రమైన వరం లభిస్తుంది. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు సంబంధించిన వార్తలు అతని ఫోన్‌లో ముందుగానే కనిపిస్తుంటాయి. ఈ విషయాన్ని తన స్నేహితులతో పంచుకున్న రాజు.. ఆ సమాచారాన్ని ఉపయోగించుకొని డబ్బు సంపాదించడం మొదలుపెడతాడు. ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించిన వార్తలు ముందే తెలుసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. అలా డబ్బు సంపాదించిన రాజు వేశ్యాగృహం నుంచి సత్యను బయటకు తీసుకొచ్చి, ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే సత్యతో సంబంధం ఉన్న త్రిపాఠికి ఇది నచ్చదు. రాజకీయంగా ఎదుగుతున్న అతను రాజును దెబ్బతీయాలని నిర్ణయించుకుంటాడు. దీంతో రాజు, త్రిపాఠి మధ్య గొడవలు మొదలవుతాయి. తనకు ముందుగానే తెలిసే వార్తలను ఉపయోగించుకొని రాజు ఈ సమస్యల నుంచి ఎలా బయటపడతాడు? త్రిపాఠిని ఎలా ఎదుర్కొంటాడు? చివరికి సత్యతో అతని జీవితం ఏమవుతుంది? అనేది మిగతా కథ. ఇది కూడా చదవండి: దక్షిణాది నుంచి తొలి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న దర్శకుడు ఎవరో తెలుసా? ఇక ఈ సిరీస్‌లో ప్రధానమైన పాయింట్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, కథనం మాత్రం పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ముందుగానే తెలుసుకునే అవకాశం రావడం అనే అంశాన్ని గతంలోనూ సినిమాలు, సిరీస్‌లలో చూశాం. ఇక్కడ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఈ కాన్సెప్ట్‌ను చూపించారు. హీరో డబ్బు సంపాదించడానికి బెట్టింగ్‌ను ఎంచుకోవడం, పోలీసులను తప్పుదారి పట్టించే సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. తల్లికి సొంత ఇల్లు ఇవ్వాలనే హీరో ఆశయం ఉన్నప్పటికీ, అందుకోసం అతను చేసే పనులు ప్రేక్షకులను భావోద్వేగంగా కనెక్ట్ చేయలేకపోయాయి. ముఖ్యంగా అతనికి ఈ వరం ఎలా వచ్చిందనే అంశానికి బలమైన కారణాన్ని చూపించకపోవడం మరో లోపంగా కనిపిస్తుంది. అలాగే కొన్ని పాత్రలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేదు. శర్మ తన బంగ్లాను వదిలి వెళ్లిపోయే సన్నివేశం కూడా సహజంగా అనిపించదు. అయితే ఆరో ఎపిసోడ్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం తర్వాతి ఎపిసోడ్స్‌పై ఆసక్తిని పెంచుతుంది. విశ్వదేవ్ రాచకొండ, శివాత్మిక రాజశేఖర్, శ్రీనివాస్ అవసరాల, శివాజీ రాజా, అజయ్ తదితరులు తమ పాత్రల పరిధిలో బాగానే నటించారు. ఫహద్ అబ్దుల్ మజీద్ సినిమాటోగ్రఫీ, సిద్ధార్థ్ సదాశివుని నేపథ్య సంగీతం, సిద్ధేశ్ చౌదరి ఎడిటింగ్ ఓ మోస్తరుగా ఉన్నాయి. మంచి కాన్సెప్ట్‌ను ఎంచుకున్నప్పటికీ, ఆసక్తికరమైన మలుపులతో కథను నడిపించడంలో సిరీస్ కొంత తడబడింది. మీకు నచ్చవచ్చు:  ఒకప్పుడు ఆయన చేసింది ఆ వ్యాపారమే.. ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపించే స్థాయికి ఎలా ఎదిగారు.? రోజుకు రూ.30 సంపాదన నుంచి నేషనల్ అవార్డు వరకు.. తమన్ జీవితంలో ఎన్ని కష్టాలో తెలుసా?           [VaramWebSeries, VaramSeriesReview, VishwadevRachakonda, ShivathmikaRajasekhar, Sushmita] 
ఒక్కొక్కలకి ఒక్కో టైం అన్నట్టుగా ఇప్పుడు పెళ్లిళ్ల టైం సినిమా హీరోల వంతు వచ్చింది. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు తేజ సజ్జా, సాయి ధరమ్ తేజ్ పెళ్లికి రెడీ ‍అయిపోయారు. ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సైతం వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. కన్నడ  శాండల్‌వుడ్ రియల్ స్టార్ ఉపేంద్ర కుటుంబంలో ఇప్పుడు పెళ్లి సందడి నెలకొంది. ఉపేంద్ర అన్న సుధీంద్ర కుమార్, వీణ దంపతుల కుమారుడు, టాలీవుడ్ మరియు శాండల్‌వుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ హీరో నిరంజన్ సుధీంద్ర    వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. వృత్తిరీత్యా గైనకాలజిస్ట్ (స్త్రీరోగ నిపుణురాలు)గా సేవలందిస్తున్న డాక్టర్ సంజనా బి. రాజ్‌తో నిరంజన్ వివాహం అత్యంత వైభవంగా జరిగింది. పెద్దల అంగీకారంతో, అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో నూతన వధూవరులు ఒక్కటయ్యారు. బెంగళూరులోని ఒక ప్రముఖ ప్రైవేట్ రిసార్ట్ మరియు విలాసవంతమైన హోటల్‌లో వీరి వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హల్దీ, మెహందీ, సంగీత్ గ్రాండ్ రిసెప్షన్ కార్యక్రమాల్లో ఉపేంద్ర కుటుంబ సభ్యులంతా కలిసి సందడి చేశారు. ముఖ్యంగా హల్దీ వేడుకలో నిరంజన్ సుధీంద్ర తన తల్లి వీణతో పాటు బాబాయ్ ఉపేంద్ర, పిన్ని ప్రియాంక ఉపేంద్రలతో కలిసి వేసిన డ్యాన్స్ స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కుటుంబ సభ్యులంతా ఆనందోత్సాహాలతో చిందులేస్తున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినీ ప్రముఖులు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. తమ ప్రేమకథ గురించి నిరంజన్ సుధీంద్ర ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమది 'లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్' అని ఆయన ఎంతో సంతోషంగా తెలిపారు. కొంతకాలం క్రితం స్నేహితుల ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొద్దిరోజుల్లోనే గాఢమైన ప్రేమగా మారింది. సంజనాలోని స్వతంత్ర భావాలు, అందరిపై చూపే ప్రేమ, ఆప్యాయత మరియు బాధ్యతాయుతమైన స్వభావం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని నిరంజన్ మనసులోని మాటను బయటపెట్టారు. ఇరు కుటుంబాల పెద్దలు వీరి ప్రేమకు పచ్చజెండా ఊపడంతో ఈ పెళ్లి పీటలెక్కింది. ఇది కూడా చదవండి: స్టార్ హీరోయిన్ తల్లి నిర్వాహకం:ప్రెగ్నెన్సీ ఉందన్న సోయిలేదు.. రోజుకు 100 సిగరెట్లు తాగేసింది! వధువు డాక్టర్ సంజనా రాజ్ నేపథ్యం కూడా ఎంతో ప్రత్యేకమైనది. ఆమె బెంగళూరులోని రాజరాజేశ్వరి ఆసుపత్రిలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. ఇటీవలే ఎం.ఎస్ (MS) చివరి సంవత్సరం పరీక్షలు పూర్తి చేసిన సంజనా, ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. వీరి కుటుంబం మూలాలు మైసూరులో ఉన్నప్పటికీ, గత 10 సంవత్సరాలుగా బెంగళూరులోనే స్థిరపడ్డారు. ఇక హీరో నిరంజన్ సుధీంద్ర సినీ ప్రయాణం విషయానికి వస్తే.. చిన్నతనంలోనే దిగ్గజ నటుడు విష్ణువర్ధన్ నటించిన 'బళ్లారి నాగ' చిత్రంలో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ప్రియాంక ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన 'సెకండ్ హాఫ్' సినిమాతో హీరోగా మారి తన ప్రతిభను నిరూపించుకున్నారు. అనంతరం 'నమ్మ హుడుగరు' చిత్రంతో పాటు, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో తెరకెక్కిన 'సీతాపయణం' లో హీరోగా నటించి మెప్పించారు. ప్రస్తుతం 'హంటర్' అనే యాక్షన్ చిత్రంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులలో నిరంజన్ బిజీగా ఉన్నారు. ఉపేంద్ర కుటుంబంలో తర్వాతి తరానికి చెందిన మొదటి వివాహం ఇదే కావడంతో, శాండల్‌వుడ్ ఇండస్ట్రీతో పాటు అభిమానులు ఈ జంటకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.   మీకు నచ్చవచ్చు:ధురంధర్ 2 కలెక్షన్స్ ని రామాయణ దాటిందా: అసలు లెక్కలివే! మీకు నచ్చవచ్చు:వైరల్ గా మారిన కన్నప్ప బ్యూటీ ప్రీతి ముకుందన్!   [Niranjan Sudhindra , Upendra, Priyanka,  Dr Sanjana Raj, Tollywood]
‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జా ఓ ఇంటివాడు కాబోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో తేజ సజ్జా ఎంగేజ్‌మెంట్ వేడుక ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్‌లో ఈ నిశ్చితార్థ వేడుక జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుక.. సినీ, రాజకీయ ప్రముఖుల రాకతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తేజ సజ్జా నిశ్చితార్థానికి మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి, శ్రీకాంత్, శివాజీ తదితరులు హాజరయ్యారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, కార్తీక్ ఘట్టమనేని, నిర్మాతలు అల్లు అరవింద్, సాహు గారపాటి, టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్, నాగవంశీ  తదితరులు కూడా వేడుకలో పాల్గొన్నారు. నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తన భర్తతో కలిసి హాజరై సందడి చేశారు. నిహారిక కొణిదెల, నిధి అగర్వాల్, రితిక నాయక్ కూడా ఈ వేడుకలో మెరిశారు. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ రంగానికి చెందిన అతిథులు కూడా ఈ వేడుకకు వచ్చారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా తదితరులు హాజరై తేజ సజ్జాకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది కూడా చదవండి: ఆకాశంలో ఒక తార ట్రైలర్.. ఆకాశాన్ని అందుకోవాలని అమ్మాయి ఆశ.. అండగా కృష్ణ.! తేజ సజ్జా తనకు కాబోయే భార్య గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని, ఆమె అమెరికాలో పెరిగారని తెలిపారు. ప్రస్తుతం తన తండ్రితో కలిసి టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్నారని చెప్పారు. ఆమె కుటుంబానికి సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని, అందుకే తన కాబోయే భార్య వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచాలనుకుంటున్నట్లు తేజ వెల్లడించారు. నిశ్చితార్థం పూర్తవడంతో ఇప్పుడు అందరి దృష్టి తేజ సజ్జా వివాహంపై పడింది. డిసెంబర్ 2026లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం. పెళ్లి అనంతరం హైదరాబాద్‌లో సినీ పరిశ్రమకు చెందిన స్నేహితులు, ప్రముఖుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.  మీకు నచ్చవచ్చు: ఒకే  ఫ్రేమ్‌లో చిరంజీవి, ప్రభాస్‌.. సందీప్‌ రెడ్డి అభిమానం చూపిస్తాడా.? అరుంధతి నక్షత్రం.. గ్రేట్ డైరెక్టర్‌తో ఆది సాయికుమార్ మూవీ.!       [Teja Sajja Engagement, Chiranjeevi, Ravi Teja, Nani, Rana Daggubati]  
హీరోయిన్స్ కి సంబంధించిన కొన్ని న్యూస్  చూస్తుంటే  పక్కనున్న వాళ్ళని నేను చదువుతుంది కల, నిజమా అని తెలియడానికి గిల్లమని అడిగే పరిస్థితి. ఒళ్ళు జలదరిస్తుంది కూడా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ప్రస్తుతం అగ్రకథానాయికగా దూసుకుపోతున్న ఆమెకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఆలియా భట్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అలాగే షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. స్వయంగా ఆమె తల్లి, సీనియర్ నటి సోనీ రజ్దాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు  ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.  తాను గర్భవతిగా ఉన్న సమయంలో ఏకంగా రోజుకి 100 సిగరెట్లు కాల్చాల్సి వచ్చిందని ఆమె గుర్తుచేసుకున్నారు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ తెరకెక్కించిన 'గుమ్రా' చిత్రం 1993లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో సోనీ రజ్దాన్ కీ రోల్.అయితే ఆ సమయంలో ఆమె తన రెండవ గర్భం దాల్చారనే విషయం ఆమెకు అసలు తెలియదట. తాను ప్రెగ్నెంట్ అనే విషయం తెలియకముందే, చిత్రంలో భాగంగా ఒక ప్రత్యేకమైన ధూమపాన సన్నివేశంలో ఆమె నటించాల్సి వచ్చింది. ఈ సీన్ కోసం ఆమె ఏకంగా ఒకే రోజులో సుమారు 100 సిగరెట్లని  కాల్చవలసి వచ్చిందని స్వయంగా ఆమె నవ్వుతూ తెలిపారు.   ఆ సమయంలో తన గర్భంలో ఉన్నది ఎవరో కాదు. ఇది కూడా చదవండి: అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్న కలెక్షన్స్: ధురంధర్ 2 ని దాటిందనే దానిపై అసలు కలెక్షన్స్ బయటకి!   ప్రస్తుతం బాలీవుడ్‌ని ఏలుతున్న ఆలియా భట్ అని సోనీ రజ్దాన్ పేర్కొన్నారు. తాను సాధారణంగా సిగరెట్లు తాగే అలవాటు ఉన్న వ్యక్తి కాదని, కానీ షూటింగ్ అనుభవం తర్వాత తనకు నిజంగానే సిగరెట్లు తాగాలనే కోరిక (హంబల్) పుట్టిందనే ఆశ్చర్యకరమైన విషయాన్ని కూడా ఆమె పంచుకున్నారు. కేవలం సిగరెట్ సీన్ మాత్రమే కాకుండా, తాను గర్భవతిగా ఉన్న సమయంలోనే ఒక క్లిష్టమైన ఉరిశిక్ష (ఫాషింగ్) సన్నివేశాన్ని కూడా షూట్ చేసినట్లు  తెలిపారు.  ఆ తర్వాత సుమారు ఐదు నెలల విరామం తరువాత తిరిగి షూటింగ్ సెట్స్‌కు వచ్చేసరికి తన దుస్తులు సరిపోలేదని, అప్పటికే కడుపు కొద్దిగా బయటకు రావడంతో కాస్ట్యూమ్స్‌లో మార్పులు చేయాల్సి వచ్చిందని ఆమె నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నాటి కాలంతో పోలిస్తే నేడు చిత్ర పరిశ్రమలో మాతృత్వం పట్ల ఎంతో మార్పు వచ్చిందని, నేడు నటీమణులు తమ ప్రెగ్నెన్సీని దాచిపెట్టాల్సిన అవసరం లేకుండా పని చేయగలుగుతున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అలియాభట్ తండ్రి బాలీవుడ్ లో  అగ్ర దర్శకుడు మహేష్ భట్ అని తెలుగులో మూడుదశాబ్దాల క్రితమే కింగ్ నాగార్జున తో క్రిమినల్ మూవీ కూడా తెరకెక్కిచాడనే విషయం తెలిసిందే.   మీకు నచ్చవచ్చు: విజయ్ దేవరకొండ రీసెంట్ పోస్ట్ వైరల్! మీకు నచ్చవచ్చు: కల్కి 2 ఆ ఏరియాలో బిజినెస్ ఇంతే: ఎందుకని ఇలా!     [Soni Razdan, Alia Bhat, Mahesh Bhat, Bollywood, Tollywood]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందా? ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే ఆసక్తికరమైన చర్చ. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సరైనోడు’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌లో భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కే అవకాశం ఉందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజా సమాచారం ప్రకారం బోయపాటి శ్రీను అల్లు అర్జున్‌కు ఓ స్టోరీ కాన్సెప్ట్‌ను వినిపించారట. అందులోని పాయింట్ నచ్చడంతో అల్లు అర్జున్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే పూర్తి స్క్రిప్ట్ ఇంకా సిద్ధం కావాల్సి ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదట. పౌరాణిక అంశాలను మాస్ యాక్షన్‌తో మిళితం చేస్తూ బోయపాటి ఈ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇదే నిజమైతే అల్లు అర్జున్ కెరీర్‌లో పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కే తొలి సినిమా కానుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత బోయపాటి శ్రీనుతో సినిమా పట్టాలెక్కే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరికొందరేమో లోకేష్ కనగరాజ్, బోయపాటి శ్రీను సినిమాలు పారలల్ గా షూట్ జరుగుతాయి అంటున్నారు. ఇది కూడా చదవండి: మరో సర్‌ప్రైజ్.. బోయపాటితో అల్లు అర్జున్‌ మూవీ అనౌన్స్‌మెంట్‌.! అయితే షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఇందులో బన్నీ పాత్ర ఎలా ఉండబోతోంది? కథ ఏ పౌరాణిక అంశం చుట్టూ తిరుగుతుంది? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి ‘పుష్ప’తో పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను మరింత విస్తరించుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు పౌరాణిక కథతో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది. మీకు నచ్చవచ్చు: క్రిష్‌ జగర్లమూడి దర్శకత్వంలో అల్లు అర్జున్‌.! ఎన్టీఆర్ లైనప్‌లో భారీ మార్పులు.. నెక్స్ట్ నాలుగు సినిమాల రిలీజ్ డేట్స్ ఇవే.!       [Sarrainodu Combo, Allu Arjun, Boyapati Sreenu, Mythological Film, Geetha Arts]  
అయోధ్య రాముడు వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద తన జైత్రయాత్రని కంటిన్యూ చేస్తున్నాడు. దీంతో ఒక్కో రికార్డు జై శ్రీరామ్ అంటూ సైడ్ ఇచ్చుకుంటూ వెళ్తుంది. ఒక రకంగా రోజు రికార్డుల  న్యూస్ వినపడుతూనే ఉంది. తాజాగా ధురంధర్ 2 ని ఆ రకంగా కూడా బీట్ చేసిన చిత్రంగా తన దిశ, దశ చాటింది.    రామాయణ ఇప్పటికి వచ్చి పదకొండు రోజులు. ఈ పదకొండు రోజులకి 1384 .50 కోట్ల గ్రాస్ ని సాధించింది. ధురంధర్ 2 అదే పదకొండు రోజులకి 1354 .92 కోట్లు రాబట్టింది. దీంతో ధురంధర్ 2 తలవంచక తప్పలేదు. ముందు ముందు కూడా తలవంచాల్సి వస్తుందేమో అని బెంగ కూడా ధురంధర్ 2 కి పట్టుకుంది.సినిమా విడుదలైన తొలి రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో రామాయణం అగ్రస్థానంలో నిలిచింది. ఈ చిత్రం ఏకంగా 8 రోజుల పాటు నిలకడగా రోజుకు . 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డును నమోదు చేసింది.  ఇంతకుముందు ఏ సినిమా కూడా ఈ స్థాయిలో వరుస రోజుల్లో ఈ మైలురాయిని అందుకోలేదు. ఇక సౌత్ రాష్ట్రాల విషయానికి వస్తే, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే  86.35 కోట్ల నెట్ వసూళ్లను సాధించి, గతంలో వచ్చిన కొన్ని పెద్ద చిత్రాల పూర్తి జీవితకాల బిజినెస్ రికార్డులను సైతం కేవలం ఐదు రోజుల్లోనే క్రాస్ చేసి సంచలనం సృష్టించింది.అంతేకాకుండా, సినిమా విడుదలైన తర్వాత వచ్చిన రెండో ఆదివారం నాడు బాక్సాఫీస్ వద్ద అసలు సిసలైన సునామీ సృష్టించింది. ఈ రెండో ఆదివారం నాడు భారతదేశంలో ఈ చిత్రం ఏకంగా రూ. 75 కోట్ల నెట్ వసూళ్లను సాధించి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. అంతకుముందు ఈ రికార్డు 'ధురంధర్ 2' పేరిట ఉండగా, ఆ సినిమా రెండో ఆదివారం రూ. 68 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇప్పుడు 'ధురంధర్ 2' సాధించిన ఆ రికార్డును రామాయణం బ్రేక్ చేసి రెండో ఆదివారం అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇది కూడా చదవండి: ఆ హీరోయిన్ నా ప్రాణం: విజయ్ దేవరకొండ పోస్ట్ వైరల్..వాళ్ళు అనుకున్నదే జరుగుతుందా! దీపావళి సెలవులు ముగిసినప్పటికీ, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల వైపు క్యూ కడుతుండటంతో కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు.   ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'జవాన్' (రూ. 643.87 కోట్లు), 'స్త్రీ 2' (రూ. 625.27 కోట్లు), 'ఛావా' (రూ. 601.57 కోట్లు), 'యానిమల్' (రూ. 556.36 కోట్లు) వంటి చిత్రాల లైఫ్‌టైమ్ కలెక్షన్ల రికార్డులను రామాయణం అవలీలగా దాటేసింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో రూ. 760.60 కోట్ల నెట్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం, రణ్‌బీర్ కపూర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఓవర్సీస్‌లోనూ రూ. 378.50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, విదేశీ మార్కెట్లోనూ సత్తా చాటింది. హిందీ వెర్షన్ అత్యధికంగా 77.3% వాటాను అందిస్తుండగా, మిగతా సౌత్ భాషల వెర్షన్లు కూడా అద్భుతమైన వసూళ్లను రాబడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ విజువల్ వండర్ ఇంకెన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలి.   మీకు నచ్చవచ్చు: తెలంగాణలో కల్కి 2 కి షాకింగ్ బిజినెస్: క్లోజ్ కూడా అయ్యింది! మీకు నచ్చవచ్చు: అమితాబ్ బచ్చన్ ఆస్థి విషయంలో లేటెస్ట్ ట్విస్ట్!    [Ramayana , Dhurandhar 2, Ranbir Kapoor, Ranveer Singh, Bollywood]
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన చేయబోయే ప్రాజెక్టులపై కూడా ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ‘డ్రాగన్’ రెండు భాగాలుగా రానుందనే ప్రచారం, అనిల్ రావిపూడితో సినిమా, త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గాడ్ ఆఫ్ వార్’.. ఇలా ఎన్టీఆర్ లైనప్‌లో వరుస భారీ ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాల విడుదల తేదీల విషయంలో ఇప్పుడు కొత్త లెక్కలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం ‘డ్రాగన్’ మొదటి భాగం 2027 జూన్‌లో, రెండో భాగం అదే ఏడాది డిసెంబర్‌లో విడుదల కావాల్సి ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ రెండో భాగం అనుకున్న సమయానికి విడుదల కాకపోతే మాత్రం ఎన్టీఆర్ తదుపరి సినిమాల షెడ్యూల్ మొత్తం మారిపోయే అవకాశం ఉందట. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ‘డ్రాగన్’ను రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మొదటి భాగాన్ని 2027 జూన్ 11న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే స్పష్టం చేశారు. రెండో భాగాన్ని అదే ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారు. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్‌ను చూసి మిగతా స్టార్స్‌ మారతారా.? తాజా సమాచారం ప్రకారం 2027 ఏప్రిల్ నుంచే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని.. అనిల్ రావిపూడి టీమ్‌కు ఎన్టీఆర్ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం 2028 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారట. ఒకవేళ ‘డ్రాగన్ 2’ డిసెంబర్ 2027లో విడుదల కాకపోతే.. అప్పుడు అనిల్ రావిపూడి సినిమాను సంక్రాంతి 2028కు తీసుకొచ్చి, ‘డ్రాగన్ 2’ను సమ్మర్‌కు మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్టీఆర్ లైనప్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘గాడ్ ఆఫ్ వార్’. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత’ తర్వాత మరోసారి కలిసి పనిచేయనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ‘డ్రాగన్’, అనిల్ రావిపూడి సినిమాల షెడ్యూల్స్ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందనే దానిపై స్పష్టత లేదు. 2029లో విడుదల కావచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. మీకు నచ్చవచ్చు:  మరో సర్‌ప్రైజ్.. బోయపాటితో అల్లు అర్జున్‌ మూవీ అనౌన్స్‌మెంట్‌.! ఒకే  ఫ్రేమ్‌లో చిరంజీవి, ప్రభాస్‌.. సందీప్‌ రెడ్డి అభిమానం చూపిస్తాడా.?       [Jr NTR Lineup, Dragon Movie, Dragon Part 2, Anil Ravipudi, God Of War]  
విజయ్ దేవరకొండ రీసెంట్ గా 'రణబాలి'తో తన జోరు చూపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన తదుపరి చిత్రంగా 'రౌడీ జనార్ధన' ని రెడీ చేస్తున్నాడు. దిల్ రాజ్ నిర్మాత కావడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. రీసెంట్ గా దేవరకొండ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  దేవరకొండ అండ్ వైఫ్ రష్మిక మందన్నాకి  సంబంధించిన లేటెస్ట్ జపాన్ వెకేషన్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతు ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ లాంటి ట్రీట్ ఇస్తున్నాయి. రకరకాల విమర్శలకు దూరంగా, తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన వాతావరణంలో ఎంజాయ్ చేస్తున్న ఈ జోడి ఫోటోలు చూసేందుకు చాలా క్యూట్‌గా ఉన్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పిక్స్‌కు ఇచ్చిన "మైన్ (Mine)", "హోమ్ (Home)", మరియు "లవ్ (Love)" అనే మూడు సింపుల్ అండ్ స్వీట్ క్యాప్షన్లు సోషల్ మీడియాని  షేక్ చేస్తున్నాయి. ఈ ట్రిప్‌లో కేవలం ఇద్దరే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొనడం విశేషం. జపాన్ వీధుల్లో అందరూ కలిసి సరదాగా తిరుగుతూ, కాఫీ మరియు మచ్చా బ్రేక్స్ ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్ అన్నీ ఈ ఫోటోల ద్వారా బ్యాలెన్స్‌డ్‌గా బయటికి వచ్చాయి. ఒక ఫ్రేమ్‌లో విజయ్ తన తలతో రష్మిక భుజంపై ఆనుకొని కనిపించగా, "హోమ్" అనే క్యాప్షన్ ఇవ్వడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మరో ఫోటోలో రష్మిక నవ్వుతుండగా విజయ్ ఆమె మెడ చుట్టూ చేతులు వేసి ప్రేమగా హగ్ చేసుకున్న పిక్‌కు "లవ్" అని రాసుకొచ్చారు.   ఈ పిక్స్ చూసిన నెటిజన్లు ఈ క్యూట్ కపుల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.మరోవైపు ఈ జపాన్ వెకేషన్‌లో కేవలం రొమాంటిక్ మూమెంట్సే కాకుండా, ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా గడిపిన ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఒక ఫోటోలో విజయ్ కుటుంబం అంతా కలిసి సరదాగా కలరింగ్ సెషన్‌లో బిజీగా కనిపించగా, మరికొన్ని పిక్స్‌లో జపనీస్ ఫుడ్ కల్చర్‌ను ఆస్వాదిస్తూ కనిపించారు. ముఖ్యంగా రష్మిక మందన్నా జపనీస్ సోఫ్ట్ సోఫ్లే ప్యాన్‌కేక్స్ తయారీని ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఫోటోలు, అలాగే నోరూరించే మోచీ (Mochi) రైస్ కేక్‌ను ఆస్వాదిస్తున్న క్షణాలు ట్రిప్ హైలైట్‌గా నిలిచాయి. అంతేకాకుండా, విజయ్ తన తల్లిగారితో కలిసి దిగిన ఒక చిలిపి ఫోటోను షేర్ చేస్తూ, "అమ్మ సన్ రష్మిక హార్ట్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు" అంటూ ఫన్నీ క్యాప్షన్ జోడించడం అందరినీ నవ్విస్తోంది. ఇది కూడా చదవండి: కల్కి 2 నైజాం హక్కులని దక్కించుకున్న ఆ ఇద్దరు..అమౌంట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!   ఈ ట్రిప్ మధ్యలో కేవలం విహారయాత్రే కాకుండా, విదేశాల్లో ఉన్నప్పటికీ మన సంప్రదాయాన్ని మరువకుండా దీపావళి పర్వదినాన ఒక ప్రత్యేకమైన హోమం (Goma Ritual) నిర్వహించినట్లు విజయ్ వెల్లడించారు.  దేవరకొండ కుటుంబం తరఫున అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ వారు జపనీస్ గడ్డపై నిర్వహించిన ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.   ఈ జపాన్ వెకేషన్ ఫోటోల్లో రష్మిక మందన్నా స్టైలిష్ లుక్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా చేతిలో కత్తి పట్టుకుని ఆమె కనిపించిన ఒక డిఫరెంట్ స్టిల్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.  రష్మిక అప్ కమింగ్  ప్రాజెక్ట్ 'మైసా' (Mysaa) సినిమాలోని లుక్‌ని  ఇది తలపిస్తోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.కాగా, నవంబర్ 27న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుండటంతో, ఈ ట్రిప్ ఫోటోలు సినిమాకి మంచి హైప్ తీసుకొస్తున్నాయని చెప్పవచ్చు.    మీకు నచ్చవచ్చు:పవన్ కళ్యాణ్,అన్నా లెజినోవా విడాకులు: సంచలన అప్ డేట్! మీకు నచ్చవచ్చు:ప్రముఖ డైరెక్టర్ పై హీరోయిన్ వ్యాఖ్యలు వైరల్!   [Vijay Deverakonda, Rashmika Mandanna, Japa Pics, Ranabhali, Tollywood]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రస్తుత కాలంలో రసాయనాలతో కూడిన బ్యూటీ ఉత్పత్తులకు బదులుగా సహజసిద్ధమైన పద్ధతులను పాటించేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ చర్మ సంరక్షణలో  రోజ్ వాటర్  ఎప్పటి నుంచో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది. సహజసిద్ధమైన గులాబీ రేకుల నుంచి సేకరించే ఈ జలంలో చర్మానికి ఎంతో మేలు చేసే హైడ్రేటింగ్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయి.  ఇది ముఖంపై పేరుకుపోయే దుమ్ము, ధూళిని సమర్థవంతంగా తొలగించి చర్మాన్ని ఎప్పుడూ తాజాగా ఉంచుతుంది. రోజూ రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకుని రోజ్ వాటర్ అప్లై చేయడం వల్ల చర్మ ఛాయ మెరుగుపడటంతో పాటు నిద్రపోయే సమయంలో చర్మానికి కావాల్సిన తేమ అందుతుంది. చర్మంపై ఉండే సహజమైన pH స్థాయిలను సమతుల్యం చేయడంలో రోజ్ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. దీనివల్ల చర్మం అతిగా పొడిబారడం లేదా ఎక్కువ జిడ్డు కారడం వంటి సమస్యలు క్రమంగా తగ్గుతాయి. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వారానికి కనీసం రెండు సార్లు రోజ్ వాటర్‌ను చర్మానికి రాసుకోవడం ద్వారా చర్మంలో అధికంగా సెబమ్ ఉత్పత్తి కాకుండా నియంత్రించవచ్చు. ఇది చర్మ రంధ్రాలను బిగుతుగా మార్చి ముఖంపై మొటిమలు, మశూచి మచ్చలు రాకుండా రక్షణ కల్పిస్తుంది. సెన్సిటివ్ లేదా చికాకు కలిగించే చర్మం ఉన్నవారికి ఇది ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ప్రశాంతతను చేకూరుస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై వచ్చే ముడతలు, గీతలు మరియు సూర్యరశ్మి వల్ల కలిగే నష్టాలను తగ్గించడంలో రోజ్ వాటర్‌లోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సహాయపడతాయి. ఇది చర్మంలో కొల్లాజెన్ స్థాయిలను కాపాడుతూ, చర్మాన్ని యవ్వనంగా మరియు ప్రకాశవంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మార్కెట్లో లభించే ఖరీదైన మేకప్ రిమూవర్లకు ప్రత్యామ్నాయంగా రోజ్ వాటర్‌ను ఉపయోగించవచ్చు. ఇది ఎలాంటి హాని చేయకుండా సులభంగా మేకప్‌ను తొలగించడమే కాకుండా, అలసిపోయిన చర్మానికి తక్షణ ఉత్సాహాన్ని ఇస్తుంది. కంప్యూటర్లు, మొబైల్ స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు, ఉబ్బరం (Puffiness) వంటి సమస్యలకు రోజ్ వాటర్ చక్కటి పరిష్కారం. ఫ్రిజ్‌లో చల్లబరచిన రోజ్ వాటర్‌లో కాటన్ ప్యాడ్స్ లేదా దూదిని ముంచి పది నిమిషాల పాటు కనురెప్పలపై ఉంచుకోవడం ద్వారా కళ్లకు ఎంతో ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా, రోజ్ వాటర్ వాసన పీల్చడం లేదా దీని సువాసన మైండ్ రిలాక్సేషన్‌కు తోడ్పడి తలనొప్పిని దూరం చేయడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి:స్టెంట్‌లు, బైపాస్ సర్జరీల వల్ల ఆయుష్షు పెరుగుతుందా? తాజా అధ్యయనం ఏం చెబుతోంది? రోజ్ వాటర్‌లో ఉండే సహజ క్రిమినాశక మరియు అనాల్జేసిక్ లక్షణాలు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చర్మాన్ని రక్షిస్తాయి. కొన్ని రకాల కంటి ఆరోగ్య సమస్యలకు ఉపయోగించే ఆయుర్వేద కంటి చుక్కలలో కూడా రోజ్ వాటర్‌ను సురక్షితంగా వాడతారు. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల చర్మం ఎరుపెక్కినా లేదా మంట పుట్టినా, ఈ జలాన్ని ముఖంపై స్ప్రే చేయడం ద్వారా తక్షణ చల్లదనం లభిస్తుంది. ఇది కేవలం బాహ్య అందాన్నే కాకుండా చర్మ కణాలకు లోపలి నుంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. మీ రోజూవారీ చర్మ సంరక్షణ దినచర్యలో (Skincare Routine) రోజ్ వాటర్‌ను చేర్చుకోవడం ద్వారా శాశ్వతమైన అందాన్ని సొంతం చేసుకోవచ్చు. కెమికల్స్ లేని స్వచ్ఛమైన రోజ్ వాటర్‌ను టోనర్‌గా, ఫేస్ మిస్ట్‌గా లేదా ఫేస్ ప్యాక్‌లలో కలుపుకుని ఉపయోగించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. క్రమమైన పద్ధతిలో దీన్ని వాడటం ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా మీ ముఖం మృదువుగా, నిండుగా మరియు కాంతివంతంగా మారుతుంది. మీకు నచ్చవచ్చు:నేచర్ ప్రిస్క్రిప్షన్: డాక్టర్లు సైతం సిఫారసు చేస్తున్న ,అద్భుతమైన ప్రకృతి రహస్యం!                                   సరికొత్త క్యాన్సర్ చికిత్సలు: వైద్య రంగంలో నూతన మైలురాళ్ళు ఇవే!       Rose Water Benefits, Glowing Skin Tips, Natural Face Care, Hydrating Skincare, Beauty Remedies, Skin Care Routine, Health Tips In Telugu.
మనలో చాలామంది చిన్నతనంలో పెద్దలు చెప్పిన మాటను ఎప్పుడో ఒకసారి వినే ఉంటాం. అదేమిటంటే, పిల్లలు గణితంలో (మ్యాథ్స్) రాణించాలన్నా, లెక్కలు సులభంగా చేయాలన్నా విధిగా బెండకాయలు తినాలని పెద్దలు గట్టిగా నమ్ముతుంటారు. దీనివల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని, లెక్కలు ఇట్టే వచ్చేస్తాయని ఇప్పటికీ చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు బెండకాయలను తినిపిస్తుంటారు.  అయితే, ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై ఆరోగ్య నిపుణులు, పరిశోధకులు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బెండకాయలు తింటే నేరుగా గణితం లేదా లెక్కలు బాగా వస్తాయనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, ఇప్పటివరకు శాస్త్రీయంగా దీన్ని ఎవరూ నిరూపించలేదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం సమాజంలో ఎప్పటినుంచో నాటుకుపోయిన ఒక ప్రాచుర్యం పొందిన నమ్మకం మాత్రమేనని తేల్చిచెప్పారు. అయితే, బెండకాయలు తింటే నేరుగా మ్యాథ్స్ రాకపోయినా, వీటిలో ఉండే అద్భుతమైన పోషకాలు మాత్రం మెదడు పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బెండకాయల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్ మరియు మెగ్నీషియం వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి శరీర జీవక్రియలు సక్రమంగా జరిగేలా తోడ్పడటంతో పాటు, నాడీ వ్యవస్థను, మెదడు కణాలను ఉత్తేజితం చేస్తాయి. బెండకాయల వల్ల మెదడు మరింత చురుగ్గా, యాక్టివ్‌గా పనిచేయడానికి సహాయపడుతుంది కాబట్టి, బహుశా దీనివల్లే పిల్లలకు జ్ఞాపకశక్తి పెరిగి చదువుపై, గణితంపై ఏకాగ్రత కుదిరి ఉంటుందని, దాంతోనే  బెండకాయ తింటే లెక్కలు వస్తాయి  అనే నానుడి ప్రచారంలోకి వచ్చి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శాస్త్రీయంగా లెక్కలతో సంబంధం లేకపోయినా, మన దైనందిన ఆహారంలో బెండకాయలను చేర్చుకోవడం ద్వారా శరీరానికి లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా బెండకాయల్లో ఉండే విటమిన్  సి  ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి శరీర రోగ నిరోధక శక్తిని (Immunity) విపరీతంగా పటిష్టం చేస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్  కె  చిన్నపాటి గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టేలా చేసి, తీవ్రమైన రక్తస్రావం కాకుండా రక్షణ కల్పిస్తుంది. అంతేకాకుండా, ఎముకలను దృఢంగా ఉంచడంలోనూ, కంటి చూపును మెరుగుపరచడంలోనూ విటమిన్  ఎ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇది కూడా చదవండి:శీతాకాలంలో, పచ్చి బఠానీలు తింటే బరువు తగ్గవచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారు? డయాబెటిస్ లేదా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి బెండకాయ ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. వీటిలో ఉండే అధిక పీచు పదార్ధం (Fiber), మ్యుసిలేజ్ రక్తంలో చక్కెర స్థాయిలను (Blood Sugar Levels) చాలా సమర్థవంతంగా అదుపులో ఉంచుతాయి. మనం తీసుకున్న ఆహారంలోని పిండి పదార్థాలు గ్లూకోజ్‌గా మారి రక్తంలో నెమ్మదిగా కలిసేలా ఇవి సహకరిస్తాయి, దీనివల్ల షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగే ప్రమాదం తప్పుతుంది. అలాగే జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, మలబద్ధకాన్ని తగ్గించడంలో, గట్ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బెండకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. జీర్ణాశయ గోడలను రక్షించి అసిడిటీ, అల్సర్లు వంటి సమస్యలను దూరం చేయడంలోనూ ఇవి ముందుంటాయి. శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారికి కూడా బెండకాయలు చక్కటి ఆహారమనే చెప్పాలి. వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల తిన్న తర్వాత కడుపు నిండిన భావన కలుగుతుంది, తద్వారా ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఆహారపు మోతాదు నియంత్రణలో ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు కూడా బెండకాయల్లో ఉండే ఫోలేట్ పిండం యొక్క ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి, లెక్కలు వస్తాయో లేదో అనే విషయంతో సంబంధం లేకుండా, అనేక పోషక విలువులు నిండిన ఈ కూరగాయను మీ డైట్‌లో క్రమం తప్పకుండా భాగం చేసుకోవడం ద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మీకు నచ్చవచ్చు:ఇంజెక్షన్లతో పనిలేదు, ఇకపై మాత్రలతోనే బరువు తగ్గింపు: పూర్తి వివరాలు ఇవే!                                   ఉదయం పూట, వ్యాయామాలు చేసేవారికి, బ్లడ్ షుగర్ ఎందుకు పెరుగుతుంది?       Ladys Finger Math Myth, Okra Health Benefits, Bhindi Brain Power, Food Myths Debunked, Nutrition Facts, Doctor Health Advice, Health Tips In Telugu.
 జీవితంలో నిజమైన విజయం ప్రశాంతత కావాలా.. ఇదిగో ఈ సూత్రాలు పాటించండి.. ! జీవితంలో మనం ఎంచుకునే మార్గం, ఎదుర్కొనే సవాళ్లు మన భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాయి. ప్రతి రోజూ ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు మన వ్యక్తిగత జీవితంపైనే కాకుండా మన చుట్టూ ఉన్న సమాజంపై కూడా ఎంతో కొంత ప్రభావాన్ని చూపుతాయి. అందుకే మనం ఏ పనిచేసినా కాస్త ఆలోచించి, సరైన దిశలో అడుగులు వేయడం చాలా ముఖ్యం. ప్రస్తుత టెక్నాలజీ పెరిగిపోయిన డిజిటల్  కాలంలో ఉరుకులు పరుగుల జీవితం వల్ల చాలామంది మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. కెరీర్ ఒత్తిళ్లు, కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత ఆశయాలను చేరుకోవాలనే ఆతురతలో పడి తమ ఆరోగ్యాన్ని ,  మనశ్శాంతిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే  జీవితంలో నిజమైన విజయం సాధించాలన్నా,  ప్రశాంతత కావాలన్నా కొన్ని జీవన సూత్రాలు పాటించాలి.  అప్పుడే హ్యాపీగా ఉండగలుగుతారు.  ఆ జీవన సూత్రాలు ఏమిటో వివరంగా తెలుసుకుంటే.. మానసిక ఆరోగ్యం.. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మనిషికి చాలా ప్రధానమైనది. రోజూ కొంత సమయాన్ని వ్యాయామం, యోగా లేదా ధ్యానం కోసం కేటాయించడం ద్వారా ఒత్తిడిని దూరంగా ఉంచుకోవచ్చు. అలాగే, మనకు నచ్చిన అలవాట్లను ఇంప్రూవ్ చేసుకోవచ్చు, పుస్తకాలు చదవడం లేదా క్రియేటివిటీ ఫ్రూవ్ చేసుకునే  పనులలో నిమగ్నం కావడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు కుంగిపోకుండా, వాటిని ఒక అనుభవంగా భావించి ముందుకు సాగడమే నిజమైన జీవన శైలి గా భావించాలి. పాజిటివ్ దృక్పథం.. ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండటం, చుట్టూ ఉన్నవారితో మంచి సంబంధాలు కలిగి ఉండటం మనల్ని మానసికంగా బలంగా మారుస్తుంది. ప్రతి రోజూ కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపాలి. అప్పుడే జీవితంలో ఎదుగుదల సాధ్యమవుతుంది. ప్రవర్తన.. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నా, సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలన్నా మన ప్రవర్తన , ఆలోచనా విధానం ఎంతో ముఖ్యం. ఎప్పుడూ అహంకారం, గర్వం,  ఇతరుల పట్ల చిన్న చూపు చూడటం వంటివి అస్సలు చేయకూడదు. ఇది కూడా చదవండి  చేతికి డబ్బు రాగానే ఈ పనులు చేయండి.. లేకపోతే బాధపడతారు..! ఆందోళన.. చాలామంది రేపు ఏమవుతుందో అనే భయంతో .. ఆందోళన చెందుతూ ఉంటారు.  దీని వల్ల వర్తమానంలో చేతిలో ఉన్న కాలాన్ని భయపడుతూ, ఆందోళనగా గడిపేస్తారు.  దీని వల్ల ఎలాంటి ప్రశాంతత,  చేయాలనుకున్న పనుల పట్ల ఏకాగ్రత ఉండవు. అందుకే భవిష్యత్తును గురించి అతిగా ఆందోళన చెందకుండా వర్తమానంలో జీవిస్తూ ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి.                                                                                                                         *రూపశ్రీ.  
మనం చేసే ప్రతి చిన్న పనీ మన భవిష్యత్తును నిర్ణయించినట్లే, మనం రోజూ ఆచరించే ప్రతీ అలవాటు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి జబ్బుల కంటే మన చెడ్డ అలవాట్లే మనల్ని నెమ్మదిగా బలహీనపరుస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు ఊరికే అనలేదు. ధనం పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం కోల్పోతే అదే అసలైన దరిద్రం. శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మన పూర్వీకులు కొన్ని సులువైన జీవన సూత్రాలను చెప్పారు. వాటిని సరిగ్గా పాటిస్తే జీవితం ప్రశాంతంగా, ఆనందంగా మారుతుంది. ఆ ముఖ్యమైన ఐదు ఆరోగ్య సూత్రాలు ఏమిటో  వివరంగా తెలుసుకుంటే..  సరైన ఆహార నియమం.. మన శరీరం జీర్ణవ్యవస్థపైనే మన ఆయుర్దాయం ఆధారపడి ఉంటుంది. కడుపులో ఉన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకముందే మళ్లీ మళ్లీ తినడం విషం తినడంతో సమానమని పెద్దలు చెబుతారు. ఆకలి లేకపోయినా కేవలం సమయం అయిపోయిందన్న ఒకే ఒక్క కారణంతో బలవంతంగా తినడం మనం చేసే అతి పెద్ద తప్పు. శరీరం చెప్పే ఆకలి సంకేతాలను వినడం నేర్చుకోవాలి కానీ గడియారపు ముళ్లను చూస్తూ తినకూడదు. ఆకలి ఉంటేనే, శరీరం కోరితేనే మితంగా, రుచిగా కాక ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి.  నిద్ర.. ఈ కాలంలో చాలామంది రాత్రంతా మేలుకోవడం, తెల్లవారితే అతిగా నిద్రపోవడం అలవాటు చేసుకున్నారు. అయితే అతిగా నిద్రపోవడం లేదా అసలు నిద్రపోకపోవడం రెండు పద్ధతులూ శరీర నాశనానికి దారితీస్తాయి. తెల్లవారుజామునే నిద్రలేవడం వల్ల మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది, బద్ధకం దరిచేరదు. సూర్యుడితో పాటు నిద్రలేచి ప్రకృతితో మమేకమైతే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. క్రమబద్ధమైన నిద్ర శారీరక శక్తిని పునరుద్ధరిస్తుంది. శారీరక శ్రమ.. నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత శారీరక కదలికలు పూర్తిగా తగ్గిపోయాయి. శరీరాన్ని కదిలించకుండా కేవలం ఒకే చోట కూర్చుని పనిచేయడం అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమే అవుతుంది. వ్యాయామం, యోగ, చిన్నపాటి నడక, ఇంటి పనులు వంటి సహజ కదలికలు శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి. జిమ్‌లకు వెళ్లి విపరీతంగా కష్టపడాల్సిన అవసరం లేదు కానీ రోజూ శరీరానికి తగిన శ్రమ ఇచ్చేలా చూసుకోవడం చాలా అవసరం. ఇది కూడా చదవండి    వాకింగ్ ఎలా చేయాలి? చాలామందికి తెలియని సీక్రెట్ ఇదే..! మానసిక ప్రశాంతత.. శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అతిగా కోపగించుకోవడం వల్ల శరీరంలోని ప్రాణశక్తి లోపలి నుంచే క్షీణించిపోతుంది. కోపం మన ఆరోగ్యాన్ని నాశనం చేసే అతిపెద్ద శత్రువు. మనసుపై నిగ్రహం లేకపోతే ఏ పనీ సరిగ్గా చేయలేము. డబ్బు కంటే మనసు నిండుగా, సంతోషంగా ఉండటమే అసలైన ఐశ్వర్యం. యోగ, ధ్యానం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. శుచి , పరిశుభ్రత.. కేవలం మన ఇల్లు మాత్రమే కాకుండా మన శరీరం, పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి మూలస్తంభం. శరీరం, చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉండటం మనలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. అలాగే మన ఆలోచనలు, మాటలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. ఈ ఐదు సూత్రాలు ఏవీ కొత్తవి కావు, మన దైనందిన జీవితంలో ఎంతో సులభంగా పాటించదగినవే. వీటిని రోజువారీ జీవితంలో అలవాటు చేసుకుంటే ఏ అనారోగ్య సమస్యలూ దరిచేరవు. జీవనశైలిలో చిన్న మార్పుతోనే పెద్ద మార్పును సాధించవచ్చు. ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకొని ఆనందంగా జీవించవచ్చు.                                                                                                                                                 *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు.. ఈ 5 పండ్లతో ఎన్నో లాభాలు!  
ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటుంటారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి, గుండెను పదిలంగా కాపాడుకోవడానికి చాలామంది వాకింగ్ ను ఎంచుకుంటారు. అయితే, వాకింగ్ చేయాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ, దానిని నిలకడగా కొనసాగించడంలో చాలామంది విఫలమవుతుంటారు. వర్షం వచ్చిందని, చలికాలం అని, లేదా ఆ రోజు మూడ్ బాలేదని, బిజీగా ఉన్నామని రకరకాల కారణాలతో నడకను మధ్యలోనే ఆపేస్తుంటారు. అసలు వాకింగ్ ఎలా చేయాలి? చాలామందికి తెలియని ఆ ముఖ్యమైన రహస్యం ఏమిటో  వివరంగా తెలుసుకుంటే.. ఉత్సాహం కాదు.. సరైన ప్లానింగ్ ముఖ్యం.. చాలామంది ఫిట్‌నెస్ విషయంలో ఒక పెద్ద పొరపాటు చేస్తుంటారు. మొదటి రోజే ఉత్సాహంతో నలభై ఐదు నిమిషాలు లేదా గంటపాటు నడవాలని నిర్ణయించుకుంటారు. అలా మొదటి రోజు కష్టపడి నడిచాక, రెండో రోజు కాళ్ల నొప్పితో బాధపడతారు. మూడో రోజు పని ఒత్తిడి, నాలుగో రోజు వాతావరణం బాగోలేకపోవడంతో వాకింగ్ కు స్వస్తి చెబుతారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఫిట్‌నెస్ సాధించడంలో ఎక్కువ మోటివేషన్ ఉన్నవారు కాదు, మంచి అలవాట్లు ఏర్పరచుకున్నవారే విజయం సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు. వేగం కాదు.. ఈ లాజిక్ ముఖ్యం.. గుండె ఆరోగ్యం కోసం వేగంగా నడవాలని,  హార్ట్ పాయింట్లు అని ఈ మధ్య చాలామంది వేగంగా నడుస్తూ ఉంటారు. కానీ ఎంత వేగంగా నడిచాం లేదా ఎంతసేపు నడిచాం అనేది ముఖ్యం కాదు, ప్రతీరోజూ నడకను కొనసాగించామా లేదా అనేదే చాలా కీలకం. ఈ క్రమంలోనే వాకింగ్ ప్రారంభించాలనుకునేవారి కోసం ఒక సులభమైన , అద్భుతమైన మార్గం ఉంది. అదేంటంటే.. ఈజీగా.. హుషారుగా.. మొదటగా మొదటి మూడు వారాలు కేవలం ఐదు నిమిషాలు మాత్రమే నడవాలి. కేవలం ఐదు నిమిషాలు నడవడం వల్ల గుండెకు పెద్దగా ప్రయోజనం చేకూరకపోవచ్చు, కానీ మన మెదడుకు ఒక కొత్త అలవాటును నేర్పించడానికి ఇది సరిగ్గా సరిపోతుంది. మొదటి మూడు వారాలు ఐదు నిమిషాలు నడిచిన తర్వాత, ఆ సమయాన్ని మరో ఐదు నిమిషాలు పెంచి పది నిమిషాలు చేయాలి. ఆ తరువాత మరో మూడు వారాలకు పదిహేను నిమిషాలు, ఇలా క్రమంగా ఇరవై నుంచి ముప్పై నిమిషాలకు పెంచుకుంటూ పోవాలి. ఇది కూడా చదవండి   మోకాళ్ల నొప్పులతో ఇబ్బందా..ఈ 5 వ్యాయామాలు మిస్ అవ్వకండి .! ​ ఇక్కడ ప్రధాన లక్ష్యం మొదట్లోనే శరీరాన్ని అలసటకి గురి చేయడం కాదు, నడకను ఒక మంచి అలవాటుగా మార్చుకోవడం. అలవాటు ఏర్పడిన తర్వాత ఫిట్‌నెస్ అనేది దానంతట అదే మన సొంతం అవుతుంది. చిన్న చిన్న చిట్కాలు.. వాకింగ్ కు మార్గాలు.. నడకను ఎటువంటి ఆటంకాలు లేకుండా క్రమం తప్పకుండా సాగించడానికి కొన్ని చిన్నచిన్న చిట్కాలు ఎంతో సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందే మరుసటి రోజు ఉదయం వాకింగ్ కి వేసుకునే దుస్తులను సిద్ధంగా ఉంచుకోవాలి. వీలైతే వాటిని పక్కనే ఉంచుకోవడం మంచిది. అలాగే షూస్‌ను మంచం పక్కనే ఉంచాలి. ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. దీనివల్ల మనం అలసత్వాన్ని గెలవడం కంటే అసలు అలసత్వానికి అవకాశం ఇవ్వకుండా ఉండవచ్చు. హ్యాబిట్ స్టాకింగ్.. హ్యాబిట్ స్టాకింగ్ అనే ఒక అద్భుతమైన పద్ధతిని పాటించవచ్చు. ఉదయం నిద్రలేచి బ్రష్ చేసిన వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా నేరుగా వాకింగ్ కి వెళ్ళిపోవాలి. వాకింగ్ పూర్తయిన తర్వాతే స్నానం చేసేలా దినచర్యను మలచుకోవాలి. ఒక పాత అలవాటుకు మరో కొత్త అలవాటును ఇలా జోడించడం వల్ల పనులు మర్చిపోయే అవకాశం ఉండదు. ఒకవేళ వర్షం కారణంగా బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడితే, ఇంట్లోనే ఐదు నిమిషాల పాటు నడవాలి కానీ వాకింగ్ అలవాటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించకూడదు. మొదలు పెట్టిన రోజే పది కిలోమీటర్లు నడవడం కంటే, ఏడాది పొడవునా ప్రతీరోజూ పది నిమిషాల చొప్పున నడవడం గుండెకు ఎంతో మేలు చేస్తుంది. మన గుండెకు కావాల్సింది ఏదో ఒక్కరోజే చేసే  ప్లానింగ్ కాదు.. ప్రతీరోజూ కొనసాగించే ప్లానింగ్ కావాలి. ఈ చిన్నపాటి నియమాలను పాటిస్తూ, వాకింగ్ ను జీవితంలో ఒక భాగం చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా దూరంగా ఉండవచ్చు. ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతమవుతుంది.                                                                                                                              *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు  మీ దగ్గర డబ్బు నిలవడం లేదా..అసలు కారణాలు ఇవే..!                                 మీకు తెలుసా ..ఈ విటమిన్లు లోపిస్తే లివర్ దెబ్బతింటుంది..!
మన ఆరోగ్యం బాగుండాలంటే రోజువారీ ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండే పండ్లను తప్పనిసరిగా చేర్చుకోవాలి. పండ్లు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు (Fiber), యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. ఇవి జీర్ణక్రియ మెరుగుపడటానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి, శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా కొన్ని పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించుకోవడానికి కూడా సహాయపడుతుంది. మరి మన ఆరోగ్యానికి మేలు చేసే ఆ ఐదు పండ్లు ఏమిటి? జామ, బొప్పాయి, దానిమ్మ, పైనాపిల్, మామిడి పండ్లలో ఎలాంటి పోషకాలు ఉంటాయి? వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి? మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఈ పండ్లు ఎలా ఉపయోగపడతాయి? ఈ ప్రత్యేక వీడియోలో ఆయుర్వేద డైటీషియన్ శ్రవంతి రఘు గారు ఈ ఐదు పండ్లలోని పోషక విలువలు, వాటి ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. జామపండులో ఉండే పీచు పదార్థాలు జీర్ణక్రియకు ఎలా సహాయపడతాయి? బొప్పాయిలోని పోషకాలు మహిళల ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి? దానిమ్మ శరీరానికి అందించే ప్రయోజనాలు ఏమిటి? పైనాపిల్ పేగుల ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది? మామిడి పండులోని విటమిన్లు, పోషకాలు మన శరీరానికి ఎలా మేలు చేస్తాయి? అనే విషయాలను వివరంగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, ఈ పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు కలిగే ప్రయోజనాలు, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో వీటి పాత్ర, రోగనిరోధక శక్తికి అవసరమైన పోషకాలు వంటి అనేక విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మలబద్ధకం సమస్యను తగ్గించుకోవడానికి పీచు పదార్థాలు అధికంగా ఉండే పండ్లను ఆహారంలో ఎలా చేర్చుకోవాలి? వాటిని ఏ విధంగా తీసుకుంటే మంచిది? అనే విషయాలను కూడా శ్రవంతి రఘు గారు వివరించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఖరీదైన ఆహారాలే అవసరం లేదు. మనకు సులభంగా లభించే పండ్లను సరైన మోతాదులో, సరైన పద్ధతిలో తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. ఈ ఐదు పండ్లలోని పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు, మలబద్ధకం సమస్యకు అవి ఎలా తోడ్పడతాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)