
సినిమా కథల విషయంలో ఒక్కోసారి విచిత్రమైన యాదృచ్ఛికాలు జరుగుతుంటాయి. ఇద్దరు దర్శకులు ఒకే తరహా ఆలోచనతో సినిమాలు తెరకెక్కించడం, అవి దగ్గర దగ్గరగా విడుదల కావడం మనం చూస్తుంటాం. కానీ ఇప్పుడు టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. నవంబర్ 20న విడుదలకు సిద్ధమవుతున్న ‘ఆకాశంలో ఒక తార’, ‘డియర్ ఆస్ట్రోనాట్’ సినిమాల కథలు దాదాపు ఒకేలా ఉండటం హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా ఈ రెండు సినిమాల ట్రైలర్లు విడుదల కావడంతో ఈ పోలికలపై చర్చ మరింత పెరిగింది. ఒక అమ్మాయి ఆకాశాన్ని అందుకోవాలని, వ్యోమగామి కావాలని కలలు కనడం.. ఆ కలను నిజం చేసుకునే క్రమంలో ఎదురయ్యే పరిస్థితులు.. ఆమెకు అండగా నిలిచే వ్యక్తులు.. ఇలా రెండు ట్రైలర్లలోనూ ఒకే తరహా పాయింట్స్ కనిపిస్తున్నాయి.
అయితే ఈ రెండు సినిమాల మధ్య పోలికలు కనిపించడంతో అసలు ఈ కథ ఎవరిది? ముందుగా ఎవరు మొదలుపెట్టారు? అనే ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ రెండు ప్రాజెక్టుల వెనుక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
‘డియర్ ఆస్ట్రోనాట్’ దర్శకుడు కార్తీక్ భాగ్యరాజా 2021లో ఇదే కథాంశంతో ‘కౌగిలి’ అనే షార్ట్ ఫిల్మ్ రూపొందించారట. ఆ షార్ట్ ఫిల్మ్‌కు మంచి స్పందన రావడంతో దానిని ఫీచర్ ఫిల్మ్‌గా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారట. 2022 జనవరి 1న ‘కౌగిలి’ పేరుతో సినిమా పోస్టర్ కూడా విడుదల చేశారని సమాచారం.
ఇది కూడా చదవండి: ఆకాశంలో ఒక తార ట్రైలర్.. ఆకాశాన్ని అందుకోవాలని అమ్మాయి ఆశ.. అండగా కృష్ణ.!
ఆ తర్వాత ఈ కథను సినిమాగా రూపొందించేందుకు పలువురు నిర్మాతలను సంప్రదిస్తున్న సమయంలో.. ‘ఆకాశంలో ఒక తార’ కూడా ఇలాంటి కథాంశంతో తెరకెక్కుతోందని మరో దర్శకుడి ద్వారా కార్తీక్‌కు తెలిసిందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన ‘ఆకాశంలో ఒక తార’ దర్శకుడు పవన్ సాధినేనిని సంప్రదించి రెండు కథల్లో ఉన్న పోలికల గురించి చర్చించారట. అయితే ఇద్దరు వ్యక్తులకు ఒకే ఆలోచన రావచ్చని, తమ సినిమా మాత్రం తమ సొంత కథతోనే తెరకెక్కుతోందని పవన్ సమాధానం ఇచ్చినట్లు ఇన్ సైడ్ టాక్.
తాజాగా జరిగిన ‘ఆకాశంలో ఒక తార’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు పవన్ సాధినేని మాట్లాడుతూ.. కరోనా టైంలో 2020లోనే ఈ కథ రాసుకున్నట్లు తెలిపారు. అంటే ఇద్దరు దర్శకులకు ఇంచు మించు ఒకే సమయంలో ఒకే తరహా కథ ఆలోచన వచ్చింది అన్నమాట.
‘ఆకాశంలో ఒక తార’లో కల్పన అనే పల్లెటూరి అమ్మాయి ఆస్ట్రోనాట్ కావాలని కలలు కంటుంది. ఆమె ఆశయాన్ని చుట్టూ ఉన్నవాళ్లు ఎగతాళి చేసినా, అసాధ్యమని నిరుత్సాహపరిచినా తన లక్ష్యాన్ని వదులుకోదు. ఆ సమయంలో కృష్ణ అనే వ్యక్తి ఆమెకు అండగా నిలుస్తాడు. కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్, కల్పనగా సాత్విక వీరవల్లి నటించారు.
మరోవైపు ‘డియర్ ఆస్ట్రోనాట్’లోనూ ఓ అమ్మాయి వ్యోమగామి కావాలనే కల, ఆ కలను నిజం చేసుకునేందుకు ఆమె చేసే ప్రయత్నాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అయితే ఇందులో ఆమె భర్త తన ఆశయానికి తోడుగా నిలుస్తాడు.
అంటే ఒక సినిమాలో ప్రేమించే వ్యక్తి.. మరో సినిమాలో భర్త అమ్మాయి కలకు అండగా నిలుస్తారు. కథలోని ప్రధాన భావన ఒకేలా కనిపిస్తున్నా, పాత్రల మధ్య సంబంధాలు, కథను నడిపించే విధానం వేరుగా ఉండే అవకాశం ఉంది.
సాధారణంగా ఒకే తరహా కథతో రెండు సినిమాలు వస్తే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడం సహజం. అయితే ఇక్కడ రెండు సినిమాలూ ఒకే రోజు థియేటర్లలోకి వస్తుండటంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. మరి నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ రెండు సినిమాల్లో ఏది మనసులు గెలుచుకుంటుంది? ఒకే కథాంశం రెండు విభిన్న విజయాలుగా మారుతుందా? చూడాలి.
మీకు నచ్చవచ్చు:
బన్నీ-బోయపాటి కాంబో.. ఈసారి మాస్ కాదు.. మైథలాజికల్.!
ఎన్టీఆర్ లైనప్‌లో భారీ మార్పులు.. నెక్స్ట్ నాలుగు సినిమాల రిలీజ్ డేట్స్ ఇవే.!
[Aakasamlo Oka Tara, Dear Astronaut, Dulquer Salmaan, Pavan Sadineni, Karthik Bhagyaraja]





